హుబేలో లాక్‌డౌన్‌ ఎత్తివేత? | Lockdown Cancelled In Hube | Sakshi
Sakshi News home page

హుబేలో లాక్‌డౌన్‌ ఎత్తివేత?

Published Wed, Mar 25 2020 2:35 AM | Last Updated on Wed, Mar 25 2020 2:38 AM

Lockdown Cancelled In Hube - Sakshi

బీజింగ్‌/వూహాన్‌: సుమారు మూడు నెలల తరువాత మధ్య చైనాలోని హుబే ప్రావిన్స్‌లోని ప్రజలకు కరోనా నుంచి విముక్తి లభించినట్లు అయ్యింది. ఆ ప్రావిన్స్‌లో ప్రజల రాకపోకలపై పెట్టిన నియంత్రణలు (లాక్‌డౌన్‌) అన్నింటినీ ఎత్తివేయాలని చైనా మంగళవారం నిర్ణయించింది. మార్చి 25వ తేదీ నుంచి మొదలుపెట్టి దశలవారీగా నియంత్రణలను ఎత్తివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఇదేమంత మంచి ఆలోచన కాదని, కరోనా కారక కోవిడ్‌–19 వ్యాధి మరోసారి విజృంభించే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తూండటం గమనార్హం. విదేశాల నుంచి చైనాకు వచ్చిన వారిలో ఈ వ్యాధి బయటపడటం ఇటీవలి కాలంలో స్థిరంగా పెరుగుతోంది. హుబేలో సోమవారం కరోనా కారణంగా ఏడుగురు మరణించారు. 

ప్రస్తుతం 4200 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం 74 విదేశీ కేసులతో కలిపి చైనా మొత్తమ్మీద 78 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య కమిషన్‌ అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ చైనాలో కరోనా కారణంగా 3277 మంది చనిపోగా, 81,171 మంది వ్యాధి బారిన పడ్డారు. సుమారు 73,159 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ కాగా, 4,735 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హుబే ప్రావిన్స్‌ రాజధాని వూహాన్‌లో మూడు నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ ఎనిమిదవ తేదీ నుంచి ఎత్తివేయాలని చైనా నిర్ణయించింది. వూహాన్‌ జనాభా కోటీ పది లక్షల వరకూ ఉండగా కరోనా భయంతో వీరందరినీ స్వీయ నిర్బంధంలో ఉంచారు. (లాక్‌డౌన్‌ : జనం మారుతున్నారు..)

గత ఏడాది డిసెంబరు ఆఖరులో తొలి కరోనా వైరస్‌ బాధితుడిని గుర్తించింది ఇక్కడే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 23వ తేదీ నుంచి ఈ ప్రాంతంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. అయితే గత వారం రోజుల్లో ఈ ప్రాంతంలో కేసుల సంఖ్య దాదాపుగా సున్నాకు చేరిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు కేసులేవీ లేకపోగా సోమవారం ఒకే ఒక్క కోవిడ్‌–19 కేసు నమోదైంది. లాక్‌డౌన్‌ ఎత్తివేయనుండటంతో కోవిడ్‌ బాధితులు, అనుమానితులు ఎవరితోనూ సంబంధాలు లేని వూహాన్‌ ప్రజలు ఏప్రిల్‌ ఎనిమిదవ తేదీ నుంచి వూహాన్, హుబే ప్రావిన్సు బయటకు వెళ్లవచ్చు. ఈ మేరకు హుబే ప్రాంత కోవిడ్‌ నియంత్రణ కేంద్ర అధికారులు ఒక సర్క్యులర్‌ జారీ చేసినట్లు అధికారిక వార్తా సంస్థ షిన్‌హువా తెలిపింది.

వ్యాపార కార్యక్రమాలను పునరుద్ధరించేందుకు వూహాన్‌ వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పద్ధతులను పాటించనుంది. హుబేలోని ఇతర ప్రాంతాల్లో నేటి నుంచి రవాణా నియంత్రణలు ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న వారిని వారు పనిచేసే ప్రాంతాలకు నేరుగా పంపనున్నారు. అయితే వ్యాధి పరీక్షల్లో ఉన్న లోపాలు, తగిన క్వారంటైన్‌ పద్ధతులు పాటించని కారణంగా అనేకమందిలో వ్యాధి లక్షణాలు బయటపడలేదని, ఈ నేపథ్యంలో మరోసారి వ్యాధి తిరగబెట్టే అవకాశముందని గ్లోబల్‌ టైమ్స్‌ అనే పత్రిక నిపుణులను ఉటంకిస్తూ హెచ్చరించింది. (2021లో... టోక్యో 2020)

చైనాలో కొత్త వైరస్‌.. ఒకరు మృతి 
చైనాలో మరో ప్రాణాంతక వైరస్‌ జాడలు బయటపడ్డాయి. హంటా అనే ఈ వైరస్‌తో ఒకరు మృతి చెందినట్లు చైనా అధికార మీడియా తెలిపింది. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్‌ కార ణంగా యున్నాన్‌ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి చనిపోయాడు. షండోంగ్‌ ప్రావిన్సులో పనిచేసేందుకు వెళ్తుండగా అతడు హంటా వైరస్‌తో చనిపోయాడు. దీంతో అధికారులు ఆ బస్సు లోని 32 మందిని ఆస్పత్రికి తరలించి, పరీక్షలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఎలుకల ద్వారా సంక్రమిం చే వైరస్‌లలో హంటా వైరస్‌ ఒకటని, ఈ వ్యాధి బాధితుల్లో లక్షణాలు కూడా ఒకేలా ఉండవని అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement