రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పర్యావరణానికే కాదు పశువుల ప్రాణాలకు కూడా ముప్పే. ప్లాస్టిక్ వాడకం ఎంత హానికరమనేది గడచిన రెండు నెలల్లో మలియాబాద్ గోశాలలో వందకుపైగా వీధి పశువులు మృత్యువాత పడడం తెలియచేస్తోంది.
నగరంలో ఎక్కడబడితే అక్కడ పడేసిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ సంచులు తింటే ప్రాణహాని అని ఆ వీధి పశువులకు తెలియదు.ఆకలితో వాటిని తిని ఆ మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. నగరంలోని అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమం తరువాత నగరసభ యంత్రాంగం వీధి పశువుల తరలించే కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలోని వివిధ రహదారుల్లో అడ్డదిడ్డంగా సంచరిస్తూ, రాత్రి సమయాల్లో రహదారులపై అడ్డంగా పడుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తుండేవి.
వీటి బెడదను అరికట్టాలని నగరసభ యంత్రాంగం రాయచూరుకు 5 కిమీ దూరంలోని మలియాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ గోశాలకు రెండు నెలల క్రితం వీధి పశువులను తరలించింది. అక్కడ వరిగడ్డి వేస్తున్నా, సమీపంలోని పొలం గట్లపై ఉన్న పచ్చిగడ్డిని ఈ పశువులు తినేవికావు. దీంతో అనారోగ్యానికి గురై రోజూ ఒకటి రెండు వంతున పశువులు చనిపోతున్నాయి. రెండు నెలల్లో గోశాలకు తరలించిన గోవులలో100కు పైగా మృతి చెందాయి. ఈ పశువులు నగరంలోని చెత్తాచెదారం, ప్లాస్టిక్ సంచులు తినడం వల్ల అనారోగ్యం బారిన పడి మృతి చెందాయి. వాటి కళేబరాల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ సంచులు నిండి ఉండడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.
చనిపోయిన పశువులను గోశాల సమీపంలో పడేయడం దారుణం. అవి కుళ్లి దుర్గంధం వ్యాపించిన పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం అవి ఎందుకు చనిపోతున్నాయని అధికారులు ఆరా తీసిన పాపాన పోలేదు. గోశాలకు తరలించి అధికారులు చేతులుదులుపుకున్నారు. గోశాలలో గోసంరక్షణకు అవసరమైన సౌకర్యాలు లేవని నిర్వాహకులు మొరపెట్టుకున్నా, పత్రికల్లో కథనాలు ప్రచురితమైనా అధికారులు స్పందించలేదు. గోసంరక్షపై వారి చిత్తశుద్దిని ఇది తెలియచేస్తుంది. పశువుల మృతితోనైనా ప్లాస్టిక్ వినియోగంపై నిషేధాన్ని అధికారులు కచ్చితంగా అమలు చేయాలి. ఆదిశగా ప్రజలనుజాగృతి చేసే కార్యక్రమాలు చేపట్టాలి.
పశువుల ప్రాణాలు హరించిన ప్లాస్టిక్
Published Fri, Jan 17 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement