
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఆగడం లేదు. అమరావతి, అకోలా జిల్లాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్స్ కలకలం రేపుతున్నాయి. జన్యుపరంగా మారిన ఈ కొత్త రకం వైరస్ మరింత త్వరితంగా వ్యాప్తి చెందుతోందని కోవిడ్–19పై ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సుభాష్ సలంఖే చెప్పారు. ఈ కొత్త స్ట్రెయిన్ సోకిన వెంటనే న్యుమోనియాలోకి దింపేస్తోందని, దీనివల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన అమరావతిలో 700 మందికి కరోనా పాజిటివ్ వస్తే అందులో 350 మందికి ఈ కొత్త రకం సోకిందని చెప్పారు. నాగపూర్ నుంచి ఔరంగాబాద్ వరకు ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ప్రజల నిర్లక్ష్యం వల్ల కూడా కేసులు పెరిగిపోతున్నాయన్నారు. భౌతికదూరం పాటించకుండా, మాస్కులు లేకుండా ప్రజలు తిరుగుతున్నారని చెప్పారు.
ఈ కొత్త రకం దేశంలోని ఇతర ప్రాంతాలకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. మహారాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 5వేలకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. హోటల్స్‌లో 50 శాతం సామర్థ్యం వరకే అనుమతి, ఒక భవనంలో అయిదు కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తే సీజ్ చేయడం, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి వంటి నిబంధనలు ముంబై, నాగపూర్‌లలో అమలు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనల్ని కఠినంగా అమలు చేయడానికి మహారాష్ట్ర సర్కార్ మార్షల్స్‌ని రంగంలోకి దించింది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారు, మెట్రో రైళ్లలో, సిటీ బస్సు ప్రయాణికులు మాస్కులు ధరించకపోతే మార్షల్స్ వచ్చి బలవంతంగా మాస్కు పెట్టుకునేలా చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర నీటి వనరుల సంరక్షణ శాఖ సహాయ మంత్రి బచ్చు కదూకి రెండోసారి కరోనా సోకింది. నెల వ్యవధిలో ఆరుగురు మంత్రులకు కరోనా వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment