ఆరోగ్యవంతమైన జీవనం
వివేకం
‘ఆరోగ్యం’ అనే పదం, ‘అంతా’ అనే పదం నుండి వచ్చింది. మీ శరీరం, మీ బుద్ధి, మీ భావోద్వేగాలు, మీ ప్రాణశక్తి అన్నీ ఒకదానితో ఒకటి సరిగా అనుసంధానమై ఉన్నప్పుడు, మీ లోపల మీరు ఒక పరిపూర్ణత్వాన్ని అనుభూతి చెందుతారు. మీరు ఆరోగ్యవంతంగా ఉన్నట్లు అనుభూతి చెందేది అప్పుడే!
వైద్యపరంగా ‘ఆరోగ్యవంతులు’ అని పరిగణింపబడే వాళ్లతో సహా, ప్రపంచంలో ఎక్కువ మంది వ్యక్తులు అనారోగ్యవంతులే! వారికి మందుల అవసరం లేకపోవచ్చు. కానీ వాళ్ల జీవన క్రియకు సంపూర్ణత అనేదే తెలీదు. శాంతి, ఉల్లాసం అనే అనుభవమే వాళ్లలో ఉండదు. మీరు ఒక నిర్ణీత స్థాయి కన్నా తక్కువగా ఉంటేనే అనారోగ్యంగా ఉన్నామని మీరు భావిస్తారు. కానీ, మీరు ఉల్లాసంతో తొణికిసలాడుతూ లేకపోతే, మీరు అనారోగ్యవంతులే! మీరు అనబడే మీ అంతర్గత నిర్మాణంలో, సంపూర్ణత అనేదే లేదు కనుక మీరు అనారోగ్యవంతులే!
సంపూర్ణత పట్ల మీరు ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. అందువల్లనే ఇలా జరిగింది. ప్రతిదానిని బయటినుంచి సరి చేయడానికి ప్రయత్నించే ఈ దృక్పథమే అసలు పోవాలి. ఏ డాక్టర్ గానీ, ఏ మందు గానీ మీకు అనారోగ్యాన్ని ఎప్పటికీ ఇవ్వలేదు. మీరు అనారోగ్యం బారిన పడినప్పుడు, వాళ్లు మీకు సహకరిస్తారు, కొంతవరకు సహాయపడతారు. కానీ, ఆరోగ్యం మాత్రం, మీ లోపలనే ఏర్పడాలి.
ఆరోగ్యం కేవలం భౌతికమైన అంశం కాదు. ఈ రోజున ఉన్న ఆధునిక వైద్యశాస్త్రం కూడా చెప్తోంది, మానవుడు సైకోసొమాటిక్ అని. మనసులో కలిగేది ఏదో, సహజంగా అదే శరీరంలో కూడా కలుగుతుంది. తిరిగి శరీరంలో కలిగేది ఏదో, అదే మనసులో కలుగుతుంది. అందుచేత, ఇక్కడ మనం ఎలా జీవిస్తున్నాము, మన వైఖరి, మన భావోద్వేగాలు, మన ప్రాథమిక మానసిక స్థితి, మనం జరిపించే కార్యకలాపాల స్థాయి, మన ఆలోచనలు ఎంత క్రమబద్ధంగా ఉన్నాయి అనేవన్నీ మన ఆరోగ్యంలో తప్పనిసరిగా ఉండే భాగాలు.
అంతర్గతంగా సంపూర్ణత భావన కలగాలంటే తప్పనిసరిగా కొంత ఇన్నర్ ఇంజనీరింగ్ చేయాలి మనం. మన శరీరం, బుద్ధి, భావాలు, ప్రాణశక్తి - అన్నీ చక్కటి సమతుల్యతలో ఉండే వాతావరణాన్ని, మనం తప్పనిసరిగా సృష్టించుకోవాలి.
అందరూ ఉదయం పూట, ఒక్క ఇరవై అయిదు, ముప్ఫై నిమిషాల కాలాన్ని వెచ్చించాలి తమ అంతర్గత శ్రేయస్సు కోసం. వీటి ద్వారా తమ శరీరాన్నీ, బుద్ధినీ సంపూర్ణ ఆరోగ్యంతో నిర్మించుకోవచ్చు. అప్పుడు ప్రతి మనిషీ ఆరోగ్యంతో చక్కగా జీవించగలరు.
సమస్య - పరిష్కారం
ఎన్నో రకాల మందులూ, చికిత్సలూ లభ్యమవుతున్నాయి. అల్లోపతి, సిద్ధ, ఆయుర్వేదం, యునాని, ఆక్యుపంక్చర్ లాంటివి... మానవ శరీరానికి ఏది ఉత్తమమైనది?
- జి.కిషన్‌రావు, హైదరాబాద్
సద్గురు: ఈ విషయం వ్యాధిపై ఆధారపడి ఉంటుంది. శరీరానికి మందులు అవసరం లేదు. వ్యాధికే మందులు కావాలి. మీకున్న వ్యాధిని బట్టి, దానికి అనుగుణంగా చికిత్స జరగాలి. మీకు ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లయితే, అల్లోపతికి మించింది లేదు. అత్యవసరానికి అల్లోపతే మంచిది. కానీ మీకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లయితే, అల్లోపతి అంత మంచిది కాదు. మీకు కోలుకోవడానికి సమయం ఉన్నప్పుడే, మీరు ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్లండి. మీ సమస్యలు కొనసాగుతూ, రకరకాలుగా మార్పుచెందుతూ ఉంటే అప్పుడు ఆయుర్వేదం, ఇతర వైద్య విధానాలు చాలా సమర్థవంతమైన మార్గాలు.
ఈ రోజుల్లో అల్లోపతి డాక్టర్లు మీకు మందులు ఇవ్వరు. వాళ్లు కేవలం ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. కానీ ప్రాచ్య వైద్య విధానాలు వ్యక్తిగతమైనవి. మందు మాత్రమే ముఖ్యం కాదు. ఆ మందును ఎవరిస్తున్నారనేది కూడా ముఖ్యమే. ఆయుర్వేదం అనేది కేవలం కాలేజీకి వెళ్లి మనుషులకు వైద్యం చేయడం నేర్చుకునే విధానం కాదు. ఆయుర్వేద వైద్యాన్ని చేయాలనుకునేవాళ్లు దాంతో నిరంతరం లీనమై ఉండాలి.