rayachuru
-
ఆమెది హత్య కాదు.. ఆత్మహత్యే?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ (23) అనుమానాస్పద మృతి కేసు అనూహ్య మలుపు తిరినట్లయింది. మధుపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని సీఐడీ అధికారులు శనివారం అనధికారికంగా వెల్లడించారు. రాయచురు రూరల్: రాయచూరును కుదిపేసిన ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ (23) అనుమానాస్పద మృతి కేసు అనూహ్య మలుపు. గత నెల 13న నవోదయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని మధు ఇంటి నుంచి అదృశ్యమైంది. 16వ తేదీన నగరంలోని మాణిక్ ప్రభు ఆలయం వెనుక పొదల్లో చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో ఆమె మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. జీవితంపై విరక్తితో మరణిస్తున్నట్లు ఒక లేఖ అక్కడ దొరికింది. ఆమెను దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారని రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాలు ధర్నాలు చేశాయి. సినీ ప్రముఖులు ఈ సంఘటనను ఖండిస్తూ సోషల్‌మీడియాలో ప్రకటనలిచ్చారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు చేపట్టి ఆమె ప్రియుడు సుదర్శన్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని రెండువారాలకు పైగా విచారించింది. విచారణలో ఏం తేల్చారు విచారణలో సుదర్శన్ యాదవ్, మధుల మధ్య ఉన్న ప్రేమ గొడవలే ఆమె ఆత్మహత్యకు కారణాలులని సీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆమె మృతదేహానికి జరిపిన పోస్టుమార్టం వివరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ నివేదిక ఆధారంగా మధుపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని సీఐడీ అధికారులు శనివారం అనధికారికంగా వెల్లడించారు. తొమ్మిదిరోజుల పాటు సీఐడీ అధికారుల కస్టడీలో ఉన్న సుదర్శన్ యాదవ్ తాను మధు 8వ తరగతి నుంచి 12వ తరగతి వర కు ఒకే కళాశాలలో చదువుకున్నామని, పీయూసీ తరువాత మధు ఇంజినీరింగ్‌ను ఎంచుకుందని, తాను బీకాంలో చేరానని అతడు వివరించారు. ఇద్దరి కళాశాలలు వేరే అయినా ప్రేమ కొనసాగిందని చెప్పాడు. వీరిద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతుండేవని, ఇది సహించలేని మధు సుదర్శన్ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని, ఈ గొడవలతో ఆమె ఆత్మహత్య చేసుకుందని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. తప్పుదోవ పట్టించే యత్నం: ప్రజాసంఘాలు కాగా సీఐడీ వర్గాల తీర్మానంపై ఆమె తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తమ కూతురిని హత్యేనని తల్లిదండ్రులు ముందునుంచి ఆరోపిస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించడానికి, నిందితులను రక్షించడానికి సీఐడీ ప్రయత్నిస్తోందని పలు ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజాలను కప్పిపెట్టడానికి ప్రయత్నం జరుగుతోందని, మధు పత్తార్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. -
బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితులను అరెస్టు చేయండి
రాయచూరు, న్యూస్‌లైన్ : లింగసూగూరు తాలూకా రామదుర్గకు చెందిన మైనర్ బాలిక బసమ్మపై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయడంలో హట్టి పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని రాష్ట్ర రైతు సంఘం, వివిధ కార్మిక సంఘాల అధ్యక్షుడు ఆర్.మానసయ్య ఆరోపించారు. గురువారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో బాధితురాలి తల్లిదండ్రులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ కేసును మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. దట్టమైన అరణ్యంలో బసమ్మపై అదే గ్రామానికి చెందిన నాగప్ప లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. అనంతరం ఓ చెట్టుకు ఆ బాలికను వేలాడదీశారని వివరించారు. అన్నతో కలిసి గొర్రెలు కాయడానికి వెళ్లిన బాలిక సాయంత్రానికి శవమైందని,బాలికను వేలాడదీసిన చెట్టును అప్పటి ఎస్ఐ ప్రకాష్మాళె నరికేయించాడన్నారు. రాత్రికి రాత్రే పోస్టుమార్టం చేయడం వంటివి కేసు మూసివేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలకు బలం చేకూర్చుతాయన్నారు. బసమ్మ ఒక్కటే కాదు, ఆ ప్రాంతంలోని గౌడూరు తండా, నిలోగల్ ఆశాల తండ , కుప్పిగడ్డలలో బాధితులకు న్యాయం జరగలేదన్నారు. బసమ్మ కేసును మూసి వేసే ప్రయత్నాలకు స్వస్తి చెప్పి తక్షణమే నిజాయితీగల అధికారితో దర్యాప్తు చేయించి, నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో కరియప్ప, లింగప్ప, పరమేశ్ తదితరులున్నారు. -
వేడెక్కుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారం
రాయచూరు, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల ప్రచారం క్రమేణా వేడెక్కుతోంది. 2-3 రోజులుగా పగటి ఉష్ణోగ్రత పెరుగుతోంది. అయినా అభ్యర్థులు లెక్కచేయకుండా ప్రచారం సాగిస్తున్నారు. జిల్లాలోని 4 తాలూకాలు, అలాగే యాదగిరి జిల్లాలోని 3 తాలూకాలు రాయచూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. నియోజకవర్గం పరిధి ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థి బివీ.నాయక్, బీజేపీ అభ్యర్థి శివనగౌడనాయక్ నామినేషన్లు వేయకుండానే ప్రచారం ప్రారంభించారు. ఏప్రిల్ 14 లోపు ప్రచారం ముగించాల్సి ఉంది.కాంగ్రెస్ అభ్యర్థి బీవీ.నాయక్ తరఫున కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ రెండు రోజుల క్రితం దేవదుర్గ, సిరివార, లింగసూగూరులలో భారత నిర్మాణ పాదయాత్రలో పాల్గొని ఉత్సాహం నింపారు. అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి సతీష్ జారకిహొళె బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమై తమపార్టీ అభ్యర్థి గెలుపు కోసం శాయశక్తులా కృషి చేయాలని కోరారు. బీవీ.వినాయక్ కొందరు నేతలతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. బీజేపీ అభ్యర్థి శివనగౌడ నాయక్ ఎన్నికలకు చాలా ముందే నియోజకవర్గాన్ని కలియ తిరిగారు. గడచిన మూడు రోజులుగా నగరంలో తిష్ట వేసి పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇంటర్నెట్ ప్రచారంపై కూడా మొగ్గు చూపారు. అందులో శివనగౌడనాయక్ ముందున్నారు. ఎండలు ఇంకా పెరిగే సూచనలున్నాయి. దీంతో నియోజకవర్గంలోని 16 లక్షల మంది ఓటర్లను కలుసుకునేందుకు అభ్యర్థులు అన్ని మార్గాలను ఎంచుకుంటున్నారు. -
పశువుల ప్రాణాలు హరించిన ప్లాస్టిక్
రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పర్యావరణానికే కాదు పశువుల ప్రాణాలకు కూడా ముప్పే. ప్లాస్టిక్ వాడకం ఎంత హానికరమనేది గడచిన రెండు నెలల్లో మలియాబాద్ గోశాలలో వందకుపైగా వీధి పశువులు మృత్యువాత పడడం తెలియచేస్తోంది. నగరంలో ఎక్కడబడితే అక్కడ పడేసిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ సంచులు తింటే ప్రాణహాని అని ఆ వీధి పశువులకు తెలియదు.ఆకలితో వాటిని తిని ఆ మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. నగరంలోని అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమం తరువాత నగరసభ యంత్రాంగం వీధి పశువుల తరలించే కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలోని వివిధ రహదారుల్లో అడ్డదిడ్డంగా సంచరిస్తూ, రాత్రి సమయాల్లో రహదారులపై అడ్డంగా పడుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తుండేవి. వీటి బెడదను అరికట్టాలని నగరసభ యంత్రాంగం రాయచూరుకు 5 కిమీ దూరంలోని మలియాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ గోశాలకు రెండు నెలల క్రితం వీధి పశువులను తరలించింది. అక్కడ వరిగడ్డి వేస్తున్నా, సమీపంలోని పొలం గట్లపై ఉన్న పచ్చిగడ్డిని ఈ పశువులు తినేవికావు. దీంతో అనారోగ్యానికి గురై రోజూ ఒకటి రెండు వంతున పశువులు చనిపోతున్నాయి. రెండు నెలల్లో గోశాలకు తరలించిన గోవులలో100కు పైగా మృతి చెందాయి. ఈ పశువులు నగరంలోని చెత్తాచెదారం, ప్లాస్టిక్ సంచులు తినడం వల్ల అనారోగ్యం బారిన పడి మృతి చెందాయి. వాటి కళేబరాల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ సంచులు నిండి ఉండడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. చనిపోయిన పశువులను గోశాల సమీపంలో పడేయడం దారుణం. అవి కుళ్లి దుర్గంధం వ్యాపించిన పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం అవి ఎందుకు చనిపోతున్నాయని అధికారులు ఆరా తీసిన పాపాన పోలేదు. గోశాలకు తరలించి అధికారులు చేతులుదులుపుకున్నారు. గోశాలలో గోసంరక్షణకు అవసరమైన సౌకర్యాలు లేవని నిర్వాహకులు మొరపెట్టుకున్నా, పత్రికల్లో కథనాలు ప్రచురితమైనా అధికారులు స్పందించలేదు. గోసంరక్షపై వారి చిత్తశుద్దిని ఇది తెలియచేస్తుంది. పశువుల మృతితోనైనా ప్లాస్టిక్ వినియోగంపై నిషేధాన్ని అధికారులు కచ్చితంగా అమలు చేయాలి. ఆదిశగా ప్రజలనుజాగృతి చేసే కార్యక్రమాలు చేపట్టాలి.