ఆయుర్వేద వైద్యం.. అంతులేని నిర్లక్ష్యం ! | Negligance On Ayurvedic Treatment In Krishna | Sakshi
Sakshi News home page

ఆయుర్వేద వైద్యం.. అంతులేని నిర్లక్ష్యం !

Published Fri, Jun 15 2018 12:23 PM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

Negligance On Ayurvedic Treatment In Krishna - Sakshi

నగరంలోని ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద ఆస్పత్రి

నాలుగేళ్లలో ప్రభుత్వం అన్ని రంగాలను చేసినట్లే వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందనడానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఆస్పత్రి.. అదే నవ్యాంధ్రలోని ఏకైక ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆస్పత్రి... విజయవాడలోని ఆచంట ఆయుర్వేద ఆస్పత్రి. మందుల కొరత, అరకొర సౌకర్యాలు, వైద్యుల లేమి వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు ఏడాదిన్నర కిందట బందరు కాలువ ఒడ్డున ఉన్న కళాశాలను ఖాళీ చేయాలంటూ ఇరిగేషన్‌ శాఖనోటీసులు ఇవ్వగా, ప్రత్యామ్నాయంపై పాలకులు దృష్టి సారించడం లేదు.

లబ్బీపేట(విజయవాడ తూర్పు): దేశీయ ప్రాచీన వైద్యమైన ఆయుర్వేదానికి పూర్వ వైభవం తీసుకు వస్తామంటున్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. నవ్యాంధ్రలో ఉన్న ఏకైక ఆయుర్వేద కళాశాల, దానికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులకు సరైన వైద్యం అందించలేని దుస్థితి నెలకొంది. మరోవైపు వైద్య విద్యార్థులకు బోధన చేసేందుకు సైతం ప్రొఫెసర్‌లు అందుబాటులో లేని దుస్థితి. ఈ విషయమై అనేక మార్లు సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆయుర్వేద కళాశాల, ఆస్పత్రులు బందరు కాల్వ ఒడ్డున ఉండటంతో వాటిని ఖాళీ చేయాలని ఏడాది కిందట ఇరిగేషన్‌ శాఖ నోటీసులు జారీ చేసారు. ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకునే వారే కరువయ్యారని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

రాష్ట్రంలోనే ఏకైక కళాశాల..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలు ఉండేవి. రాష్ట్ర విభజన అనంతరం వరంగల్, హైదరాబాద్‌ కళాశాలలు తెలంగాణ రాష్ట్రానికి చెందగా, విజయవాడలోని నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాల ఒక్కరే నవ్యాంధ్రలో మిగిలింది. దానికి అనుబంధంగా ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయుర్వేద కళాశాలలో ప్రతిఏటా బీఏఎంఎస్‌లో 60 సీట్లు భర్తీ చేస్తుండగా, పోస్టు గ్రాడ్యుయేషన్‌ నాలుగు విభాగాల్లో 20 మంది చేరుతున్నారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

అరకొర సౌకర్యాలు..
ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద ఆస్పత్రికి నిత్యం 150 నుంచి 200 మంది అవుట్‌పేషెంట్స్‌ వస్తుంటారు. మరో  60 నుంచి 80 మంది వరకూ ఇన్‌పేషెంట్స్‌ చికిత్స పొందుతున్నారు. వారికి వైద్య సేవలు అందించేందుకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. నాల్గవ తరగతి ఉద్యోగులు, స్టాఫ్‌నర్సులు ఉద్యోగ విరమణ చేస్తుండగా, కొత్తవారిని పదేళ్లుగా భర్తీ చేయడం లేదు. దీంతో తీవ్రమైన సిబ్బంది కొరత నెలకొంది. రోగులకు సేవలు అందించేందు సిబ్బంది లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు బయటే..
ఆయుర్వేద ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన రోగులకు రక్తపరీక్షలు అవసరమైతే బయటే చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలోని లేబొరేటరీ అలంకారప్రాయంగానే ఉండడంతో పరీక్షలన్నీ వైద్యులు బయటకే సిఫారసు చేస్తున్నట్లు చెపుతున్నారు. దీంతో పేద రోగులు వందలాది రూపాయలు చెల్లించి పరీక్షలు చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఫార్మశీ తెలంగాణకు వెళ్లిపోవడంతో ప్రభుత్వం పూర్తిస్థాయిలో మందులు కొనుగోలు చేయడం లేదు. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులకు మందులు బయటకే రాస్తున్నారు. మందులు లోకల్‌గా కొనుగోలు చేసేందుకు బడ్జెట్‌ కేటాయింపులు కూడా లేకపోవడంతో ఏమి చేయలేని దుస్థితి నెలకొంటుంది.

కళాశాలను అభివృద్ధి చేయాలి
నవ్యాంధ్రలో ఉన్న ఏకైక ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆయుర్వేద విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలి. నాల్గవ తరగతి సిబ్బందిని భర్తీ చేసి రోగులకు మెరుగైన సేవలు అందించేలా చూడాలి. ఆయుర్వేద ఫార్మశీని ఏర్పాటు చేసి, మందులు అందుబాటులో ఉండేలా చూడాలి. ఆయుర్వేద కళాశాల ఏర్పాటు, వన మూలికలు, పరిశోధనలకు ప్లాంటేషన్‌ అభివృద్ధికి ఐదెకరాలు కేటాయించాల్సిన అవసరం ఉంది.  పంచకర్మ వైద్యానికి మంచి డిమాండ్‌ వున్న నేపధ్యంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ఆ విభాగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, నిపుణులైన సిబ్బందిని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం వుంది.
– డాక్టర్‌ మెహబూబ్‌ షేక్,  వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement