సాక్షి, హైదరాబాద్: యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) సహా పలు దేశాలను హడలెత్తిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ తెలంగాణకూ పాకింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనాకన్నా సుమారు 70 శాతం అధికంగా వ్యాప్తి చెందే గుణం ఉన్న కరోనా కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించి రాష్ట్రంలోనే తొలి కేసు సోమవారం నమోదైంది. యూకే నుంచి ఈ నెల 10న వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తిలో కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్లుగా సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) నిర్ధారించింది. అయితే ఈ వివరాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ వైరస్ కొత్త స్ట్రెయిన్ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది.
ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు జరుగుతుండటంతో వాటన్నింటి ఫలితాలను కేంద్ర ఆరోగ్యశాఖ ఏకకాలంలో వెల్లడించే అవకాశాలున్నాయి. మరోవైపు కొత్త వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ సోమవారం ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. అన్ని జిల్లాల వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి వీలైనంత వేగంగా అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
తల్లీకొడుకులు ఒకే ఆసుపత్రిలో...
యూకే నుంచి వచ్చిన వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఆ వ్యక్తిలో ఈ నెల 16న కరోనా లక్షణాలు కనిపించగా జిల్లాలోనే పరీక్షలు నిర్వహించగా 22న పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పట్నుంచీ అతను వరంగల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్నుంచి సేకరించిన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపగా ఆ నమూనాల్లో కరోనా కొత్త రకం వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితంగా మెలిగిన వారికి తక్షణమే పరీక్షలు చేశారు.
ఆ పరీక్షల్లో బాధితుడి తల్లి (71)కి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను కూడా అదే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాలేదని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కుమారుడికి కరోనా కొత్త వైరస్ నిర్ధారణ కావడంతో తల్లికి కూడా ఆ వైరస్ సోకి ఉంటుందేమోనన్న అనుమానంతో ఆమె నుంచి శాంపిళ్లను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపారు.
కొత్త వైరస్‌తో మరణాలు తక్కువే...
కరోనా కొత్త రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందేగానీ దానివల్ల మరణాల తీవ్రత తక్కువే. వ్యాక్సిన్ వచ్చేవరకు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం నిబంధన పాటించాలి. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. – డాక్టర్ కిరణ్ మాదల, నిజామాబాద్ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి
యూకే నుంచి వచ్చిన వారిలో మరొకరికి పాజిటివ్
యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల్లో సోమవారం మరొకరికి (మేడ్చల్ జిల్లా) కరోనా పాతరకం వైరస్ నిర్ధారణ అయినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతో యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో ఇప్పటివరకు 21 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ జిల్లా నుంచి 9 మంది, జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు ఫలితాలు వచ్చాయన్నారు.
బాధితులను వివిధ ఆసుపత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి ఇప్పటివరకు యూకే నుంచి 1,216 మంది తెలంగాణకు రాగా వారిలో 1,060 మందిని గుర్తించామన్నారు. వారిలో 58 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోగా మరో ఆరుగురు తిరిగి విదేశాలకు వెళ్లారన్నారు. మిగిలిన 996 మందికి పరీక్షలు నిర్వహించగా 966 మందికి కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. 21 మందికి పాజిటివ్‌గా తేలిందని, మరో 9 మంది ఫలితాలు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి నేరుగా యూకే నుంచి వచ్చిన వారు లేదా యూకే మీదుగా ప్రయాణించి వచ్చిన వారు 040–24651119కు ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం తెలియజేయాలని డాక్టర్ శ్రీనివాసరావు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment