చిన్నపిల్లలున్న ఇల్లు! అసలే వీపరీతమైన పని, ఒత్తిడి. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు! ఏం తినాలో, ఏం తినకూడదో వారికి తెలియదు, తల్లితండ్రులకు వారిని అర్థం చేసుకునే సమయం తక్కువ! 24 గంటలూ పిల్లలనే కనిపెట్టుకుని వుండాలంటే కొద్దిగా కష్టమే!
అయినా కళ్ళల్లో వత్తు లేసుకుని కాపలా కాస్తూనే వున్నప్పటికీ పిల్లలు ఏదో తినేస్తుంటారు. ఇబ్బంది పడతారు. మరి అప్పుడేం చెయ్యాలి? ఆందోళన చెందకుండా ఆయుర్వేదం ఎలాంటి పరిష్కారాలు సూచిస్తోంది?
1. పిల్లలు తెలియకుండా ఏదో ఒకటి నోట్లో పెట్టుకుని తర్వాత కడుపు నొప్పి అంటూ విలవిలలాడితే?
కొద్దిగా జీలకర్ర తీసుకుని బాగా శుభ్రపరిచి, దోరగా వేయించాలి. ఆ వేగిన జీలకర్రను మెత్తటి వుండగా చేసుకుని ఓ సీసాలో భద్రపరచు కోవాలి. మాదీఫల రసాయనం సీసాను తెచ్చుకుని ఓ చెంచా జీలకర్ర పొడిలో మాదీఫల రసాయనం కలపాలి.
దాన్ని చెంచాలో తీసుకుని పిల్లలకు పట్టాలి. దీని వల్ల వాంతులే కాదు వామ్టింగ్ సెన్సేషన్ కూడా వుండమన్నా వుండదు. పత్యం చెయ్యాల్సిన అవసరం లేదు.
2. హఠాత్తుగా విరేచనాలు మొదలయితే ఏం చేయాలి?
జిగట, మామూలు, నెత్తురు, చీము వంటి విరేచనాల లక్షణాలు కనిపిస్తున్నప్పుడు, ఆ విరేచనాల ప్రాథమిక దశలోనే జాగ్రత్త తీసుకుంటే వాటి బారి నుంచి రక్షణ పొందవచ్చు. ఎలాగంటే ఓ రెండు చింతగింజల్నీ, ఓ చెంచా గసగసాలనూ తీసుకుని ఈ రెంటినీ కలిపి కొద్దిగా నీటిని జోడించి మెత్తగా నూరాలి.
అప్పుడు వచ్చే రసాన్ని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం చొప్పున ఓ నాలుగైదు రోజుల పాటు ఇవ్వాలి. అవసరాన్ని బట్టి వ్యాధి తగ్గేంత వరకూ మందు ఇవ్వాలి. విరేచనాలు పూర్తిగా తగ్గిపోయేంత వరకూ మజ్జిగ అన్నం పెడితే మంచిది.
3. దీర్ఘకాలిక జ్వరాలకు ఏం చేయాలి?
ఎప్పుడు చూసినా లో-ఫీవర్ వుంటుంటే దీర్ఘజ్వరం వున్నట్లుగా భావిస్తాం. దీర్ఘజ్వరం వున్నవాళ్లు చల్ల మిరియం విధానం వినియోగిస్తే సత్వర ఫలితం వుంటుంది. రోజుకో మిరియం చొప్పున మింగిస్తూ, మిరియపు గింజను మజ్జిగలో నానబెట్టి, మెత్తగా నూరి కడుపులోకి తీసుకుని కొద్దిగా మజ్జిగ తాగుతుంటే దీర్ఘజ్వరాలు తగ్గిపోతాయి. ఈ విధంగా 41 రోజులపాటు చల్లమిరియం వాడవల్సి వుంటుంది.
4. విరోచనం కాకపోతే ఏం చేయాలి?
విరేచనం బిగపట్టి ఇబ్బందిగా వుంటే చిన్న చిట్కాతో ఈ ఇబ్బందిని తొలగించవచ్చు. కొద్దిపాటి సునాముఖి ఆకును తీసుకుని దీనిని గుండుగా చేసి భద్రపరచాలి. అనంతరం పంచదార పాకం పట్టి అందులో సునాముఖి ఆకు గుండను వేసి ఆరబెట్టి చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి.
ఇది సుమారు రెండు మూడు నెలలపాటు నిల్వ వుంటుంది. అన్ని వయసులవారు నిరభ్యంతరంగా వాడదగిన ఈ మందు విరోచనం ఫ్రీగా అవడానికి సహకరిస్తుంది.
5. పిల్లలు తరచుగా దగ్గు, రొంపకు గురయితే ఏం చేయాలి?
దగ్గు, రొంప విపరీతంగా వున్నప్పుడు చిన్న చిన్న చిట్కాలను ప్రయోగిస్తే ఫలితం సంతృప్తికరంగా వుంటుంది. తులసి ఆకుల రసాన్ని రోజుకు రెండు మూడు సార్లు రెండు, మూడు చుక్కలు ఇస్తే పిల్లలకు దగ్గు, రొంప అసలు రాకుండా ఉంటాయి. తులసి ఆకుల రసంలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
ఓ నాలుగైదు తమలపాకులు ముందుగా వెచ్చ చేసి, ఆపై నూరి రసం తీసి, దానిలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఓ రెండు చెంచాల నూనెను కాచి, ఒక పెద్ద చెంచాడు కర్పూరాన్ని పొడిచేసి నూనెలో కలిపి ఒక సీసాలో నిల్వ వుంచాలి. దీనిని ఛాతీకి, గొంతుకకూ రాస్తే దగ్గు, జలుబు తగ్గుతాయి.
ఒక గుప్పెడు జామాయిలు (యూకలిప్టస్ ) ఆకుల్ని రెండు గ్లాసుల నీళ్లల్లో పోసి అవి మరిగి ఒక గ్లాసు అయ్యేదాకా మరగబెట్టాలి. అనంతరం ఆ నీటిని వడగట్టి అందులో కొంచెం పంచదార కలిపి, రోజుకు మూడుసార్లు తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ముందు ముందు రాకుండా ఉంటుంది.
6. తరచుగా ఇంజక్షన్లు చేయిస్తున్నారా?
ఇవి పరిశీలనలోకి తీసుకోండి. సూది మందు వీటికి వద్దు.
►చిన్న చిన్న జబ్బులకు
►సాధారణంగా వచ్చే దగ్గు, జలుబుకు
►విటమిన్ టాబ్లెట్లు
►కాల్షియం మందు
►రక్తహీనతకు వాడే బి12, లివర్ ఎక్స్‌ట్రాక్ట్, ఇన్‌ఫెర్రాన్ లాంటివి. విటమిన్ టాబ్లెట్లు నోటి ద్వారా తీసుకుంటే మంచిది.
ఇంకా చెప్పాలంటే విటమిన్లు, మందుల రూపంలోకన్నా ఆహారం ద్వారా వీటిని తీసుకోవడం అన్ని విధాలా క్షేమదాయకం. రక్తహీనతకు ఇంజెక్షన్ల కంటే కూడా నోటి ద్వారా తీసుకునే ఫెర్రస్ సల్ఫేట్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు మంచివి. పైగా అపరిశుభ్రమైన సూదుల ద్వారా అవసరం లేని ఇబ్బందులు, అప్పుడప్పుడు నరాలకు, రక్తనాళాలకు గాయాలు కావచ్చు.
-నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment