Interesting Facts About Jasmine Mallelu Types Uses Health Benefits - Sakshi
Sakshi News home page

Jasmine Flower: తలలో మల్లెపూలు పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసా? వీటిలోని ‘ఆర్సిటిన్‌’ అనే రసాయనం వల్ల..

Published Mon, May 8 2023 7:13 PM | Last Updated on Tue, May 9 2023 11:50 AM

Interesting Facts About Jasmine Mallelu Types Uses Health Benefits - Sakshi

వేసవి అంటే సూర్యుడు చండ్రనిప్పులు కురిపించే మండుటెండలు.
వేసవి అంటే మనుషులను ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోతలు.
వేసవి అంటే మామిడి రుచులు, తాటిముంజెల చవులు.
వేసవి అంటే నసాళానికెక్కే ఘాటైన ఆవకాయల కారాలు.
వేసవి అంటే ఇవే కాదు, మల్లెల పరిమళాలు కూడా!

మల్లెలు వేసవిలోనే విరగబూస్తాయి. వీథి వీథినా బుట్టలు బుట్టలుగా అమ్మకానికొస్తాయి. బజారుల్లో గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. పరిసరాలను పరిమళభరితం చేస్తాయి. ఎండ చల్లబడిన సాయంవేళ చక్కగా స్నానం చేసి, కొప్పున మూరెడు మల్లెలు ముడుచుకుంటేనే తెలుగు పడతులకు అదో తృప్తి!

ఇదివరకటి కాలంలో ఆడా మగా తేడా లేకుండా అందరూ తలలో మల్లెలను అలకరించుకునే వారు. శరవేగంగా పరుగులు తీసే కాలం తెచ్చిన పెనుమార్పులతో పురుషుల అలంకరణ నుంచి మల్లెలు తప్పుకున్నాయి. అలాగని, పురుషులకు మల్లెలంటే మొహంమొత్తినట్లు కాదు. మల్లెల పరిమళాన్ని ఇష్టపడటం వల్లనే ఉద్యోగాలు చేసే పురుషులు చాలామంది విధులు ముగించుకుని ఇళ్లకు మళ్లేటప్పుడు తోవలో భార్యల కోసం మల్లెలు కొనుక్కుని మరీ పోతారు. 

చిరకాలంగా మల్లెలు మన సంస్కృతిలో భాగం. మల్లెలను మాలలుగా అల్లడం ఒక ప్రత్యేకమైన కళ. మల్లెల పరిమళమే లేకపోతే వేసవులు మరింత దుర్భరంగా ఉండేవి. మండుటెండా కాలంలో మల్లెల పరిమళమే మనుషులకు ఊరట! మగువల అలంకరణల్లోనే కాదు, పూజ పురస్కారాల్లోనూ మల్లెలకు విశేషమైన స్థానం ఉంది. మన సాహిత్యంలో మల్లెల ప్రస్తావన కనిపిస్తుంది.

మన సాహిత్యంలో మల్లెలను ఆరాధించని కవులు దాదాపుగా లేరు. శంకరంబాడి సుందరాచారి ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అంటూ తెలుగుతల్లికి మల్లెపూల దండతోనే పదాలంకరణ చేశారు. మల్లెలను సంస్కృతంలో ‘మల్ల’, ‘మల్లి’, ‘మల్లిక’ అంటారు. వేసవి మొదలయ్యే వసంత రుతువులో మల్లెలు పూయడం ప్రారంభిస్తాయి. అందువల్ల వీటిని ‘వార్షికి’ అంటారు. శీతాకాలంలో చలి పెరిగే సమయంలో మల్లెలు కనుమరుగైపోతాయి. అందువల్ల మల్లెలను ‘శీతభీరువు’ అని కూడా అంటారు.

మల్లెల్లో వాటి రేకులు, పరిమాణాన్ని బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. బొండు మల్లెలు, కాడ మల్లెలు, అడవి మల్లెలు, విడి మల్లెలు, దొంతర మల్లెలు, బొడ్డు మల్లెలు వంటివి మన దేశంలో విరివిగా కనిపిస్తాయి. మన దేశంలో కనిపించే అన్ని రకాల మల్లెలు తెల్లగానే ఉంటాయి. వీటి పరిమళంలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి.

ఇతర దేశాల్లో కొన్ని చోట్ల అరుదుగా పసుపు రంగులోను, గులాబి రంగులోను పూచే మల్లెలు కూడా కనిపిస్తాయి. మల్లెల ఉత్పాదనలో భారత్, ఈజిప్టు దేశాలే అగ్రస్థానంలో ఉంటాయి. మల్లెలు సహజంగా పూచే పరిస్థితులు లేని చలి దేశాలు ఈ దేశాల నుంచి భారీ ఎత్తున మల్లెలను దిగుమతి చేసుకుంటాయి. కేవలం మల్లెలనే ఉపాధి చేసుకుని బతికేవారు మన దేశంలో కోకొల్లలుగా కనిపిస్తారు.

మల్లెలు పరిమళించే దేశాలు
ప్రపంచంలోని ఉష్ణమండల దేశాల్లోని వాతావరణం మల్లెలకు అనుకూలంగా ఉంటుంది. భారత్‌తో పాటు దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లోను; ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లో రకరకాల మల్లెలు ఏటా వేసవిలో విరివిగా కనిపిస్తాయి. అలాగే కొన్ని యూరోపియన్‌ దేశాల్లో కూడా మల్లెల సాగు జరుగుతోంది. మల్లెల్లో దాదాపు మూడువందల రకాలు ఉన్నాయి.

వీటిలో 75 రకాలు భారత్‌లో పూస్తాయి. మల్లె మొక్కలను చాలామంది పెరటితోటల్లోను, కుండీల్లోను పెంచుకుంటారు. భూవసతి కలిగిన ఉద్యాన రైతులు వాణిజ్యపరంగా కూడా మల్లెలను సాగు చేస్తారు. మన దేశంలో వాణిజ్యపరంగా మల్లెల సాగు చేయడంలో తమిళనాడు అగ్రస్థానంలో నిలుస్తుంది. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోను మల్లెల సాగు గణనీయంగానే జరుగుతోంది.

ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్‌లో వాణిజ్యపరంగా మల్లెల సాగు జరుగుతోంది. మల్లెలను సాగుచేసే రైతులు టోకు వర్తకులకు పెద్దమొత్తంలో మల్లెలను విక్రయిస్తారు. వీటిని టోకు వర్తకులు వినియోగం ఎక్కువగా ఉండే నగరాలు, పట్టణాలకు తరలిస్తారు. వివిధ దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు కూడా మల్లెలను పెద్ద ఎత్తున తరలిస్తుంటారు.

వాణిజ్యపరంగా మల్లెల సాగు మన దేశంలో చిరకాలంగా సాగుతున్నప్పటికీ, మల్లెల సాగు విస్తీర్ణం, ఏటా స్థానికంగా జరిగే మల్లెల వ్యాపారం విలువ, మల్లెల ఎగుమతులు వంటి వివరాలపై గణాంకాలేవీ అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యకరం.

పూల రారాణి
మల్లెపువ్వును ‘పూల రారాణి’ అంటారు. ఇంగ్లిష్‌లో దీనికి ‘బెల్‌ ఆఫ్‌ ఇండియా’– అంటే ‘భారత సుందరి’ అనే పేరు, ‘క్వీన్‌ ఆఫ్‌ ఫ్రాగ్రన్స్‌’– ‘సుగంధ రాణి’ అనే పేరు కూడా ఉన్నాయి. మల్లెకు పర్షియన్‌ భాషలో ‘యాస్మిన్‌’ అనే పేరు ఉంది. దాదాపు పశ్చిమాసియా దేశాల్లోని అన్ని భాషల్లోనూ మల్లెను ‘యాస్మిన్‌’ అనే పిలుస్తారు. ఇంగ్లిష్‌ సహా పలు యూరోపియన్‌ భాషల్లో ‘జాస్మిన్‌’ అంటారు.

హిందీలో మల్లెను మోగ్రా, చమేలీ, జూహీ అనే పేర్లతో పిలుస్తారు. భారత దేశంలోను, ఇతర దక్షిణాసియా దేశాల్లోను మల్లెలను మహిళలు సిగలలో అలంకరించుకుంటారు. శుభకార్యాల సమయంలో చేసే పుష్పాలంకరణలలోను, దేవాలయాల్లోను భారీ పరిమాణంలోని మల్లెమాలలను ఉపయోగిస్తారు. మల్లెలకు అనేక ఆధ్యాత్మిక విశేషాలు కూడా ఉన్నాయి. మల్లెలతో దేవతార్చన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మల్లెల మహిమ గురించి ‘పుష్పచింతామణి’ ఇలా చెబుతోంది:

‘మల్లికాజ్ఞా నకర్మార్థ మర్చయంతో మహేశ్వరమ్‌
లభంతే పరమం జ్ఞానం సంసార భయనాశనం’

ఎలాంటి కోరికలు లేకుండా మల్లెలతో ఈశ్వరార్చన చేసినట్లయితే సంసార భయాలు తొలగి, పరమజ్ఞానం కలుగుతుంది.

మల్లికా కుసుమై రేవం వసంతే గరుడధ్వజమ్‌ 
యోర్చయే పరయా భక్త్యా దహేత్‌ పాపం త్రిధార్జితమ్‌’

వసంత రుతువులో శ్రీమహావిష్ణువును మల్లెలతో అర్చిస్తే, మనో వాక్కాయ కర్మల వల్ల ప్రాప్తించిన పాపాలన్నీ తొలగిపోతాయి. 

భక్తులకు గల ఈ విశ్వాసం కారణంగానే వైష్ణవాలయాల్లో జరిగే పూజార్చనల్లో మల్లెలను విశేషంగా ఉపయోగిస్తారు. తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుని ఇతర పుష్పాలతో పాటు భారీస్థాయిలో మల్లెలను అలంకరిస్తారు.

భాషా సాహిత్యాల్లో మల్లెలు
మన భాషా సాహిత్యాల్లో మల్లెల ప్రస్తావన కనిపిస్తుంది. మన సామెతలు, జాతీయాల్లోనూ మల్లెల మాటలు వినిపిస్తాయి. ఉదాహరణ చెప్పుకోవాలంటే, ‘బోడితలకు బొడ్డు మల్లెలు ముడిచినట్లు’ అనే సామెత ఉంది. ఒకదానికొకటి ఏమాత్రం పొసగని వాటిని బోడితలకు బొడ్డు మల్లెలతో పోలుస్తారు.

‘జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా?’ అని మరో సామెత ఉంది. దుర్మార్గుల సంతానం దుర్మార్గులే అవుతారు గాని సన్మార్గులు కాలేరనే అర్థంతో ఈ సామెతను ఉపయోగిస్తారు. అలాగే, ‘ఉల్లి మల్లె కాదు, కాకి కోకిల కాదు’ అనే సామెత కూడా మనకు వాడుకలో ఉంది. మల్లెపూల గురించి చలం అద్భుతమైన కవిత రాశాడు.

‘మల్లెపూలు, తెల్లని మల్లెపూలు!/ విచ్చిన మల్లెపూలు! ఆ పరిమళం నాకిచ్చే సందేశం యే మాటలతో తెలపగలను!’ అంటూనే మల్లెల గురించి ఆయన ఈ కవితలో చాలా విశేషాలే చెబుతాడు. ‘ఒక్క స్వర్గంలో తప్ప/ ఇలాంటి వెలుగు తెలుపు/ లేదేమో– అనిపించే మల్లెపూలు’ అని పరవశించిపోతాడు.

ఎంతైనా మల్లెలను అలంకరించుకునే అలవాటు ఉన్న మహానుభావుడాయన! మల్లెల పరిమళాలు కేవలం మన సాహిత్యంలోనే కాదు, పాశ్చాత్య సాహిత్యంలోనూ అక్కడక్కడా గుబాళింపులు వెదజల్లుతూనే ఉంటాయి.

‘అద్భుతమైన మల్లె మళ్లీ పరిమళిస్తుంది/ తన సుమనోహర సుగంధంతో ఈ బీడునేల మళ్లీ వికసిస్తుంది’ అంటూ మల్లెల సౌరభాన్ని అమెరికన్‌ కవయిత్రి సిల్వియా ఫ్రాన్సిస్‌ చాన్‌ తన ‘వండర్‌ జాస్మిన్‌’ కవితలో వర్ణించింది. ఇక మన తెలుగు సినీ సాహిత్యంలోనైతే మల్లెల పాటలు కొల్లలుగా వినిపిస్తాయి.

మల్లెలూ కొన్ని రకాలూ...
వివిధ దేశాల్లో వేసవిలో సర్వసాధారణంగా కనిపించే మల్లెల్లో ‘పోయెట్స్‌ జాస్మిన్‌’ ఒక రకం. వీటి పూలు చూడటానికి నందివర్ధనం పూలలా కనిపించినా, మంచి పరిమళాన్ని వెదజల్లుతాయి. ఈ జాతి మల్లెల మొక్కలు గుబురుగా పొదలుగా ఎదుగుతాయి. ఇవి దాదాపు నలభై అడుగుల వరకు విస్తరిస్తాయి.

మన దేశంలో సర్వసాధారణంగా కనిపించే మల్లెలను ‘ఇండియన్‌ జాస్మిన్‌’ అంటారు. వీటినే సాదా మల్లెలు అంటారు. పశ్చిమాసియా, ఈజిప్టు ప్రాంతాల్లో చిన్న గులాబీల్లా కనిపించే మల్లెలను ‘అరేబియన్‌ జాస్మిన్‌’ అంటారు. విడివిడి రేకులతో వివిధ పరిమాణాల్లో కనిపించే మల్లెల్లో స్పానిష్‌ జాస్మిన్, ఏంజెల్‌ వింగ్‌ జాస్మిన్, అజోరియన్‌ జాస్మిన్‌ వంటివి ప్రధానమైన రకాలు.

మల్లెల్లో ఎక్కువ రకాలు తెల్లగానే ఉంటాయి. అయితే, ఇటాలియన్‌ జాస్మిన్, షోయీ జాస్మిన్‌ వంటి అరుదైన రకాలు పసుపు రంగులోను; పింక్‌ జాస్మిన్, ఫ్రాగ్రంట్‌ ఫైనరీ జాస్మిన్, స్టీఫాన్‌ జాస్మిన్‌ వంటివి గులాబి రంగులోను కనిపిస్తాయి. ఆకారాలు, రంగులు ఎలా ఉన్నా, చక్కని పరిమళాన్ని వెదజల్లడం మల్లెల ప్రత్యేకత.

చరిత్రలో మల్లెల సౌరభం
భారత్, చైనా, ఈజిప్టు, అరేబియా ప్రాంతాల్లో పరిమళ ద్రవ్యాల తయారీలో మల్లెలను చిరకాలంగా ఉపయోగిస్తున్నారు. క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్దిలోనే ఈజిప్టు, భారత్‌ ప్రాంతాల్లో తాజా మల్లెలను వేడినీటిలో వేసి, స్నానానికి ఉపయోగించేవారు. భారత్‌లో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది నుంచే మల్లెలను ప్రత్యేకంగా సాగుచేయడం మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి.

చైనాలో క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటి నుంచి మల్లెల సాగు మొదలైంది. చైనాను అప్పట్లో పరిపాలించిన హాన్‌ వంశస్థులు మల్లెల సాగును బాగా ప్రోత్సహించినట్లు ఆధారాలు ఉన్నాయి. యూరోప్‌కు మల్లెలు చాలా ఆలస్యంగా పరిచయమయ్యాయి. అరబ్బుల ద్వారా క్రీస్తుశకం పదహారో శతాబ్దంలో గ్రీస్, ఫ్రాన్స్‌ ప్రాంతాలకు తొలిసారిగా మల్లెలు చేరాయి.

ఫిలిప్పీన్స్‌కు పదిహేడో శతాబ్దిలో మల్లెలు పరిచయమయ్యాయి. మల్లెలపై మనసు పారేసుకున్న ఫిలిప్పీన్స్‌ మల్లెపూవును తన జాతీయపుష్పంగా ప్రకటించుకుంది. ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేసియా, టునీసియా దేశాలకు కూడా మల్లెపూవే జాతీయపుష్పం కావడం విశేషం.

పరిమళ ద్రవ్యాల తయారీలో...
పరిమళ ద్రవ్యాల తయారీలో మల్లెల వినియోగం శతాబ్దాలుగా సాగుతోంది. మల్లెల నుంచి అత్తరులు, సెంట్లు వంటివి తయారు చేస్తారు. సబ్బులు, అగరొత్తుల తయారీలోనూ మల్లెల నుంచి సేకరించిన పరిమళ తైలాన్ని వినియోగిస్తారు. మల్లెల నుంచి ఒక కిలో సుగంధతైలం సేకరించాలంటే, వెయ్యి కిలోల మల్లెలు అవసరమవుతాయి.

మిగిలిన పూల నుంచి సుగంధ తైలాన్ని సేకరించడానికి వాటిని నీటిలో ఉడికించి, ఆవిరిని సేకరించడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఇది ఒకే దశలో జరిగే ప్రక్రియ. మల్లెల నుంచి సుగంధతైలాన్ని సేకరించడం ఒకే దశలో సాధ్యమయ్యే పని కాదు. మొదటగా తాజాగా సేకరించిన మల్లెలను వాటిని సేకరించిన చోటనే నీటిలో ఉడికించి, ఆవిరి పడతారు.

తొలిదశలో పరిమళాలు వెదజల్లే మైనం వంటి పదార్థం తయారవుతుంది. దీనిని ‘జాస్మిన్‌ కాంక్రీట్‌’ అంటారు. రెండో దశలో ఈ ‘జాస్మిన్‌ కాంక్రీట్‌’ను శుద్ధి చేయడం ద్వారా దీని సుగంధ తైలాన్ని సేకరిస్తారు. ఇంతగా ఎంతో శ్రమించి సేకరించిన సుగంధ తైలాన్నే అత్తరులు, సెంట్లు వంటి పరిమళ ద్రవ్యాల తయారీలోను, సబ్బులు, అగరొత్తులు వంటి ఉత్పత్తుల కోసం వినియోగిస్తారు.

మల్లెల నుంచి సుగంధతైలం సేకరణ చాలా క్లిష్టమైన ప్రక్రియ కావడం వల్ల మల్లెల పరిమళాన్ని వెదజల్లే అత్తరులు, సెంట్లు వంటి ఉత్పత్తుల ధరలు కళ్లు చెదిరే స్థాయిలో ఉంటాయి.

సంప్రదాయ వైద్యంలో...
►మల్లెలను మన ప్రాచీన ఆయుర్వేద వైద్యంలోను, చైనా సంప్రదాయ వైద్యంలోను చిరకాలంగా వినియోగిస్తున్నారు. మల్లెపూలను తలలో ధరించడం వల్ల వెంట్రుకలకు, కళ్లకు మేలు జరుగుతుందని;
►మల్లె ఆకులను దట్టంగా తలపైవేసి కట్టు కట్టినట్లయితే, కళ్లు ఎర్రబారడం, కళ్లకలకలు వంటి నేత్రవ్యాధులు నయమవుతాయని,
►మల్లె ఆకులను నూనెలో వేసి కాచిన తైలాన్ని తలకు పట్టించినట్లయినా నేత్రవ్యాధులు నయమవుతాయని;
►మల్లెల వేరు నుంచి తయారు చేసిన కషాయం వాత పైత్య దోషాలను హరిస్తుందని, రక్తదోషాలను తొలగిస్తుందని ‘వస్తుగుణ దీపిక’ చెబుతోంది.

►ఒత్తిడిని తగ్గించడంలోను, మానసిక ప్రశాంతతను కలిగించడంలోను మల్లెల సుగంధం బాగా పనిచేస్తుందని పలు ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి.
►చైనా సంప్రదాయ వైద్యంలో మల్లెపూవును ‘మో లి హువా’ అంటారు.
►దీనిని చర్మవ్యాధులు నయం చేయడానికి, మానసిక ఆందోళనను తగ్గించడానికి విరివిగా ఉపయోగిస్తారు.
►మల్లెల ఆకులతో తయారు చేసిన కషాయాన్ని జీర్ణకోశ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
మల్లెపూలలో ఉండే ‘ఆర్సిటిన్‌’ అనే రసాయనం రక్తపోటును అదుపు చేస్తుందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement