Center for Cellular and Molecular Biology
-
కేన్సర్‌కు పసుపు మందు!
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన కేన్సర్ మహమ్మారికి మెరుగైన చికిత్సను రూపొందించే దిశగా ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)’శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఆధునిక చికిత్స పద్ధతులకు తోడుగా పసుపులో ఉండే అద్భుతమైన రసాయనం ‘కర్క్యుమిన్’ను వినియోగించడం ద్వారా అద్భుత ఫలితాలు వస్తున్నట్టు గుర్తించారు. ప్రతిబంధకాలను అధిగమించి.. కీమోథెరపీ అవసరం లేకుండానే కేన్సర్‌కు చికిత్స చేసేందుకు ఇటీవలికాలంలో జన్యువులను స్విచ్ఛాఫ్ చేసే పద్ధతి ‘ఆర్ఎన్ఏ ఇంటర్ఫెరెన్స్ (ఆర్‌ఎన్‌ఏఐ)’అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఆర్ఎన్ఏఐను సురక్షితంగా, కేన్సర్ కణితులే లక్ష్యంగా ప్రయోగించే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ లేఖ దినేశ్ కుమార్ నేతృత్వంలోని సీసీఎంబీ శాస్త్రవేత్తల బృందం, నేషనల్ కెమికల్ లేబొరేటరీకి చెందిన పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సంయుక్తంగా పరిశోధన చేపట్టాయి. పసుపులోని కర్క్యుమిన్ రసాయనంతో నానో నిర్మాణాలు కొన్నింటిని అభివృద్ధి చేశాయి. అవి ఆర్‌ఎన్‌ఏఐ (ఈపీహెచ్బీ4 ఎస్‌హెచ్ ఆర్ఎన్ఏ)లను సురక్షితంగా బంధించి ఉంచేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని నిర్దిష్ట కండరాలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించవచ్చని తేల్చారు. పైగా కర్క్యుమిన్ జీవ సంబంధితమైనది కాబట్టి.. శరీరం శోషించుకోగలదని గుర్తించారు. రొమ్ము, పేగు కేన్సర్లు ఉన్న ఎలుకలకు ఈ మందును అందించినప్పుడు.. కేన్సర్ కణితుల పరిమాణం తగ్గిందని డాక్టర్ దినేశ్ తెలిపారు. -
జన్యుమార్పులతోనే గుండెజబ్బుల ముప్పు?
సాక్షి, హైదరాబాద్: చిన్న వయసులోనివారు, రోజూ వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్న వాళ్లు కూడా అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలడం గురించి మనం వింటుంటాం. విన్న ప్రతిసారీ మన మెదళ్లలో మెదిలే ఓ ప్రశ్న.. ఎందుకలా? అని! హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తల అంచనా ప్రకారం పాశ్చాత్యదేశాల వారితో పోలిస్తే మన దేశ జనాభాలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చేందుకు ప్రధాన కారణం మన జన్యువుల్లో ఉండే ప్రత్యేకమైన మార్పులే! గుండె కండరాల అంతర నిర్మాణాన్ని మార్చేసే కార్డియో మయోపతి ఉంటే.. ఉన్నట్టుండి గుండె పనిచేయడం ఆగిపోయే అవకాశాలు ఎక్కువవుతాయి. సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ ఈ కార్డియో మయోపతికి గల కారణాలను అన్వేషించేందుకు పరిశోధనలు చేపట్టారు. బీటా మయోసిన్ హెవీఛెయిన్ జన్యువు (–ఎంవైహెచ్7)లోని కొన్ని వినూత్నమైన జన్యుమార్పుల వల్ల భారతీయుల్లో అధికులకు డైలేటెడ్ కార్డియో మయోపతి వస్తున్నట్లు గుర్తించారు. కెనడియన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఈ తాజా పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. మారిన అమైనోయాసిడ్లు ప్రపంచవ్యాప్తంగానూ ఈ ఎంవైహెచ్7కు, గుండెజబ్బులకు సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే నిరూపణ అయ్యింది. అయితే భారతీయ కార్డియో మయోపతి రోగులపై ఇందుకు సంబంధించిన జన్యు పరిశోధనలు ఏవీ జరగలేదని డాక్టర్ తంగరాజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో తాము దాదాపు 137 మంది డైలేటెడ్ కార్డియో మయోపతి రోగులను ఎంపిక చేసుకుని వారిలోని ఎంవైహెచ్7 జన్యువు తాలూకు క్రమాన్ని నమోదు చేశామని, వీరితోపాటు ఇంకో 167 మంది ఆరోగ్యకరమైన వారిలోనూ ఈ జన్యుక్రమాన్ని నమోదు చేసి పోల్చి చూశామని వివరించారు. ‘సుమారు 27 తేడాలు, ఏడు మార్పులు వినూత్నంగా కనిపించాయి. భారతీయ డైలేటెడ్ కార్డియో మయోపతి రోగుల్లో మాత్రమే ఇవి కనిపించాయి. జన్యుమార్పుల్లో ప్రొటీన్‌లో తప్పుడు అమైనోయాసిడ్లు ఉండే మిస్‌సెన్స్ మ్యుటేషన్స్ నాలుగు ఉన్నాయి. ఈ నాలుగూ ఎంవైహెచ్7 జన్యువులో యుగాలుగా కొనసాగుతూ వచ్చిన అమైనోయాసిడ్లను మార్చేశాయి. మారిపోయిన అమైనోయాసిడ్లు వ్యాధులకు కారణమవుతాయని బయో ఇన్ఫర్మేటిక్స్ ద్వారా తెలిసింది’అని వివరించారు. గుండెజబ్బులతో బాధపడుతున్న వారికి జన్యుమార్పిడి టెక్నాలజీల ద్వారా రక్షణ కల్పించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. -
వై క్రోమోజోమ్... వెరీ స్పెషల్!
సాక్షి, హైదరాబాద్: పురుషులకు మాత్రమే ప్రత్యేకమైన వై క్రోమోజోమ్‌కు సంబంధించి ఒక కొత్త, వినూత్నమైన అంశాన్ని శాస్త్రవేత్తలు వెలికితీశారు. కేవలం లింగ నిర్ధారణకు మాత్రమే ఉపయోగపడుతుందని ఇప్పటివరకూ ఉన్న అంచనా పూర్తిగా నిజం కాకపోవచ్చని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లింగ నిర్ధారణతోపాటు పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఇతర జన్యువుల నియంత్రణలోనూ వై క్రోమోజోమ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసిందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన సీసీఎంబీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రాచెల్ జేసుదాసన్ తెలిపారు. బీఎంసీ బయోలజీ తాజా సంచికలో పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. ఎలుకల వై క్రోమోజోమ్‌ను పరిశీలించినప్పుడు అందులో నిర్దిష్ట డీఎన్ఏ భాగం కొంత ఎడంతో పదేపదే కనిపిస్తోందని... ఇవి ఇతర క్రోమోజోమ్‌లలోని జన్యువుల వ్యక్తీకరణపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసిందని వివరించారు. వృషణాల్లోని ఈ జన్యువులు కేవలం పునరుత్పత్తికి మాత్రమే చెంది ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. పునరావృతమవుతున్న డీఎన్ఏ భాగం కొన్ని జీవజాతుల్లో ఉంటే మరికొన్నింటిలో లేదని, ఇది ప్రత్యేకమైన చిన్నస్థాయి ఆర్ఎన్ఏల ఉత్పత్తికి కారణమవుతోందని జేసుదాసన్ వివరించారు. చిన్నస్థాయి ఆర్ఎన్ఏలపై ఇదే తొలి పరిశోధన వ్యాసమన్నారు. జీవజాతుల పరిణామ క్రమంలో ఈ పునరావృత డీఎన్ఏ భాగాలు పునరుత్పత్తిని నియంత్రించే స్థితిని కోల్పోతాయని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ జెనిటిక్స్ డిపార్ట్మెంట్కు సలహాదారు (పరిశోధనలు)గా వ్యవహరిస్తున్న జేసుదాసన్... ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ జినోమిక్స్ అండ్ జీన్ టెక్నాలజీ శాస్త్రవేత్త కూడా. -
కొత్త వైరస్: యూకే నుంచి తెలంగాణకు..!
సాక్షి, హైదరాబాద్: యునైటెడ్ కింగ్డమ్ (యూకే) సహా పలు దేశాలను హడలెత్తిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ తెలంగాణకూ పాకింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనాకన్నా సుమారు 70 శాతం అధికంగా వ్యాప్తి చెందే గుణం ఉన్న కరోనా కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించి రాష్ట్రంలోనే తొలి కేసు సోమవారం నమోదైంది. యూకే నుంచి ఈ నెల 10న వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తిలో కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్లుగా సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) నిర్ధారించింది. అయితే ఈ వివరాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ వైరస్ కొత్త స్ట్రెయిన్ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు జరుగుతుండటంతో వాటన్నింటి ఫలితాలను కేంద్ర ఆరోగ్యశాఖ ఏకకాలంలో వెల్లడించే అవకాశాలున్నాయి. మరోవైపు కొత్త వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ సోమవారం ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. అన్ని జిల్లాల వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి వీలైనంత వేగంగా అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. తల్లీకొడుకులు ఒకే ఆసుపత్రిలో... యూకే నుంచి వచ్చిన వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఆ వ్యక్తిలో ఈ నెల 16న కరోనా లక్షణాలు కనిపించగా జిల్లాలోనే పరీక్షలు నిర్వహించగా 22న పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పట్నుంచీ అతను వరంగల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్నుంచి సేకరించిన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపగా ఆ నమూనాల్లో కరోనా కొత్త రకం వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితంగా మెలిగిన వారికి తక్షణమే పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో బాధితుడి తల్లి (71)కి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను కూడా అదే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాలేదని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కుమారుడికి కరోనా కొత్త వైరస్ నిర్ధారణ కావడంతో తల్లికి కూడా ఆ వైరస్ సోకి ఉంటుందేమోనన్న అనుమానంతో ఆమె నుంచి శాంపిళ్లను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపారు. కొత్త వైరస్‌తో మరణాలు తక్కువే... కరోనా కొత్త రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందేగానీ దానివల్ల మరణాల తీవ్రత తక్కువే. వ్యాక్సిన్ వచ్చేవరకు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం నిబంధన పాటించాలి. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. – డాక్టర్ కిరణ్ మాదల, నిజామాబాద్ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి యూకే నుంచి వచ్చిన వారిలో మరొకరికి పాజిటివ్ యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల్లో సోమవారం మరొకరికి (మేడ్చల్ జిల్లా) కరోనా పాతరకం వైరస్ నిర్ధారణ అయినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతో యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో ఇప్పటివరకు 21 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ జిల్లా నుంచి 9 మంది, జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు ఫలితాలు వచ్చాయన్నారు. బాధితులను వివిధ ఆసుపత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి ఇప్పటివరకు యూకే నుంచి 1,216 మంది తెలంగాణకు రాగా వారిలో 1,060 మందిని గుర్తించామన్నారు. వారిలో 58 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోగా మరో ఆరుగురు తిరిగి విదేశాలకు వెళ్లారన్నారు. మిగిలిన 996 మందికి పరీక్షలు నిర్వహించగా 966 మందికి కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. 21 మందికి పాజిటివ్‌గా తేలిందని, మరో 9 మంది ఫలితాలు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి నేరుగా యూకే నుంచి వచ్చిన వారు లేదా యూకే మీదుగా ప్రయాణించి వచ్చిన వారు 040–24651119కు ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం తెలియజేయాలని డాక్టర్ శ్రీనివాసరావు కోరారు. -
మాస్కే మన వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నిరోధానికి టీకాపై అతిగా ఆధారపడటం తగదని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా స్పష్టం చేశారు. టీకా రాకపోయినా దాన్ని ఎదుర్కోవడం ఎలా అనే దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు తుది దశలో ఉన్నప్పటికీ వాటి సామర్థ్యం తెలియాలంటే మరికొంత సమయం పడుతుందని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. ‘సమర్థంగా పనిచేసే టీకా అందుబాటులోకి వస్తే సరి. లేదంటే భౌతిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం బహిరంగ ప్రదేశాల్లో మాస్కు వేసుకోవడం వంటి చర్యల ద్వారా వ్యాప్తిని అడ్డుకోవచ్చు’అని వివరించారు. ముఖానికి తొడుక్కునే మాస్క్.. వ్యాక్సిన్ లాంటిదే అనే విషయం గుర్తించాలని పేర్కొన్నారు. కరోనా రక్షణ చర్యలన్నీ పాటిస్తే కొంత కాలానికి నిరోధకత ఏర్పడుతుందని, తద్వారా సహజ సిద్ధంగానే వైరస్‌కు చెక్ పెట్టొచ్చని చెప్పారు. అతి తక్కువ సమయంలో ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పలు విధానాలు అందుబాటులోకి రావడం, అందరూ కలసికట్టుగా కృషి చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఒకవేళ టీకా అందుబాటులోకి వచ్చినా దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి అందించేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని పేర్కొన్నారు. అలాగే టీకా ఇచ్చినా దాని ప్రభావం ఎంత కాలం పాటు ఉంటుందో కూడా తెలియదని, ఆ విషయం తెలుసుకునేందుకు కనీసం రెండేళ్లు పడుతుందని వివరించారు. అప్పటివరకూ ప్రస్తుతం పాటిస్తున్న అన్ని రకాల జాగ్రత్తలను కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ‘మిషన్’కు రూ. 50 వేల కోట్లు! న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలకు అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.50వేల కోట్లు కేటాయించినట్లు సమాచారం. ఒక్కో వ్యక్తికి వ్యాక్సిన్ ఇవ్వడానికి 6 నుంచి 7 డాలర్ల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేసినట్లు తెలుస్తోంది. భారత్‌లో ప్రస్తుత జనాభా 130 కోట్ల పైమాటే. వ్యాక్సినేషన్ మిషన్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.50 వేల కోట్లు కేటాయించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరోనా టీకాలను ప్రజలందరికీ అందజేసే విషయంలో ఖర్చుకు ప్రభుత్వం వెనుకాడబోదని వెల్లడించాయి. భారత్‌లో ఒక్కో టీకా డోసుకు 2 డాలర్ల చొప్పున ఖర్చు కానుందని అంచనా. ఒక్కో వ్యక్తికి రెండు డోసుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి 4 డాలర్లు ఖర్చవుతాయి. వ్యాక్సిన్ రవాణా, నిల్వ కోసం మరో 3 డాలర్లు అవసరం. మొత్తంమీద ఒక్కో పౌరుడిపై ప్రభుత్వం 7 డాలర్ల (రూ.515) చొప్పున వ్యయం చేయనుంది. -
గాల్లో కరోనా వ్యాప్తిపై సీసీఎంబీ శోధన
హైదరాబాద్: కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఆసుపత్రి వాతావరణంలో ఈ వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు సిద్ధమ య్యారు. వైరస్ గాలి ద్వారా ఎంత దూరం ప్రయాణించగలదు? ఎంత సమయం గాల్లో ఉండగలదు? వైరస్ బారిన పడ్డ వ్యక్తి నుంచి వెలువడ్డవి ఎంత సమయం ఉండగలవు? అన్న అంశాలన్నింటినీ ఈ పరిశోధనల ద్వారా తెలుసుకోనున్నారు. సుమారు పది రోజుల క్రితమే ఈ పరిశోధన మొదలైంది. కొన్ని నెలల క్రితం కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించగలదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఓ లేఖ రాసిన నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రస్తుతం తాము ఆసుపత్రి వాతావరణంలో వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేస్తున్నామని, దీని ఫలితాల ఆధారంగా బ్యాంకు, షాపింగ్‌మాల్స్ వంటి ప్రాంతాలపై పరిశోధనలు చేపడతామని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఆసుపత్రి వాతావరణంలో జరిగే పరిశోధన కోసం ఐసీయూ, కోవిడ్ వార్డు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పరికరం సాయంతో గాలి నమూనాలు సేకరిస్తామని రోగికి రెండు నుంచి ఎనిమిది మీటర్ల దూరం నుంచి సేకరించిన నమూనాలతో పరిశోధనలు చేస్తామని వివరించారు. వైరస్ ఎంత దూరం ప్రయాణించగలదో నిర్వచించగలిగితే ఆరోగ్య కార్యకర్తలకు రక్షణ కల్పించే విషయంలో మార్పులు చేర్పులు చేయవచ్చునని చెప్పారు. -
జన్యు పరీక్షతో మధుమేహ నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: భారతీయుల్లో మధుమేహాన్ని గుర్తించేందుకు ప్రస్తుత పద్ధతుల కన్నా జన్యు ఆధారిత పరీక్షలు మేలని ఓ అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), పుణేలోని కేఈఎం ఆసుపత్రుల సంయుక్త అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. మధుమేహం రెండు రకాలని ఒక్కోదానికి వేర్వేరు చికిత్స పద్ధతులు అవలంబించాలన్నది తెలిసిన సంగతే. టైప్–1 మధుమేహానికి జీవితకాలం ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉండగా.. టైప్–2 విషయంలో మంచి ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా నియంత్రించవచ్చు. టైప్–1 పిల్లల్లోనూ, టైప్–2 పెద్దవారిలోనూ వస్తుందన్నది ఇప్పటికున్న అంచనా. భారతీయుల్లో దీనికి భిన్నమైన ఫలితాలున్నాయి. పెద్దయ్యాక కూడా వారిలో టైప్–1 మధుమేహమున్నట్లు తెలుస్తుండగా.. దేశంలో బక్కపలుచగా ఉన్న యువకులు టైప్–2 బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత మధుమేహ పరీక్షల ద్వారా తప్పుడు ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఎక్కువ. ఇలాకాకుండా జన్యువుల్లోని నిర్దిష్ట అంశాల ద్వారా ఒక వ్యక్తి ఏ రకమైన మధుమేహం బారిన పడే అవకాశముందో నిర్ధారించడం ద్వారా వారికి తగిన చికిత్స లభిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీన్ని నిర్ధారించుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్టర్తో చేతులు కలిపారు. యూరోపియన్ల కోసం ఎక్స్టర్ యూనివర్సిటీ జన్యు ఆధారిత రిస్క్ స్కోర్ ఒకదాన్ని సిద్ధం చేయగా.. ఆ స్కోర్ భారతీయుల విషయంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు కేఈఎం ఆసుపత్రి, సీసీఎంబీలు ప్రయత్నించాయి. పుణేలో టైప్–1 మధుమేహులు 262 మంది, టైప్–2 మధుమేహులు 352 మంది, సాధారణ ప్రజలు 334 మంది జన్యుక్రమాలను పరిశీలించారు. వీటిని వెల్కమ్ ట్రస్ట్ కేస్ కంట్రోల్ కన్సార్షియం సిద్ధం చేసిన యూరోపియన్ల సమాచారంతో పోల్చి చూశారు. ఫలితంగా జన్యు రిస్క్ స్కోర్ ఇరువురికీ ఉపయోగపడుతుందని స్పష్టమైంది. కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా భారతీయుల్లో మరింత మెరుగ్గా వ్యాధిని గుర్తించవచ్చునని తెలిసింది. పదిహేనేళ్ల వయసులోపు టైప్–1 మధుమేహుల్లో 20 శాతం మంది భారత్‌లో ఉన్న నేపథ్యంలో వ్యాధిని కచ్చితంగా నిర్ధారించే జన్యు ఆధారిత కిట్ ఉండటం ఎంతైనా వాంఛనీయమని, ఈ అధ్యయనం ద్వారా అది సాధ్యమవుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇదిగో తెలంగాణ ఆపిల్!
సేంద్రియ రైతుతో కలిసి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మోలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా తెలంగాణ లోని ధనోరా గ్రామపరిధిలో ఆపిల్ పండ్ల సాగు కల సాకారమైంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో దనోరా గ్రామం ఉంది. ఉష్ణోగ్రత ఏడాదిలో కొద్దిరోజులైనా అతి తక్కువగా నమోదయ్యే ఎత్తయిన ప్రాంతమే ఆపిల్ సాగుకు అనుకూలం. ధనోరా ప్రాంతంలో అక్టోబర్ – ఫిబ్రవరి మధ్యలో.. 3 నుంచి 400 గంటల పాటు.. సగటున 4 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. అందువల్లే ధనోరా తెలంగాణ కాశ్మీర్‌గా పేరుగాంచింది. ఈ విషయం గ్రహించిన హైదరాబాద్‌లోని కేంద్రప్రభుత్వ సంస్థ సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్తలు డా. ఏ వీరభద్రరావు, డా. రమేశ్ అగర్వాల్ ఐదేళ్లక్రితం సర్వే చేసి.. సేంద్రియ రైతు కేంద్రే బాలాజి పొలం ప్రయోగాత్మకంగా ఆపిల్ సాగుకు అనువైనదిగా గుర్తించారు. చాలా ఏళ్లుగా సేంద్రియ ఉద్యానతోటలు సాగు చేస్తున్న బాలాజి అప్పటికే పది ఆపిల్ మొక్కలు నాటితే, కొన్ని మాత్రమే బతికాయి. ఈ నేపథ్యంలో సీసీఎంబీ శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో నాణ్యమైన ఆపిల్ మొక్కల సాగుకు బాలాజి శ్రీకారం చుట్టారు. వారు అందించిన హరిమన్, బిలాస్పూర్, నివోలిజన్, అన్న, రాయల్ డెలిషియస్ రకాలకు చెందిన నాణ్యమైన 500 ఆపిల్ మొక్కలను బాలాజి మూడేళ్ల క్రితం తన పొలంలో నాటారు. 400 మొక్కలు ఏపుగా ఎదిగాయి. ఈ ఏడాది చక్కని కాపు వచ్చింది. చెట్టుకు 25 నుంచి 40 కాయలు ఉన్నాయి. అయితే, లేత చెట్లు కావటంతో కాయ సైజు చిన్నగా ఉంది. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లో అమ్మకానికి పెట్టే అంత సైజు కాయలు వస్తాయని రైతు బాలాజి ‘సాక్షి’తో చెప్పారు. 5 ఎకరాల్లో ఆపిల్‌తో పాటు మామిడి, దానిమ్మ, అరటి, బత్తాయి, సంత్ర, ఆపిల్ బెర్ పంటలను ఆయన సాగు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ ఆపిల్ పండ్లను ప్రజలు రుచిచూడటానికి కృషి చేసిన సీనియర్ సేంద్రియ రైతు, సీసీఎంబి శాస్త్రవేత్తలు, ఉద్యాన, వ్యవసాయ అధికారులకు జేజేలు! ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి! మా ఊళ్లో ఆపిల్ సాగుకు వాతావరణం అనుకూలమేనని రుజువైంది. ఇక్కడ చాలా మంది రైతులు ఆపిల్ సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరికొంతమంది రైతులకు మెలకువలు నేర్పుతాను. ఎక్కువ మంది రైతులు ఆపిల్ పంటను పండిస్తే అమ్మకం సులువు అవుతుంది. ఆపిల్ పంట పండించందుకు సీసీఎంబీ శాస్త్రవేత్తలతో పాటు ఉద్యానవన శాఖాధికారుల, వ్యవసాయాధికారుల కృషి కూడా ఉంది. ఇప్పుడు చేతికొచ్చిన ఆపిల్ పండు చిన్నదిగా ఉంది. ఈ ఏడాది గడిస్తే మరింత పెద్ద సైజు పండ్లు కాసే అవకాశం ఉంది. అందుకే వచ్చే ఏడాది నుంచి మార్కెట్లో అమ్మకానికి పెడదామనుకుంటున్నాను. – కేంద్రే బాలాజి (99490 92117), ఆపిల్ రైతు, కెరమెరి(ధనోర), భీం ఆసిఫాబాద్ జిల్లా బాలాజి తోటలో ఆపిల్ పండు – ఆనంద్, సాక్షి, కెరమెరి, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా -
కొత్త సాంబా మసూరితో మధుమేహులకు మేలు
సాక్షి, హైదరాబాద్: అగ్గి తెగులును సమర్థంగా ఎదుర్కోగల కొత్త సాంబా మసూరి వరితో మధుమేహులకు మేలు జరుగుతుందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు. జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) 13 వరి వంగడాలను పరిశీలించి ఈ కొత్త సాంబా మసూరి గ్లైసిమిక్ ఇండెక్స్ (పిండిపదార్థాలు చక్కెరలుగా మారే సూచీ) 50.99గా ఉన్నట్లు తేల్చిం దని తెలిపారు. అగ్గి తెగులు సోకే అవకాశాలున్న బీపీటీ 5204 లేదా సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా భారతీయ వరి పరిశోధన సంస్థ, సీసీఎంబీలు తొమ్మిదేళ్ల కింద కొత్త సాంబా మసూరి వంగడాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. సాంబా మసూరిని దేశంలోనే తొలి సూపర్ వరి వంగడంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పి.ఆనందకుమార్ తెలిపారు.కార్యక్రమంలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు డాక్టర్ విష్ణుప్రియ, డాక్టర్ రమేశ్ శొంఠి పాల్గొన్నారు.