సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన కేన్సర్ మహమ్మారికి మెరుగైన చికిత్సను రూపొందించే దిశగా ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)’శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఆధునిక చికిత్స పద్ధతులకు తోడుగా పసుపులో ఉండే అద్భుతమైన రసాయనం ‘కర్క్యుమిన్’ను వినియోగించడం ద్వారా అద్భుత ఫలితాలు వస్తున్నట్టు గుర్తించారు.
ప్రతిబంధకాలను అధిగమించి..
కీమోథెరపీ అవసరం లేకుండానే కేన్సర్‌కు చికిత్స చేసేందుకు ఇటీవలికాలంలో జన్యువులను స్విచ్ఛాఫ్ చేసే పద్ధతి ‘ఆర్‌ఎన్‌ఏ ఇంటర్‌ఫెరెన్స్ (ఆర్‌ఎన్‌ఏఐ)’అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఆర్‌ఎన్‌ఏఐను సురక్షితంగా, కేన్సర్ కణితులే లక్ష్యంగా ప్రయోగించే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ లేఖ దినేశ్ కుమార్ నేతృత్వంలోని సీసీఎంబీ శాస్త్రవేత్తల బృందం, నేషనల్ కెమికల్ లేబొరేటరీకి చెందిన పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సంయుక్తంగా పరిశోధన చేపట్టాయి.
పసుపులోని కర్క్యుమిన్ రసాయనంతో నానో నిర్మాణాలు కొన్నింటిని అభివృద్ధి చేశాయి. అవి ఆర్‌ఎన్‌ఏఐ (ఈపీహెచ్‌బీ4 ఎస్‌హెచ్ ఆర్‌ఎన్‌ఏ)లను సురక్షితంగా బంధించి ఉంచేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని నిర్దిష్ట కండరాలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించవచ్చని తేల్చారు. పైగా కర్క్యుమిన్ జీవ సంబంధితమైనది కాబట్టి.. శరీరం శోషించుకోగలదని గుర్తించారు. రొమ్ము, పేగు కేన్సర్లు ఉన్న ఎలుకలకు ఈ మందును అందించినప్పుడు.. కేన్సర్ కణితుల పరిమాణం తగ్గిందని డాక్టర్ దినేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment