కొత్తా దేవుడండి.. కొంగొత్తా దేవుడండి... అప్పుడెప్పుడో వచ్చిన తెలుగు సినిమా పాట పల్లవిది!
ఇప్పుడు తరచూ దీన్ని మార్చి పాడుకోవాల్సిన పరిస్థితి! ఎందుకంటారా? ఏముందీ..
ఇంకో కొత్త కరోనా రూపాంతరితం అవతరించిందట!
ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్‌లు ఎక్కడికీ పోలేదు కానీ...
పాతికకుపైగా దేశాల్లో ఇప్పుడు ల్యామ్డా కలకలం మొదలైంది!
కంగారేమీ లేదు లెండి.. ప్రస్తుతానికి దీంతో ముప్పు తక్కువే.
దేశంలో రెండో దశ కరోనాలో విధ్వంసం సృష్టించిన డెల్టా రూపాంతరితం ఇప్పుడు ఇతర దేశాల్లో విజృంభిస్తూంటే.. కొన్ని దేశాల్లో ల్యామ్డా ఆందోళన రేకెత్తిస్తోంది. నిజానికి ఇది కొత్తగా కనుక్కున్న రూపాంతరితం ఏమీ కాదు. గత ఏడాది ఆగస్టులోనే దక్షిణ అమెరికా దేశమైన పెరూలో దీన్ని గుర్తించారు. ఆ తరువాత అది సుమారు 30 దేశాలకు విస్తరిం చింది కూడా. కానీ ఇప్పటివరకూ భారత్‌లో ఈ కొత్త రూపాంతరిత వైరస్ సోకిన వారు ఎవరూ లేరు. గత నెల 14న ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా ప్రకటించింది. అప్పటివరకూ దీనికున్న సాంకేతిక నామం సి.37. కరోనా వచ్చిన తరువాత గుర్తించిన ఏడవ వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఇది.
మనకేమైనా ప్రమాదమా?
భారత్‌తోపాటు, మన ఇరుగుపొరగు దేశాల్లోనూ ఇప్పటివరకూ ల్యామ్డా రూపాంతరితాన్ని గుర్తించలేదు. ఆసియా మొత్తమ్మీద ఒక్క ఇజ్రాయెల్‌లోనే దీన్ని గుర్తించారు. అయితే యూరోపియన్ దేశాలు కొన్నింటిలో ఈ వైరస్ ఉన్న కారణంగా, ఆ దేశాల నుంచి భారత్‌కు రాకపోకలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్న నేపథ్యంలో ల్యామ్డాపై కొంచెం జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాక్సీన్లు వేసుకున్న వారికీ ఈ వైరస్ సోకే అవకాశం ఉండటం కొంత ఆందోళన కలిగించే విషయమే. మూక నిరోధకతకు దగ్గరగా ఉన్న యూరోపియన్ దేశాల్లో కూడా మళ్లీ మళ్లీ కేసులు ఎక్కువ అవుతూండటం గమనించాల్సిన అంశం.
లక్షణాలేమిటి?
ల్యామ్డాను ఇప్పటివరకూ 30 దేశాల్లో గుర్తించారు. డెల్టా రూపాంతరితం మాదిరిగానే వేగంగా వ్యాపిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని రూఢీ చేసేందుకు ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఈ అధ్యయనాలు జరుగుతున్నాయి. పెరూతోపాటు దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో నమోదైన కేసుల్లో ల్యామ్డావే ఎక్కువ. ఒక దశలో పెరూలో నమోదైన కేసుల్లో 80 శాతం ఈ రూపాంతరితానివే కావడం గమనార్హం. ఇటీవలే యునైటెడ్ కింగ్‌డమ్‌లో అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ఆరుగురికి ఈ వైరస్ సోకింది. ఫ్రాన్స్, జర్మ నీ, ఇటలీ వంటి యూరోపియన్ దేశాలతోపాటు ఆస్ట్రేలియాలోనూ దీని ఉనికిని గుర్తించారు.
జన్యుమార్పులేమిటి?
వైరస్ పరిణామ క్రమంలో మ్యుటేషన్లు (జన్యుమార్పులు) సహజం. అయితే ఈ మ్యుటేషన్లు అన్నీ ప్రమాదకరం కాదు. ల్యామ్డా విషయానికి వస్తే దీని కొమ్ము ప్రొటీన్‌లో ఏడు ముఖ్యమైన జన్యుమార్పులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. డెల్టాలో ఈ సంఖ్య మూడు మాత్రమే. కొమ్ము ప్రొటీన్‌లో కీలకమైన మార్పులు జరిగాయి కాబట్టి ఈ వైరస్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుందని, యాంటీబాడీలను (సహజంగా పుట్టేవైనా.. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పత్తి అయ్యేవైనా) నిరోధించగలదని కొంతమంది అంచనా వేస్తున్నారు. చిలీలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ల్యామ్డా రూపాంతరితం యూకే, బ్రెజిల్‌లలో ముందుగా గుర్తించిన ఆల్ఫా కంటే ఎక్కువ నిరోధకత (యాంటీబాడీలకు) కలిగి ఉన్నట్లు తెలిసింది. చైనా వ్యాక్సిన్ సైనోవ్యాక్‌కు ల్యామ్డా స్పందించడం లేదని కూడా స్పష్టమైంది. అయితే పూర్తిస్థాయి అంచనాకు వచ్చేందుకు మరింత విస్తృత స్థాయిలో ఈ రూపాంతరితం తాలూకూ జన్యుక్రమాలను నమోదు చేసి పరిశీలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment