తెలుగువారి పండుగలు, ఆచారాలు, ధార్మిక సంస్కృతితో సమ్మిళితమై ఉంటాయి. దైవ కైంకర్యంలో నైవేద్యానిది ప్రధాన పాత్ర. చక్రపొంగలి, దద్ధ్యోదనం, పులిహోర వంటి ప్రసాదాలు మనకు అతి సాధారణం. వీటన్నింటిలోనూ సామాన్య ద్రవ్యం ‘వరి అన్నమే’. ఇతర పదార్థాలలో నెయ్యి, బెల్లం/శర్కర; పెరుగు, నిమ్మకాయ/చింతపండు’ ప్రధానమైనవి. ఇవి మనకి అతి సామాన్యంగా కనిపిస్తాయే గాని వాటి పోషక విలువలు, గుణధర్మాలు అమోఘం. వీటి ప్రయోజనాలు ఆయుర్వేద గ్రంథాలలో సుస్పష్టంగా కనిపిస్తాయి.
నెయ్యి
ఘృతం, ఆజ్యం, సర్పి మొదలైనవి నెయ్యికి సంస్కృత పర్యాయపదాలు. ఆయుర్వేదంలో ఆవు నేతికి విశిష్టత ఉంది.
గుణధర్మాలు: మధురం, ప్రధానంగా పిత్త దోషహరం, వాత కఫ శ్యామకం, చలువ చేస్తుంది. తెలివితేటలను పెంచుతుంది. ఓజోకరం, శుక్రకరం, రసాయనం (సప్త ధాతు పుష్టికరమై క్షమత్వ వర్థకం). లావణ, కాంతి, తేజోవర్థకం. ముసలితనం రానీయకుండా యౌవనాన్ని పదిలపరుస్తుంది. ఆయు వర్థకం. మంగళకరం. కంటికి మంచిది. గవ్యం ఘృతం విశేషేణ చక్షుష్యం, వృషం, అగ్నికృత్.... మేధా లావణ్య కాంతి తేజో ఓజో వృద్ధికరం, వయస్థాపకం, బల్యం, సుమంగలం, ఆయుష్యం, సర్వ ఆజ్యేషు గుణాధికం
►ఆవు నెయ్యిని హోమం చేస్తే వచ్చే పొగ విషహరం, క్రిమిహరం, వాతావరణ కాలుష్య హరం.
►ఆవు పెరుగు: కొంచెం పులుపు. ఎక్కువ తీపి కలిగితే రుచిలో నుంచి ఆకలిని పెంచి, ధాతుపుష్టిని కలిగించి, గుండెకు కూడా శక్తినిస్తుంది. నాడీవ్యవస్థను పటిష్ఠపరుస్తుంది (వాత హరం). అందువలననే దీనిని చాలా పవిత్రమని వర్ణించారు. గవ్యం దధి విశేషేణ... రుచిప్రదం, పవిత్రం, దీపనం, హృద్యం, పుష్టికృత్, పవనాపహం...
గేదె పెరుగు: ఇది చాలా చిక్కగా ఉండటం వలన బరువైన ఆహారంగా చెప్పబడింది. కఫకరం, స్రోతస్సులలో అవరోధం కలిగిస్తుంది. రక్తాన్ని దూషిస్తుంది. శుక్రకరం.
రాత్రిపూట పెరుగు తినకూడదు (రాత్రౌ దధి న భుంజీత). పెరుగును వేడి చేయకూడదు. మితిమీరిన పరిమాణంలో పెరుగును సేవించకూడదు.
బెల్లం
చెరకు రసం నుంచి తయారుచేసిన బెల్లం తియ్యగా, జిగురుగా ఉండి శుక్రవర్థకంగా ఉపకరిస్తుంది. దేహంలో కొవ్వుని పెంచుతుంది. కొంతవరకు వేడిని తగ్గిస్తుంది కాని శర్కరంత చలువచేయదు. బలవర్థకమే కాని, కఫాన్ని క్రిములను పెంచుతుంది. పాతబెల్లం (పురాణ గుడం) చాలా మంచిది (పథ్యం). వేడిని తగ్గించి, కొవ్వును కరిగిస్తుంది. జఠరాగ్నిని పెంచి పుష్టిని కలిగిస్తుంది. (కాని ఈనాడు బెల్లం తయారీలో చాలా కెమికల్స్‌ని కలిపి, కల్తీ చేస్తున్నారు. ఇది హానికరం).
శర్కర
ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన శర్కర చాలా విశిష్టమైనది. దాని తయారీ వేరు. ఈనాడు చేస్తున్న పంచదార తయారీలో పోషక విలువలు శూన్యం. పరిపూర్ణంగా కెమికల్స్ మయం. చాలా అనర్థదాయకం.
చింత
చింతకాయ చక్కటి పులుపు కలిగి వాతహరంగానూ, కించిత్ పిత్తకఫాలను పెంచేదిగానూ ఉంటుంది. బరువుగా ఉండి ఆలస్యంగా జీర్ణమవుతుంది. పక్వమైనది (చింత పండు) ఆకలిని పెంచి, విరేచనం సాఫీగా అవటానికి సహకరిస్తుంది (సుఖరేచకం). ఉష్ణవీర్యమై వాతకఫహరంగా ఉంటుంది. ‘చించా, తింత్రిణీ, తింతిడీ, అమ్లీ, చుక్రికా... మొదలైనవి. చింతకాయ/పండునకు సంస్కృత పర్యాయపదాలు
నిమ్మ
నింబు, జంబీర అను పర్యాయపదాలున్నాయి. కఫవాత శ్యామకం. దప్పికను తగ్గిస్తుంది. (తృష్ణాహరం). రుచిని పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మూత్రకరం. జ్వరహరం. కంఠవికారాన్ని తగ్గిస్తుంది. నేత్రదృష్టివర్థకం. బాగుగా పరిపక్వమైనది (పండు) వాడుకుంటే మంచిది.
ఇంగువ (హింగు)
ఉష్ణవీర్యం, ఆహారపచనం బాగా చేస్తుంది. కడుపునొప్పి, కడుపులోని వాయువు, క్రిములను పోగొడుతుంది. వాతకఫహరం.
పసుపు (నిశా, హరిద్రా)
ఇది కడుపులోకి సేవించినా లేక బయటపూతగా వాడినా కూడా క్రిమిహరం. రక్తశోధకం, జ్వరహరం, మధుమేహ హరం. శరీర కాంతిని పెంచి చర్మరోగాలని దూరం చేస్తుంది.
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment