
ఆయుర్వేదం అన్నాడు.. అల్లోపతి ఇస్తున్నాడు!
►అర్హత లేకున్నా డాక్టర్‌గా చలామణి
►నర్సింగ్‌హోం సీజ్, నిందితుడి అరెస్ట్
కౌడిపల్లి: ఆయుర్వేద డాక్టర్ అని చెప్పుకుంటూ.. అల్లోపతి వైద్యం చేస్తున్న వ్యక్తి కటకటాలపాలయ్యాడు. గతంలో రెండుసార్లు ఇతగాడి ఆస్పత్రిని అధికారులు సీజ్ చేసినా.. దర్జాగా మరోచోట దందా నడిపిస్తున్నాడు. కౌడిపల్లిలో బుధవారం వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలు... కౌడిపల్లిలోని అందుగులపల్లికి చెందిన సుధాకర్ కొన్నాళ్లుగా శ్రీనివాస మమత నర్సింగ్‌హోంను నిర్వహిస్తున్నాడు.
అయితే, ఇక్కడ ఎక్కువగా అపెండిక్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని డీఎం అండ్ హెచ్‌ఓ బాలజీపవర్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో ఆయన పోలీసులతో కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. డాక్టర్‌గా చలామణి అవుతున్న సుధాకర్‌కు ఎలాంటి విద్యార్హతలు లేవని గుర్తించారు. నర్సింగ్‌హోంకు వస్తున్నట్టు చెబుతున్న ఎంబీబీఎస్ డాక్టర్ నాగరాజు ఎప్పడూ ఆస్పత్రికి రాలేదని, అతనికి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా లే వని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆపరేషన్ థియేటర్‌లో ట్రాక్టర్ పరికరాలు ఉండటంతో వారు ఖంగుతిన్నారు. పోలీసులు ఆస్పత్రిని సీజ్‌చేసి నిందితుడిని అరెస్టుచేశారు.