బాబుకు బ్రాంకైటిస్... తగ్గడం ఎలా?
మా బాబు వయసు ఆరేళ్లు. గత మూడు నెలలుగా దగ్గుతో బాధపడుతున్నాడు. అప్పుడప్పుడూ జ్వరం, కొద్దిపాటి కళ్లె కూడా కనిపిస్తున్నాయి. పరీక్షలన్నీ చేసి డాక్టర్లు ‘బ్రాంకైటిస్’గా నిర్ధారణ చేసి మందులిచ్చారు. అయినా పెద్దగా ఫలితం కనబడటం లేదు. పూర్తిగా తగ్గాలంటే ఆయుర్వేద చికిత్స సూచింప ప్రార్థన.
కె. రాధిక, సిరిసిల్ల
మీరు చెప్పిన లక్షణాలను బట్టి, ఆయుర్వేదంలో దీనిని ‘పిత్తజ కాస’గా పరిగణించవచ్చు. అప్పుడప్పుడు ఇక్కడ అసాత్మ్యత (అలర్జీ) కూడా చోటు చేసుకుంటుంది. సాధారణంగా పిల్లలను ఆకర్షించే చాక్లెట్లు, నూడిల్స్, లాలీపాప్స్ ఐస్‌క్రీములు, కూల్‌డ్రింక్స్ వంటి చిరుతిళ్లను పూర్తిగా నిషేధించాలి. బయటి తిండిని మానేయాలి. ఇంట్లో వండే వంటకాలలో వాడే నూనెలు, రంగులు మొదలైనవాటిల్లో కల్తీ లేకుండా చూసుకోవాలి. బలకరమైన ఆహారంతో బాటు బాదం, జీడిపప్పు వంటి ఎండుఫలాలను తినిపించండి. పాలు, పెరుగు తగు రీతిలో సేవించాలి. ఈ కింద వివరించిన మందుల్ని ఒక నెలపాటు వాడి ఫలితాన్ని సమీక్షించండి.
రస పీపరీ రస (మాత్రలు) ... ఉదయం 1, రాత్రి 1.
అతిమధురం చూర్ణం రెండు గ్రాములు, ప్రవాళ పిష్ఠి ఒక చిటికెడు కలిపి తేనెతో రెండుపూటలా తినిపించండి.
వాసారిష్ట (ద్రావకం) ... ఒక చెంచా మందుకి ఒక చెంచా నీళ్లు కలిపి, రెండు లేక మూడు పూటలా తాగించాలి.
నా వయసు 68. శీతాకాలంలో చర్మం పొడిగా మారి దురదలు రాకుండా ఉండాలంటే ఆయుర్వేద సూచనలీయగలరు.
- ఎస్. మేరీ, విశాఖపట్నం
ఆయుర్వేద సూత్రాల రీత్యా ‘రూక్షత్వక’ (పొడిచర్మం)ను నివారించడానికి ఈ కింది విధానాలను పాటించండి.
రోజుకి నాలుగైదు లీటర్ల నీరు తాగండి. ఆహారంలో ఆకుకూరలు, మునగకాడలు విరివిగా వాడండి. రోజూ రెండు చెంచాలు నువ్వుల పప్పు (పచ్చిది) నమిలి తినండి. ఉప్పు, కారం తగ్గించాలి.
స్నానం కోసం సబ్బులేమీ వాడవద్దు. ముఖాలంకరణకు పౌడర్లు, క్రీములు వాడవద్దు. చెమటపట్టేటట్టు తేలికపాటి వ్యాయామం అవసరం. రాత్రిపూట కనీసం ఆరుగంటల నిద్ర ఉండాలి. మానసిక ఒత్తిడి లేకుండా ప్రాణాయామం ఉపయోగకరం.
స్వచ్ఛమైన నువ్వులనూనెతో శరీరమంతా అభ్యంగనం చేసుకొని, అనంతరం సున్నిపిండి లేదా శనగపిండితో నలుగుపెట్టుకొని, పిదప గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ ప్రక్రియ రోజు విడిచి రోజు చేసినా సరిపోతుంది.
ముఖానికి: పాలమీగడ, శనగపిండి, నిమ్మరసం, తేనె కలిపిన ముద్దను పూసుకొని, 20 నిమిషాల అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
‘కుమార్యాసవం, శారిబాద్యాసవం’ ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో కలుపుకొని, సమానంగా నీళ్ల్లు కలిపి, రెండుపూటలా తాగాలి.
నా వయసు 73. మలబద్దకానికి ‘త్రిఫలాచూర్ణం’ వాడవచ్చా?
- సిద్ధప్ప, అనంతపురం
‘కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ’... ఈమూడింటిని విడివిడిగా చూర్ణం చేసి సమానంగా కలుపుకుంటే త్రిఫలాచూర్ణం తయారవుతుంది. దీంతో కషాయం కాచుకుని రాత్రి పడుకునేప్పుడు 30 మి.లీ. తాగండి. రోజువారీ విరేచనం సాఫీగా అవుతుంది. ఈ ఔషధం గుండెకు, కంటికి, రక్తనాళాలకు, కాలేయానికి, మెదడుకు బలం కలిగించే చక్కటి రసాయనంగా ఆయుర్వేదం వర్ణించింది.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
హుమయున్ నగర్, హైదరాబాద్