థర్డ్ వేవ్‌తో కరోనా విరుచుకుపడుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్న వేళ.. నిఫా వైరస్ పేరు మళ్లీ వినిపించడం వైద్యసిబ్బందిని కలవరపాటుకు గురి చేస్తోంది. కేరళలో పన్నెండేళ్ల బాలుడు నిపా వైరస్ కారణంగా చనిపోవడంతో కేరళ, ఆ పొరుగునే ఉన్న తమిళనాడు జిల్లాలు అప్రమత్తం అయ్యాయి. ఈ తరుణంలో ఫేక్ కథనాలు ప్రచారంలోకి వస్తున్నప్పటికీ.. నిపా విషయంలో అప్రమత్తంగా ఉంటేనే నష్టనివారణ చేయొచ్చని సూచిస్తున్నారు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు.
నిపా.. జూనోటిక్ డిసీజ్. జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. అయితే మనిషి నుంచి మనిషికి సోకడమనే ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది. అందుకే జంతువులు, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ అశుతోష్ బిస్వాస్ చెబుతున్నారు. ఫ్రూట్ బ్యాట్(గబ్బిలాలు) లాలాజలం నుంచి, వాటి విసర్జితాల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రత్యేకించి చికిత్స విధానమంటూ నిపా వైరస్‌కు లేకపోవడం వల్ల జాగ్రత్తగా ఉండడమే మార్గమని డాక్టర్ బిస్వాస్ అంటున్నారు. సెప్టెంబర్ 5న నిపా కారణంగా కేరళ కోజికోడ్ బాలుడు చనిపోగా.. బాధితుడి ఇంటి నుంచి సేకరించిన ‘రాంభూటాన్ పండ్ల’(చెట్టు నుంచి కిందపడిన పండ్లు) ద్వారా వైరస్ నిర్ధారణ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు డాక్టర్ బిస్వాస్.
పండ్లు కడగాల్సిందే!
గబ్బిలాలు నిపా వాహకాలు కావడంతో పండ్ల(ఫ్రూట్స్) విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ బిస్వాస్ సూచిస్తున్నారు. సాధారణంగా గబ్బిలాలు జంతువులకు వైరస్‌ను అంటిస్తాయి. ప్రధానంగా గబ్బిలాలు కొరికిన పండ్ల వల్ల నిపా వైరస్ సోకుతుంది. చాలామంది చెట్ల మీద నుంచి పడిన పండ్లను సంబరంగా తింటుంటారు. సగం కొరికి కింద పడ్డ పండ్లను.. కడగకుండానే తినేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన అలవాటు అని చెప్తున్నారు డాక్టర్ బిస్వాస్. పండ్లు ఎలాంటివైనా సరే శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలని ఆయన సూచిస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఈ జాగ్రత్త తప్పక పాటించాలని, లేకుంటే ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారాయన.
ప్రాథమిక జాగ్రత్తలు
► పెంపుడు జంతువుల్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవడం.. వాటిని బయటకు తీసుకెళ్లినప్పుడు ఓ కంటకనిపెడుతుండడం.
► చేతులను తరచు సబ్బుతో శుభ్రం చేసుకోవటం.
► ఆహారాన్ని పూర్తిగా ఉడికించి తినడం
► పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి.
లక్షణాలు
► శ్వాసకోశ సమస్యలు,
► జ్వరం
► ఒళ్లు నొప్పులు
► తలనొప్పి
► వాంతులు
► లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవటం ఉత్తమం.
► నిపా నిర్ధారణ అయితే వైద్యసిబ్బందిని సంప్రదించడం.
మలేషియాలో పందుల పెంపకందారులకు మొదటిసారిగా నిపా వైరస్ సోకింది. భారత్‌లో మొదటిసారి పశ్చిమబెంగాల్‌లో, రెండోసారి కేరళలో విజృంభించింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి తీరుతెన్నులను గమనిస్తే ఒకే ప్రాంతం, దాని చుట్టుపక్కల పరిసరాలకు పరిమితమవుతూ వచ్చింది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటే.. ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశమే ఉండదని వైద్యులు చెప్తున్నారు.
చదవండి: మరోసారి నిపా కలకలం
Comments
Please login to add a commentAdd a comment