ఈ సంవత్సరం తొలినాళ్ల నుంచి ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో విరగడయ్యే అవకాశం లేదని తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. అది రూపం మార్చుకుని మరింత ప్రమాదకరంగా పరిణమించిందని, వ్యాప్తి చెందే వేగం కూడా బాగా పెరిగిందని నిపుణులు చెబుతున్న మాటలు దడ పుట్టిస్తున్నాయి. గత పది పన్నెండు నెలలుగా కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెందుతూ భిన్న రూపాలు సంతరించుకోగా... వాటిల్లో ఇప్పుడు కొత్తగా కనుగొన్న వీయూఐ 202012/01 రకం మిగిలిన కరోనా రకాలతో పోలిస్తే అత్యంత ప్రమాదకరమైనదని తేల్చారు. పాత రకం కన్నా దీనికి 70 శాతం అధికంగా విస్తరించే లక్షణం వుందన్నది వారి మాట. దీని జాడ సెప్టెంబర్‌లోనే బయటపడినా అన్ని రకాలుగా పరీక్షించి నిర్ధారించడానికి సమయం పట్టింది.
కనుక ఈ వైరస్ ప్రస్తుతం బ్రిటన్‌కి మాత్రమే పరిమితమైందని చెప్పలేం. ఇప్పటికే నెదర్లాండ్స్, డెన్మార్క్, ఆస్ట్రేలియాలకు ఇది విస్తరించిందంటున్నారు. కరోనాను అరికట్టడానికి వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాబోతున్నాయని, త్వరలోనే మాస్క్‌లను దూరం పెట్టొచ్చని, భౌతికదూరం పాటించే అలవాటుకు కూడా స్వస్తి పలకొచ్చునని ఆశిస్తున్నవారికి ఈ తాజా రూపం వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడానికి ఏడాదంతా ఎదురుచూసే అలవాటున్న పాశ్చాత్య ప్రపంచానికి ఇది ఊహించని షాక్. ఇప్పుడు కొత్త రకం కరోనా బయటపడిన బ్రిటన్‌కు దాదాపు అన్ని దేశాలూ తలుపులు మూస్తున్నాయి. ఈ నెల 31 వరకూ ఆ దేశానికి విమాన రాకపోకలను నిలిపేస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. ఇరుగుపొరుగునున్న యూరప్ దేశాలు మాత్రమే కాదు... మన దేశంతో సహా ప్రపంచ దేశాలన్నీ అక్కడినుంచి వచ్చినవారి ఆచూకీని రాబట్టి పరీక్షలు చేయడానికి సిద్ధపడుతున్నాయి.
ఒకసారి వైరస్ జన్యు అమరిక మారిందంటే అందుబాటులో వున్న వ్యాక్సిన్లకు అది లొంగడం కష్టమన్న వాదన వుంది. అయితే వ్యాక్సిన్ చేసే పని వైరస్‌లోని వివిధ భాగాలపై దాడిచేసే శక్తిని మన రోగ నిరోధక వ్యవస్థకు ఇవ్వడం. కనుక వైరస్ రూపం మార్చుకున్నా ఆ వ్యాక్సిన్ ప్రభావంతో రోగ నిరోధక వ్యవస్థ తన పని తాను చేస్తుందని నిపుణులంటున్న మాట కొంతలో కొంత ఉపశమనం. కానీ కొత్త రకం వైరస్ తీరుతెన్నులు పూర్తిగా అవగాహనకు రాని ప్రస్తుత పరిస్థితుల్లో కచ్చితమైన నిర్ధారణకు రావడం సులభం కాదు. బ్రిటన్, డెన్మార్క్ పరిశోధనాలయాల్లో శాస్త్రవేత్తల మేధోమథనం నిరంతరాయంగా సాగుతోంది. ఇప్పుడు జరిగిన ఉత్పరివర్తన స్వరూపస్వభావాలేమిటో, దాని తీవ్రత ఎంతో, రోగ నిరోధక వ్యవస్థపై అది చూపగల ప్రభావమేమిటో వారు పరిశోధిస్తున్నారు. ఇటీవలే కరోనాలోని డీ614జీ రకం వైరస్‌ను కనుగొన్నారు. అది స్పెయిన్‌లో మొదలై యూరప్‌లో విస్తరించిందని నిర్ధారించారు. అలాగే దానికి ముందు వై453ఎఫ్ రకం కరోనా వైరస్ జాడను డెన్మార్క్‌లో పసిగట్టారు. దాని వ్యాప్తి మందకొడిగానే వుంది. దక్షిణాఫ్రికాలో బయటపడిన 501.వీ2 రకానికి మాత్రం వేగంగా విస్తరించే లక్షణం వుందంటున్నారు.
బ్రిటన్ వైద్యరంగాన్ని పర్యవేక్షించే నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్‌ఎస్) ప్రపంచంలోనే పేరెన్నికగన్నది. కానీ రాజకీయ నాయకత్వం అసమర్థత దానికి శాపమైంది. అంటువ్యాధుల నిపుణులు మొదట్లో లాక్‌డౌన్ విధింపే మార్గమని చెబుతున్నా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తాత్సారం చేశారు. మార్చిలో లాక్‌డౌన్ విధించేనాటికి అది కాస్తా ఉగ్రరూపం ధరించింది. వేలమందికి ప్రాణాంతకమైంది. తీవ్రత అధికంగా వున్నచోట్ల లాక్‌డౌన్ అవసరమని సెప్టెంబర్‌లో నిపుణులు సూచించినప్పుడు కూడా ఆయన సకాలంలో స్పందించలేదు. పర్యవసానంగా నవంబర్‌లో సుదీర్ఘ లాక్‌డౌన్ తప్పలేదు. మొన్నీమధ్య కూడా అంతే. వైరస్ ఉత్పరివర్తనతో వ్యాధి తీవ్రత పెరుగుతోందని, ఆంక్షలు సడలించవద్దని చెబితే క్రిస్మస్ వేడుకలకు అడ్డుపడటం అమానుషమని జాన్సన్ వ్యాఖ్యానించారు.
ఈలోగా ఆగ్నేయ ఇంగ్లండ్‌లో వైరస్ శరవేగంతో విస్తరిస్తూ పోయింది. ఆంక్షల అమలు తప్పనిసరని ఆయన నిర్ణయానికొచ్చాక వాటినుంచి తప్పించుకుని వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు వేలాదిమంది రైల్వే స్టేషన్లకూ, విమానాశ్రయాలకూ తరలారు. ఫలితంగా వ్యాధి వ్యాప్తి ప్రమాదం పెరిగింది. వ్యాపార, వాణిజ్య రంగాలు భారీ నష్టాలు చవిచూడక తప్పని స్థితి ఏర్పడింది. ఈసారి సుదీర్ఘకాలంపాటు ఆంక్షలు అమలు చేయాల్సిరావొచ్చునని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో, యువకుల్లో ఇది విరుచుకుపడే అవకాశం వుందంటున్నారు గనుక పాఠశాలలు ముందనుకున్నట్టు జనవరిలో ప్రారంభించే అవకాశాలు తక్కువ. పండగలు, సంప్రదాయాలు, నిబంధనలు వగైరా మాటున ఆంక్షల్ని గాలికొదిలితే ఏమవుతుందో బ్రిటన్ వర్తమాన పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది.
ఇప్పటికైతే మన దేశంలో దీని జాడ లేదు. కానీ అంతమాత్రం చేత ఇది ప్రవేశించలేదని నిర్ధారణగా చెప్పలేం. ఎందుకంటే మొన్న సెప్టెంబర్ నుంచి ఇది బ్రిటన్‌లో వ్యాప్తిలో వుంది. అప్పటినుంచీ లెక్కేస్తే అక్కడినుంచి వచ్చినవారు గణనీయంగానే వుంటారు. మొదట్లో విమానాశ్రయాల్లో కట్టడి విధించకపోవడం వల్ల దేశం ఎంతటి వైపరీత్యాన్ని ఎదుర్కొనవలసివచ్చిందో అందరికీ అనుభవమే. అందుకే ప్రభుత్వాలన్నీ తక్షణ చర్యలు చేపట్టాయి. మానవాళితో జరిపే నిరంతర యుద్ధంలో వైరస్‌లు రూపాంతరం చెందడం సర్వసాధారణం. కనుకనే వాటిపై పోరాటం కూడా ఆ స్థాయిలో నిరంతరం జరగక తప్పదు. గత పది నెలలుగా కరోనాతో చేసిన పోరాటం మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ఆ అనుభవం ప్రభుత్వ విభాగాల సంసిద్ధతను పెంచింది. ప్రజానీకానికి సైతం ఆ వైరస్ ఎంతటి ప్రమాదకారో అర్థమైంది. అవన్నీ కొత్త రకం వైరస్‌ను ఎదుర్కొనడంలో అక్కరకొస్తే ఈ గండాన్ని అధిగమించడం కష్టం కాదు.
Comments
Please login to add a commentAdd a comment