సాక్షి, ముంబై: బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్ విజృంభింస్తుడటంతో కేంద్రప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి విమాన సేవలను నిలిపివేసింది. కానీ, అంతకు ముందే అంటే సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ముంబైకి ఐదు విమానాలు వచ్చాయని తెలిసింది. అందులో సుమారు వేయి మందికిపైగా ప్రయాణికులు వచ్చి ఉండవచ్చని సమాచారం రావడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది. ప్రయాణికుల వివరాలు సేకరించే పనిలో బీఎంసీ తలమునకలైంది. వీరంతా నేరుగా తమ ఇళ్లకు వెళ్లకుండా వారం రోజులపాటు హోటల్ గదులలో బస చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత కరోనా పరీక్షలు నిర్వహించి ఎలాంటి వైరస్ సోకలేదని నిర్ధరణ అయితే అప్పుడు ఇంటికి పంపిస్తారని బీఎంసీ వర్గాలు తెలిపాయి.
8 ఆస్పత్రుల్లో టీకా నిల్వ..
కరోనా టీకా మందు త్వరలో అందుబాటులోకి రానుందని సంకేతాలు రావడంతో బీఎంసీ పరిపాలన విభాగం ఏర్పాట్లు చేసే పనులు మరింత వేగవంతం చేసింది. టీకా మందు తీసుకునేందుకు పరేల్‌లోని కేం, సైన్‌లోని లోకమాన్య తిలక్, ముంబై సెంట్రల్‌లోని నాయర్, బాంద్రాలోని బాబా, విలేపార్లేలోని కూపర్, ఘాట్కోపర్‌లోని రాజావాడి, శాంతకృజ్‌లోని వి.ఎన్.దేశాయ్, కాందివలిలోని అంబేడ్కర్ ఇలా ఎనిమిది ఆçస్పత్రులను ఎంపిక చేసింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయని బీఎంసీ అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేంద్రాలలో టీకా మందు ఇచ్చేందుకు వైద్య రంగంలో నిపుణులైన 40 మంది వైద్యులను నియమించనున్నారు. వీరందరికి బీఎంసీకి చెందిన ఆరోగ్య అధికారి డాక్టర్ శీలా జగ్తాప్ నేతృత్వంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు బీఎంసీ ఆస్పత్రి డాక్టర్ రమేశ్ బార్మల్ అన్నారు.
ఈ నెల ఎనిమిదో తేదీన కేంద్రం జారీ చేసిన నియమావళి ప్రకారం టీకా మందు తొలుత ఎవరికివ్వాలో మెబైల్ ఫోన్‌లో సందేశాలు పంపించేందుకు జాబితా సిద్ధం చేస్తున్నారు. అందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది తీరికలేకుండా పనిచేస్తున్నారు. అంతేగాకుండా ట్రాఫిక్ పోలీసులను కూడా సిద్ధం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో భారీ మాత్రలో నిల్వచేసిన కోల్డ్ స్టోరేజ్‌ల నుంచి కరోనా టీకా ఆస్పత్రులకు తరలించేందుకు ట్రాఫిక్ పోలీసుల సాయం తీసుకోనున్నారు. ట్రాఫిక్ జామ్‌లో టీకా మందు తీసుకెళ్లే అంబులెన్స్‌లు చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కోల్డ్ స్టోరేజ్‌ల నుంచి టీకా మందు బయటకు తీసిన తరువాత నిర్ణీత సమయంలోపు కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యం కాకుండా సకాలంలో టీకా మందు సంబంధిత కేంద్రాలకు చేరుకునేలా ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు.
15 రోజుల క్వారంటైన్..
బ్రిటన్‌లో కొత్త వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి ముంబై వచ్చిన ప్రయాణికులు నేరుగా జనాల్లోకి వెళ్లకుండా వారం లేదా పక్షం రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. అందుకు నగరంలోని వివిధ హోటళ్లలో రెండు వేల గదులు సిద్ధంచేసి ఉంచింది. ఇందులో వేయి గదులు ఫోర్, ఫైవ్ స్టార్ హోటళ్లలో, మిగతా గదులు కొన్ని స్టార్ హోటళ్లలో ఉన్నాయి. హోటళ్లలో బస ఖర్చులు స్వయంగా ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చహల్ స్పష్టం చేశారు. సోమవారం కంటే ముందు ముంబైకి చేరుకున్న వారి వివరాలు సేకరిస్తున్నామని చహల్ అన్నారు.
ఒకవేళ ముంబైలో ఉన్నట్లు సమాచారం ఉంటే వెంటనే వారింటికెళ్లి పరీక్షలు నిర్వహించి చేతికి స్టాంప్ వేస్తామని ఆయన అన్నారు. అంతకు ముందు విమానాశ్రయంలోనే ప్రాథమిక పరీక్షలు జరుగుతాయి. అందులో లండన్ నుంచి వచ్చిన ప్రయాణికులను కోవిడ్ లక్షణాలుంటే వారిని విలేపార్లేలోని సెవన్ హిల్స్ ఆస్పత్రిలో, యూరప్ లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సమీపంలో ఉన్న జీ.టి.ఆస్పత్రిలో చేర్పిస్తామని చహల్ తెలిపారు. వారి కోసం ప్రత్యేకంగా వార్డులు కేటాయించామని స్పష్టంచేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి వదంతులు నమ్మవద్దని, అలాగే ముంబైకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment