కేరళ ఆయుర్వేదం గెలిచింది! | Kerala Ayurveda Victory On Coronavirus | Sakshi
Sakshi News home page

కేరళ ఆయుర్వేదం గెలిచింది!

Published Wed, Jun 17 2020 2:57 AM | Last Updated on Wed, Jun 17 2020 2:57 AM

Kerala Ayurveda Victory On Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది జనవరి నాటికి కరోనా వైరస్‌ కేరళలో అడుగుపెట్టింది. కొద్ది రోజుల్లోనే రోగుల సంఖ్య పదుల సంఖ్యకు.. ఆపై వందల్లోకి చేరింది. మహమ్మారికి కళ్లెం వేసేందుకు రంగంలోకి దిగిన కేరళ ప్రభుత్వం.. ఆయుర్వేదాన్ని ఆయుధంగా చేసుకుంది. వ్యాధిని గుర్తించేందుకు ఏం చేయొచ్చో తెలపాలని ఆయుర్వేద వైద్యులను కోరింది. దాంతోపాటు రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఏం చేయాలన్నది రాష్ట్రం మొత్తానికి తెలియజేసింది. ఏప్రిల్‌ 11 నాటికి కరోనాకు సంబంధించి ఆయుర్వేద కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. రోగులతో పాటు సాధారణ ప్రజలు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలని, ఇందుకు తాము సూచించిన పద్ధతులను పాటించాలని కోరింది కూడా.

ఆయుర్వేదం ఏం చెబుతోంది?
రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని, తద్వారా కరోనాను దూరంగా ఉంచేందుకు కేరళ ప్రభుత్వం ఆయుర్వేదం ఆధారంగా పలు సూచనలు చేసింది. చిరుతిళ్లను వీలైనంత వరకు తగ్గించడం, డ్రైఫ్రూట్స్‌తో పాటు ఉడికించిన పచ్చి అరటిపండు (కేరళలోని నేండ్రం రకం)ను వాడాల్సిందిగా కోరింది. ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలని.. రోజులో కనీసం ఒక్కసారైనా ముడి బియ్యంతో చేసిన గంజి తాగాలని, వీలైనంత వరకు మాంసాధారిత ఆహారాన్ని తీసుకోకపోవడం మేలని తెలిపింది. కూరలు, సూప్‌లు, అల్పాహారాల్లో పెసలు, పెసరపప్పు విరివిగా వాడాలని కోరింది. రోజుకు కనీసం 20 నిమిషాల పాటు యోగా చేయాలని తెలిపింది. మినుముల వాడకం తగ్గిస్తే మేలని, వేడినీటిలో శొంఠిని వేసి మరిగించిన నీటిని తాగుతుండటం, శొంఠి కాఫీకి కొంచెం పసుపు కలుపుకొని తాగడం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయని, ఆవు పాల కంటే మేకపాలు మేలని తెలిపింది.


కరోనా నియంత్రణకు ఆయుర్వేద మందులు ఉపయోగించేందుకు సిద్ధమైన కేరళ ప్రభుత్వం.. చికిత్స విషయానికి వచ్చేసరికి మాత్రం ఆధునిక వైద్యం పైనే ఆధారపడింది. నిర్ధారణ పరీక్షలు, వైద్యం అల్లోపతి ద్వారా చేపట్టారు. ఆయుర్వేద విధానం జీవనశైలి మార్పులు, రోగి శక్తి పుంజుకునేందుకు ఉపయోగపడుతోంది. 

కేరళను ఆయుర్వేదం రక్షిస్తుంది
కరోనా కష్టకాలంలో ఆయుర్వేదాన్ని ఉపయోగించేందుకు ప్రభుత్వం ‘కేరళను ఆయుర్వేదం రక్షిస్తుంది’ అనే నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చింది. స్వాస్థ్యం, సుఖాయుష్యం, పునర్జనని పేర్లతో సిద్ధం చేసిన పద్ధతులను ప్రజలకు ప రిచయం చేసింది. 60 ఏళ్లలోపు వారికి తొలి పద్ధతి ఉపయోగపడితే వృద్ధుల రక్షణకు సుఖాయుష్యం సిద్ధమైంది. పునర్జనని కరో నా రోగులు త్వరగా కోలుకునేందుకు సాయపడుతుంది. రాష్ట్రంలోని ఆయుర్వేద వైద్యశాల వివరాలను ‘నిరామయ’పేరున్న పో ర్టల్‌కు ఎక్కించింది. కేంద్ర ప్రభుత్వపు ఆయుష్‌ మిషన్‌లో భాగంగా రా ష్ట్రమంతా ఆయుర్‌ రక్ష పేరుతో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ ఆరోగ్య కేంద్రాలు కరోనా పర్యవేక్షణ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ సామాజిక మాధ్యమ పేజీల్లో కరోనా నివారణకు తీ సుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన వ్యాయామాల వివరాలను ప్రజలకు అందించింది. ఏపీలోని గ్రామ వలంటీర్ల వ్యవస్థ మాదిరిగా ఆయుర్వేద వైద్యులు, వైద్య విద్యార్థుల సాయంతో రాష్ట్రమంతటా అనుమానిత క రోనా బాధితులను గుర్తించేందుకు కృషిచేసింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement