Ayurvedam
-
భూటాన్‌లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరమై పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టిపెట్టింది. తన ట్రీట్మెంట్లో భాగంగా రకరకాల థెరపీలను ట్రై చేస్తోంది సమంత. ఇటీవలె క్రయోథెరపీ అనే ఆయుర్వేద చికిత్స తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం భూటాన్‌లో ఉన్న సమంత.. డాట్‌షో (హాట్ స్టోన్ బాత్) అనే ఆయుర్వేద చికిత్సను తీసుకుంటుంది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ వల్ల కలిగే ఉపయోగాలను సైతం పంచుకుంది. భూటాన్‌లో హాట్ స్టోన్ బాత్ అనే ఆయుర్వేద ట్రీట్మెంట్ బాగా ఫేమస్. దీనిపై సమంత స్వయంగా తన పోస్టులో షేర్ చేస్తూ..''వేల ఏళ్ల క్రితం నుంచే భూటన్లో ఈ ఆచారం ఉంది. ఆయుర్వేదలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న భూటాన్ ప్రజలు స్టోన్ బాత్‌ని ఆచరిస్తున్నారు. నదులలో ఉన్న రాళ్లను ఎర్రగా కాలుస్తారు. వాటిని నీటిలో వేస్తారు. రాళ్లల్లో ఉన్న మినరల్స్ కరిగి భూటానీస్ హాట్ టబ్‌లోకి చేరుతాయి. ఈ ప్రక్రియలో కెంపా అనే మూలికలు కూడా వాడతారు. ఆ స్టోన్స్, మూలికలు ఈ హాట్ వాటర్ లో కరిగి వాటి శక్తి నీళ్లకు అందగా దీంట్లో స్నానం చేయడం వల్ల మనలో ఉన్న బాడీ పెయిన్స్, అలసట, కడుపు నొప్పి, జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత.. ఇలాంటివి అన్ని మాయం అవుతాయి. కండరాలు రిలాక్స్ కావడానికి ఉపయోగపడతాయి'' అంటూ ఆ ప్రాసెస్‌ని వివరించింది సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) మజిల్ పెయిన్, ట్రావెల్ సిక్నెస్, మజిల్ - బోన్ రిలేటెడ్ ట్రబుల్స్కీ, ఆర్తిరైటిస్, స్పాండిలైటిస్, జాయింట్ పెయిన్స్, స్టొమక్ సిక్నెస్ వంటివాటికి అన్నిటికీ ఈ బాత్ ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర్నుంచి సమంత కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్, బాలి, అమెరికా, ఆస్ట్రియా, ఇటలీ వంటి ప్రదేశాలకు వెళ్లింది. ఇప్పుడు భూటాన్‌లో ఆయుర్వే చికిత్సను తీసుకుంటూనే మరోపక్క అక్కడి ప్రకృతి ప్రదేశాలు, బుద్ధుడి ఆలయాలను సందర్శిస్తుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయుర్వేదంతో చెక్
అనేక అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదం చక్కటి పరిష్కారం. చిన్న చిట్కాలతోనే కొన్ని వ్యాధులను నయం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఇంగువను నిమ్మరసంతో కలిపి నూరి కొద్దిగా వెచ్చచేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది. బిళ్లగనేరు ఆకుల్ని, జామ ఆకుల్ని సమతూకంలో తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం 3 రోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. వంద గ్రాముల వాము శుభ్రంచేసి ఎర్రగా వేయించి, మెత్తగా పొడిచేసి డబ్బాలో నిల్వ ఉంచుకొని గ్యాస్ట్రబుల్ ఉన్నప్పుడు ఒక చెంచా పొడిని నీళ్ళల్లోగాని, విడిగా గాని తీసుకుంటే ఎక్కువ త్రేన్పులు రాకుండా ఉంటుంది. అల్లంముక్కలు తేనెతో గానీ, పంచదారతో గానీ కలుపుకుని తింటే యూనినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. పచ్చి మెంతులు ఒక అరచెంచా ఉదయం, సాయంత్రం మింగాలి. పచ్చివి తినలేకపోతే పెరుగులో నానబెట్టుకుని తింటే మూత్ర పిండాల నొప్పి తగ్గుతుంది. నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూజ, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికాయ చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి చల్లార్చి తలకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది. గుంటగలగరాకు దంచి, రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెలో కలిపి నీరు మరిగే వరకు ఉడకబెట్టాలి. చిటపట శబ్దం పోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచాలి. సువాసనకి గంధకచ్చూరాలు కలుపుకుని వాడడంవల్ల జుట్టు రాలదు. నల్లబడుతుంది, పెరుగుతుంది. అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది. అశ్వగంధ ఆకుల్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక పచ్చి ఆకుని నమిలి మింగాలి. ఇది బరువును తగ్గిస్తుంది ఎర్రమందారంపూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది. ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి. జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది. శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి సింహనాద గుగ్గిళ్ళు అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున మూడునెలలు వాడితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. -నవీన్ నడిమింటి -
ఎక్కువగా నిలబడి పనిచేస్తున్నారా?వెరికోస్ వెయిన్స్ నొప్పి నుంచి ఇలా ఉపశమనం
పాదాల్లోని సిరల్లో అవరోధాలు ఏర్పడి చెడురక్తం నిలిచిపోయి అవి మెలికలు తిరిగి ఉబ్బుతాయి. దీన్నే వేరికోస్ వెయిన్స్ అంటారు. ఎక్కువగా నిలబడి పని చేసేవారిలో వెరికోస్ వెయిన్ సమస్య ఎక్కువగా వస్తుంది. దీనికి పరిష్కార మార్గాలు, ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. యోగా యోగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.సిరల నుంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. యోగాసనాల ద్వారా వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే వాపు, పుండ్లు పడటం నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాయామం శారీరక శ్రమ లేదా వ్యాయామం అనారోగ్య సిరల అభివృద్ధి అవకాశాలను తగ్గిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం మీ కాళ్ళలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంద. అంతేకాకుండా ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడానికి కూడా సహాయపడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వాకింగ్ సైకిల్ తొక్కడం ఊపిరితిత్తులు లెగ్ లిఫ్ట్‌లు ఇలా చేయడం వల్ల కాళ్ల సిరల్లో ఒత్తిడి తగ్గడంతో పాటు సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ యాపిల్ సైడర్ వెనిగర్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.పేరుకుపోయిన టాక్సిన్స్ నుంచి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. వెరికోస్ వెయిన్స్కి చికిత్స చేయడానికి, పలచని యాపిల్ సైడర్ వెనిగర్‌ను వెరికోస్ వెయిన్లపై చర్మానికి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. ఇలా రోజుకు రెండుసార్లు చేయండి. లేదా గ్లాసు నీటిలో రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలుపుకొని తాగాలి.యాపిల్ సైడర్ వెనిగర్ చర్మంపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. లెగ్ మసాజ్ నొప్పి ఉన్న ప్రాంతాల్లో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల వేరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అయితే మసాజ్ చేసేటప్పుడు, నేరుగా సిరలపై నొక్కకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది పెళుసుగా ఉండే కణజాలాలను దెబ్బతీస్తుంది. వెరికోస్ వెయిన్ నొప్పి నుంచి ఉపశమనం తగ్గించడానికి కొన్ని ఆయుర్వేద పద్దతులు: అశ్వగంధ అశ్వగంధను సాధారణంగా "ఇండియన్ జిన్సెంగ్" లేదా "ఇండియన్ వింటర్ చెర్రీ" అని పిలుస్తారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఉపయోగించే సాంప్రదాయ ఔషధం. ఇది కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గోటుకోలా గోటు కోలా అనేది ట్రైటెర్పెనిక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెంటెల్లా ఆసియాటికా (TTFCA) అనే రసాయనాన్ని కలిగి ఉన్న ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధం. ఈ రసాయనం ముఖ్యంగా అనారోగ్య సిరలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎలాస్టిన్, కొల్లాజిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. గుగ్గుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన గుగ్గుల్‌ను ఆయుర్వేదంలో ఆర్థరైటిస్,ఊబకాయంతో సహా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.గుగ్గుల్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, మొటిమలు వంటి చర్మ వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. త్రిఫల చూర్ణం త్రిఫల అనేది ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద ఫార్ములా. ఇది రక్తాన్ని నిర్వీషికరణ చేయడంలో సహాయపడుతుంది. త్రిఫల చూర్ణం కండరాలకు బలాన్ని అందిస్తుంది. మంజిష్ఠ మంజిష్ట రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.రక్తప్రవాహంలో అడ్డంకులను కరిగిస్తుంది. అనారోగ్య సిరలు చికిత్సకు ఇది ఉత్తమమైన ఆయుర్వేద నివారణలలో ఒకటి. మంజిష్ఠ యొక్క ఇతర ప్రయోజనాలు మొటిమలు, హైపర్పిగ్మెంటేషన్ను నయం చేయడం. పసుపు పసుపులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా, వెరికోస్ వెయిన్స్ చికిత్సలో బాగా పనిచేస్తుంది. ఇది వాపు,నొప్పిని తగ్గిస్తుంది. రక్తం నుంచి హానీకరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. గమనిక: పైన పేర్కొన్ని ఆయుర్వేద మందులను వైద్యునితో చర్చించిన తర్వాతే తీసుకోవాలి. -నవీన్ నడిమింటి -
బంగారంతో రోగాలు నయం.. డిప్రెషన్ కూడా దూరమవుతుంది
బంగారంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయుర్వేదంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. యుర్వేద మందుల్లో బంగారంను నేరుగా ఉపయోగించకుండా.. బంగారంను భస్మంగా మార్చి స్వర్ణ భస్మంలా వాడుతుంటారు. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, మధుమేహం, నాడీ వ్యవస్థ సంబంధిత వ్యాధులకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. స్వర్ణ భస్మంలో 98శాంతం బంగారు రేణువులను కలిగి ఉన్నందున ఇది ఆయుర్వేదంలో అత్యంత ఖరీదైన ఔషధాలలో ఒకటిగా పేర్కొంటారు. నెయ్యి, తేనె లేదా పాలతో కలిపి స్వర్ణభస్మం పౌడర్ని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ► స్వర్ణ భస్మం రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చడంతో పాటు గుండె కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ► కడుపులోని ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి స్వర్ణభస్మం చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఇది అజీర్ణాన్ని పోగొడుతుంది. ► స్వర్ణభస్మంలో యాంటీ పైరేటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి జ్వరాలు, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. శతాబ్దాలుగా జ్వరాలకు ఆయుర్వేద చికిత్సలలో దీన్ని ఉపయోగిస్తున్నారు. ► రక్తాన్ని శుద్దిచేసి బ్లడ్ ప్యూరిఫైయర్‌గా పనిచేసే సామర్థ్యం స్వర్ణభస్మంలో ఉంటుంది. ► లైంగిక ఆరోగ్యాన్ని స్వర్ణభస్మం మెరుగుపరుస్తుంది. ► యాంటీ-స్ట్రెస్, యాంటీ-డిప్రెషన్ వంటి లక్షణాలు ఇందులో ఉన్నాయి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిద్రలేమిని తగ్గిస్తుంది. ► స్వర్ణ భాస్మాలో యాంటీ టాక్సిన్, యాంటీమైక్రోబయల్ యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ప్రారంభ దశలో టిబి కలిగించే బ్యాక్టీరియాను ఎదుర్కోగలవు. ► రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ► కణితులు లేదా క్యాన్సర్ల పెరుగుదలను ఎదుర్కోవడానికి కూడా పనిచేసే రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను స్వర్ణ భస్మం కలిగి ఉంది. - డాక్టర్ నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు -
అతివేడితో బాధపడుతున్నారా? వేడి గంజిలో పాలు, చక్కెర కలుపుకొని తాగితే..
వేసవిలో అతివేడితో బాధపడే వారికి ఆయుర్వేద వైద్యులు సూచిస్త్ను చిట్కాలివి. వేసవి తాప నివారణకు బ్రహ్మఫల చూర్ణంతో చెక్ పెట్టేయొచ్చు. పైత్య (అతి వేడి) శరీరంతో పుట్టిన వాళ్ళు తేనె రంగు శరీరంతో వుంటారు. వీళ్ళ శరీరం ఎక్కువ వేడి చేసి వుంటుంది. మొలలు వేసవి సమస్యలు మొదలగు వేడి సమస్యలతో బాధపడుతూ వుంటారు. బ్రహ్మఫల చూర్ణం ►బాగా పండిన మర్రి పండ్లను ఎండబెట్టి దంచిన పొడి---- 100 gr ►అతిమధురం పొడి ---100 gr ►కలకండ పొడి ---- 100 gr ►అన్నింటిని బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. ►10 గ్రాముల పొడిని కుండలోని నీటిలో కలిపి మూడు పూటలా తాగాలి. ►దీనిని వాడడం వలన ముక్కు నుండి రక్తం కారడం, మొల్ల ద్వారా ఆసనం నుండి, మలము ద్వారా రక్తం పడడం నివారింప బడతాయి. శీఘ్ర స్ఖలన సమస్యలు, గర్భాశయ సమస్యలు, నపుంసకత్వం నివారింపబడతాయి, అదే విధంగా.. పిల్లలు వాడితే పొడవు పెరుగుతారు, వృద్ధులు వాడితే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది. నడవలేని వాళ్ళు దీనిని వాడితే సమస్య నివారింపబడి నడకలో వేగం పెరుగుతుంది. 2. అతి_వేడి - నివారణ ఉష్ణము ఎక్కువైతే పైత్యం ఎక్కువవుతుంది. దీని వలన రక్తపైత్యము, అధిక రక్తపోటు చర్మ రోగాలు మొదలైనవి వస్తాయి. కావున వేడి శరీరం వున్నవాళ్ళు వేడిని తగ్గించే పదార్ధాలను వాడాలి. ముఖ్యంగా తీపిపదార్ధాలను ఎక్కువగా వాడాలి. ఆవుపాల పాయసాన్నము తినాలి. ►పొన్నగంటి కూర, బచ్చలి, పెరుగు తోటకూర, కరివేపాకు మొదలైనవి వాడుకోవాలి. ►ద్రాక్ష, బాదం, ఎండు ఖర్జూరం, కొబ్బరినీళ్ళు తరచుగా వాడాలి. ►వేడి ఎక్కువైతే పైత్యము ఎక్కువవుతుంది. దీని వలన నోటిపూత, అరిచేతుల, అరికాళ్ళ మంటలు, శరీరమంతా వేడిగా వుండడం మొదలైన లక్షణాలుంటాయి. ►కొబ్బరినూనె, ఆముదము శరీరాన్ని ఎంతో చల్లబరుస్తాయి. ఆముదాన్ని లోపలి సేవిస్తే వేడి చేస్తుంది. పై పూతగా వాడితే శరీరాన్ని చల్లబరుస్తుంది. ►చెరువులోని బంకమట్టిని తెచ్చి ఎండబెట్టి, దంచి, జల్లించి, నీళ్ళు పోసి పిసికి శరీరం మొత్తానికి అరికాళ్ళతో సహా పట్టిస్తే వెంటనే శరీరం చల్లబడుతుంది. ►వేడి ఎక్కువైతే మలము గట్టి పడి సమస్య ఏర్పడుతుంది. ఆహారం ►గుప్పెడు ఎండు ద్రాక్షను రాత్రి ఒక గ్లాసులో వేసి నీళ్ళు పోసి నానబెట్టాలి. దానిని ఉదయం బాగా పిసికి పానీయం లాగా చేసి తాగాలి. దీని వలన వేడి తగ్గి ఒక గంటలో సుఖ విరేచనమవుతుంది. రక్తంలోని మలినాలు తొలగించబడతాయి. ►అలాగే ఆహారంలో మజ్జిగ ఎక్కువగా వాడుకోవాలి. ►బార్లీ నీళ్ళు, చక్కర కలిపి ఉదయం, సాయంత్రం ఒక్కొక్క గ్లాసు సేవిస్తే వేడి తగ్గుతుంది. ►వేడి గంజిలో పాలు, చక్కెర కలుపుకొని తాగితే వేడి తగ్గుతుంది. 3. వేడి_తగ్గడానికి 1.తులసి రసం ---- ఒక టీ స్పూను నిమ్మ రసం ---- ఒక టీ స్పూను అల్లం రసం ---- ఒక టీ స్పూను చక్కెర ----- ఒకటి లేక రెండు స్పూన్లు అన్నింటిని కలుపుకొని ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు సేవిస్తే పైత్యం వలన కలిగే వాంతి, అన్నం చూస్తేనే వాంతి (అన్న ద్వేషం) ,అజీర్ణం, ఆకలి లేకపోవడం, కళ్ళు ఎర్రబడడం, గొంతులో మంట మొదలైనవి నివారంప బడతాయి. దీని వలన కఫము, వేడి రెండు తగ్గుతాయి. చిన్న పిల్లలకు మోతాదు తగ్గించి వాడాలి. 2. తులసి రసం ----- ఒక గ్లాసు నువ్వుల నూనె ---- ఒక గ్లాసు రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి. తలలో పైత్యం ఎక్కువై మంటలు, చురుకు వున్నపుడు ఆ నూనెను తలకు పెట్టి సున్నితంగా మర్దన చెయ్యాలి. 4. అతి వేడి సమస్య - నివారణ అతి మధురం పొడి --- ఒక టీ స్పూను పాలు --- అర గ్లాసు కలకండ లేదా చక్కెర --- ఒక టీ స్పూను పాలు స్టవ్ మీద పెట్టి మూడు పొంగులు రానిచ్చి, దించి వడపోసి గోరువెచ్చగా అయిన తారువాత చక్కెర గాని, కలకండ గాని, తేనె గాని కలుపుకొని తాగాలి. దీని వలన వెంటనే వేడి తగ్గుతుంది. ఇది ఇరవై రకాల వేడి సమస్యలను నివారిస్తుంది. అతి వేడి నివారణకు అమృతాహారం ►ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు. ►అతి వేడి వలన కళ్ళు మంటలు, కాళ్ళ మంటలు వుంటాయి. ►ఉల్లి ---- 50 gr ►నూనె లేక నెయ్యి ---- 50 gr ►పెరుగు ---- ఒక కప్పు ►ఉల్లి గడ్డలను సన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో పోసి నెయ్యి తో గాని నూనె తో గాని వేయించాలి. చల్లార్చి ఒక కప్పు పెరుగు కలపాలి. దీనిని ఉదయం గాని, సాయంత్రం గాని ఆహారంగా తీసుకోవాలి. వేడి ఎక్కువగా వుంటే రెండు పూటలా వాడుకోవచ్చు. శరీరంలోని అతివేడి తగ్గడానికి తంగేడు_కాఫీ తంగేడు పూల పొడి --- 100 gr పత్తి గింజల పొడి --- 50 gr ధనియాల పొడి --- 50 gr గులాబి రేకుల పొడి ---30 gr శొంటి పొడి --- 20 gr చిన్న ఏలకుల పొడి --- 20 gr సుగంధ పాల వేర్ల పొడి --10 gr తంగేడు విత్తనాల పొడ --10 gr అన్ని పదార్ధాలను కలిపితే తంగేడు కాఫీ పొడి తయారవుతుంది. కాఫీ ఫిల్టర్ లో పొడి వేసి డికాషన్ తయారు చేసి చక్కెర కలుపుకొని తాగితే శరీరం యొక్క వేడి తగ్గి, మెదడు చల్లబడుతుంది. మెదడుకు బలం చేకూరుతుంది. #అత్యుష్ణాన్నితగ్గించేపానీయం సుగంధ పాల వేళ్ళపొడి ----- అర టీ స్పూను ధనియాల పొడి ----- అర టీ స్పూను వట్టి వేర్ల పొడి ---- పావు టీ స్పూను కలకండ పొడి ----- ఒక టీ స్పూను ఒక గ్లాసు నీళ్ళలో అన్ని పొడులను వేసి మరిగించి అర గ్లాసు కషాయానికి రానివ్వాలి, వడపోసి, చల్లార్చి కలకండను కలపాలి. చల్లారిన తరువాత తాగాలి. దీని వలన పైత్య దోషము వలన వచ్చే తలనొప్పి ( లేదా అతి వేడి వలన వచ్చే తలనొప్పి ) తగ్గుతుంది. పిత్త సంహార ముద్ర దీనినే ప్రాణ ముద్ర లేక శక్తి ముద్ర అని కూడా అంటారు. ►బొటన వ్రేలి కొన, చిటికెన వ్రేలి కొన, ఉంగరపు వ్రేలి కొన లను కలిపి మిగిలిన రెండు వ్రేళ్ళను కిందికి పెట్టి ముద్ర వేసుకొని పద్మాసనంలో కూర్చోవాలి. ►దీని వలన అత్యుష్ణము వలన వచ్చే సమస్యలు, సెగ గడ్డలు, పొక్కులు, తలనొప్పులు చాలా అద్భుతంగా తగ్గుతాయి ►బార్లీ పేలాల పిండి చక్కెర.. రెండింటిని కలిపి తింటే అతి వేడి తగ్గుతుంది. ►అతి వేడి వలన శరీరలో వచ్చే మంటలు --నివారణ ►ఆవాలను మెత్తగా నూరి పేస్ట్ లాగా చేసి పాదాలకు పూస్తే శరీరంలోని మంటలు తగ్గుతాయి. ►శరీరం లోని అతి వేడిని తగ్గించడానికి మృత్తికా స్నానం ►ఈ ప్రక్రియ శరీరంలోని సకల మలినాలను తొలగిస్తుంది. ►పూర్వం ఒండ్రుమట్టిని తెచ్చి పిసికి ఒంటికి తలకు మట్టి పూసేవాళ్ళు. కొంతసేపటికి తలమీద మట్టి పులిసేది. ►ఒండ్రుమట్టి 5, 10 కిలోలు తెచ్చి ఎండబెట్టి నలగగొట్టి జల్లించి పట్టుకోవాలి. ►వేపాకుపొడిని, తులసి ఆకుల పొడిని, ;పసుపు పొడిని కలిపి విడిగా కలిపి పెట్టుకోవాలి. వేపాకు పొడి --- రెండు స్పూన్లు తులసి ఆకుల పొడి --- రెండు స్పూన్లు పసుపు పొడి --- రెండు స్పూన్లు ►బాగా వేడి శరీరం వున్నవాళ్ళు కొద్దిగా ముద్దకర్పూరం కలుపుకోవచ్చు. ఈ చూర్నాల మిశ్రమాన్ని, మట్టిపొడిని తగినంత నీటితో కలిపి శరీరానికి, తలకు, ముఖానికి పట్టించి అర గంట తరువాత స్నానం చేయాలి. ►దీని వలన శరీరంలో వుండే వేడి అంతా తగ్గిపోతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -నవీన్ నడిమింటి -
తలలో మల్లెపూలు పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసా? వీటిలోని ‘ఆర్సిటిన్’ అనే రసాయనం
వేసవి అంటే సూర్యుడు చండ్రనిప్పులు కురిపించే మండుటెండలు. వేసవి అంటే మనుషులను ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోతలు. వేసవి అంటే మామిడి రుచులు, తాటిముంజెల చవులు. వేసవి అంటే నసాళానికెక్కే ఘాటైన ఆవకాయల కారాలు. వేసవి అంటే ఇవే కాదు, మల్లెల పరిమళాలు కూడా! మల్లెలు వేసవిలోనే విరగబూస్తాయి. వీథి వీథినా బుట్టలు బుట్టలుగా అమ్మకానికొస్తాయి. బజారుల్లో గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. పరిసరాలను పరిమళభరితం చేస్తాయి. ఎండ చల్లబడిన సాయంవేళ చక్కగా స్నానం చేసి, కొప్పున మూరెడు మల్లెలు ముడుచుకుంటేనే తెలుగు పడతులకు అదో తృప్తి! ఇదివరకటి కాలంలో ఆడా మగా తేడా లేకుండా అందరూ తలలో మల్లెలను అలకరించుకునే వారు. శరవేగంగా పరుగులు తీసే కాలం తెచ్చిన పెనుమార్పులతో పురుషుల అలంకరణ నుంచి మల్లెలు తప్పుకున్నాయి. అలాగని, పురుషులకు మల్లెలంటే మొహంమొత్తినట్లు కాదు. మల్లెల పరిమళాన్ని ఇష్టపడటం వల్లనే ఉద్యోగాలు చేసే పురుషులు చాలామంది విధులు ముగించుకుని ఇళ్లకు మళ్లేటప్పుడు తోవలో భార్యల కోసం మల్లెలు కొనుక్కుని మరీ పోతారు. చిరకాలంగా మల్లెలు మన సంస్కృతిలో భాగం. మల్లెలను మాలలుగా అల్లడం ఒక ప్రత్యేకమైన కళ. మల్లెల పరిమళమే లేకపోతే వేసవులు మరింత దుర్భరంగా ఉండేవి. మండుటెండా కాలంలో మల్లెల పరిమళమే మనుషులకు ఊరట! మగువల అలంకరణల్లోనే కాదు, పూజ పురస్కారాల్లోనూ మల్లెలకు విశేషమైన స్థానం ఉంది. మన సాహిత్యంలో మల్లెల ప్రస్తావన కనిపిస్తుంది. మన సాహిత్యంలో మల్లెలను ఆరాధించని కవులు దాదాపుగా లేరు. శంకరంబాడి సుందరాచారి ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అంటూ తెలుగుతల్లికి మల్లెపూల దండతోనే పదాలంకరణ చేశారు. మల్లెలను సంస్కృతంలో ‘మల్ల’, ‘మల్లి’, ‘మల్లిక’ అంటారు. వేసవి మొదలయ్యే వసంత రుతువులో మల్లెలు పూయడం ప్రారంభిస్తాయి. అందువల్ల వీటిని ‘వార్షికి’ అంటారు. శీతాకాలంలో చలి పెరిగే సమయంలో మల్లెలు కనుమరుగైపోతాయి. అందువల్ల మల్లెలను ‘శీతభీరువు’ అని కూడా అంటారు. మల్లెల్లో వాటి రేకులు, పరిమాణాన్ని బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. బొండు మల్లెలు, కాడ మల్లెలు, అడవి మల్లెలు, విడి మల్లెలు, దొంతర మల్లెలు, బొడ్డు మల్లెలు వంటివి మన దేశంలో విరివిగా కనిపిస్తాయి. మన దేశంలో కనిపించే అన్ని రకాల మల్లెలు తెల్లగానే ఉంటాయి. వీటి పరిమళంలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. ఇతర దేశాల్లో కొన్ని చోట్ల అరుదుగా పసుపు రంగులోను, గులాబి రంగులోను పూచే మల్లెలు కూడా కనిపిస్తాయి. మల్లెల ఉత్పాదనలో భారత్, ఈజిప్టు దేశాలే అగ్రస్థానంలో ఉంటాయి. మల్లెలు సహజంగా పూచే పరిస్థితులు లేని చలి దేశాలు ఈ దేశాల నుంచి భారీ ఎత్తున మల్లెలను దిగుమతి చేసుకుంటాయి. కేవలం మల్లెలనే ఉపాధి చేసుకుని బతికేవారు మన దేశంలో కోకొల్లలుగా కనిపిస్తారు. మల్లెలు పరిమళించే దేశాలు ప్రపంచంలోని ఉష్ణమండల దేశాల్లోని వాతావరణం మల్లెలకు అనుకూలంగా ఉంటుంది. భారత్‌తో పాటు దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లోను; ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లో రకరకాల మల్లెలు ఏటా వేసవిలో విరివిగా కనిపిస్తాయి. అలాగే కొన్ని యూరోపియన్ దేశాల్లో కూడా మల్లెల సాగు జరుగుతోంది. మల్లెల్లో దాదాపు మూడువందల రకాలు ఉన్నాయి. వీటిలో 75 రకాలు భారత్‌లో పూస్తాయి. మల్లె మొక్కలను చాలామంది పెరటితోటల్లోను, కుండీల్లోను పెంచుకుంటారు. భూవసతి కలిగిన ఉద్యాన రైతులు వాణిజ్యపరంగా కూడా మల్లెలను సాగు చేస్తారు. మన దేశంలో వాణిజ్యపరంగా మల్లెల సాగు చేయడంలో తమిళనాడు అగ్రస్థానంలో నిలుస్తుంది. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోను మల్లెల సాగు గణనీయంగానే జరుగుతోంది. ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్‌లో వాణిజ్యపరంగా మల్లెల సాగు జరుగుతోంది. మల్లెలను సాగుచేసే రైతులు టోకు వర్తకులకు పెద్దమొత్తంలో మల్లెలను విక్రయిస్తారు. వీటిని టోకు వర్తకులు వినియోగం ఎక్కువగా ఉండే నగరాలు, పట్టణాలకు తరలిస్తారు. వివిధ దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు కూడా మల్లెలను పెద్ద ఎత్తున తరలిస్తుంటారు. వాణిజ్యపరంగా మల్లెల సాగు మన దేశంలో చిరకాలంగా సాగుతున్నప్పటికీ, మల్లెల సాగు విస్తీర్ణం, ఏటా స్థానికంగా జరిగే మల్లెల వ్యాపారం విలువ, మల్లెల ఎగుమతులు వంటి వివరాలపై గణాంకాలేవీ అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యకరం. పూల రారాణి మల్లెపువ్వును ‘పూల రారాణి’ అంటారు. ఇంగ్లిష్‌లో దీనికి ‘బెల్ ఆఫ్ ఇండియా’– అంటే ‘భారత సుందరి’ అనే పేరు, ‘క్వీన్ ఆఫ్ ఫ్రాగ్రన్స్’– ‘సుగంధ రాణి’ అనే పేరు కూడా ఉన్నాయి. మల్లెకు పర్షియన్ భాషలో ‘యాస్మిన్’ అనే పేరు ఉంది. దాదాపు పశ్చిమాసియా దేశాల్లోని అన్ని భాషల్లోనూ మల్లెను ‘యాస్మిన్’ అనే పిలుస్తారు. ఇంగ్లిష్ సహా పలు యూరోపియన్ భాషల్లో ‘జాస్మిన్’ అంటారు. హిందీలో మల్లెను మోగ్రా, చమేలీ, జూహీ అనే పేర్లతో పిలుస్తారు. భారత దేశంలోను, ఇతర దక్షిణాసియా దేశాల్లోను మల్లెలను మహిళలు సిగలలో అలంకరించుకుంటారు. శుభకార్యాల సమయంలో చేసే పుష్పాలంకరణలలోను, దేవాలయాల్లోను భారీ పరిమాణంలోని మల్లెమాలలను ఉపయోగిస్తారు. మల్లెలకు అనేక ఆధ్యాత్మిక విశేషాలు కూడా ఉన్నాయి. మల్లెలతో దేవతార్చన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మల్లెల మహిమ గురించి ‘పుష్పచింతామణి’ ఇలా చెబుతోంది: ‘మల్లికాజ్ఞా నకర్మార్థ మర్చయంతో మహేశ్వరమ్ లభంతే పరమం జ్ఞానం సంసార భయనాశనం’ ఎలాంటి కోరికలు లేకుండా మల్లెలతో ఈశ్వరార్చన చేసినట్లయితే సంసార భయాలు తొలగి, పరమజ్ఞానం కలుగుతుంది. ‘మల్లికా కుసుమై రేవం వసంతే గరుడధ్వజమ్ యోర్చయే పరయా భక్త్యా దహేత్ పాపం త్రిధార్జితమ్’ వసంత రుతువులో శ్రీమహావిష్ణువును మల్లెలతో అర్చిస్తే, మనో వాక్కాయ కర్మల వల్ల ప్రాప్తించిన పాపాలన్నీ తొలగిపోతాయి. భక్తులకు గల ఈ విశ్వాసం కారణంగానే వైష్ణవాలయాల్లో జరిగే పూజార్చనల్లో మల్లెలను విశేషంగా ఉపయోగిస్తారు. తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుని ఇతర పుష్పాలతో పాటు భారీస్థాయిలో మల్లెలను అలంకరిస్తారు. భాషా సాహిత్యాల్లో మల్లెలు మన భాషా సాహిత్యాల్లో మల్లెల ప్రస్తావన కనిపిస్తుంది. మన సామెతలు, జాతీయాల్లోనూ మల్లెల మాటలు వినిపిస్తాయి. ఉదాహరణ చెప్పుకోవాలంటే, ‘బోడితలకు బొడ్డు మల్లెలు ముడిచినట్లు’ అనే సామెత ఉంది. ఒకదానికొకటి ఏమాత్రం పొసగని వాటిని బోడితలకు బొడ్డు మల్లెలతో పోలుస్తారు. ‘జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా?’ అని మరో సామెత ఉంది. దుర్మార్గుల సంతానం దుర్మార్గులే అవుతారు గాని సన్మార్గులు కాలేరనే అర్థంతో ఈ సామెతను ఉపయోగిస్తారు. అలాగే, ‘ఉల్లి మల్లె కాదు, కాకి కోకిల కాదు’ అనే సామెత కూడా మనకు వాడుకలో ఉంది. మల్లెపూల గురించి చలం అద్భుతమైన కవిత రాశాడు. ‘మల్లెపూలు, తెల్లని మల్లెపూలు!/ విచ్చిన మల్లెపూలు! ఆ పరిమళం నాకిచ్చే సందేశం యే మాటలతో తెలపగలను!’ అంటూనే మల్లెల గురించి ఆయన ఈ కవితలో చాలా విశేషాలే చెబుతాడు. ‘ఒక్క స్వర్గంలో తప్ప/ ఇలాంటి వెలుగు తెలుపు/ లేదేమో– అనిపించే మల్లెపూలు’ అని పరవశించిపోతాడు. ఎంతైనా మల్లెలను అలంకరించుకునే అలవాటు ఉన్న మహానుభావుడాయన! మల్లెల పరిమళాలు కేవలం మన సాహిత్యంలోనే కాదు, పాశ్చాత్య సాహిత్యంలోనూ అక్కడక్కడా గుబాళింపులు వెదజల్లుతూనే ఉంటాయి. ‘అద్భుతమైన మల్లె మళ్లీ పరిమళిస్తుంది/ తన సుమనోహర సుగంధంతో ఈ బీడునేల మళ్లీ వికసిస్తుంది’ అంటూ మల్లెల సౌరభాన్ని అమెరికన్ కవయిత్రి సిల్వియా ఫ్రాన్సిస్ చాన్ తన ‘వండర్ జాస్మిన్’ కవితలో వర్ణించింది. ఇక మన తెలుగు సినీ సాహిత్యంలోనైతే మల్లెల పాటలు కొల్లలుగా వినిపిస్తాయి. మల్లెలూ కొన్ని రకాలూ... వివిధ దేశాల్లో వేసవిలో సర్వసాధారణంగా కనిపించే మల్లెల్లో ‘పోయెట్స్ జాస్మిన్’ ఒక రకం. వీటి పూలు చూడటానికి నందివర్ధనం పూలలా కనిపించినా, మంచి పరిమళాన్ని వెదజల్లుతాయి. ఈ జాతి మల్లెల మొక్కలు గుబురుగా పొదలుగా ఎదుగుతాయి. ఇవి దాదాపు నలభై అడుగుల వరకు విస్తరిస్తాయి. మన దేశంలో సర్వసాధారణంగా కనిపించే మల్లెలను ‘ఇండియన్ జాస్మిన్’ అంటారు. వీటినే సాదా మల్లెలు అంటారు. పశ్చిమాసియా, ఈజిప్టు ప్రాంతాల్లో చిన్న గులాబీల్లా కనిపించే మల్లెలను ‘అరేబియన్ జాస్మిన్’ అంటారు. విడివిడి రేకులతో వివిధ పరిమాణాల్లో కనిపించే మల్లెల్లో స్పానిష్ జాస్మిన్, ఏంజెల్ వింగ్ జాస్మిన్, అజోరియన్ జాస్మిన్ వంటివి ప్రధానమైన రకాలు. మల్లెల్లో ఎక్కువ రకాలు తెల్లగానే ఉంటాయి. అయితే, ఇటాలియన్ జాస్మిన్, షోయీ జాస్మిన్ వంటి అరుదైన రకాలు పసుపు రంగులోను; పింక్ జాస్మిన్, ఫ్రాగ్రంట్ ఫైనరీ జాస్మిన్, స్టీఫాన్ జాస్మిన్ వంటివి గులాబి రంగులోను కనిపిస్తాయి. ఆకారాలు, రంగులు ఎలా ఉన్నా, చక్కని పరిమళాన్ని వెదజల్లడం మల్లెల ప్రత్యేకత. చరిత్రలో మల్లెల సౌరభం భారత్, చైనా, ఈజిప్టు, అరేబియా ప్రాంతాల్లో పరిమళ ద్రవ్యాల తయారీలో మల్లెలను చిరకాలంగా ఉపయోగిస్తున్నారు. క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్దిలోనే ఈజిప్టు, భారత్ ప్రాంతాల్లో తాజా మల్లెలను వేడినీటిలో వేసి, స్నానానికి ఉపయోగించేవారు. భారత్‌లో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది నుంచే మల్లెలను ప్రత్యేకంగా సాగుచేయడం మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి. చైనాలో క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటి నుంచి మల్లెల సాగు మొదలైంది. చైనాను అప్పట్లో పరిపాలించిన హాన్ వంశస్థులు మల్లెల సాగును బాగా ప్రోత్సహించినట్లు ఆధారాలు ఉన్నాయి. యూరోప్‌కు మల్లెలు చాలా ఆలస్యంగా పరిచయమయ్యాయి. అరబ్బుల ద్వారా క్రీస్తుశకం పదహారో శతాబ్దంలో గ్రీస్, ఫ్రాన్స్ ప్రాంతాలకు తొలిసారిగా మల్లెలు చేరాయి. ఫిలిప్పీన్స్‌కు పదిహేడో శతాబ్దిలో మల్లెలు పరిచయమయ్యాయి. మల్లెలపై మనసు పారేసుకున్న ఫిలిప్పీన్స్ మల్లెపూవును తన జాతీయపుష్పంగా ప్రకటించుకుంది. ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేసియా, టునీసియా దేశాలకు కూడా మల్లెపూవే జాతీయపుష్పం కావడం విశేషం. పరిమళ ద్రవ్యాల తయారీలో... పరిమళ ద్రవ్యాల తయారీలో మల్లెల వినియోగం శతాబ్దాలుగా సాగుతోంది. మల్లెల నుంచి అత్తరులు, సెంట్లు వంటివి తయారు చేస్తారు. సబ్బులు, అగరొత్తుల తయారీలోనూ మల్లెల నుంచి సేకరించిన పరిమళ తైలాన్ని వినియోగిస్తారు. మల్లెల నుంచి ఒక కిలో సుగంధతైలం సేకరించాలంటే, వెయ్యి కిలోల మల్లెలు అవసరమవుతాయి. మిగిలిన పూల నుంచి సుగంధ తైలాన్ని సేకరించడానికి వాటిని నీటిలో ఉడికించి, ఆవిరిని సేకరించడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఇది ఒకే దశలో జరిగే ప్రక్రియ. మల్లెల నుంచి సుగంధతైలాన్ని సేకరించడం ఒకే దశలో సాధ్యమయ్యే పని కాదు. మొదటగా తాజాగా సేకరించిన మల్లెలను వాటిని సేకరించిన చోటనే నీటిలో ఉడికించి, ఆవిరి పడతారు. తొలిదశలో పరిమళాలు వెదజల్లే మైనం వంటి పదార్థం తయారవుతుంది. దీనిని ‘జాస్మిన్ కాంక్రీట్’ అంటారు. రెండో దశలో ఈ ‘జాస్మిన్ కాంక్రీట్’ను శుద్ధి చేయడం ద్వారా దీని సుగంధ తైలాన్ని సేకరిస్తారు. ఇంతగా ఎంతో శ్రమించి సేకరించిన సుగంధ తైలాన్నే అత్తరులు, సెంట్లు వంటి పరిమళ ద్రవ్యాల తయారీలోను, సబ్బులు, అగరొత్తులు వంటి ఉత్పత్తుల కోసం వినియోగిస్తారు. మల్లెల నుంచి సుగంధతైలం సేకరణ చాలా క్లిష్టమైన ప్రక్రియ కావడం వల్ల మల్లెల పరిమళాన్ని వెదజల్లే అత్తరులు, సెంట్లు వంటి ఉత్పత్తుల ధరలు కళ్లు చెదిరే స్థాయిలో ఉంటాయి. సంప్రదాయ వైద్యంలో... ►మల్లెలను మన ప్రాచీన ఆయుర్వేద వైద్యంలోను, చైనా సంప్రదాయ వైద్యంలోను చిరకాలంగా వినియోగిస్తున్నారు. మల్లెపూలను తలలో ధరించడం వల్ల వెంట్రుకలకు, కళ్లకు మేలు జరుగుతుందని; ►మల్లె ఆకులను దట్టంగా తలపైవేసి కట్టు కట్టినట్లయితే, కళ్లు ఎర్రబారడం, కళ్లకలకలు వంటి నేత్రవ్యాధులు నయమవుతాయని, ►మల్లె ఆకులను నూనెలో వేసి కాచిన తైలాన్ని తలకు పట్టించినట్లయినా నేత్రవ్యాధులు నయమవుతాయని; ►మల్లెల వేరు నుంచి తయారు చేసిన కషాయం వాత పైత్య దోషాలను హరిస్తుందని, రక్తదోషాలను తొలగిస్తుందని ‘వస్తుగుణ దీపిక’ చెబుతోంది. ►ఒత్తిడిని తగ్గించడంలోను, మానసిక ప్రశాంతతను కలిగించడంలోను మల్లెల సుగంధం బాగా పనిచేస్తుందని పలు ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ►చైనా సంప్రదాయ వైద్యంలో మల్లెపూవును ‘మో లి హువా’ అంటారు. ►దీనిని చర్మవ్యాధులు నయం చేయడానికి, మానసిక ఆందోళనను తగ్గించడానికి విరివిగా ఉపయోగిస్తారు. ►మల్లెల ఆకులతో తయారు చేసిన కషాయాన్ని జీర్ణకోశ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ►మల్లెపూలలో ఉండే ‘ఆర్సిటిన్’ అనే రసాయనం రక్తపోటును అదుపు చేస్తుందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. -
షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం! పరగడుపున ఒక చెంచా రసం తాగితే
కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనానికై ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్న చిట్కాలివి. 1.అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది. 2.నిమ్మ రసంలో పాలు కలిపి రాత్రి పూట రాసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొహంమీద మచ్చలు పోతాయి. మొటిమలు తగ్గుతాయి 3. ఒక చెంచా కస్తూరి పసుపు మెత్తగా చేసి, నువ్వుల నూనెలో గాని, పల్లీనూనెలో గాని కలిపి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. 4.వేపాకు మెత్తగా నూరి శనగ గింజంత మోతాదులో మాత్ర చేసుకుని రోజుకు మూడుసార్లు మింగితే మొటిమలు తగ్గుతాయి. స్థూలకాయం తగ్గి 5. ఉసిరికాయ రసం పంచదారతో కలిపి పూటకు పది గ్రాముల వంతున రెండు పూటలు తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. 6. పుదీనా కట్టలు నాలుగు తీసుకుని, పది గ్రాముల మిరియాలు, పది గ్రాముల శొంఠి కలిపి మెత్తగా నూరాలి. శనగ గింజంత టాబ్లెట్లు చేసుకుని నీడలో ఆరబెట్టాలి. రోజుకు మూడు టాబ్లెట్లు మూడునెలలు. తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. నరాలకు మేలు 7.అశ్వగంధ చూర్ణాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పాలతో కలిపి పుచ్చుకుంటే నరాలకు మేలు చేస్తాయి. 8.కరక్కాయ బెరడు దవడకు పెట్టుకొని దాని రసం మింగితే జలుబు, దగ్గు తగ్గుతుంది. కడుపు నొప్పి ఉంటే 9.రావి చికురుటాకులు తొమ్మిదింటి రసం తీసుకుని, తేనెతో కలిపి తీసుకుంటే రెండుమూడు పూటల్లో జలుబు తగ్గుతుంది. 10.తులసి ఆకు రసంతో కొంచెం అల్లం రసం గాని, లేక కొంచెం శొంఠి రసం గాని కలిపి, టీ స్పూన్ తేనె కూడా కలిపి తాగితే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది. పేను కొరుకుడు వేధిస్తోందా 11.దానిమ్మ గింజలు చప్పరించి తింటే ఏ వయసు వారికైనా వాంతులు ఆగిపోతాయి. వేవిళ్ళతో ఉన్న వాళ్లకి తక్షణం పనిచేస్తుంది. 12.ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది. చుండ్రు నివారణకు 13.మెంతులు (పచ్చివి) మెత్తగా పొడి చేసి, తలకి సరిపోయే పొడిని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి, అందులో నిమ్మరసం, పెరుగు కలిపి తలకు పట్టించి గంటసేపు వుండి, తల స్నానంచేస్తే చుండ్రు తగ్గుతుంది. 14.కలబంద నుండి గుజ్జుతీసి మెత్తగా చేసి, గుజ్జుని తలకి పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది. మడమ నొప్పి తగ్గాలంటే 15.చల్లటి ఒక కప్పు ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి. 16.జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది. పచ్చకామెర్లు ఉంటే 17.శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. 18.రావి చెక్క కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళలో ఉడికించి కషాయం తీయాలి. చల్లారిన కషాయాన్ని రాత్రికి అలాగే వుంచి పరగడుపున తాగాలి. ఇలా మూడురోజులు తాగాలి. నేల ఉసిరి మందుతోపాటు రావిచెక్క కషాయం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి. షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం 19.మెంతులు రెండు చెంచాలు, లేత వేప చిగురు, కాకరకాయ, బోగన్విల్లా లేత చిగుర్లు (ఎనిమిది లేక పది) తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. 20.ఒక కాకరకాయ, ఒక కీర కాయ, ఒక టమోటా పండు, పది తెల్ల బిళ్లగన్నేరు పూలు, పది వేప చిగుళ్ళు కలిపి కొంచెం నీళ్ళు కలిపి రసం తీసి, ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచి పరగడుపున ఒక చెంచా రసం తాగితే షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం. పార్శ్వపు నొప్పి తగ్గటానికి 21.పెద్ద ఉసిరికాయంత అల్లం, రెండు పసుపుకొమ్ములు కలిపి దంచి దానికి ఒక కాయ నిమ్మరసం, మూడు చెంచాల ఆముదం కలిపి గోరువెచ్చ చేయాలి. తలకి పట్టువేసి గుడ్డతో గట్టిగా కట్టి గంటసేపు నిద్రపోతే తలనొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది. 22. తులసి రసాన్ని నాలుగుచుక్కలు తీసుకుని ఎడమవైపు నొప్పి వస్తే కుడి ముక్కులో, కుడివైపు నొప్పి వస్తే ఎడమవైపు ముక్కులో వేసుకుని గంటసేపు పడుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది. -నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్య నిపుణులు నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -
పిల్లల్లో విరోచనం కాకపోతే ఏం చేయాలి? సునాముఖి ఆకుతో ఇలా చేస్తే..
చిన్నపిల్లలున్న ఇల్లు! అసలే వీపరీతమైన పని, ఒత్తిడి. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు! ఏం తినాలో, ఏం తినకూడదో వారికి తెలియదు, తల్లితండ్రులకు వారిని అర్థం చేసుకునే సమయం తక్కువ! 24 గంటలూ పిల్లలనే కనిపెట్టుకుని వుండాలంటే కొద్దిగా కష్టమే! అయినా కళ్ళల్లో వత్తు లేసుకుని కాపలా కాస్తూనే వున్నప్పటికీ పిల్లలు ఏదో తినేస్తుంటారు. ఇబ్బంది పడతారు. మరి అప్పుడేం చెయ్యాలి? ఆందోళన చెందకుండా ఆయుర్వేదం ఎలాంటి పరిష్కారాలు సూచిస్తోంది? 1. పిల్లలు తెలియకుండా ఏదో ఒకటి నోట్లో పెట్టుకుని తర్వాత కడుపు నొప్పి అంటూ విలవిలలాడితే? కొద్దిగా జీలకర్ర తీసుకుని బాగా శుభ్రపరిచి, దోరగా వేయించాలి. ఆ వేగిన జీలకర్రను మెత్తటి వుండగా చేసుకుని ఓ సీసాలో భద్రపరచు కోవాలి. మాదీఫల రసాయనం సీసాను తెచ్చుకుని ఓ చెంచా జీలకర్ర పొడిలో మాదీఫల రసాయనం కలపాలి. దాన్ని చెంచాలో తీసుకుని పిల్లలకు పట్టాలి. దీని వల్ల వాంతులే కాదు వామ్టింగ్ సెన్సేషన్ కూడా వుండమన్నా వుండదు. పత్యం చెయ్యాల్సిన అవసరం లేదు. 2. హఠాత్తుగా విరేచనాలు మొదలయితే ఏం చేయాలి? జిగట, మామూలు, నెత్తురు, చీము వంటి విరేచనాల లక్షణాలు కనిపిస్తున్నప్పుడు, ఆ విరేచనాల ప్రాథమిక దశలోనే జాగ్రత్త తీసుకుంటే వాటి బారి నుంచి రక్షణ పొందవచ్చు. ఎలాగంటే ఓ రెండు చింతగింజల్నీ, ఓ చెంచా గసగసాలనూ తీసుకుని ఈ రెంటినీ కలిపి కొద్దిగా నీటిని జోడించి మెత్తగా నూరాలి. అప్పుడు వచ్చే రసాన్ని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం చొప్పున ఓ నాలుగైదు రోజుల పాటు ఇవ్వాలి. అవసరాన్ని బట్టి వ్యాధి తగ్గేంత వరకూ మందు ఇవ్వాలి. విరేచనాలు పూర్తిగా తగ్గిపోయేంత వరకూ మజ్జిగ అన్నం పెడితే మంచిది. 3. దీర్ఘకాలిక జ్వరాలకు ఏం చేయాలి? ఎప్పుడు చూసినా లో-ఫీవర్ వుంటుంటే దీర్ఘజ్వరం వున్నట్లుగా భావిస్తాం. దీర్ఘజ్వరం వున్నవాళ్లు చల్ల మిరియం విధానం వినియోగిస్తే సత్వర ఫలితం వుంటుంది. రోజుకో మిరియం చొప్పున మింగిస్తూ, మిరియపు గింజను మజ్జిగలో నానబెట్టి, మెత్తగా నూరి కడుపులోకి తీసుకుని కొద్దిగా మజ్జిగ తాగుతుంటే దీర్ఘజ్వరాలు తగ్గిపోతాయి. ఈ విధంగా 41 రోజులపాటు చల్లమిరియం వాడవల్సి వుంటుంది. 4. విరోచనం కాకపోతే ఏం చేయాలి? విరేచనం బిగపట్టి ఇబ్బందిగా వుంటే చిన్న చిట్కాతో ఈ ఇబ్బందిని తొలగించవచ్చు. కొద్దిపాటి సునాముఖి ఆకును తీసుకుని దీనిని గుండుగా చేసి భద్రపరచాలి. అనంతరం పంచదార పాకం పట్టి అందులో సునాముఖి ఆకు గుండను వేసి ఆరబెట్టి చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఇది సుమారు రెండు మూడు నెలలపాటు నిల్వ వుంటుంది. అన్ని వయసులవారు నిరభ్యంతరంగా వాడదగిన ఈ మందు విరోచనం ఫ్రీగా అవడానికి సహకరిస్తుంది. 5. పిల్లలు తరచుగా దగ్గు, రొంపకు గురయితే ఏం చేయాలి? దగ్గు, రొంప విపరీతంగా వున్నప్పుడు చిన్న చిన్న చిట్కాలను ప్రయోగిస్తే ఫలితం సంతృప్తికరంగా వుంటుంది. తులసి ఆకుల రసాన్ని రోజుకు రెండు మూడు సార్లు రెండు, మూడు చుక్కలు ఇస్తే పిల్లలకు దగ్గు, రొంప అసలు రాకుండా ఉంటాయి. తులసి ఆకుల రసంలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఓ నాలుగైదు తమలపాకులు ముందుగా వెచ్చ చేసి, ఆపై నూరి రసం తీసి, దానిలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఓ రెండు చెంచాల నూనెను కాచి, ఒక పెద్ద చెంచాడు కర్పూరాన్ని పొడిచేసి నూనెలో కలిపి ఒక సీసాలో నిల్వ వుంచాలి. దీనిని ఛాతీకి, గొంతుకకూ రాస్తే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఒక గుప్పెడు జామాయిలు (యూకలిప్టస్ ) ఆకుల్ని రెండు గ్లాసుల నీళ్లల్లో పోసి అవి మరిగి ఒక గ్లాసు అయ్యేదాకా మరగబెట్టాలి. అనంతరం ఆ నీటిని వడగట్టి అందులో కొంచెం పంచదార కలిపి, రోజుకు మూడుసార్లు తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ముందు ముందు రాకుండా ఉంటుంది. 6. తరచుగా ఇంజక్షన్లు చేయిస్తున్నారా? ఇవి పరిశీలనలోకి తీసుకోండి. సూది మందు వీటికి వద్దు. ►చిన్న చిన్న జబ్బులకు ►సాధారణంగా వచ్చే దగ్గు, జలుబుకు ►విటమిన్ టాబ్లెట్లు ►కాల్షియం మందు ►రక్తహీనతకు వాడే బి12, లివర్ ఎక్స్ట్రాక్ట్, ఇన్‌ఫెర్రాన్ లాంటివి. విటమిన్ టాబ్లెట్లు నోటి ద్వారా తీసుకుంటే మంచిది. ఇంకా చెప్పాలంటే విటమిన్లు, మందుల రూపంలోకన్నా ఆహారం ద్వారా వీటిని తీసుకోవడం అన్ని విధాలా క్షేమదాయకం. రక్తహీనతకు ఇంజెక్షన్ల కంటే కూడా నోటి ద్వారా తీసుకునే ఫెర్రస్ సల్ఫేట్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు మంచివి. పైగా అపరిశుభ్రమైన సూదుల ద్వారా అవసరం లేని ఇబ్బందులు, అప్పుడప్పుడు నరాలకు, రక్తనాళాలకు గాయాలు కావచ్చు. -నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
సినీ నటి కాజల్ అగర్వాల్ కొత్త అవతార్: అదేంటో తెలుసా?
హైదరాబాద్: ఆయుర్వేద ఉత్పత్తుల విక్రయంలో ఉన్న ద ఆయుర్వేద కంపెనీ (టీఏసీ)..సిరీస్-ఏ రౌండ్లో సినీ నటి కాజల్ అగర్వాల్ నుంచి పెట్టుబడి అందుకుంది. డైరెక్ట్-టు-కన్స్యూమర్ ఆయుర్వేద బ్రాండ్ తన సిరీస్ఏలో టాలీవుడ్ నటి కాజల్ పెట్టుబడి పెట్టినట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే విప్రో కంజ్యూమర్ కేర్ వెంచర్స్ పెట్టుబడి పెట్టింది. ఈ-కామర్స్ పోర్టల్స్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో 1,000కిపైగా కౌంటర్లలో టీఏసీ ఉత్పత్తులు లభిస్తాయి. అయుర్వేదానికి ఈ ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉందని నిజంగా తాను నమ్ముతానని కాజల్ అగర్వాల్ చెప్పారు. అందుకే ఆయుర్వేద కంపెనీ మిషన్‌లో చేరానని తెలిపారు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో కాజల్ ‘దశపుష్పది’ ప్రొడక్ట్ ప్రకటనల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. రాబోయే తరాలకు ఆయుర్వేదం అందించే ఫలాలను అందించాలనుకుంటున్నాం. ముఖ్యంగా జీవితాన్ని మార్చే అలవాట్లు, ప్రయోజనాలను పరిచయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధా సింగ్ వెల్లడించారు. మెరుగైన జీవన నాణ్యతకు ఆయుర్వేద ఉపయోగ పడుతుందన్నారు. అలాగే కాలక్రమంలో ఆయుర్వేదానికి దూరమైపోతున్న మిలీనియల్స్‌కు శక్తివంతమైన సాంప్రదాయ వ్యవస్థను అందించాలని శ్రీధా సింగ్ పేర్కొన్నారు. . -
Health Tips: డెంగీ జ్వరాన్ని ఎలా గుర్తించాలి? నివారణకు చర్యలేంటి?
వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జ్వరం. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. ఈ బాధితుల్లో కొందరికి డెంగీ వల్ల జ్వరం వస్తోంది. అసలు వచ్చింది మామూలు జ్వరమా? లేక డెంగీ జ్వరమా తెలుసుకోవడం ఎలా అన్నది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. డెంగీ లక్షణాలు ►జ్వరం విపరీతంగా ఉంటుంది. దాదాపు 104 డిగ్రీలు ►తీవ్రమైన తలనొప్పి, చలి, ఒళ్లునొప్పులు ►కళ్లలో విపరీతమైన నొప్పి ►శరీరంపై దద్దర్లు ►వాంతులు కావడం, కడుపునొప్పి ►నోరు ఆరిపోవడం, విపరీతమైన దాహం ►కొన్ని సందర్భాల్లో జ్వరం తీవ్రతను బట్టి రక్తస్రావం డెంగీ లక్షణాలుంటే ఏంచేయాలి? ►పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ ద్రవాలను ఇవ్వాలి ►జ్వరం వచ్చిన వెంటనే చల్ల నీళ్లతో శరీరం అంతా బాగా తుడవాలి ►దోమలు నివారించడానికి ఇంట్లో కాయిల్స్, లిక్విడ్, దోమ తెరలు వాడాలి డెంగీని నివారించడానికి అనుసరించాల్సిన ఆయుర్వేదంలో ఉన్న జాగ్రత్తలు 1. నిమ్మకాయను రెండు భాగాలుగా కోసి అందులోని ఒక్కో భాగంలో 1015 లవంగాలను అందులో గుచ్చాలి. దీంతో డెంగీ దోమలు ఆ ప్రాంతంలోకి రావు. 2. బొప్పాయి ఆకును తుంచి బాగా కడిగి వాటిని కలకండతో కలిపి కొన్ని నీళ్లు పోసి, మిక్సీ పట్టాలని. వచ్చిన ఆ మిశ్రమాన్ని వడగట్టి గంటకో గ్లాసు చొప్పున డెంగీ బాధితుడికి తాగిస్తే డెంగీ లక్షణాలు పూర్తిగా మాయం అవుతాయి. 3. క్యారెట్ జ్యూస్, చీనీ రసం, కొబ్బరి బోండం నీళ్లు బాగా తాగిస్తే తొందరగా కోలుకునే అవకాశం ఉంది. 4. కొబ్బరి నూనెను పాదాల నుంచి మోకాళ్ల దాకా బాగా పూయాలి. ఇది యాంటి బయోటిక్‌గా పనిచేస్తుంది. డెంగీ దోమను దగ్గరికి రాకుండా కాపాడుతుంది. 5. డెంగ్యూ జ్వరం కారణంగా తల నెప్పి, వాంతులు, ముక్కు, నోటి చిగుర్ల నుండి రక్తం రావడం, పొత్తి కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలకు డెంగ్యూ జ్వరం వస్తే ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ►డెంగీ వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి. జ్వరం తగ్గాక కూడా పూర్తిగా కొలుకోవడానికి ఒక నెల వరకు కూడా సమయం పట్టవచ్చు. ►డెంగీ జ్వరం రోగనిరోధక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి చూపిస్తుంది. ►జ్వరం తగ్గాక పోషకాలతో కూడిన, శుభ్రమైన పరిసరాల్లో తీసిన చెరకు రసం, కొబ్బరినీళ్లు, తాజా పళ్ళ రసం లాంటివి ఇవ్వాలి. ►పాలు, పెరుగు, చేపలు, గ్రుడ్లు, కోడి మాంసం లాంటి పౌష్టికాహారం రోజువారీ ఆహారంలో చేర్చాలి. ►పళ్లలో దానిమ్మపాళ్లు, కూరగాయలతో బీట్ రూట్ ఎక్కువగా తీసుకోవడం మంచిది. ►మసాలా కూరలు, నూనె పదార్థాలు, బయటి వంటకాలు వీలైనంత వరకు తగ్గించాలి. ►కొన్ని సందర్భాల్లో వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉన్నా శరీర తత్వాన్ని బట్టి శరీరంలోని కొన్ని వ్యవస్థలు సులభంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. జ్వరం వచ్చినపుడు ప్లేట్ లెట్స్ తగ్గి తీవ్రమైన ముప్పుకు దారి తీస్తుంది. ఏ వైరస్ శరీరంలో ఏ భాగాన్ని దెబ్బ తీస్తుంది అనే అవగాహన కలిగిన డాక్టర్‌ను సంప్రదించాలి. అలాంటప్పుడు ప్లేట్ లెట్స్ తగ్గుదలను నిరోధించడానికి కావలసిన మందులు వాడడంతో పాటు ఇతరుల నుంచి సేకరించిన ప్లేట్లెట్లను శరీరంలోనికి ఎక్కిస్తారు. ►బొప్పాయి ఆకుల రసం ఈ ప్లేట్లెట్స్ పెరగడానికి దోహదం చేస్తుంది. ►డెంగ్యూ జ్వరం వచ్చిన తరువాత చర్య తీసుకొవడం కంటే ముందు అది రాకుండా నిరోధించడం మంచిది. ►డెంగ్యూ జ్వరం రాకుండా అడ్డుకొనే టీకా ప్రయోగ దశలో ఉన్నది కొన్ని నెలలలో అందుబాటులోకి రానుంది. అంత వరకు డెంగ్యూ సీజన్ లో శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులను ధరించడం మంచిది. కూలర్లలో , పూలకుండీలలో, పాత టైర్లలో... ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి లేకుంటే డెంగ్యూ దోమలు వీటిలో అభివృద్ధి చెందుతాయి. కిటీకీలకు తెరలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దోమలను ఇంట్లోకి రాకుండా చూడవచ్చు. -నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Pigmentation: బంగాళా దుంప, నిమ్మ రసం, తేనె.. పిగ్మెంటేషన్‌కు ఇలా చెక్! Tips To Increase Platelet Count: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే.. -
మన ప్రాచీన వైద్యాన్ని పునరుద్ధరించాలి
ప్రతి మనిషీ ఆరోగ్యం కోరుకుంటాడు. ఏ పని చేయాలన్నా ప్రాథమికంగా మనిషి ఆరోగ్యవంతుడై ఉండాలి. అందుకే అన్ని భాగ్యాల్లో కెల్లా ఆరోగ్యాన్ని మాత్రమే మహా భాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యం సరిగా లేనప్పుడు చికిత్స తప్పనిసరి. ఇప్పుడంటే ఆధునిక అల్లోపతి వైద్య విధానం రాజ్యమేలు తోంది కానీ... అత్యంత ప్రాచీన కాలం నుంచీ ఇటీవలి కాలం వరకూ భారతదేశంలో ఆయుర్వేద వైద్య విధా నంలోనే చికిత్స అందించారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అటువంటి మన దేశీయ వైద్య విధానానికి ఇవ్వాళ అంతగా ప్రాముఖ్యం లభించడంలేదు. ఆయుర్వేదమే కాదు... యునాని, హోమియో వైద్య విధానాలు సైతం చౌకగా ప్రజలకు చికిత్స అందించడానికి ఉపయోగపడు తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ విధానాల కన్నా అత్యంత ఖరీదైన అల్లోపతికే ప్రభు త్వాలు పెద్దపీట వేస్తున్నాయి. మిగతా మూడింటితో పోల్చినప్పుడు అల్లోపతి ఎక్కువ శాస్త్రీయమైనదని నమ్మడమే ఇందుకు కారణం కావచ్చు. అలాగే అల్లోపతి వైద్యవిధానంలో రోగ లక్షణాలు లేదా బాధ తొందరగా తగ్గుతుందనేది మరో కారణం. అలాగే పెద్ద పెద్ద శ్రస్త చికిత్సలు చేసి రోగులను బతికించే శాస్త్రీయ విధానంగానూ ప్రజలలో దానికి పేరున్నమాటా నిజం. చరకుడు, సుశ్రుతుని కాలం నుండి కూడా ఆయుర్వేద వైద్యం భారత ఉప ఖండంలో వ్యాపించి ఉంది. ఆయుర్వేదంలోనూ అనేక ఛేదనాల (అంగాలను తొల గించడం) రూపంలో శస్త్ర చికిత్సలు జరిగేవి. రాచ పుండ్లు (కేన్సర్లు), పక్షవాతానికీ, అనేక దీర్ఘకాలిక వ్యాధులకూ, వ్రణాలకూ అద్భుతమైన చికిత్సలు జరిగేవి. అడవులూ, పొలాలూ, పెరడులూ, వంటిళ్లూ... ఎక్కడ చూసినా ఆయుర్వేదానికి అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండేవి. అయితే అల్లోపతి విధానం అనేక కారణాలవల్ల ప్రజల్లో ఆదరణ పొంద డంతో మన దేశీయ వైద్యం క్రమంగా పడకేసింది. అలాగే గత రెండు మూడు దశాబ్దాలుగా హోమియో వైద్య విధానం అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో భారత్‌లోనూ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఈ హోమియో వైద్య విధానంలో వ్యక్తి శారీరక ధర్మాలను అంచనా వేసి వైద్యులు మందులను ఇస్తారు. అల్లోపతి వైద్యంతో పోల్చుకున్నపుడు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. మొండి రోగాలను నయం చేయగలిగిన శక్తి హోమియోపతికి ఉన్నదని నమ్మకం కూడా ఇటీవల ప్రజల్లో పెరిగిపోవడంతో హోమియో వైద్యానికి గిరాకీ కూడా గణ నీయంగానే పెరుగుతున్నది. అయితే ప్రభుత్వపరంగా హోమియో, ఆయుర్వేద, యునాని వైద్యవిధానాలకు ప్రోత్సాహం అల్లోపతితో పోల్చి చూసినప్పుడు తక్కువగానే ఉందని చెప్పక తప్పదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా మన ప్రాచీన వైద్య విధానాల ద్వారా ప్రజలకు చౌకగా చికిత్స అందించడానికి కృషి చేస్తాయని ఆశిద్దాం. ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్’ ద్వారా మన సంప్రదాయ వైద్యవిధానాలను ప్రజలకు చేరువ చేస్తోంది. మన రెండు తెలుగు రాష్ట్రాలూ అనేక ఆయుర్వేద కళాశాలలూ, వైద్యశాలలూ నెలకొల్పు తుండటం గమనార్హం. కాకపోతే అల్లోపతి వైద్య కళా శాలలు, ఆస్పత్రుల సంఖ్యతో పోల్చుకుంటే మిగిలిన వైద్య విధానాలకు చెందిన కాలేజీలు, వైద్యశాలలూ తక్కువ అనేది సుస్పష్టం. (క్లిక్: భారత్‌ను ఒంటరిని చేస్తారు జాగ్రత్త!) ముఖ్యంగా వ్యాధి మొదటి, రెండో దశల్లో ఉన్నప్పుడు అల్లోపతి డాక్టర్లకన్నా ఆయుర్వేద, హోమియో వైద్యుల దగ్గరకు వెళ్లడం వల్ల ప్రజలకు తక్కువ ఖర్చుతో సులువైన వైద్యం అందుతుంది. అందుకే ప్రాథమిక, మాధ్యమిక స్థాయిల్లో తప్పనిసరిగా ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్యాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. (క్లిక్: భూమాతకు సత్తువనిచ్చే సంకల్పం) - డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, జర్నలిజం విభాగం, కాకతీయ యూనివర్సిటీ -
తిప్పతీగపై తప్పుడు ప్రచారం.. ఆయుష్ మంత్రిత్వశాఖ క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: తిప్పతీగ వినియోగిస్తే ఎలాంటి హానికర ప్రభావం ఉండదని ఆయుష్ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. తిప్పతీగ కాలేయాన్ని దెబ్బతీస్తుందంటూ కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారం తప్పు అని ఆయుష్ శాఖ బుధవారం ఓ ప్రకటనలో ఖండించింది. ఆయుర్వేదంలో ఉత్తమ పునరుజ్జీవన మూలికగా పేర్కొనే తిప్పతీగ సారం ఎలాంటి విష ప్రభావాన్ని కల్గించదని అధ్యయనాలు పేర్కొన్నాయని తెలిపింది. ఔషధం భద్రత ఎంత అనేది వినియోగించే అంశంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. నిపుణుడైన వైద్యుడి సూచన మేరకు ఔషధం తగిన మోతాదులో వినియోగించుకోవాలని సూచించింది. మూలికా ఔషధ మూలాల్లో నిజమైన నిధిగా భావించే తిప్పతీగ పలు రుగ్మతలను తగ్గిస్తుందని పేర్కొంది. జ్వరాలు, డయేరియా, అల్సర్, క్యాన్సర్, ఆందోళన తదితర రుగ్మతల నివారణకు వినియోగించే తిప్పతీగ కరోనా నియంత్రణకూ వినియోగించినట్లు పేర్కొంది. ఔషధ ఆరోగ్య ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకొంటే తిప్పతీగ విషపూరితమని చెప్పలేమని కేంద్ర మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. చదవండి: (1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న నాగార్జున) -
ఐ డ్రాప్స్ అనుమతులకు దరఖాస్తు చేసుకోండి
సాక్షి, అమరావతి: ఐ డ్రాప్స్ తయారీ, పంపిణీకి అనుమతుల కోసం డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం, ఇతర నిబంధనల ప్రకారం అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో తదుపరి ఎలాంటి ఆదేశాలు, విచారణ అవసరం లేదని పేర్కొంటూ ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న కోవిడ్ మందు విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని, ఆనందయ్య మందు పంపిణీకి తక్షణమే అనుమతులు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది పి.మల్లికార్జునరావు, ఎం.ఉమామహేశ్వరనాయుడు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. -
ఆయుర్వేదంలో విస్తృత పరిశోధనలు జరగాలి
తిరుపతి తుడా : ఆయుర్వేద వైద్యంలో విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఇందుకు యూనివర్సిటీ సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం ఆయన వైద్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి, కళాశాలలోని వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, రోగులు ఎంతో నమ్మకంతో చికిత్స నిమిత్తం డాక్టర్ల వద్దకు వస్తారని, వారితో ఆప్యాయంగా మాట్లాడితే సగం రోగం నయం చేసినట్లేనన్నారు. డాక్టర్లు కేవలం సంపాదన కోసమే కాకుండా పేదలకు మేలు చేసేలా కూడా ఆలోచించాలన్నారు. మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా డాక్టర్లు నైపుణ్యం పెంచుకోవాలని వీసీ సూచించారు. పుస్తకాలు చదవడం కంటే రోగిని డీల్ చేయడమే ముఖ్యమన్నారు. ఆయుర్వేద వైద్యంలో పరిశోధనలకు మంచి అవకాశాలున్నాయని, ప్రొఫెసర్లు ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. వైద్య రంగంలో మరింత పురోగతి సాధించడానికి ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఎంబీబీఎస్ సీటు రానందువల్ల ఆయుర్వేద వైద్యంలో చేరామనే భావనను విద్యార్థులు తొలగించుకోవాలని హితవు చెప్పారు. థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండండి కోవిడ్ థర్డ్ వేవ్‌పై నిపుణుల హెచ్చరికలపట్ల అప్రమత్తంగా వుంటూ ప్రజల్ని చైతన్యపరచాలని డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ కోరారు. కోవిడ్–19 అనేక రకాలుగా రూపాంతరం చెందుతోందని.. ఆయుర్వేద వైద్యంలో కూడా దీని కట్టడికి పరిశోధనలు చేయాలన్నారు. ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, ఆర్ఎంవో డాక్టర్ జి.పద్మావతి, పీజీ రీడర్ డాక్టర్ రేణుదీక్షిత్‌తో పాటు వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఆ వార్తల్లో వాస్తవం లేదు: ఎమ్మెల్యే కాకాణి
సాక్షి, నెల్లూరు: ఆనందయ్యకు ప్రభుత్వ సహకారం ఉంటుందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అందరికీ మందు పంపిణీకి సిద్ధమేనని ఆనందయ్య ప్రకటించారని.. సామాన్యులకు అందడం లేదని వచ్చే వార్తల్లో వాస్తవం లేదని కాకాణి అన్నారు. ఆనందయ్య ఎలాంటి సహకారం కోరుతున్నారో జిల్లా కలెక్టర్‌కి నివేదిస్తే కార్యాచరణ సిద్ధమవుతుందని ఆయన సూచించారు. గ్రామ సచివాలయాలతో పాలనలో కొత్త ఒరవడి మొదలైందని కాకాణి అన్నారు. మ్యానిఫెస్టోలో అన్ని అంశాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం జగన్ మ్యానిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేస్తున్నారన్నారు. టీడీపీ అనవసర రాద్ధాంతం తప్ప.. నిర్మాణాత్మక పాత్ర పోషించడంలేదని ఆయన దుయ్యబట్టారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలైందన్నారు. చదవండి: సాంప్రదాయబద్ధంగా పీఠాధిపతి ఎంపిక: వెల్లంపల్లి చంద్రబాబు హయాంలో భారీగా భూకబ్జాలు: అవంతి -
నమస్కార సంస్కారం నేర్పిన కరోనా
షేక్ హ్యాండ్ ఇవ్వడం రాకపోతే చిన్నచూపు చూసిన ఆధునిక లోకం.. అదే షేక్ హ్యాండ్ ఇవ్వబోతే ఛీ కొట్టే స్థితికి వచ్చింది. కషాయం అంటే కడుపులో తిప్పుతుందన్న నోటితోనే వాటిని ఇష్టంగా తాగేలా చేసింది. కరోనా కారణంగా మన ఆచార వ్యవహారాలు, ఆరోగ్యమార్గాల విలువ నవతరానికి మాత్రమే కాదు ప్రపంచానికీ తెలిసింది. ఈ నేపథ్యంలో నగరవాసి వీటిని భావితరాలకు అందించాల్సిన అవసరాన్ని గుర్తించారు. అమెరికాలో ఉద్యోగం వదులుకుని వచ్చి వాటిని పాఠ్యాంశాలుగా మార్చే పనిలో నిమగ్నమయ్యారు. సాక్షి, హైదరాబాద్: ‘మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను ఒక మతానికి పరిమితం చేయడం సరైంది కాదు. అవెంత అవసరమో.. వాటిని పాటించడం అంటే మానవాళికి ఎంత మేలు కలుగుతుందో కరోనా తెలియజెప్పింది. ఇప్పుడు వాటిని భావితరాలకు అందించడమే నా లక్ష్యం’ అంటున్నారు నగరానికి చెందిన ఇండియన్ వేదిక్ ఫౌండేషన్ నిర్వాహకులు విక్రమ్ రాజు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి, అక్కడే చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదులుకుని నగరానికి వచ్చిన ఆయనకు భారతీయ ఆచార వ్యవహారాలంటే చాలా మక్కువ. వేదాలు, ఉపనిషత్తులు, యోగా, ఆయుర్వేదం గురించి తెలుసుకున్నారు. వాటిని పాఠ్యాంశాలుగా మారుస్తున్నారు. ఆయన చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే. సరళీకరణ ఓ నిర్విరామ ప్రక్రియ.. మనవైన వేదాలు రోజురోజుకూ మనకి దూరమవకుండా ఉండేందుకు మనకన్నా మన ముందు తరం వారే తగిన శ్రద్ధ వహించారు. కాలానుగుణంగా వాటిని సింప్లిఫై చేస్తూ వచ్చారు. తొలిదశలో వేదాలు అందరూ చదివగలిగేవారు. తర్వాత ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, తర్వాత దశలో పండుగలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు సంప్రదాయంగా పండుగలు ఆచరించేవారు కూడా లేరు కాబట్టి.. వాటిని భావితరాలకు ఉపకరించేలా మరింత సింప్లిఫై చేసి పాఠాల రూపంలో అందించాల్సి ఉంది. నాటి బాటే.. నేటి పాఠమై.. వేద పాఠశాలు చాలా ఉన్నా.. యోగా, ముద్ర, చక్రాస్, మెడిటేషన్‌లపై దేశంలో ఎవరి దగ్గరా సరైన విద్యా మెటీరియల్ లేదని నాకు అవగతమైంది. లాక్డౌన్ సమయంలో లభించిన వెసులుబాటుతో దాదాపు 25ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నవారితో కలిసి ఒక కర్రిక్యులం తయారు చేశా. అలాగే దాదాపు 2వేల పేజీలు ఉండే గరుణ పురాణంలోని ముఖ్యమైనదంతా కలిపి 100 పేజీల్లో కుదించి.. 18 పురాణాలూ చేయిస్తున్నాను. మనకు 18 శక్తి పీఠాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఒక్కో దేవత గురించి 2 పేజీల్లో పొందుపరచి పుస్తకాలు తెస్తున్నాం. ఈ కర్రిక్యులంని రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలకు, కళాశాలలకు అందుబాటులోకి తేవాలనేది ప్రయత్నం. ఆయుర్వేదం సహా 150 నుంచి 200 పేజీలలో వేదాల పుస్తకాలు తెస్తున్నాం. వేదగణితం.. కాల్క్యులేటర్కి సమానం.. మన వేదిక్ మ్యాథ్స్ చాలా సింప్లిఫైడ్.. ఈ వేద గణితం నేర్చుకున్నవారు కాల్క్యులేటర్తో సమానంగా లెక్కించగలరు అంటే నమ్మాలి. క్లాస్ 1 నుంచి క్లాస్ 10దాకా వేదిక్ సైన్స్‌తో పాటు వేదాలు, నాలుగు వేదాలు ఉపనిషత్తులు, మంత్రాలు, తంత్రాలపై కూడా పూర్తిస్థాయి సబ్జెక్టు తయారు చేశా. ఇవన్నీ రెగ్యులర్ సిలబస్‌తో పాటు అందించాలంటే.. వ్యక్తిగతంగా ఆసక్తి ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే సరిపడా స్థలం ఇస్తే ఇండియన్ వేదిక్ స్కూల్ నెలకొల్పాలని ఉంది. చిన్ననాటి నుంచే నేర్పాలి... డార్విన్ ఎవల్యూషన్ థియరీ చదువుతాం. కానీ అది ఎప్పుడో మనం దశావతారాల పేరిట మన పెద్దవాళ్లు చెప్పారనేది పిల్లలకి తెలియాలి. అలాగే మొత్తం సోలార్ సిస్టమ్ గురించి, గెలాక్సీ గురించి పురుష సూక్తంలోని నాసదీయసూక్తంలో ఉందని తెలియజెప్పాలి. అవన్నీ ఎప్పుడో కాదు ప్రతి పిల్లాడికీ వేదాలు, ఉపనిషత్తు 5వ ఏట నుంచే ఇవి పాఠ్యాంశాలు కావాలి. ఆ ఉద్ధేశ్యంతోనే మొత్తం 50 థియరీల మీద కలిపి బుక్స్ చేయిస్తున్నాను. – విక్రమ్ రాజు, వేదిక్ ఫౌండేషన్ -
నన్ను నేను తెలుసు కుంటున్నాను
‘‘మన పూర్వీకులు ఆరోగ్యాన్ని ఆర్డర్ అని అనారోగ్యాన్ని డిజార్డర్ అని అన్నారు. డిజార్డర్ ఎందువల్లో కనుక్కోగలిగితే దాన్ని ఆర్డర్లో పెట్టడం సులువు అయిపోతుంది. ప్రస్తుతం ఇదే విషయాన్ని కనుగొంటున్నాను’’ అన్నారు అమలాపాల్. ప్రస్తుతం ఆమె పంచకర్మ చికిత్స తీసుకుంటున్నారు. ఆయుర్వేద చికిత్సలో ఇదో భాగం. 28 రోజుల ఈ చికిత్సా ప్రక్రియలో సుమారు 20 రోజులు పూర్తి చేశారట ఆమె. ఈ ప్రయాణం గురించి అమలా పాల్ మాట్లాడుతూ – ‘‘ఆయుర్వేదంతో నా ప్రయాణం నాలుగేళ్ల క్రితం ప్రారంభం అయింది. ఈ ప్రయాణంలో ఓ పుస్తకంలో దోషాలు, వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సృష్టి మొత్తం పంచభూతాల ఆధారంగా నిర్మింపబడింది. ఈ పంచభూతాలు కలసి మూడు శక్తులను సృష్టించాయి. వాటినే దోషాలంటారు. వాతా. పితా. కఫా. ఇందులో మొదటిది మన ఎనర్జీని కంట్రోల్ చేస్తుంది. రెండోది మన జీర్ణాన్ని, శారీరక చర్యలను చూసుకుంటుంది. చివరిది మన శరీరాకృతిని నిర్దేశిస్తుంది. ఆయుర్వేదిక ప్రక్రియలన్నీ ఈ మూడు దోషాలను సరైన క్రమంలో పెట్టి మన సమస్యలను నయం చేసుకోవడానికే. నెల రోజులుగా ఆయుర్వేదంలో పంచకర్మలో మునిగితేలుతున్నాను. నన్ను నేను తెలుసుకుంటున్నాను. మన శక్తిని మనమే తెలుసుకొని స్వయంగా నయం చేసుకోగలిగే ప్రక్రియ ఇది. ఇలాంటి ప్రక్రియలో పంచకర్మ ఒకటి’’ అన్నారామె. -
ఒత్తిడి నివారణకు ఆయుర్వేద చిట్కాలివే..
న్యూఢిల్లీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒత్తిడి, డిప్రెషన్ (మానసిక ఆందోళన)తో మెజారిటీ ప్రజలు బాధపడుతున్నారు. కొన్ని ఆయుర్వేద చిట్కలతో ఒత్తిడి సమస్యను నివారించవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. భారత ఆయుర్వేదానికి గణనీయమైన చరిత్ర ఉంది. గత 2వేల సంవత్సరాలుగా అనేక జబ్బులకు ఆయుర్వేద వైద్యం దివ్యౌషదంగా పని చేసింది. అయితే ఇటీవల కాలంలో జబ్బులు నయం కావడానికి ఆయుర్వేద వైద్యం చాలా సమయం తీసుకుంటుందని కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అపోహలకు దీటుగా ఆయుర్వేద నిపుణులు చక్కటి విశ్లేషణతో దీటైన కౌంటర్ ఇస్తున్నారు. ఒత్తిడిని ఎదుర్కొనే ఆయుర్వేద వైద్యంపై విశ్లేషణ: ఆయుర్వేద వైద్యంలో ఒత్తిడి సమస్యకు నాడీ వ్యవస్థ మూలమని భావిస్తారు. మానసిక సమస్యలను దోషా అనే ప్రక్రియ నియంత్రిస్తుంది. కాగా నరాల వ్యవస్థను బలంగా ఉంచే వాత ప్రక్రియ ద్వారా శారీరక, మానసిక సమస్యలను అధిగమించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. తీవ్ర ఒత్తిడి సమస్యను నివారించేందుకు పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పరిష్కార మార్గంగా నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాచీన కాలం నుండి హెడ్ మసాజ్ ప్రక్రియ చాలా ప్రాచుర్యం పొందింది. అయితే తల, మెడ ప్రాంతాలను మసాజ్ చేయడం ద్వారా ప్రశాంతమైన నిద్రతో పాటు రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో పాటు చర్మం, జుట్టు సమస్యను నివారిస్తుంది. కాగా మసాజ్ చేయుటకు నారాయణ తైలా, బ్రాహ్మి నూనె వంటి సహజ నూనెలను ఉపయోగిస్తారు. సమతుల్య ఆహారం ద్వారా ఒత్తిడి నివారణ మనిషికి ఏం కావాలో శరీరం సిగ్నల్స్ ఇస్తుంది. అలాగే శరీరం కోరుకున్న సమయంలో ఆహారం తీసుకోవడం ద్వారా హార్మోన్ల సమస్యను నివారించవచ్చని తెలిపారు. కాగా విటమిన్ సీ, బీ, ఒమెగా, మాగ్నిషియమ్ కలిగిన ఆహారాలను తీసుకోవడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఒత్తిడి సమస్యను నివారించేందుకు క్రమం తప్పకుండా యోగాను సాధన చేయాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు -
కేరళ ఆయుర్వేదం గెలిచింది!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జనవరి నాటికి కరోనా వైరస్ కేరళలో అడుగుపెట్టింది. కొద్ది రోజుల్లోనే రోగుల సంఖ్య పదుల సంఖ్యకు.. ఆపై వందల్లోకి చేరింది. మహమ్మారికి కళ్లెం వేసేందుకు రంగంలోకి దిగిన కేరళ ప్రభుత్వం.. ఆయుర్వేదాన్ని ఆయుధంగా చేసుకుంది. వ్యాధిని గుర్తించేందుకు ఏం చేయొచ్చో తెలపాలని ఆయుర్వేద వైద్యులను కోరింది. దాంతోపాటు రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఏం చేయాలన్నది రాష్ట్రం మొత్తానికి తెలియజేసింది. ఏప్రిల్ 11 నాటికి కరోనాకు సంబంధించి ఆయుర్వేద కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. రోగులతో పాటు సాధారణ ప్రజలు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలని, ఇందుకు తాము సూచించిన పద్ధతులను పాటించాలని కోరింది కూడా. ఆయుర్వేదం ఏం చెబుతోంది? రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని, తద్వారా కరోనాను దూరంగా ఉంచేందుకు కేరళ ప్రభుత్వం ఆయుర్వేదం ఆధారంగా పలు సూచనలు చేసింది. చిరుతిళ్లను వీలైనంత వరకు తగ్గించడం, డ్రైఫ్రూట్స్‌తో పాటు ఉడికించిన పచ్చి అరటిపండు (కేరళలోని నేండ్రం రకం)ను వాడాల్సిందిగా కోరింది. ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలని.. రోజులో కనీసం ఒక్కసారైనా ముడి బియ్యంతో చేసిన గంజి తాగాలని, వీలైనంత వరకు మాంసాధారిత ఆహారాన్ని తీసుకోకపోవడం మేలని తెలిపింది. కూరలు, సూప్‌లు, అల్పాహారాల్లో పెసలు, పెసరపప్పు విరివిగా వాడాలని కోరింది. రోజుకు కనీసం 20 నిమిషాల పాటు యోగా చేయాలని తెలిపింది. మినుముల వాడకం తగ్గిస్తే మేలని, వేడినీటిలో శొంఠిని వేసి మరిగించిన నీటిని తాగుతుండటం, శొంఠి కాఫీకి కొంచెం పసుపు కలుపుకొని తాగడం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయని, ఆవు పాల కంటే మేకపాలు మేలని తెలిపింది. కరోనా నియంత్రణకు ఆయుర్వేద మందులు ఉపయోగించేందుకు సిద్ధమైన కేరళ ప్రభుత్వం.. చికిత్స విషయానికి వచ్చేసరికి మాత్రం ఆధునిక వైద్యం పైనే ఆధారపడింది. నిర్ధారణ పరీక్షలు, వైద్యం అల్లోపతి ద్వారా చేపట్టారు. ఆయుర్వేద విధానం జీవనశైలి మార్పులు, రోగి శక్తి పుంజుకునేందుకు ఉపయోగపడుతోంది. కేరళను ఆయుర్వేదం రక్షిస్తుంది కరోనా కష్టకాలంలో ఆయుర్వేదాన్ని ఉపయోగించేందుకు ప్రభుత్వం ‘కేరళను ఆయుర్వేదం రక్షిస్తుంది’ అనే నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చింది. స్వాస్థ్యం, సుఖాయుష్యం, పునర్జనని పేర్లతో సిద్ధం చేసిన పద్ధతులను ప్రజలకు ప రిచయం చేసింది. 60 ఏళ్లలోపు వారికి తొలి పద్ధతి ఉపయోగపడితే వృద్ధుల రక్షణకు సుఖాయుష్యం సిద్ధమైంది. పునర్జనని కరో నా రోగులు త్వరగా కోలుకునేందుకు సాయపడుతుంది. రాష్ట్రంలోని ఆయుర్వేద వైద్యశాల వివరాలను ‘నిరామయ’పేరున్న పో ర్టల్కు ఎక్కించింది. కేంద్ర ప్రభుత్వపు ఆయుష్ మిషన్‌లో భాగంగా రా ష్ట్రమంతా ఆయుర్ రక్ష పేరుతో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ ఆరోగ్య కేంద్రాలు కరోనా పర్యవేక్షణ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ సామాజిక మాధ్యమ పేజీల్లో కరోనా నివారణకు తీ సుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన వ్యాయామాల వివరాలను ప్రజలకు అందించింది. ఏపీలోని గ్రామ వలంటీర్ల వ్యవస్థ మాదిరిగా ఆయుర్వేద వైద్యులు, వైద్య విద్యార్థుల సాయంతో రాష్ట్రమంతటా అనుమానిత క రోనా బాధితులను గుర్తించేందుకు కృషిచేసింది. -
ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్రినికల్ ట్రయల్స్
ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారత్‌లోనూ కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మెడిసన్‌కు సంబంధించి పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. కరోనా వల్ల మనదేశ సాంప్రదాయ పద్దతులు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్రినికల్ ట్రయల్స్ ప్రారంభించనుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్సీ (ఐసీఎంఆర్ ), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాక మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పోలిస్తే అశ్వగంధ ఏ విధింగా పనిచేస్తుందన్న దానిపై పరీక్షించనున్నారు. #WATCH ...Clinical trials of Ayush medicines like Ashwagandha, Yashtimadhu, Guduchi Pippali, Ayush-64 on health workers and those working in high risk areas has begun from today: Union Health Minister Dr Harsh Vardhan #COVID19 pic.twitter.com/dHKUMGCclX — ANI (@ANI) May 7, 2020 అంతేకాకుండా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు అశ్వగంధతో పాటు యష్తిమధు, గుడుచి పిప్పాలి వంటి సాంప్రదాయ ఔషదాలు (ఆయుష్ -64) గా పిలిచే ఈ ఫార్ములాను నేటినుంచి ఇవ్వనున్నట్లు ఆయుష్ కార్యదర్శి రాజేశ్ కొటెచా తెలిపారు. దీని వల్ల శ్వాస సంబంధిత సమస్యలు నియంత్రణలో ఉంటాయని పేర్కిన్నారు. ఇదిలా ఉండగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952 కు చేరింది. కోవిడ్ కారణంగా ఇప్పటివరకు దేశంలో 1,783 మంది మరణించారని కేంద్రం వెల్లడించింది. (చ్యవన్‌ప్రాశ్ తినండి.. తులసి టీ తాగండి) -
ఋతుగుణానికి... అనుగుణంగా
వాతావరణంలోని మార్పులను బట్టి సంవత్సరంలోని పన్నెండు నెలల్ని ఆరు ఋతువులుగా విభజించారు మన పూర్వీకులు. సంస్కృతంలో చెప్పినా, ఆంగ్లంలో చెప్పినా, ఏ మాతృభాషలో చెప్పినా ‘శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం’ ప్రకృతిలోని కాలచక్రానికి చిహ్నాలు. వీటికి అనుగుణంగా ప్రాణికోటి తమ జీవనశైలిని, ఆహారవిధానాలను సర్దుకోవలసిందే. మానవ ఆరోగ్య శాస్త్రానికి కాణాచి అయిన ఆయుర్వేదం వివిధ వ్యాధులకు చికిత్సలను వివరించడంతో పాటు ప్రతి వ్యక్తి తన ఆరోగ్యాన్ని పదిలపరచుకోవడానికి, ఎన్నో ప్రక్రియలను ‘స్వస్థవృత్తం’ అనే పేరు మీద విపులీకరించింది. ఆహారస్వభావాలను, జీవనశైలిని.. దినచర్య, ఋతుచర్యలుగా విశదీకరించింది. శిశిర, వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంతం అనే ఆరు ఋతువులలోనూ తదనుగుణమైన ఆహారవిహారాలను వివరించింది. ప్రస్తుతం నడుస్తున్న హేమంత ఋతువు, రానున్న శిశిర ఋతువుల చర్యలను పరిశీలిద్దాం. హేమంతం: మార్గశిర, పుష్య మాసాలు హేమంత ఋతువు. ఇంచుమింగా నవంబరు నెల చివర నుంచి, జనవరి నెల చివరి వరకు ఉంటుంది. అనంతరం శిశిర ఋతువు ప్రారంభమౌతుంది. ఇది మార్చి నెలలో మూడు వారాల వరకు ఉంటుంది. ఈ రెండు ఋతువుల్ని చలికాలం అంటాం. స్వభావరీత్యా బయట చలిగాలులు వీస్తాయి. అందువలన శరీరం లోపల ఊష్మం అంటే వేడి పుడుతుంది. జఠరాగ్ని (దీపన పాచకాగ్నులు – ఆకలి కలగడానికి, అరుగుదల కావడానికి ఆధారమైనవి) గణనీయంగా వృద్ధి చెందుతుంది. మనుషులు ఎంతటి బరువైన ఆహారాన్నయినా అరిగించుకోగలరు. సమృద్ధిగా తినకపోతే రసధాతువు బలహీనపడి వాతప్రకోపం జరుగుతుంది. ఆహారవిధి: తీపి, పులుపు, ఉప్పు రుచులతో (మధుర, ఆమ్ల, లవణ రసాలు) కూడిన పుష్టికరమైన (బరువైన గుర్వాహారం) ఆహారాన్ని సేవించాలి. కొత్త బియ్యం, ఆవుపాలు, చెరకు రసం శ్రేష్ఠమని చరకాచార్యుడు స్పష్టీకరించాడు. నువ్వులనూనె (తైల), వస (ఎముకల గుజ్జులోని రసం) బలకరమని చెప్పాడు. (గోరసాన్ ఇక్షువికృతీః – వసామ్, తైలమ్ నవౌదనమ్). కనుకనే సంక్రాంతి పండుగ సమయంలో కొత్తబియ్యపు పాయసం, చెరకు రస పానం విశిష్టతను సంతరించుకున్నాయి. మినుములతో (మాష) చేసిన పదార్థాలు పుష్టికరమని వాగ్భటాచార్యుడు వివరించాడు. (... మాషిక్షుక్షీరోద్ధవికృతీః శుభాః). కారము, చేదు, వగరు (కటు తిక్త కషాయ) రుచులు కలిగిన ఆహారపదార్థాలు మంచివి కాదు. వేడివేడి సూపుల వంటి పానీయాలు, ఫలాలు, రకరకాల రుచికర వంటకాలు హితకరం. విహారం (జీవనశైలి): వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. నువ్వులనూనె వంటి వాతహర తైలంతో శరీరానికి మర్దనా చేసుకోవటం, నూనెతో కూడిన దూదిని తలమీద ఉంచుకోవటం మంచిది. వస, కరక్కాయ వంటి ద్రవ్యాల చూర్ణాలకు కొద్దిగా నూనె కలిపి నలుగు పెట్టుకుని, ఆ తరవాత అభ్యంగ స్నానం చేయాలి. (శరీరానికి సరిపడేలా వేడి నీళ్లు వాడుకోవాలి. అంటే సుఖోష్ణ జలస్నానం). వెచ్చదనం కోసం ప్రత్తి లేదా పట్టు (సిల్కు) వస్త్రాలను ధరించాలి. ఎండలో నుంచి సూర్యరశ్మి శరీరానికి అందేలా కొద్ది సమయం గడపాలి. కూర్చోవటం, పండుకోవటం కోసం వెచ్చని వస్త్రాలు ఉండాలి. గమనిక: ఎటువంటి పరిస్థితులలోనూ శీతల వాయువులకు గురి కాకూడదు. తలకు, శరీర భాగాలకు వెచ్చదనం కలిగించే దుస్తులు, ఇతర ప్రక్రియలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరమైతే భూమి లోపల కూడా చిన్న గదులు నిర్మించుకుని నివసించాలని వివరించారు. ఇటువంటి ఋతుచర్యలను ఆరు ఋతువులకు కూడా ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నివారణకు, ఓజో వృద్ధి కొరకు పేర్కొన్నారు. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్, ఫోన్: 9963634484 -
మినుములు–వరి మితంగా తింటే సరి
ఆహార శాస్త్రం గురించి ఆయుర్వేదం నిశితంగా పరిశోధించింది. శరీర పోషణ కోసం తీసుకునే ప్రతి పదార్థాన్ని ఆహారంగా వివరించింది. ఆహారాన్ని తినే విధానాన్ని బట్టి, ‘పాన (తాగేవి), చోష్య (చప్పరించేవి), లేహ్య (నాకేవి), భక్ష్య (నమిలి తినేవి) అని నాలుగు రకాలుగా వర్గీకరించింది. వండక్కర లేకుండా సహజంగా ప్రకృతి ప్రసాదించే కందమూల ఫలాలు, కొబ్బరి నీళ్లు, చెరకు రసం వంటి పానీయాలు ఒక రకం. కొత్త రుచులను కనిపెడుతూ మనం తయారుచేసుకునే తినుబండారాలు రెండవ రకం. వీటిని కృతాన్నాలు అంటారు. ప్రతి ద్రవ్యానికి ఉండే పోషక విలువలు, ఔషధ గుణాలను కూడా విశదీకరించింది. వరి, గోధుమలు మన దేశంలో ప్రధాన ఆహారం. వరి బియ్యం, మినుములకు సంబంధించిన వివరాలు.. వరి: క్షేత్ర బీజ ప్రాధాన్యత, పంటకాలం (ఋతువులు) ప్రాతిపదికగా రకరకాల ధాన్యాలు మనకు చాలా కాలంగా ఉన్నాయి. వాటి రుచులు, పోషక విలువలలో కూడా తేడాలు ఉన్నాయి. శాలిధాన్యం: కండనేన వినా శుక్లా హేమంతాః శాలయః స్మృతాః (భావ ప్రకాశ) హేమంత ఋతువులో సంక్రాంతి సమయంలో పంటకు వచ్చేవి, పైపొట్టు తీయబడి తెల్లగా ఉండే బియ్యం శాలిధాన్యం. ఈ గింజల రంగు, పరిమాణాలలో చాలా భేదాలున్నాయి. సామాన్య గుణధర్మాలు శాలయో మధురా స్నిగ్ధా బల్యా... వృష్యాశ్చ బృంహణాః.... మేధ్యాః చ ఏవ బలావహాః... ఈ అన్నం తియ్యగా జిగురుగా ఉండి, రుచికరమై, బలకరమై మలమూత్ర విసర్జనకు తోడ్పడుతుంది. మేధాకరం (బుద్ధిని వికసింపచేస్తుంది), శుక్రకరం. చలవ చేస్తుంది. కొత్త బియ్యం: వాపితేభ్యో గుణైః... రోపితాస్తు నవా వృష్యాః; పురాణా లఘవః స్మృతాః... (భావప్రకాశ) కొత్త ధాన్యం నుంచి వెంటనే ఆడించిన బియ్యంతో వండిన అన్నం కొంచెం బరువుగా ఉండి, అరుగుదల మందగిస్తుంది. పాతవైతే లఘుగుణం కలిగి, తేలికగా జీర్ణమవుతుంది. ఆధునిక శాస్త్రం రీత్యా: పాలిష్ చేసిన తెల్ల బియ్యంలో పిండి పదార్థాలు అధికంగా (78 శాతం) ఉంటాయి. ప్రొటీన్లు (6.8), కొవ్వు (0.5), ఐరన్ (0.7) ఫాస్ఫరస్ (160) శాతం ఉంటాయి. పొట్టుతో (తవుడుతో) కూడిన గోధుమ రంగు ముడిబియ్యంలో పిండి పదార్థాలు కొంచెం తక్కువగా ఉండి, బీ విటమిన్లు అధికంగా ఉంటాయి. కనుక తెల్లటి బియ్యం డయా»ñ టిస్ వ్యాధికి దోహదకారి. ముడి బియ్యాన్ని వండుకుని, మితంగా పరిమిత ప్రమాణంలో తింటే నష్టం ఉండదు. కాల్షియం, కాపర్, జింక్ వంటి లవణాలు కూడా లభిస్తాయి. మినుములు: వీటిని సంస్కృతంలో మాష అంటారు. ‘‘మాషో గురుః స్వాదుపాకః... అనిలాపః‘... శుక్రణో బృంహణః... మేదః కఫ ప్రదః... శూలాని నాశయేత్ (భావప్రకాశ) తియ్యగా రుచికరంగా ఉండే బరువైన ఆహారం. శరీర కొవ్వును బరువును పెంచుతుంది. విరేచనం సాఫీగా చేస్తుంది. శుక్రాన్ని, స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది. కొంచెం వేడి చేస్తుంది. ‘ఆర్శస్ (పైల్స్), అర్ధి్దత వాతం (ముఖంలో సగభాగానికి వచ్చే ప„ý వాతం), తమక శ్వాస (ఆయాసం), కడుపులోని పుండ్లు (అల్సర్స్)... వీటిని పోగొడుతుంది. బలహీనులకు మంచి ఆహారం. క్రమశిక్షణతో వ్యాయామం చేసేవారికి చక్కటి ఆహారం. ఇడ్లీ, డోసెలలో మినుములు, వరి బియ్యం ఉంటాయి. కనుక వీటి సత్ఫలితాలను పొందాలనుకుంటే, పరిమితంగా తింటే మంచిది. పైన ఉండే నల్లని పొట్టుతోబాటు మినుముల్ని వాడుకుంటే పోషక విలువలు బాగా లభిస్తాయి. ఆధునిక శాస్త్ర వివరాలు.. (100 గ్రా.లో ఉండే పోషకాలు, గ్రాములలో) పప్పు: ప్రోటీన్లు (24), కొవ్వు (1.4), పిండి పదార్థాలు (59.6), కాల్షియం (15.4), ఫాస్ఫరస్ (385), ఐరన్ (3.8). పొట్టుతో ఉన్న మినుములలో సోడియం, పొటాషియం.. ఇవి రెండూ శూన్యం. పొట్టు తీసిన పప్పులో సోడియం నూరు గ్రాములకి 39.8 మి.గ్రా. పొటాషియం 800 మి. గ్రాములు, ఇతర లవణాలు తగినంత లభిస్తాయి. గమనిక: తెలుగువారి వంటకాలలో గారె విశిష్టమైనది. దీనిని కేవలం మినుములతోనే చేస్తారు. కొందరు బియ్యాన్ని కూడా కలిపి నానిన తరవాత పిండి రుబ్బుతారు. దీనివలన నూనెలో వేగినప్పుడు నూనె ఎక్కువగా పీల్చదని పరిశీలన. పెరుగు వడ కూడా చేస్తుంటారు. తగురీతిలో వ్యాయామం చేస్తూ, ఇవి మితంగా సేవిస్తే ప్రయోజనం మెండు. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్, ఫోన్: 9963634484 -
బెల్లం మధురౌషధం
ప్రకృతి సంపదను ఆరోగ్యం కోసం ఆహారంగా, ఔషధాలుగా మలచుకోవడం ఆయుర్వేద శాస్త్ర విశిష్టత. ఆరు రుచులలోనూ (తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు) మధుర రసానిదే అగ్రస్థానం. కొన్ని పదార్థాలు నాలుకకు తగలగానే తీపి స్ఫురిస్తుంది. కొన్నింటిలో తీపి అంతర్లీనంగా అనురసంగా ఉంటుంది. వివిధ ఫలాలు, దుంప జాతులు, కొబ్బరి నీళ్ల వంటి ద్రవ్యాలలోని మాధుర్యం అందరికీ తెలిసినదే. బయటకు గట్టిగా కర్రలా ఉన్నా, చెరకులో నిండుగా తీపి ఉంటుంది. చెరకును సంస్కృతంలో ఇక్షు అంటారు. మన దేశంలో చాలాకాలంగా ఇక్షు రసం నుంచి బెల్లం (గుడం) తయారుచేస్తున్నారు. ఔషధాల తయారీలో, వంటకాలలో బెల్లాన్ని ఉపయోగిస్తారు. సితా (పటిక బెల్లం), ఖండ శర్కర (ఇసుకలా అతి సన్నగా ఉన్న పంచదార), మధు శర్కర (తేనె నుంచి తయారైన పంచదార)... ద్రవ్యాల ప్రయోజనాల గురించి భావప్రకాశ సంహితలో కనిపిస్తుంది. కాని వీటి తయారీ గురించి కనపడదు. ఈనాడు రసాయనిక పదార్థాలతో తయారుచేస్తున్న పంచదారకు, నాటి సహజ సిద్ధమైన శర్కరలకు చాలా తేడా ఉంది. బెల్లం అమోఘమైన పోషకాహారం. చెరకు బెల్లం – సశాస్త్రీయ వివరాలు చెరకు రసం: శరీరానికి చలవ చేస్తుంది. వీర్యవర్థకం, కఫకరం. కాచిన చెరకు రసం శరీరం లో వేడిని ఉత్పత్తి చేస్తుంది. కడుపులోని వాయువుని, కడుపు నొప్పిని పోగొడుతుంది. నిల్వ చేయటం వలన పులిసిన చెరకు రసం మంచిది కాదు (కొన్ని గంటలపాటు పులిస్తే పరవాలేదు). మలమూత్రాలను సాఫీగా జారీ చేస్తుంది. గుణాలు: తియ్యగా, జిగురు (స్నిగ్ధం) గా ఉంటుంది. వాతహరం. కొంతవరకు వేడిని తగ్గిస్తుంది, కాని శర్కరంత చలవ చేయదు. మూత్రాన్ని సాఫీగా చేసి మూత్ర వికారాలను తగ్గిస్తుంది. వృష్యం (శుక్రకరం, వీర్యవర్థకం), బలవర్థకం. దేహంలో కొవ్వును (మేదస్సు) పెంచుతుంది. కఫాన్ని, క్రిములను పెంచుతుంది. (ఇక్షో రసో యస్సపక్వో జాయతే... సగుడౌ... వృష్యో గురుః స్నిగ్ధో వాతఘ్నో మూత్ర శోధనః‘ నాతి పిత్త హరో మేదః కఫ కృమి బలప్రదః) కొత్త బెల్లం: జఠరాగ్నిని పెంచుతుంది, కాని కఫాన్ని, కృములను కలుగచేస్తుంది. దగ్గు, ఆయాసాల ను పెంచుతుంది. (గుడో నవః కఫ శ్వాస కాస కృమి కరో అగ్నికృత్) పాత బెల్లం: చాలా మంచిది (పథ్యం). లఘువు అంటే తేలికగా జీర్ణమై శరీరాన్ని తేలికపరుస్తుంది. వేడిని తగ్గించి కొవ్వును కరిగిస్తుంది. జఠరాగ్నిని పెంచి, పుష్టిని కలిగిస్తుంది. వృష్యం. రక్తదోషాన్ని పోగొడుతుంది. వాతరోగాల్ని తగ్గిస్తుంది. గుడో జీర్ణ లఘుః పథ్యో న అభిష్యంది అగ్ని పుష్టికృత్ పిత్తఘ్నో మధురో వృష్యో వాతఘ్నో అసృక్ ప్రసాదనః ఔషధ గుణాలు: బెల్లాన్ని శుంఠి (శొంఠి)తో కలిపి సేవిస్తే, అన్నిరకాల వాతరోగాలు తగ్గుతాయి. అల్లంతో కలిపి సేవిస్తే కఫవ్యాధులు పోతాయి. కరక్కాయ చూర్ణంతో కలిపి సేవిస్తే, అన్ని పిత్తరోగాలు ఉపశమిస్తాయి. ఇది మూలవ్యాధి (పైల్స్)ని తగ్గించడానికి మంచి మందు. మత్స్యండీ: చెరకు రసాన్ని ఒక పద్ధతిలో వేడి చేస్తూ బెల్లాన్ని తయారుచేసేటప్పుడు, చివరన కొంచెం ద్రవాంశలు మిగిలిపోతాయి. దానినే మత్స్యండీ అంటారు. ఇది బలకరం, మృదురేచకం, రక్తశోధకం, వీర్యవర్ధకం. (మత్స్యండీ భేదినీ, బల్యా, బృంహణీ వృష్యా, రక్తదోషాపహాః స్మృతా) ఆధునిక జీవరసాయన పోషక వివరాలు: తాటి బెల్లం, ఖర్జూర బెల్లం, కొబ్బరి బెల్లాలు కూడా తయారీలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం చెరకు »ñ ల్లాన్నే ఎక్కువ వాడుతున్నారు. దీనిలోని పోషకల విలువలు కూడా విశిష్టం. నూరు గ్రాముల బెల్లంలో ప్రొటీన్లు 0.4, కొవ్వులు 0.1, మినరల్స్ 0.6 శర్కరలు (కార్బోహ్రైడ్రేట్స్) 95 శాతం, కాల్షియం 80 శాతం, ఫాస్ఫరస్ 40 శాతం, ఐరన్ 2.64, కేలరీలు 383 ఉంటాయి. తయారీలో – ఆసక్తికర అంశాలు: రిఫైన్డ్, డిస్టిలేషన్ చేయకుండా ఉన్నది మంచి బెల్లం. దీంట్లో కెమికల్స్ వాడకపోవటం వలన అన్ని పోషక ఖనిజాలు (ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్) భద్రంగా ఉంటాయి. మట్టిరంగు వంటి నలుపు రంగులో ఉండే బెల్లం ఉత్తమం. దీంట్లో విటమిన్లు, ఫైబర్ కూడా ఉంటాయి. కనుక ఆరోగ్యకరం. ఆర్గానిక్ బెల్లం (జాగరీ): ఇది మరింత శ్రేష్ఠం. చెరకును పండించినపుడు కృత్రిమ రసాయనిక ఎరువులు గాని, క్రిమిసంహారక మందులు గాని వాడరు. బెల్లంలో తెలుపు లేదా ఎరుపు రంగు రావటం కోసం కెమికల్స్ (బేకింగ్ సోడా, కాల్షియం కార్బొనేట్/సున్నం పొడి, జింక్ ఫార్మాల్ డిహైడ్ సల్ఫాక్సిలేటు వంటివి) వాడరు. కనుక పసుపు మిశ్రిత మట్టిరంగులో చూర్ణం రూపంలో ఉంటుంది. సుక్రోజ్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. పొటాషియం, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు వార్థక్యాన్ని దూరం చేయటానికి ఉపకరిస్తాయి. కల్తీ బెల్లాలు: నిగనిగలాడే ఎరుపు, తెలుపు, పసుపు రంగులు విరజిమ్మటం కోసం హానికర కెమికల్స్, తీపిని అధికం చేసే కెమికల్స్, నిల్వ ఉండటానికి కెమికల్స్ అధిక మోతాదులో కలుపుతారు. అసలైన మట్టిరంగు కంటె ఈ ఆకర్షిత రంగు బెల్లానికి వినియోగదారులు ఆకర్షితులవుతారు. పంచదార తయారీలో మితిమీరిన తెలుపు, తీపి మినహా పోషక విలువలు ఉండవు. బ్రౌన్ సుగర్లో బ్లీచింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు నయం. తెల్లటి పంచదార తయారీ లో రసాయనిక పదార్థాలు అధికంగా ఉంటాయి. ఆ పంచదార ఆరోగ్యానికి చేటు చేస్తుంది కనుక జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్, ఫోన్: 9963634484 -
గోధుమ అవతారాలు
ఆయుర్వేదం ఆహారధాన్యాలను ఐదు రకాలుగా విభజించింది. శాలి, పష్టిక (వ్రీహి), శూక, శింబీ, తృణ. రంగు, రూపం, పరిమాణం, ఎంతకాలం లో పంట పండుతుంది వంటి అంశాలను బట్టి వీటికి నామకరణం చేసి, గుణధర్మాలను వివరించారు. యవలు, గోధుమలను శూక ధాన్యాలుగా వర్ణించారు. ఈ గింజలకు ఒక వైపు చిన్న ముక్కు ఆకారంలో సూదిగా ఉంటుంది. గోధుమలు: పరిమాణంలో కొంచెం పెద్దగా ఉన్నవాటిని మహా గోధుమలనీ, చిన్నగా ఉన్నవాటిని మథూలీ గోధుమలనీ, శూకము లేకుండా పొడవుగా ఉన్నవాటిని దీర్ఘ గోధుమలనీ అన్నా రు. వీటినే నందీముఖ గోధుమలని కూడా అంటారు. గుణాలు: (భావప్రకాశ): గోధూమో మధురః శీతో వాతపిత్తహరో – గురుః జీవనోబృంహణో, వర్ణ్యః, వ్రణరోపకః, రుచ్యః స్థిరకృత్’ – రుచికి తియ్యగా ఉంటాయి. కొంచెం జిగురుగా ఉండి ఆలస్యంగా జీర్ణమవుతాయి. బరువు ఆహారం, బలకరం, శుక్రకరం, ధాతు పుష్టికరం, జీవనీయం, చర్మకాంతిని పెంపొందిస్తుంది. గాయాలను మాన్చటానికి ఉపయోగపడుతుంది. కొత్తగా పండిన గోధుమలు కఫాన్ని కలిగిస్తాయి, బరువైన ఆహారం. పాతబడిన గోధుమలు తేలికగా జీర్ణమై, శరీరంలోని కొవ్వుని కరిగించి, బరువుని తగ్గిస్తుంది. మెదడుకి మంచిది (మేధ్యము). నీరసాన్ని పోగొడుతుంది. శుక్రకరం కూడా. అడవి గోధుమల్ని ఆయుర్వేదం గవేధుకా అంది. ఇవి తీపితో పాటు కొంచెం కారంగా ఉంటాయి. కొవ్వుని, కఫాన్ని హరించి, స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. ఆధునిక శాస్త్ర విశ్లేషణ: గోధుమ పైపొరను బ్రాన్ అంటారు. లోపల జెర్మ్, ఎండోస్పెర్మ్ అనే పదార్థాలుంటాయి. గ్లూటెన్ అనే అంశ వలన గోధుమపిండి జిగురుగా ఉంటుంది. అన్నిటికంటె జెర్మ్‌లో ప్రొటీన్లు, కొవ్వు, పీచు, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అన్ని భాగాలతో కూడిన గోధుమల్ని ఆహారంగా సేవించడం శ్రేష్ఠం. బ్రాన్‌లో పీచు అధికంగా ఉంటుంది. జెర్మ్ నుంచి మొలకలు తయారవుతాయి. గోధుమగింజలో ఎండోస్పెర్మ్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కార్బోహైడ్రేట్ (శర్కర) మాత్రమే ఉంటుంది. ఇతర పోషకాలేవీ ఉండవు. 100 గ్రా. సంపూర్ణ గోధుమలో 346 కేలరీలు ఉంటాయి. బొంబాయి రవ్వ: ఇది మనం చేసుకునే ఉప్మాకు ప్రసిద్ధి. దీనిని సంపూర్ణ గోధుమను కొంచెం సంస్కరించి తయారుచేస్తారు కనుక పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. మైదా: ఇది అతి తెల్లని, అతి మెత్తని పిండి. దీనిని గోధుమలోని ఎండోస్పెర్మ్‌ని బ్లీచింగ్ చేయటం ద్వారా తయారుచేస్తారు. బ్రాన్, జెర్మ్‌లను సంపూర్ణంగా తొలగిస్తారు. కనుక మైదాలో ఎక్కువ సాంద్రతలో స్టార్చ్/శర్కర మాత్రమే ఉండటం వలన గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. కనుక మధుమేహరోగులకు మంచిది కాదు. పీచు ఉండకపోవటం వలన మల బంధకం కలుగుతుంది. శరీర బరువును పెంచుతుంది. బ్లీచింగ్ చేయటం కోసం కలిపే కెమికల్స్ క్లోరిన్ బెంజాయిక్, కాల్షియం పెరాక్సైడ్, ఎంజోడై కార్బనమైడ్ ప్రధానమైనవి. ఎండోస్పెర్మ్ తో జరిపే రసాయనిక చర్య వలన ఎలోగ్సిన్ అనే మరో కెమికల్ ఉత్పత్తి కణాలను ధ్వంసం చేసి డయాబెటిస్‌ను కలిగిస్తాయి. పూరీలు, నిమ్‌కీన్స్, పునుగులు, చల్ల బూరెలు, బొబ్బట్లు, బ్రెడ్, రకరకాల కేకులు, సమోసాలు, పేస్ట్రీలు మొదలైనవి మైదా వంటకాలలో ప్రధానమైనవి. పాలకోవా, బర్ఫీలలో వ్యాపారార్థమై మైదాను కలిపేస్తారు. జాగ్రత్త: పై విషయాలను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవటం అవసరం. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్, ఫోన్: 9963634484 -
అనుదిన ద్రవ్యాలు అమోఘ గుణాలు
తెలుగువారి పండుగలు, ఆచారాలు, ధార్మిక సంస్కృతితో సమ్మిళితమై ఉంటాయి. దైవ కైంకర్యంలో నైవేద్యానిది ప్రధాన పాత్ర. చక్రపొంగలి, దద్ధ్యోదనం, పులిహోర వంటి ప్రసాదాలు మనకు అతి సాధారణం. వీటన్నింటిలోనూ సామాన్య ద్రవ్యం ‘వరి అన్నమే’. ఇతర పదార్థాలలో నెయ్యి, బెల్లం/శర్కర; పెరుగు, నిమ్మకాయ/చింతపండు’ ప్రధానమైనవి. ఇవి మనకి అతి సామాన్యంగా కనిపిస్తాయే గాని వాటి పోషక విలువలు, గుణధర్మాలు అమోఘం. వీటి ప్రయోజనాలు ఆయుర్వేద గ్రంథాలలో సుస్పష్టంగా కనిపిస్తాయి. నెయ్యి ఘృతం, ఆజ్యం, సర్పి మొదలైనవి నెయ్యికి సంస్కృత పర్యాయపదాలు. ఆయుర్వేదంలో ఆవు నేతికి విశిష్టత ఉంది. గుణధర్మాలు: మధురం, ప్రధానంగా పిత్త దోషహరం, వాత కఫ శ్యామకం, చలువ చేస్తుంది. తెలివితేటలను పెంచుతుంది. ఓజోకరం, శుక్రకరం, రసాయనం (సప్త ధాతు పుష్టికరమై క్షమత్వ వర్థకం). లావణ, కాంతి, తేజోవర్థకం. ముసలితనం రానీయకుండా యౌవనాన్ని పదిలపరుస్తుంది. ఆయు వర్థకం. మంగళకరం. కంటికి మంచిది. గవ్యం ఘృతం విశేషేణ చక్షుష్యం, వృషం, అగ్నికృత్.... మేధా లావణ్య కాంతి తేజో ఓజో వృద్ధికరం, వయస్థాపకం, బల్యం, సుమంగలం, ఆయుష్యం, సర్వ ఆజ్యేషు గుణాధికం ►ఆవు నెయ్యిని హోమం చేస్తే వచ్చే పొగ విషహరం, క్రిమిహరం, వాతావరణ కాలుష్య హరం. ►ఆవు పెరుగు: కొంచెం పులుపు. ఎక్కువ తీపి కలిగితే రుచిలో నుంచి ఆకలిని పెంచి, ధాతుపుష్టిని కలిగించి, గుండెకు కూడా శక్తినిస్తుంది. నాడీవ్యవస్థను పటిష్ఠపరుస్తుంది (వాత హరం). అందువలననే దీనిని చాలా పవిత్రమని వర్ణించారు. గవ్యం దధి విశేషేణ... రుచిప్రదం, పవిత్రం, దీపనం, హృద్యం, పుష్టికృత్, పవనాపహం... గేదె పెరుగు: ఇది చాలా చిక్కగా ఉండటం వలన బరువైన ఆహారంగా చెప్పబడింది. కఫకరం, స్రోతస్సులలో అవరోధం కలిగిస్తుంది. రక్తాన్ని దూషిస్తుంది. శుక్రకరం. రాత్రిపూట పెరుగు తినకూడదు (రాత్రౌ దధి న భుంజీత). పెరుగును వేడి చేయకూడదు. మితిమీరిన పరిమాణంలో పెరుగును సేవించకూడదు. బెల్లం చెరకు రసం నుంచి తయారుచేసిన బెల్లం తియ్యగా, జిగురుగా ఉండి శుక్రవర్థకంగా ఉపకరిస్తుంది. దేహంలో కొవ్వుని పెంచుతుంది. కొంతవరకు వేడిని తగ్గిస్తుంది కాని శర్కరంత చలువచేయదు. బలవర్థకమే కాని, కఫాన్ని క్రిములను పెంచుతుంది. పాతబెల్లం (పురాణ గుడం) చాలా మంచిది (పథ్యం). వేడిని తగ్గించి, కొవ్వును కరిగిస్తుంది. జఠరాగ్నిని పెంచి పుష్టిని కలిగిస్తుంది. (కాని ఈనాడు బెల్లం తయారీలో చాలా కెమికల్స్‌ని కలిపి, కల్తీ చేస్తున్నారు. ఇది హానికరం). శర్కర ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన శర్కర చాలా విశిష్టమైనది. దాని తయారీ వేరు. ఈనాడు చేస్తున్న పంచదార తయారీలో పోషక విలువలు శూన్యం. పరిపూర్ణంగా కెమికల్స్ మయం. చాలా అనర్థదాయకం. చింత చింతకాయ చక్కటి పులుపు కలిగి వాతహరంగానూ, కించిత్ పిత్తకఫాలను పెంచేదిగానూ ఉంటుంది. బరువుగా ఉండి ఆలస్యంగా జీర్ణమవుతుంది. పక్వమైనది (చింత పండు) ఆకలిని పెంచి, విరేచనం సాఫీగా అవటానికి సహకరిస్తుంది (సుఖరేచకం). ఉష్ణవీర్యమై వాతకఫహరంగా ఉంటుంది. ‘చించా, తింత్రిణీ, తింతిడీ, అమ్లీ, చుక్రికా... మొదలైనవి. చింతకాయ/పండునకు సంస్కృత పర్యాయపదాలు నిమ్మ నింబు, జంబీర అను పర్యాయపదాలున్నాయి. కఫవాత శ్యామకం. దప్పికను తగ్గిస్తుంది. (తృష్ణాహరం). రుచిని పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మూత్రకరం. జ్వరహరం. కంఠవికారాన్ని తగ్గిస్తుంది. నేత్రదృష్టివర్థకం. బాగుగా పరిపక్వమైనది (పండు) వాడుకుంటే మంచిది. ఇంగువ (హింగు) ఉష్ణవీర్యం, ఆహారపచనం బాగా చేస్తుంది. కడుపునొప్పి, కడుపులోని వాయువు, క్రిములను పోగొడుతుంది. వాతకఫహరం. పసుపు (నిశా, హరిద్రా) ఇది కడుపులోకి సేవించినా లేక బయటపూతగా వాడినా కూడా క్రిమిహరం. రక్తశోధకం, జ్వరహరం, మధుమేహ హరం. శరీర కాంతిని పెంచి చర్మరోగాలని దూరం చేస్తుంది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్