CCMB Scientists
-
సంతాన లోపానికి సగం కారణం పురుషుల్లోని సమస్యలే.. షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ఎనిమిది ప్రత్యేక జన్యువులు ప్రభావితం చేస్తున్నాయని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ఎనిమిది జన్యువుల్లో జరుగుతున్న మార్పులు వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపి, పురుషుల్లో వంధ్యత్వానికి కారణమవుతోందని తేల్చారు. ఈ వివరాలను సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయగ్నస్టిక్స్ డైరెక్టర్ డాక్టర్ కె.తంగరాజ్ వెల్లడించారు. సంతానం కలగకపోవడానికి సగం కారణం పురుషుల్లోని సమస్యలేనని.. పిల్లలు పుట్టకపోతే మహిళలను నిందించడం సరికాదని స్పష్టం చేశారు. జన్యుమార్పులు వంధ్యత్వానికి దారితీస్తున్నట్టు వెల్లడైన నేపథ్యంలో.. ఈ సమస్య పరిష్కారం కోసం మెరుగైన పద్ధతుల ఆవిష్కరణకు వీలవుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందికూరి తెలిపారు. దీర్ఘకాలం నుంచి పరిశోధనలు..: దేశంలోని పురుషుల్లో వంధ్యత్వ సమస్యకు కారణాలను తెలుసుకునేందుకు డాక్టర్ తంగరాజ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం రెండు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. గతంలోనూ వంధ్యత్వ సమస్య ఉన్న పురుషుల్లో 38శాతం మంది వై క్రోమోజోమ్‌లో తేడాలున్నట్టు వీరు గుర్తించారు. దీనితోపాటు కణాల్లోని మైటోకాండ్రియా, ఆటోసోమల్ జన్యువుల్లో మార్పులు కూడా వంధ్యత్వానికి కారణమవుతున్నట్టు తేల్చారు. తాజా పరిశోధనలో భాగంగా తాము వంధ్యత్వ సమస్య ఉన్న 47మందిలోని జన్యుక్రమాన్ని పరిశీలించామని తెలిపారు. దేశవ్యాప్తంగా మరో 1,500 మంది వంధ్యత్వ పురుషుల్లోని జన్యుమార్పులతో పోల్చి చూశామని.. ఈ క్రమంలో ఎనిమిది ప్రత్యేక జన్యువుల సంగతి తెలిసిందని పరిశోధనలో భాగం వహించిన సీసీఎంబీ పీహెచ్డీ విద్యార్థి, ముంబై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ శాస్త్రవేత్త సుధాకర్ దిగుమర్తి తెలిపారు. ఈ పరిశోధనలో బెంగళూరు జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌తోపాటు సికింద్రాబాద్‌లోని మమత ఫెర్టిలిటీ ఆస్పత్రి, సీడీఎఫ్‌డీ తదితర జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయని వివరించారు. ఈ వివరాలు హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. డాక్టర్ కె.తంగరాజ్ -
గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ గాలిలో ఉండగలదని, గాలి ద్వారా వ్యాపించగలదనడానికి సరైన ఆధారాలను సీఎస్ఐఆర్–సీసీఎంబీ హైదరాబాద్, సీఎస్ఐఆర్–ఇమ్టెక్ చండీగఢ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం కోవిడ్–19 చికిత్స అందించిన ఆస్పత్రులు, కోవిడ్–19 రోగులను ఉంచిన గదులు, హోం ఐసోలేషన్ పాటించిన కోవిడ్–19 రోగులున్న గదుల నుంచి గాలి నమూనాలను సేకరించి పరిశోధన చేశారు. ఈ క్రమంలో గాలిలో వైరస్ ఉన్నట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కనుగొన్నారు. కరోనా రోగులున్న పరిధిలో వైరస్ గాలిలోకి వ్యాపిస్తోందని, ఇతరులు ఆ పరిధిలోకి వెళ్తే వైరస్ బారిన పడతారని అంచనాకు వచ్చారు. గదిలో ఇద్దరి కన్నా ఎక్కువ మంది రోగులున్న చోట కోవిడ్–19 పాజిటివిటీ రేటు 75 శాతం ఉందని.. ఒకరు ఉన్నా లేదా రోగులు వెళ్లిపోయిన తర్వాత ఖాళీ చేసిన గదిలో పాజిటీవిటీ రేటు 15.8 శాతంగా ఉందని కనుగొన్నారు. బయటి గాలిలో కన్నా గదిలోని గాలిలో వైరస్ ఎక్కువ యాక్టివ్‌గా ఉందని పరిశోధనలో పాల్గొన్న శాస్తవేత్త డాక్టర్ శివరంజని మొహరీర్ స్పష్టం చేశారు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సీసీఎంబీ ప్రొఫెసర్, సీనియర్ సైంటిస్ట్, టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనిటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా సూచిస్తున్నారు. చదవండి: టీకా వేసుకోవాలని... బలవంతపెట్టలేం: సుప్రీం -
రాగితో మాస్కు.. 99.9 శాతం బ్యాక్టీరియా నాశనం.. మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి మాస్కు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి దాదాపు అన్ని చోట్లా ‘మాస్క్ తప్పనిసరి’ చేశారు. అయితే కరోనాతో పాటు అన్ని బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే మాసు్కలు వచ్చేస్తే! ఇలాంటి మాసు్కనే ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ (ఏఆర్‌సీఐ), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కలిసికట్టుగా తయారు చేశారు. రాగిని నానో స్థాయిలో వాడి రూపొందించిన ఈ కొత్త రకం మాసు్కను బెంగళూరుకు చెందిన రెసిల్ కెమికల్స్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. 20 నానోమీటర్ల సైజున్న రాగి కణాలతో.. బ్యాక్టీరియా, వైరస్‌లను అడ్డుకోగల మాసు్కలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నా వాటి ఖరీదు ఎక్కువ. అందుకే ఏఆర్‌సీఐ, సీసీఎంబీ శాస్త్రవేత్తలు చౌకైన యాంటీవైరల్ మాస్కు తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేపట్టిన నానో మిషన్‌లో భాగంగా 20 నానోమీటర్ల సైజున్న రాగి కణాలను తాము తయారు చేశామని, వస్త్రంపై ఈ కణాలతో కూడిన పూత పూయడం ద్వారా 99.9 శాతంతో బ్యాక్టీరియాను నాశనం చేయగలిగామని ఏఆర్‌సీఐ శాస్త్రవేత్త ఎన్. తాతారావు తెలిపారు. అలాగే సీసీఎంబీ శాస్త్రవేత్తల ప్రయోగాల్లో వైరస్ 99.9 శాతం నశించినట్టు గుర్తించారు. నానో కణాల పూత ఉన్న మాస్కు ఒక్క పొరతో ఉన్నా ప్రభావం బాగా కనబడింది. ప్రస్తుతం రెండు పొరలున్న మాసు్కను రెసిల్ సంస్థ పెద్ద ఎత్తున తయారు చేస్తోంది. ఈ మాసు్కలను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురాబోతోంది. వీటిని సాధారణ మాసు్కల్లా శుభ్రం చేసుకుని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు కూడా. -
కేన్సర్‌కు పసుపు మందు!
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన కేన్సర్ మహమ్మారికి మెరుగైన చికిత్సను రూపొందించే దిశగా ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)’శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఆధునిక చికిత్స పద్ధతులకు తోడుగా పసుపులో ఉండే అద్భుతమైన రసాయనం ‘కర్క్యుమిన్’ను వినియోగించడం ద్వారా అద్భుత ఫలితాలు వస్తున్నట్టు గుర్తించారు. ప్రతిబంధకాలను అధిగమించి.. కీమోథెరపీ అవసరం లేకుండానే కేన్సర్‌కు చికిత్స చేసేందుకు ఇటీవలికాలంలో జన్యువులను స్విచ్ఛాఫ్ చేసే పద్ధతి ‘ఆర్ఎన్ఏ ఇంటర్ఫెరెన్స్ (ఆర్‌ఎన్‌ఏఐ)’అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఆర్ఎన్ఏఐను సురక్షితంగా, కేన్సర్ కణితులే లక్ష్యంగా ప్రయోగించే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ లేఖ దినేశ్ కుమార్ నేతృత్వంలోని సీసీఎంబీ శాస్త్రవేత్తల బృందం, నేషనల్ కెమికల్ లేబొరేటరీకి చెందిన పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సంయుక్తంగా పరిశోధన చేపట్టాయి. పసుపులోని కర్క్యుమిన్ రసాయనంతో నానో నిర్మాణాలు కొన్నింటిని అభివృద్ధి చేశాయి. అవి ఆర్‌ఎన్‌ఏఐ (ఈపీహెచ్బీ4 ఎస్‌హెచ్ ఆర్ఎన్ఏ)లను సురక్షితంగా బంధించి ఉంచేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని నిర్దిష్ట కండరాలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించవచ్చని తేల్చారు. పైగా కర్క్యుమిన్ జీవ సంబంధితమైనది కాబట్టి.. శరీరం శోషించుకోగలదని గుర్తించారు. రొమ్ము, పేగు కేన్సర్లు ఉన్న ఎలుకలకు ఈ మందును అందించినప్పుడు.. కేన్సర్ కణితుల పరిమాణం తగ్గిందని డాక్టర్ దినేశ్ తెలిపారు. -
వై క్రోమోజోమ్... వెరీ స్పెషల్!
సాక్షి, హైదరాబాద్: పురుషులకు మాత్రమే ప్రత్యేకమైన వై క్రోమోజోమ్‌కు సంబంధించి ఒక కొత్త, వినూత్నమైన అంశాన్ని శాస్త్రవేత్తలు వెలికితీశారు. కేవలం లింగ నిర్ధారణకు మాత్రమే ఉపయోగపడుతుందని ఇప్పటివరకూ ఉన్న అంచనా పూర్తిగా నిజం కాకపోవచ్చని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లింగ నిర్ధారణతోపాటు పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఇతర జన్యువుల నియంత్రణలోనూ వై క్రోమోజోమ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసిందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన సీసీఎంబీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రాచెల్ జేసుదాసన్ తెలిపారు. బీఎంసీ బయోలజీ తాజా సంచికలో పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. ఎలుకల వై క్రోమోజోమ్‌ను పరిశీలించినప్పుడు అందులో నిర్దిష్ట డీఎన్ఏ భాగం కొంత ఎడంతో పదేపదే కనిపిస్తోందని... ఇవి ఇతర క్రోమోజోమ్‌లలోని జన్యువుల వ్యక్తీకరణపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసిందని వివరించారు. వృషణాల్లోని ఈ జన్యువులు కేవలం పునరుత్పత్తికి మాత్రమే చెంది ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. పునరావృతమవుతున్న డీఎన్ఏ భాగం కొన్ని జీవజాతుల్లో ఉంటే మరికొన్నింటిలో లేదని, ఇది ప్రత్యేకమైన చిన్నస్థాయి ఆర్ఎన్ఏల ఉత్పత్తికి కారణమవుతోందని జేసుదాసన్ వివరించారు. చిన్నస్థాయి ఆర్ఎన్ఏలపై ఇదే తొలి పరిశోధన వ్యాసమన్నారు. జీవజాతుల పరిణామ క్రమంలో ఈ పునరావృత డీఎన్ఏ భాగాలు పునరుత్పత్తిని నియంత్రించే స్థితిని కోల్పోతాయని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ జెనిటిక్స్ డిపార్ట్మెంట్కు సలహాదారు (పరిశోధనలు)గా వ్యవహరిస్తున్న జేసుదాసన్... ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ జినోమిక్స్ అండ్ జీన్ టెక్నాలజీ శాస్త్రవేత్త కూడా. -
సీసీఎంబీ శాస్త్రవేత్తకు ఇన్ఫోసిస్ అవార్డు
సాక్షి ,హైదరాబాద్: శాస్త్ర, పరిశోధన రంగాల్లో చేసిన కృషికి గాను దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ అందించే ఇన్ఫోసిస్ సైన్స్ అవార్డు ఈ ఏడాది హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్త డాక్టర్ రాజన్ శంకరనారాయణన్ ను వరించింది. జీవశాస్త్ర రంగానికి సంబంధించి డాక్టర్ రాజన్ కు అవార్డు దక్కగా ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో హరి బాలక్రిష్ణన్‌ను అవార్డుకు ఎంపిక చేసినట్ల ఇన్ఫోసిస్ తెలిపింది. దేశంలో ప్రతీ పేద బాలుడికీ పోషకాహారం, విద్య, ఆరోగ్య సౌకర్యాలు, గూడు అందుబాటులో ఉండాలని ఇన్ఫోసిస్ ఆశిస్తోందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకల్లో ఒకరైన నారాయణ మూర్తి తెలిపారు. శాస్త్రవేత్తలకు అవార్డులు ఇవ్వడం ద్వారా తాము ఆ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. -
వచ్చే రెండు మూడు నెలలపాటు జాగ్రత్తగా ఉండాలి
-
నిర్వీర్యం చేసిన వైరస్‌తో టీకా!
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు టీకా తయారీకి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. నిర్వీర్యం చేసిన కరోనా వైరస్‌నే టీకాగా అభివృద్ధి చేస్తుండటం విశేషం. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఏడాదిలో టీకా మన ముందుకు వస్తుందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. సురక్షితమైన, సులువుగా తయారు చేసేందుకు వీలైన పద్ధతిలో తాము టీకా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని పిలిచే ఈ తరహా టీకాల తయారీ మానవ కణంలో వైరస్ సంతతిని గణనీయంగా పెంచడం ద్వారా మొదలవుతుంది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన రసాయనాలను లేదా వేడిని ఉపయోగించడం ద్వారా వైరస్‌ను నిర్వీర్యం చేస్తారు. వైరస్ నిర్వీర్యమైనా, పునరుత్పత్తి సామర్థ్యం లేకపోయినా.. అందులోని ప్రొటీన్ కొమ్ము లాంటి భాగాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. ఈ కొమ్ము సాయంతోనే వైరస్ కణాల్లోకి ప్రవేశిస్తుందన్నది మనకు తెలిసిన విషయమే. అయితే నిర్వీర్యమైన వైరస్ మన కణంలోకి ప్రవేశిస్తే.. రోగ నిరోధక వ్యవస్థ దాన్ని గుర్తిస్తుంది. తదనుగుణంగా యాంటీబాడీలను తయారు చేస్తుంది. వైరస్ ఎలాగూ నిర్వీర్యమైంది కాబట్టి దాని ద్వారా వ్యాధి లక్షణాలు కనిపించవు. ఇంకోలా చెప్పాలంటే.. ఈ టీకాను వాడటం సురక్షితమన్నమాట. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారు కూడా దీన్ని ఉపయోగించొచ్చు. సీసీఎంబీలో ప్రస్తుతం తాము ఈ ఇనాక్టివేటెడ్ టీకా తయారీకి సిద్ధమవుతున్నామని రాకేశ్ మిశ్రా తెలిపారు. నిర్వీర్యమైన వైరస్‌లను చెప్పుకోదగ్గ స్థాయిలో ఉత్పత్తి చేసి ఇంజెక్షన్ రూపంలో శరీరంలోకి ప్రవేశపెట్టాలన్నది తమ ఆలోచన అని వివరించారు. బయట పెంచడమే సవాల్.. వైరస్‌లన్నీ పరాన్న జీవులని తెలిసిన విషయమే. వీటికి స్వయంగా జీవం ఉండదు. కాకపోతే ఇతర జంతువుల కణాల్లోకి చొరబడి.. వాటి జన్యుపదార్థాన్ని హైజాక్ చేయడం ద్వారా వేగంగా వృద్ధి చెందుతాయి. ఇప్పుడు టీకా తయారీలో అతిపెద్ద సవాలు కూడా ఇదే. శరీరం బయట ఈ వైరస్‌లను పెంచాల్సి ఉంటుంది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఈ సమస్యను అధిగమించేందుకు ఆఫ్రికాకు చెందిన కోతుల చర్మపు పై పొరలోని కణాలను వైరస్‌ను వృద్ధి చేసేందుకు ఉపయోగించాలన్న ఆలోచనలో ఉన్నారు. నిర్వీర్యమైన వైరస్‌లో అవసరమైన ప్రొటీన్లు అన్నీ ఉన్న వాటిని ఎంపిక చేసేందుకు రెండు, మూడు నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత వేర్వేరు దశల్లో జంతు, మానవ ప్రయోగాలు చేపట్టేందుకు, మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ఏడాది కంటే ఎక్కువ సమయం పడుతుందని రాకేశ్ మిశ్రా వివరించారు. వైరస్‌ను పెంచేందుకు తగిన పద్ధతిని కనుక్కోవడం భవిష్యత్తులో కరోనా చికిత్సకు అవసరమైన మందుల తయారీకి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ఒకసారి వైరస్‌ను కణంలోకి ప్రవేశపెడితే రెండు, మూడు రోజుల తర్వాత కణాలు చనిపోగా.. వైరస్లు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయని.. మందుగా పనిచేస్తాయనుకున్న వాటిని నేరుగా ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని లెక్కకట్టవచ్చని తెలిపారు. నాలుగు రకాల టీకాలు.. వ్యాధుల నివారణకు ఉపయోగపడే టీకాలను స్థూలంగా నాలుగు పద్ధతుల్లో తయారు చేస్తారు. బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటి నుంచి ఎలా ఎదుర్కోవాలో శరీర రోగ నిరోధక వ్యవస్థకు నేర్పించడం టీకా ప్రధాన ఉద్దేశం. తద్వారా బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చన్నమాట. శాస్త్రవేత్తలు టీకాలను తయారు చేసేటప్పుడు బ్యాక్టీరియా/వైరస్‌లకు రోగ నిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తోంది.. ఎవరికి టీకా అవసరం.. టీకా తయారీకి మేలైన పద్ధతి, టెక్నాలజీ ఏది అన్న అంశాలను ముందుగా పరిగణనలోకి తీసుకుంటారు. వీటి ఆధారంగా నాలుగు రకాల టీకాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుంటారు. బలహీనమైన వైరస్‌లతో.. ఈ రకమైన టీకాను లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ అని పిలుస్తారు. ఇందులో వైరస్‌కు విరుగుడుగా బలహీనమైన వైరస్‌ను ఉపయోగిస్తారు. ఈ రకమైన టీకాలోని వైరస్లు బలహీనంగా ఉంటాయి గానీ.. వీటికి కూడా రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. యాంటీబాడీలను తయారు చేసుకుంటుంది. ఒకట్రెండు డోసుల టీకాతోనే జీవితాంతం నిర్దిష్ట వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. అయితే ఈ రకమైన టీకాలు అందరికీ అనుకూలంగా ఉండవు. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.. అవయవ మార్పిడి చేసుకున్నవారు ఈ రకమైన టీకాలు వేయించుకునే ముందు వైద్యులను సంప్రదించడం మేలు. బలహీనమైన వైరస్‌లతో కూడిన టీకాలను ఎప్పుడూ చల్లగా ఉంచాల్సి ఉంటుంది. మశూచి, స్మాల్‌పాక్స్, చికెన్ పాక్స్ వంటి వ్యాధుల నుంచి రక్షణకు ఇచ్చే టీకాలు ఈ లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్లకు ఉదాహరణలు. సూక్ష్మజీవి భాగాలతో చేస్తే.. వ్యాధి కారక సూక్ష్మజీవి భాగాలను ఉపయోగించుకుని కూడా టీకా తయారు చేయొచ్చు. ప్రొటీన్లు, చక్కెరలు, సూక్ష్మజీవి చుట్టూ ఉండే తొడుగు వంటివి టీకా తయారీకి వాడతారు. వాడే భాగాన్ని బట్టి వీటిని సబ్యూనిట్/ రీకాంబినెంట్/పాలిశాకరైడ్/ కంజుగేట్ వ్యాక్సిన్లుగా పిలుస్తారు. విడిభాగం ఒక్కదాన్నేవాడటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ స్పందన బలంగా ఉంటుంది. అవసరమైన వారందరికీ ఇచ్చేందుకు వీలైన టీకా ఇది. అయితే వ్యాధి నుంచి రక్షణ కావాలంటే.. తరచూ బూస్టర్ షాట్లు తీసుకోవాల్సి ఉంటుంది. హెపటైటిస్–బి, షింగిల్స్, మెనింజో కోకల్, న్యూమోకోకల్, హ్యూమన్ పాపిలోమా వైరస్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించే టీకాలన్నీ ఇలా బ్యాక్టీరియా/వైరస్ విడిభాగాలతో తయారవుతాయి. విషాన్ని విరుగుడుగా ఇస్తే.. సూక్ష్మజీవులకు పడని విషాన్ని ఉపయోగించడం ద్వారా తయారయ్యే టీకాను టాక్సాయిడ్ వ్యాక్సిన్ అని పిలుస్తారు. ఇవి తీసుకున్నప్పుడు సూక్ష్మజీవి మొత్తానికి రోగ నిరోధక వ్యవస్థ స్పందించదు. వాడిన టాక్సిన్ (విషం) ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే స్పందిస్తుంది. టాక్సాయిడ్ టీకాలు కూడా తరచూ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకట్రెండు డోసులతో జీవితాంతం రక్షణ లభించదు. టెటానస్, డిప్తీరియా వంటి వ్యాధుల నుంచి రక్షణకు ఉపయోగించేవి టాక్సాయిడ్ వ్యాక్సిన్లకు ఉదాహరణలు. నిర్వీర్యమైన సూక్ష్మజీవులతో.. ఈ రకమైన టీకాలను ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అని పిలుస్తారు. వ్యాధి కారక సూక్ష్మజీవిని నిర్వీర్యం చేసిన తర్వాత వాడతారన్నమాట. లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్లతో పోలిస్తే అంత ప్రభావం చూపవు. ఎక్కువ డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. సూక్ష్మజీవి నిర్వీర్యమైనా.. అవి శరీరంలో ఉన్నప్పుడు రోగ నిరోధక వ్యవస్థ వాటిని గుర్తించి ప్రతిచర్యలు తీసుకుంటుంది కాబట్టి.. నిర్దిష్ట వ్యాధి సోకదన్నది ఈ టీకా వెనుక ఉన్న సూత్రం. పోలియో, రేబిస్, హెపటైటిస్–ఏ వంటి వ్యాధుల నివారణకు ఇచ్చే టీకాలు ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు! -
కరోనా జన్యుక్రమం నమోదు
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌కు ముకుతాడు వేసేందుకు అన్నివైపుల నుంచి ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. టీకా, మందుల తయారీలో ఇప్పటికే పలు కంపెనీలు నిమగ్నమై ఉండగా.. ఈ వైరస్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆప్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ)లు జన్యుక్రమ నమోదును దాదాపు పూర్తి చేశాయి. అన్నీ సవ్యంగా సాగితే ఒకట్రెండు వారాల్లోనే కనీసం 5 ఐసోలేట్ వైరస్ల జన్యుక్రమాల నమోదు పూర్తి చేస్తామని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. కరోనా బారిన పడ్డ వ్యక్తి నుంచి వేరు చేసిన వైరస్‌ను ఐసోలేట్ అంటారు. జన్యుక్రమాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ వైరస్ ఎప్పుడు.. ఎలా పుట్టింది.. ఎలా పరిణమించిందన్న విషయాలు తెలుస్తాయని, తద్వారా భవిష్యత్తులో ఈ రకమైన వైరస్‌లను అడ్డుకోవడం సాధ్యమవుతుందని వివరించారు. వైరస్ పూర్తి జన్యుక్రమాన్ని తెలుసుకోవాలంటే బోలెడన్ని ఐసొలేట్‌ల జన్యుక్రమాలు అవసరమవుతాయి. ఎంత ఎక్కువ సంఖ్యలో ఐసొలేట్ జన్యుక్రమాలు ఉంటే.. అంత కచ్చితత్వంతో జన్యుక్రమాన్ని నమోదు చేయొచ్చు. ఆ వైరస్ గురించి అధ్యయనం చేయొచ్చు. ఈ కారణంగానే సీసీఎంబీతో పాటు ఐజీఐబీ కూడా ఐసోలేట్ జన్యుక్రమాలను నమోదు చేసే పనిలో ఉందని, ఇంకో వారం పది రోజుల్లో కావాల్సినంత సమాచారాన్ని సేకరించగలుగుతామని రాకేశ్ మిశ్రా తెలిపారు. వైరస్‌లకు సంబంధించి దేశంలోని ఏకైక పరిశోధన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి తాము కరోనా సోకిన వారి నుంచి వేరు చేసిన వైరస్‌లను సేకరిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని వైరస్ల జన్యుక్రమాలను నమోదు చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనముంటుందని చెప్పారు. -
మలేరియా కారక సూక్ష్మజీవిపై సీసీఎంబీ పరిశోధనలు
సాక్షి, హైదరాబాద్: మలేరియా కారక పరాన్నజీవిని మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. మలేరియా వ్యాధి నియంత్రణకు ఈ పరాన్నజీవి పనితీరును అర్థం చేసుకోవడం ముఖ్యం కాగా.. మన ఎర్ర రక్తకణాల్లోకి చేరి డీఎన్ఏను వాడుకునే దీని జన్యువులను తెలుసుకోవాలంటే 4 పొరలను దాటాల్సి ఉంటుంది. ఈ పొరలన్నింటినీ తొలగించి లోపలి పరాన్నజీవి పనితీరును అర్థం చేసుకునేందుకు ప్రస్తుతం ఎలక్ట్రోపోరేషన్ అనే ఖరీదైన పద్ధతిని వాడుతున్నారు. డాక్టర్ పూరన్‌సింగ్ సిజ్‌వాలీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ సమస్య పరిష్కారానికి మలేరియా కారక ప్లాస్మోడియం ఫాల్సీపరంపై పరిశోధనలు చేపట్టింది. లైజ్–రీ సీల్ అని పిలుస్తున్న ఈ పద్ధతి ద్వారా ప్లాస్మోడియం ఫాల్సిపరం కణాల్లోకి బయటి నుంచి జన్యువులను జొప్పించడం సులువవుతుంది. ఈ పరాన్న జీవి.. డీఎన్ఏలతో కూడిన ఎర్ర రక్తకణాల్లోకి చేరిపోయి అక్కడ ఉన్న డీఎన్ఏలోకి తనదైన జన్యువులు చొప్పిస్తుంది. పరిశోధన వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమయ్యాయి. -
మధుమేహ నియంత్రణకు కొత్త మార్గం
సాక్షి, హైదరాబాద్: మధుమేహాన్ని నియంత్రించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు ఓ కొత్త మార్గా న్ని ఆవిష్కరించారు. ఊబకాయం వల్ల మధుమేహం వచ్చిన వారిలో ఇన్సులిన్ పనిని సెక్రెటాగోగిన్ అనే ప్రొటీన్ ఎక్కువ చేస్తున్నట్లు డాక్టర్ యోగేంద్ర శర్మ, ఆనంద్ శర్మ, రాధిక ఖండేల్వాల్, అమృతా చిదానందలు గుర్తించారు. ఈ ప్రొటీన్ అతుక్కుపోవడం వల్ల ఇన్సులిన్‌కు రక్షణ కలుగుతోందని, స్థిరంగా ఉండేలా చేయడం ద్వారా పనితీరును మెరుగుపరుస్తోందని వీరు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. మధుమేహుల్లో ఈ ప్రొటీ న్ చాలా తక్కువగా ఉంటుంది. ఊబకాయంతో ఉన్న ఎలుకలకు ఈ ప్రొటీన్‌ను అందించినప్పుడు కొవ్వు తగ్గడంతోపాటు రక్తంలో తిరుగుతున్న అదనపు ఇన్సులిన్‌ను తొలగించింది. అంతేకాకుండా ఈ ప్రొటీన్‌ను అందుకున్న ఎలుకల్లో హానికారక ఎల్డీఎల్ కొవ్వు కూడా తగ్గిపోయిందని, కాలేయ కణాల్లో కొవ్వులు పేరుకుపోవడమూ తగ్గిందని డాక్టర్ యోగేంద్ర శర్మ తెలిపారు. సాధారణంగా మధుమేహం, మతిమరుపు మధ్య సంబంధం ఉంటుందని, అల్జీమర్స్ రోగుల మెదళ్లలో ఈ సెక్రెటాగోగిన్ప్రొటీన్ తక్కువ మోతాదుల్లో ఉండటాన్ని బట్టి తాము కొన్ని ఇతర ప్రయోగాలు చేశామని ఆయన వివరించారు. సెక్రెటాగోగిన్ప్రొటీన్ అల్జీమర్స్ వంటి అనేక నాడీసంబంధిత సమస్యలకు కారణమయ్యే ఆల్ఫా సైనూక్లియన్ ప్రొటీన్ ఫిబ్రిల్స్ ఏర్పడటాన్ని నిరోధిస్తున్నట్లు ఈ ప్రయోగాల ద్వారా తెలిసిందని వివరించారు. మధుమేహ నియంత్రణకు ఈ ప్రొటీన్ సరికొత్త మార్గం కాగలదని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా వ్యాఖ్యానించారు. -
తెలుగు.. 4,500 ఏళ్ల వెలుగు!
సాక్షి, హైదరాబాద్: వేయి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 4,500 ఏళ్లు! ఒక భాషగా తెలుగు ఉనికిలో ఉన్న కాలమిది! ఒక్క తెలుగేమిటి.. కన్నడ, తమిళ, మలయాళ భాషలతో కూడిన ద్రావిడ భాషా కుటుంబం మొత్తం ఇంత పురాతనమైందని అంటోంది జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. ప్రాచీన భాషగా గుర్తింపు కోసం తెలుగు, కన్నడ భాషలు సుప్రీంకోర్టులో పోరాడుతున్న తరుణంలో ఈ అధ్యయనానికి ప్రాముఖ్యత ఏర్పడింది. దక్షిణాదిన ఉన్న 4 ప్రధాన భాషలతోపాటు ఎక్కడో బలూచిస్తాన్‌లో మాట్లాడే బ్రాహుయీ వంటివన్నీ ద్రావిడ భాషా కుటుంబానికే చెందుతాయి. అఫ్గానిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వరకూ ఉండే దక్షిణాసియాలో ఈ భాషా కుటుంబంలో మొత్తం 80 భాషలు, యాసలున్నాయని అంచనా. దాదాపు 22 కోట్ల మంది మాట్లాడే ఈ వేర్వేరు భాషలు, యాసలు ఎంత పురాతనమైనవో తెలుసుకునేందుకు ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహించారు. ఆయా భాషలు మాట్లాడేవారి నుంచి పదాలు, వాటి అర్థాల వంటి వివరాలు సేకరించి విశ్లేషించారు. అందులో తేలిందేమిటంటే.. ఇవన్నీ 4,000 నుంచి 4,500 ఏళ్ల పురాతనమైనవీ అని! అయితే తమిళం, సంస్కృత భాషలు వీటికంటే పురాతనమైనవి కావొచ్చని, సంస్కృత భాష వినియోగం కాలక్రమంలో అంతరించిపోగా, తమిళం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కె.విష్ణుప్రియ తెలిపారు. క్రీస్తుశకం 570 ప్రాంతానికి చెందిన కళ్లమళ్ల శాసనం తెలుగులో గుర్తించిన తొలి శాసనం అన్న సంగతి తెలిసిందే. యురేసియా చరిత్రకు ఇవే కీలకం యురేసియా ప్రాంతపు పూర్వ చరిత్రను తెలుసుకోవాలంటే ద్రావిడ కుటుంబ భాషలు కీలకమని, ఇవి ఇతర భాషలను ప్రభావితం చేయడమే అందుకు కారణమన్నది నిపుణుల అంచనా. ఈ భాషలన్నీ ఎప్పుడు, ఎక్కడ పుట్టాయి? ఎంత వరకూ విస్తరించాయి? అన్న అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కాకపోతే ద్రావిడులు భారత ఉపఖండానికి చెందినవారేనని ఉత్తర భారత ప్రాంతానికి ఆర్యులు రావడానికి ముందు నుంచే వీరు ఇక్కడ ఉన్నారనడంపై పరిశోధకుల మధ్య ఏకాభిప్రాయం ఉంది. క్రీ.పూ. 3500 ప్రాంతంలో ఆర్యులు భారత్‌కు వచ్చారని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. అయితే భారతీయుల జన్యుక్రమంలో ఇతర ప్రాంతాల వారి జన్యువులేవీ లేవని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా స్పష్టం చేశారు. గణాంక శాస్త్ర పద్ధతుల ద్వారా.. ద్రావిడ కుటుంబ భాషలు ఎంత పురాతనమైనవో తెలుసుకునేందుకు మ్యాక్స్‌ప్లాంక్ శాస్త్రవేత్తలు ఆధునిక గణాంక శాస్త్ర పద్ధతులను ఉపయోగించారు. అన్ని ద్రావిడ కుటుంబ భాషల ప్రజల నుంచి పదాలను వాటి అర్థాలను సేకరించి అవి 4,500 ఏళ్ల పురాతనమైన భాషలు, యాసలు కావచ్చునని గుర్తించారు. పురాతత్వ ఆధారాలు దీన్ని రూఢీ చేస్తున్నాయని విష్ణుప్రియ తెలిపారు. ఇదే సమయంలోనే ద్రావిడ భాషలు ఉత్తర, మధ్య, దక్షిణ భాగాలుగా విడిపోయాయని, సంస్కృతీపరమైన మార్పులూ ఈ కాలంలోనే మొదలైనట్లు పురాతత్వ ఆధారాల ద్వారా తెలుస్తోందని వివరించారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ భాషల మధ్య ఉన్న సంబంధాలపై మరింత స్పష్టత రావొచ్చని, భౌగోళిక చరిత్రకూ భాషలకూ మధ్య సంబంధం కూడా తెలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తెలంగాణలో తెలుగు భాషకు సంబంధించి 2 వేల సంవత్సరాల నాటి ఆధారాలు లభ్యమయ్యాయి. తాజా అధ్యయనం ప్రకారం తెలుగు 4,500 సంవత్సరాల పురాతనమైనదే అయితే తెలుగువాళ్లంతా స్వాగతించాలి. రామగిరి ఖిల్లాలో లభించిన గోపరాజుల నాణాలపై ‘అన్న’అనే తెలుగు పదం ఉంది. – నందిని సిధారెడ్డి, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ -
లాల్జీ సింగ్ కన్నుమూత
వారణాసి/హైదరాబాద్: ప్రముఖ శాస్త్రవేత్త, భారత డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు లాల్జీ సింగ్ (70) ఆదివారం రాత్రి కన్నుమూశారు. వారణాసి విమానాశ్రయంలో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఛాతిలో తీవ్రమైన నొప్పి రావటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ‘విమానాశ్రయంలో ఉన్న సమయంలో లాల్జీ తీవ్రమైన ఛాతీ నొప్పితో కుప్పకూలారు. వెంటనే బీహెచ్‌యూ ట్రామా కేర్ సెంటర్లో అత్యవసర సేవలందించాం. అయినా లాభంలేదు’ అని బీహెచ్‌యూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. వారణాసి పక్కనున్న జౌన్పూర్ జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించిన లాల్జీ సింగ్ బీహెచ్‌యూ 25వ వైస్‌చాన్స్‌లర్‌గా ఉన్నారు. ఇదే యూనివర్సిటీలో ఆయన బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్డీ పూర్తిచేశారు. ఈయన మృతిపట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని కేంద్ర డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో ఓఎస్డీగా (1995–99)కూడా ఆయన సేవలందించారు. ల్యాకోన్స్, జెనోమ్ ఫౌండేషన్ (పేదప్రజలకు జన్యుపరమైన సమస్యలకు చికిత్సనందించే సంస్థ) వంటి పలు సంస్థలను ఆయన స్థాపించారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపకుల్లో లాల్జీ ఒకరు. భారత బయోలాజికల్ సైన్సెస్‌కు చిరస్మరణీయమైన సేవలందించారు. లాల్జీ హఠాన్మరణంపై సీసీఎంబీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సీసీఎంబీ ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కే మిశ్రా, ఇతర శాస్త్రవేత్తలు సోమవారం ఆయనకు నివాళులర్పించారు. ‘డీఎన్ఏ ప్రింటింగ్’ ఆద్యుడు దేశంలో డీఎన్ఏ ఆధారంగా పితృత్వాన్ని నిర్ధారించే పరీక్షలను లాల్జీ సింగ్ అభివృద్ధి చేశారు. 1991లోనే డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీకి ఆయన ఆద్యుడు. డీఎన్ఏను కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టడం ద్వారా ఓ పితృత్వ కేసును నిర్ధారించారు. తర్వాత ఈ టెక్నాలజీ ఆధారంగా వందలాది సివిల్, క్రిమినల్ కేసులు కొలిక్కి వచ్చాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, పంజాబ్ మాజీ సీఎం బియంత్ సింగ్ హత్య కేసుల్లోనూ మృతుల నిర్ధారణకు ఈ టెక్నాలజీనే ఉపయోగపడింది. ► 1970లలో లాల్జీ సింగ్ తన సహచరులతో కలసి పాములపై పరిశోధనలు చేసేవారు. ఇండియన్ బ్రాండెడ్ క్రెయిట్ అనే పాము జన్యుక్రమంలో కొంతభాగం మళ్లీమళ్లీ పునరావృతమవుతున్నట్లు గుర్తించారు. తదుపరి పరిశోధనల్లో ఇలాంటి డీఎన్ఏ భాగాలు ఇతర జాతుల పాములతో పాటు మనుషుల్లోనూ ఉన్నట్లు తెలియడంతో దీని ఆధారంగా డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేయొచ్చని లాల్జీ సింగ్ గుర్తించారు. ► కాలక్రమంలో అంతరించిపోతున్న జీవజాతుల పరిరక్షణకు లాల్జీ సింగ్ కృషి చేశారు. హైదరాబాద్‌లోని సీసీఎంబీ డైరెక్టర్‌గా.. కృత్రిమ గర్భధారణ పద్ధతుల ఆధారంగా అంతరించిపోతున్న జీవజాతుల సంతతిని పెంచేందుకు లేబొరేటరీ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ ఎన్డేంజర్డ్ స్పీషీస్ (ల్యాకోన్స్)ను ఏర్పాటు చేశారు. ► కణాల్లోని వై–క్రోమోజోమ్‌లోని చిన్న భాగం ఆడ ఎలుకను మగ ఎలుకగా మార్చేసేందుకు సరిపోతుందని లాల్జీసింగ్ 1982లో గుర్తించారు. ► 1998 వరకు భారత్‌లో జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు ఎలాంటి సౌకర్యాల్లేవు. ఈ నేపథ్యంలో లాల్జీసింగ్ దేశంలోనే తొలి జన్యువ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆయుర్వేదానికి జన్యు ఆధారం!
సీసీఎంబీ శాస్త్రవేత్తల వెల్లడి సాక్షి, హైదరాబాద్: భారతీయ వైద్యవిధానం ఆయుర్వేదానికి జన్యుపరమైన ఆధారాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నామని వెల్లడించారు. ఈ విషయంపై సంస్థ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్‌రావు బుధవారం విలేకరులతో మాట్లాడారు. తమ ఆవిష్కరణ వ్యక్తిగత వైద్య చికిత్సా విధానానికి మార్గం సుగమం చేస్తుందని.. భారతీయ సంప్రదాయ వైద్యవిధానంపై మరిన్ని పరిశోధనలు జరిగేందుకు దోహదపడుతుందని ఆయన చెప్పారు. ఆయుర్వేద విధానంలో పేర్కొనే మూడు ప్రాథమికమైన దోషాలు (వాతం, పిత్తం, కఫం) మన జన్యువుల్లోని తేడాల వల్ల కలుగుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. ఈ ప్రపంచం, ప్రాణికోటి పంచభూతాల ద్వారా ఏర్పడ్డాయని సనాతన భారతీయులు నమ్మేవారని, ఆయుర్వేదంలోని మూడుదోషాలు కూడా వీటి మధ్య సమతౌల్యానికి సంబంధించిందేనని మోహన్‌రావు పేర్కొన్నారు. అత్యాధునిక పద్ధతులలో పరిశీలించి.. త్రిదోషాలు కేవలం అంచనా మాత్రమేనా లేదా కణస్థాయిలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికేందుకే తాము ఈ పరిశోధన చేపట్టామన్నారు. సుశిక్షితులైన ఆయుర్వేద వైద్యులు, అత్యాధునిక కంప్యూటర్ సాఫ్ట్వేర్, జన్యుక్రమం విశ్లేషణల ఆధారంగా జరిగిన ఈ పరిశోధనలో... మొత్తం 3,400 మందిని పరిశీలించి వాత, పిత్త, కఫ దోషాల ప్రభావం ఎక్కువగా ఉన్న 262 మందిని గుర్తించామని తెలిపారు. వీరి జన్యుక్రమాన్ని పరిశీలించినప్పుడు దాదాపు 52 జన్యువుల్లో నిర్దిష్టమైన తేడాలు ఉన్నట్లు తెలిసిందని మోహన్‌రావు వెల్లడించారు. జీర్ణక్రియతోపాటు మెటబాలిజమ్ (జీవక్రియ)లో పీజీఎం1 జన్యువు పాత్ర ఇప్పటికే శాస్త్రీయంగా నిరూపితమైందని... పిత్తదోష ప్రభావమున్న వారిలో ఈ జన్యువు చురుకుగా పనిచేస్తున్నట్లు తాము గుర్తించామని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ తెలిపారు. ప్రఖ్యాత కార్డియోథొరాసిక్ సర్జన్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎం.ఎస్.వలియత్తన్, ఇతర శాస్త్రవేత్తలు కొందరు త్రిదోషాలకు, జన్యుక్రమానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షించారని... అందుకు తగ్గట్టుగా సీసీఎంబీ నేతృత్వంలో తాము ఆరేళ్ల క్రితం ఈ పరిశోధన చేపట్టామని ఆయన వివరించారు. మణిపాల్ యూనివర్సిటీ, ఉడిపిలోని శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఆయుర్వేద కళాశాల, పుణెలోని సిన్హద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బెంగళూరుకు చెందిన ఫౌండేషన్ ఫర్ రీవైటలైజేషన్ ఆఫ్ లోకల్ హెల్త్ ట్రెడిషన్స్, యూనివర్సిటీ ఆఫ్ పుణెలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నట్లు వివరించారు. -
ఆదిలాబాద్ ఆపిల్
ఉట్నూర్ : ఆపిల్ పండ్లు.. చల్లని ప్రదేశాల్లో వాటిని పండిస్తారు. అందుకే సిమ్లా, కశ్మీర్ వాటికి కేంద్రాలయ్యాయి. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యల్పంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఇక్కడ కూడా ఆపిల్ పండ్లు పండించవచ్చని, అనుకూలమైన వాతావరణం ఉందని సెంటర్ ఫర్ సెల్యూలార్ మాలిక్యులర్ బయోలాజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో భాగంగానే జిల్లాలో ఆపిల్ సాగుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు కెరమెరి మండలం సరిహద్దు ప్రాంతాలను ఎంచుకున్నారు. జిల్లాలోనే అతితక్కువ ఉష్టోగ్రతలు.. శీతాకాలం వచ్చిందంటే జిల్లాలో అతితక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కెరమెరి మండల సరిహద్దు ప్రాంతాల్లో అతి తక్కువ ఉ ష్టోగ్రతలు నమోదు కావడాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. చుట్టూ గుట్ట ప్రాంతం కావడం.. అడవులు విస్తరించి ఉండడంతో ఇక్కడ తక్కువ ఉ ష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. యాపిల్ పండ్లు సాగు కావాలంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండాలి. పంట కాలం 90నుంచి 110 రోజులు మాత్రమే ఉండడంతో ఇక్కడ ఆపిల్ సాగు సాధ్యమేనని శాస్త్రవేత్తలు అంచనాకొచ్చారు. విడుతలుగా సాగు.. ఆపిల్ పండ్ల సాగును విడుతలుగా విస్తరించాలని సీసీఎంబీ బావిస్తూంది. వచ్చే జనవరిలో ఆపిల్ సాగుకు ముందుకు వచ్చే రైతుల్లో కొంత మందిని గుర్తించి.. మొక్కలందించి సాగు చేపట్టేలా సన్నాహాలు చేయనున్నారు. ఆపి ల్ సాగు సత్ఫలితాలిస్తే విడుతలుగా విస్తీర్ణం పెంచనున్నారు. ఆపిల్ సాగు విజయవంతమైతే కశ్మీర్, సిమ్లా ప్రాంతాల సరసన మన జిల్లా చేరనుంది. కిలోకు వందల రూపాయలు వెచ్చించలేని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆపిల్ చౌకగా లభిస్తాయి. అదీకాక ఏజెన్సీలో పోషకాహార లోపం గిరిజనులకు శాపంగా మారింది. కెరమెరి ఏజెన్సీ ప్రాంతం కావడంతో చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలకు పండ్లు అందుబాటులోకి వస్తాయి. అంతేగాకుండా సాగు సక్సెస్‌తో గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నిత్యం అందించే పండ్ల సరసన ఆపిల్ చేర్చవచ్చు. ఆపిల్ తోటల పెంపకానికి మన ప్రాంతం అనుకూలంగా ఉంటుందా లేదా అనేది కొన్ని నెలల్లో తేలనుంది.