ఆపిల్ చెట్టు
సేంద్రియ రైతుతో కలిసి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మోలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా తెలంగాణ లోని ధనోరా గ్రామపరిధిలో ఆపిల్ పండ్ల సాగు కల సాకారమైంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో దనోరా గ్రామం ఉంది. ఉష్ణోగ్రత ఏడాదిలో కొద్దిరోజులైనా అతి తక్కువగా నమోదయ్యే ఎత్తయిన ప్రాంతమే ఆపిల్ సాగుకు అనుకూలం. ధనోరా ప్రాంతంలో అక్టోబర్ – ఫిబ్రవరి మధ్యలో.. 3 నుంచి 400 గంటల పాటు.. సగటున 4 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. అందువల్లే ధనోరా తెలంగాణ కాశ్మీర్‌గా పేరుగాంచింది.
ఈ విషయం గ్రహించిన హైదరాబాద్‌లోని కేంద్రప్రభుత్వ సంస్థ సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్తలు డా. ఏ వీరభద్రరావు, డా. రమేశ్ అగర్వాల్ ఐదేళ్లక్రితం సర్వే చేసి.. సేంద్రియ రైతు కేంద్రే బాలాజి పొలం ప్రయోగాత్మకంగా ఆపిల్ సాగుకు అనువైనదిగా గుర్తించారు. చాలా ఏళ్లుగా సేంద్రియ ఉద్యానతోటలు సాగు చేస్తున్న బాలాజి అప్పటికే పది ఆపిల్ మొక్కలు నాటితే, కొన్ని మాత్రమే బతికాయి.
ఈ నేపథ్యంలో సీసీఎంబీ శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో నాణ్యమైన ఆపిల్ మొక్కల సాగుకు బాలాజి శ్రీకారం చుట్టారు. వారు అందించిన హరిమన్, బిలాస్‌పూర్, నివోలిజన్, అన్న, రాయల్ డెలిషియస్ రకాలకు చెందిన నాణ్యమైన 500 ఆపిల్ మొక్కలను బాలాజి మూడేళ్ల క్రితం తన పొలంలో నాటారు. 400 మొక్కలు ఏపుగా ఎదిగాయి. ఈ ఏడాది చక్కని కాపు వచ్చింది. చెట్టుకు 25 నుంచి 40 కాయలు ఉన్నాయి.
అయితే, లేత చెట్లు కావటంతో కాయ సైజు చిన్నగా ఉంది. వచ్చే ఏడాది నుంచి మార్కెట్‌లో అమ్మకానికి పెట్టే అంత సైజు కాయలు వస్తాయని రైతు బాలాజి ‘సాక్షి’తో చెప్పారు. 5 ఎకరాల్లో ఆపిల్‌తో పాటు మామిడి, దానిమ్మ, అరటి, బత్తాయి, సంత్ర, ఆపిల్ బెర్ పంటలను ఆయన సాగు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ ఆపిల్ పండ్లను ప్రజలు రుచిచూడటానికి కృషి చేసిన సీనియర్ సేంద్రియ రైతు, సీసీఎంబి శాస్త్రవేత్తలు, ఉద్యాన, వ్యవసాయ అధికారులకు జేజేలు!
ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి!
మా ఊళ్లో ఆపిల్ సాగుకు వాతావరణం అనుకూలమేనని రుజువైంది. ఇక్కడ చాలా మంది రైతులు ఆపిల్ సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరికొంతమంది రైతులకు మెలకువలు నేర్పుతాను. ఎక్కువ మంది రైతులు ఆపిల్ పంటను పండిస్తే అమ్మకం సులువు అవుతుంది. ఆపిల్ పంట పండించందుకు సీసీఎంబీ శాస్త్రవేత్తలతో పాటు ఉద్యానవన శాఖాధికారుల, వ్యవసాయాధికారుల కృషి కూడా ఉంది. ఇప్పుడు చేతికొచ్చిన ఆపిల్ పండు చిన్నదిగా ఉంది. ఈ ఏడాది గడిస్తే మరింత పెద్ద సైజు పండ్లు కాసే అవకాశం ఉంది. అందుకే వచ్చే ఏడాది నుంచి మార్కెట్‌లో అమ్మకానికి పెడదామనుకుంటున్నాను.
– కేంద్రే బాలాజి (99490 92117), ఆపిల్ రైతు, కెరమెరి(ధనోర), భీం ఆసిఫాబాద్ జిల్లా
బాలాజి తోటలో ఆపిల్ పండు
– ఆనంద్, సాక్షి, కెరమెరి, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment