చిన్నారులపై వ్యాధుల పంజా! | Heavy Malaria Cases Recorded In 10 Months In Telangana | Sakshi
Sakshi News home page

చిన్నారులపై వ్యాధుల పంజా!

Published Fri, Feb 28 2020 3:25 AM | Last Updated on Fri, Feb 28 2020 3:25 AM

Heavy Malaria Cases Recorded In 10 Months In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐదేళ్లలోపు పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సకాలంలో అన్ని రకాల టీకాలు తీసుకోకపోవడం, ఇతరత్రా జాగ్రత్తలు చేపట్టకపోవడం తదితర కారణాల వల్ల ఈ వయసు పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (హెచ్‌ఎంఐఎస్‌) తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ఐదేళ్లలోపు పిల్లలపై అనేక జబ్బులు దాడి చేస్తున్నాయని తేలింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు అంటే 10 నెలల కాలంలో మలేరియా కేసులు దేశవ్యాప్తంగా 4.96 లక్షలు నమోదు కాగా, అందులో తెలంగాణలో 6,075 నమోదయ్యాయి.

2018–19 ఆర్థిక సంవత్సరంలో 5,940 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దేశంలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 16వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,582 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 623 కేసులు నమోదు కావడం గమనార్హం. సిరిసిల్ల జిల్లాలో 514 మలేరియా కేసులు నమోదయ్యాయి. మలేరియా నియంత్రణ చర్యలు సక్రమంగా చేపట్టకపోవడం వల్లే ఈ ఏడాది ఈ పరిస్థితి నెలకొందని వైద్య నిపుణులు అంటున్నారు.

టీకా మరణాల్లో ఎనిమిదో స్థానం.. 
పిల్లలకు వివిధ రకాల టీకాలు వేసిన అనంతరం చనిపోయిన సంఘటనల్లో దేశంలో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో నిలిచింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో టీకాలు వేసిన అనంతరం 12 మంది చనిపోగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో గత 10 నెలల్లోనే 24 మంది చనిపోయారని కేంద్రం తెలిపింది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 11 మంది టీకాలు వేసిన అనంతరం చనిపోగా, ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలో 9 మంది చనిపోయారు. ఖమ్మం జిల్లాలో ఇద్దరు, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. టీకాల వల్ల వివిధ రకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ కేసులు ఈ ఏడాది అధికంగా నమోదయ్యాయి.

2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 546 కేసులు నమోదు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 నెలల్లోనే 738 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. టీకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌లో తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో నిలిచింది. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 309 టీకా సైడ్‌ ఎఫెక్ట్స్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలో 123 మంది పిల్లలకు టీకాల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చాయి. అయితే లక్షలాది మందికి టీకాలు వేస్తున్నప్పుడు ఈ మాత్రం సంఘటనలు సహజమేనని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వ్యాఖ్యానించడంపై విమర్శలు వస్తున్నాయి. టీకాలను సరిగా నిల్వ చేయకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల మరణాలు సంభవించాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారి వ్యాఖ్యానించారు.

భారీగా పెరిగిన డిఫ్తీరియా కేసులు.. 
ఐదేళ్లలోపు పిల్లల్లో డిఫ్తీరియా కేసులు రాష్ట్రంలో రెట్టింపు స్థాయి లో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 83 డిఫ్తీరియా కేసులు నమోదవ్వగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో 10 నెలల్లోనే 149 పెరగడం గమనార్హం. ఇందులో దేశంలో తెలంగాణ 6వ స్థానంలో నిలిచిం ది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం లో 80 డిఫ్తీరియా కేసులు నమోదయ్యాయి. ఆ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క కేసు కూడా నమోదవ్వలేదు. హైదరాబాద్‌లోనూ 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఒక్క డిఫ్తీరియా కేసు కూడా లేకపోగా, 2019–20లో 10 నెలల్లో ఇప్పటికే 50 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో గతేడాది కంటే ప్రసవ మరణాలు పెరిగాయి. గత సంవత్సరంలో 337 మంది బాలింతలు చని పోగా, ఈ ఏడాది జనవరి వరకు 389 మంది చనిపోయారని తెలిపింది. ఈ విషయంలో రాష్ట్రం దేశంలో 12వ స్థానంలో ఉంది. గతే డాది కంటే ఈ ఏడాది డయేరియా కేసులు రాష్ట్రంలో బాగా పెరిగాయి. 2018–19లో ఐదేళ్లలోపు పిల్లల్లో 39,541 డయేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరికి  42,597 కేసులు నమోదయ్యాయి.  హైదరాబాద్‌లో అత్యధి కంగా 7,932డయేరియా కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. ఐదేళ్లలోపు పిల్లల్లో రక్తహీనత కేసులు కూడా పెరిగాయి. గతేడాది 5,940 మంది రక్తహీనతకు గురి కాగా, ఈ ఏడాది జనవరి వరకు 6,075 కేసులు నమోదయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement