సాక్షి, హైదరాబాద్: భారతీయుల్లో మధుమేహాన్ని గుర్తించేందుకు ప్రస్తుత పద్ధతుల కన్నా జన్యు ఆధారిత పరీక్షలు మేలని ఓ అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), పుణేలోని కేఈఎం ఆసుపత్రుల సంయుక్త అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. మధుమేహం రెండు రకాలని ఒక్కోదానికి వేర్వేరు చికిత్స పద్ధతులు అవలంబించాలన్నది తెలిసిన సంగతే. టైప్–1 మధుమేహానికి జీవితకాలం ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉండగా.. టైప్–2 విషయంలో మంచి ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా నియంత్రించవచ్చు.
టైప్–1 పిల్లల్లోనూ, టైప్–2 పెద్దవారిలోనూ వస్తుందన్నది ఇప్పటికున్న అంచనా. భారతీయుల్లో దీనికి భిన్నమైన ఫలితాలున్నాయి. పెద్దయ్యాక కూడా వారిలో టైప్–1 మధుమేహమున్నట్లు తెలుస్తుండగా.. దేశంలో బక్కపలుచగా ఉన్న యువకులు టైప్–2 బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత మధుమేహ పరీక్షల ద్వారా తప్పుడు ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఎక్కువ. ఇలాకాకుండా జన్యువుల్లోని నిర్దిష్ట అంశాల ద్వారా ఒక వ్యక్తి ఏ రకమైన మధుమేహం బారిన పడే అవకాశముందో నిర్ధారించడం ద్వారా వారికి తగిన చికిత్స లభిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీన్ని నిర్ధారించుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్‌టర్‌తో చేతులు కలిపారు.
యూరోపియన్ల కోసం ఎక్స్‌టర్ యూనివర్సిటీ జన్యు ఆధారిత రిస్క్ స్కోర్ ఒకదాన్ని సిద్ధం చేయగా.. ఆ స్కోర్ భారతీయుల విషయంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు కేఈఎం ఆసుపత్రి, సీసీఎంబీలు ప్రయత్నించాయి. పుణేలో టైప్–1 మధుమేహులు 262 మంది, టైప్–2 మధుమేహులు 352 మంది, సాధారణ ప్రజలు 334 మంది జన్యుక్రమాలను పరిశీలించారు. వీటిని వెల్‌కమ్ ట్రస్ట్ కేస్ కంట్రోల్ కన్సార్షియం సిద్ధం చేసిన యూరోపియన్ల సమాచారంతో పోల్చి చూశారు. ఫలితంగా జన్యు రిస్క్ స్కోర్ ఇరువురికీ ఉపయోగపడుతుందని స్పష్టమైంది. కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా భారతీయుల్లో మరింత మెరుగ్గా వ్యాధిని గుర్తించవచ్చునని తెలిసింది. పదిహేనేళ్ల వయసులోపు టైప్–1 మధుమేహుల్లో 20 శాతం మంది భారత్‌లో ఉన్న నేపథ్యంలో వ్యాధిని కచ్చితంగా నిర్ధారించే జన్యు ఆధారిత కిట్ ఉండటం ఎంతైనా వాంఛనీయమని, ఈ అధ్యయనం ద్వారా అది సాధ్యమవుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment