చైనాలో HMPV పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేశాయి. అయితే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది. ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికించడం ఖాయమని పరిశోధకుల హెచ్చరికల వేళ.. డ్రాగన్ కంట్రీ కొత్త వైరస్ విజృంభణను ధృవీకరించినట్లు కథనాలు వెలువడుతుండడం గమనార్హం. అయితే..
కేవలం చైనా ఉత్తర భాగంలోనే హెచ్‌ఎంపీవీ విజృంభణ కొనసాగుతోందని అటు చైనా ఆరోగ్య శాఖ.. ఇటు చైనా అంటువ్యాధుల నియంత్రణ మండలి(China CDC) ప్రకటించాయి. అన్ని వయసులవాళ్లపై ఈ వైరస్ ప్రభావం చూపుతోందని.. ముఖ్యంగా పిల్లల్లో, వయసు పైబడినవాళ్లలో త్వరగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం కేసులను ట్రేస్ చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నాయి. అలాగే మాస్కులు ధరించాలని, శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలని మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలిపాయి. అయితే.. ఇది ప్రాణాంతకమేనా? అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
👉ఒకవైపు చైనాలో నిజంగానే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
అత్యవసర పరిస్థితి(Emergency) విధించారా? అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటిల్లో వాస్తవమెంత? అనేది తేలాల్సి ఉంది.
👉మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ పరిణామంపై స్పందించాల్సి ఉంది.
👉ఇంకోవైపు.. చైనా చుట్టుపక్కల దేశాల్లో కొత్త వైరస్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే జపాన్‌లో ఫ్లూ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండగా.. HMPV కేసులేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హంకాంగ్‌లోనూ ఈ వైరస్ కేసులు నమోదు అయినట్లు సమాచారం.
ఏమిటీ హెచ్‌ఎంపీవీ వైరస్?
హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్.. ఆర్‌ఎన్‌ఏ వైరస్. క్షీరదాలు, పక్షుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్ని కలగజేసే Pneumoviridae Metapneumovirusకి చెందింది. అయితే హెచ్‌ఎంపీవీ కొత్తదేం కాదు. చైనాకు 20 ఏళ్లుగా పరిచయం ఉన్న వైరస్సే. 2021లో తొలిసారిగా ఈ వైరస్ ఆనవాళ్లను శ్వాసకోశ సంబంధిత సమ్యలతో బాధపడుతున్న చిన్నపిల్లల్లో డచ్ పరిశోధకులు గుర్తించారు. అయితే ఎలా సోకుతుందని(వ్యాధికారకం) విషయం గుర్తించలేకపోగా.. ఇప్పటిదాకా దీనికి వ్యాక్సిన్, మందులు సైతం కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. సెరోలాజికల్ అధ్యయనాల ప్రకారం ఈ వైరస్ 60 ఏళ్లు భూమ్మీద సజీవంగానే ఉండి తన ప్రభావం చూపిస్తుందని తేలింది.
ఇదీ చదవండి: HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్ ఏజెన్సీ
లక్షణాలు, చికిత్స
కరోనా తరహాలోనే వేగంగా వ్యాపించే ఈ వైరస్.. పిల్లలు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లపై ప్రభావం చూపెడుతుందని తెలుస్తోంది. జలుబుతో పాటు దగ్గు, ముక్కు దిబ్బడ, జ్వరం ఈ వైరస్ లక్షణాలు. అయితే పరిస్థితి తీవ్రమైతే గనుక న్యూమోనియా, బ్రాంకైటిస్‌కు దారి తీయొచ్చు. వ్యాక్సిన్, మందులు లేకపోవడంతో లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నారు.
ఇక హెచ్‌ఎంపీవీతో మరణాలు సంభవిస్తాయా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. 2021లో ఈ వైరస్ డాటా ఆధారంగా లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ఓ కథనం ప్రచురించింది. అందులో.. ఐదేండ్ల లోపు పిల్లల్లో ఒక శాతం మరణాలు సంభవించిన విషయాన్ని ప్రస్తావించింది.
Comments
Please login to add a commentAdd a comment