ఆయుర్వేదానికి జన్యు ఆధారం!
సీసీఎంబీ శాస్త్రవేత్తల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: భారతీయ వైద్యవిధానం ఆయుర్వేదానికి జన్యుపరమైన ఆధారాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నామని వెల్లడించారు. ఈ విషయంపై సంస్థ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్‌రావు బుధవారం విలేకరులతో మాట్లాడారు. తమ ఆవిష్కరణ వ్యక్తిగత వైద్య చికిత్సా విధానానికి మార్గం సుగమం చేస్తుందని.. భారతీయ సంప్రదాయ వైద్యవిధానంపై మరిన్ని పరిశోధనలు జరిగేందుకు దోహదపడుతుందని ఆయన చెప్పారు.
ఆయుర్వేద విధానంలో పేర్కొనే మూడు ప్రాథమికమైన దోషాలు (వాతం, పిత్తం, కఫం) మన జన్యువుల్లోని తేడాల వల్ల కలుగుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. ఈ ప్రపంచం, ప్రాణికోటి పంచభూతాల ద్వారా ఏర్పడ్డాయని సనాతన భారతీయులు నమ్మేవారని, ఆయుర్వేదంలోని మూడుదోషాలు కూడా వీటి మధ్య సమతౌల్యానికి సంబంధించిందేనని మోహన్‌రావు పేర్కొన్నారు.
అత్యాధునిక పద్ధతులలో పరిశీలించి..
త్రిదోషాలు కేవలం అంచనా మాత్రమేనా లేదా కణస్థాయిలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికేందుకే తాము ఈ పరిశోధన చేపట్టామన్నారు. సుశిక్షితులైన ఆయుర్వేద వైద్యులు, అత్యాధునిక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, జన్యుక్రమం విశ్లేషణల ఆధారంగా జరిగిన ఈ పరిశోధనలో... మొత్తం 3,400 మందిని పరిశీలించి వాత, పిత్త, కఫ దోషాల ప్రభావం ఎక్కువగా ఉన్న 262 మందిని గుర్తించామని తెలిపారు. వీరి జన్యుక్రమాన్ని పరిశీలించినప్పుడు దాదాపు 52 జన్యువుల్లో నిర్దిష్టమైన తేడాలు ఉన్నట్లు తెలిసిందని మోహన్‌రావు వెల్లడించారు.
జీర్ణక్రియతోపాటు మెటబాలిజమ్ (జీవక్రియ)లో పీజీఎం1 జన్యువు పాత్ర ఇప్పటికే శాస్త్రీయంగా నిరూపితమైందని... పిత్తదోష ప్రభావమున్న వారిలో ఈ జన్యువు చురుకుగా పనిచేస్తున్నట్లు తాము గుర్తించామని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ తెలిపారు. ప్రఖ్యాత కార్డియోథొరాసిక్ సర్జన్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎం.ఎస్.వలియత్తన్, ఇతర శాస్త్రవేత్తలు కొందరు త్రిదోషాలకు, జన్యుక్రమానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షించారని... అందుకు తగ్గట్టుగా సీసీఎంబీ నేతృత్వంలో తాము ఆరేళ్ల క్రితం ఈ పరిశోధన చేపట్టామని ఆయన వివరించారు.
మణిపాల్ యూనివర్సిటీ, ఉడిపిలోని శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఆయుర్వేద కళాశాల, పుణెలోని సిన్‌హద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బెంగళూరుకు చెందిన ఫౌండేషన్ ఫర్ రీవైటలైజేషన్ ఆఫ్ లోకల్ హెల్త్ ట్రెడిషన్స్, యూనివర్సిటీ ఆఫ్ పుణెలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నట్లు వివరించారు.