దాదాపు ఏడాదిన్నర కింద మొదలైన కరోనా విలయం ఇప్పుడిప్పుడే సర్దుకుంటోంది. కానీ దాని ప్రభావం మాత్రం ఇప్పటికీ ప్రమాదకరంగానే కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనా సోకి తగ్గినవారిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా.. అంతర్గతంగా అవయవాల పనితీరును దెబ్బతీస్తోందని, మెదడుపైనా ప్రభావం చూపుతోందని తాజాగా గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ఏమిటో తెలుసుకుందామా?
- సాక్షి సెంట్రల్ డెస్క్
మానసిక సమస్యలను ముందే గుర్తించినా..
కరోనా కారణంగా శారీరకంగానే కాకుండా మానసికంగా పలు సమస్యలు ఎదురవుతున్నట్టు శాస్త్రవేత్తలు ఇంతకుముందే గుర్తించారు. కరోనా వచ్చి తగ్గిపోయాక (పోస్ట్ కోవిడ్ సమయంలో) చిన్న విషయాలకే ఆందోళనకు లోనవడం, కుంగుబాటు (డిప్రెషన్), స్వల్పస్థాయి మతిమరుపు, గందరగోళానికి లోనవడం లక్షణాలు కనిపిస్తున్నట్టు తేల్చారు. అందులోనూ 45-50 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అయితే కరోనా సోకి ఒంటరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిరావడం, తమకు ఏదైనా అవుతుందేమోనన్న భయం, కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్థికపరమైన సమస్యలు తలెత్తడం వంటివి ఈ మానసిక సమస్యలకు కారణమన్న నిర్ధారణకు వచ్చారు. అయితే కరోనా వైరస్ వల్ల మెదడు కుంచించుకుపోతోందని, ఇది కూడా సమస్యలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’
45 వేల మందిపై పరిశోధన
కరోనా వల్ల మెదడు, నాడీ మండలంపై ప్రభావంపై అమెరికాలోని టెక్సాస్ ఏఅండ్‌ఎం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఆగస్టులో విస్తృతమైన పరిశోధన మొదలుపెట్టారు. ‘యూకే బయోబ్యాంక్’ సంస్థ వద్ద ఉన్న సుమారు 45 వేల మంది మెదడు స్కానింగ్ డేటాను తీసుకుని అధ్యయనం. కరోనా సమయంలోనేగాకుండా అంతకుముందటి పరిస్థితిని పోల్చి చూసేందుకు.. 2014 నాటి నుంచి 2021 జూలై వరకు నమోదు చేసిన అన్ని వయసుల వారి డేటాను పరిగణనలోకి తీసుకున్నారు. కరోనాకు ముందు, తర్వాత మెదడులో జరిగిన మార్పులను పరిశీలించారు.
స్వల్ప స్థాయి కోవిడ్ ఉన్నా..
వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రాంతం వంటివన్నీ దాదాపు ఒకేలా ఉండి.. కరోనా సోకిన, సోకని వ్యక్తుల మెదడు స్కానింగ్‌లను శాస్త్రవేత్తలు పోల్చి చూశారు. కరోనా సోకనివారితో పోలిస్తే.. సోకినవారి మెదడులోని కొంతభాగం లో గ్రే మేటర్ (మెదడు కణాలైన న్యూరాన్ల సమూహం) మందం తగ్గిపోయినట్టు గుర్తించారు. తీవ్రస్థాయి కరోనా సోకినవారిలోనే కాకుండా.. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నవారిలోనూ మెదడు కుంచించుకుపోతోందని తేల్చా రు. ఆ మేరకు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్‌ఎఫ్) పరిమాణం పెరుగుతోందని గుర్తించారు.
- సాధారణంగా 40 సంవత్సరాల వయసు దాటాక ఏళ్లు గడిచినకొద్దీ మెదడులో గ్రేమేటర్ కుంచించుకుపోతూ ఉంటుందని.. కానీ కరోనా సోకినవారిలో తక్కువ వయసులోనే, ఎక్కువ వేగంగా కుంచించుకుపోతోందని గుర్తించారు. ముఖ్యంగా 45-50 ఏళ్ల వయసు దాటినవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు.
ఆలోచన శక్తి, మానసిక సామర్థ్యాలకు దెబ్బ
కరోనా సోకినవారిలో మొదటినుంచీ కనిపిస్తున్న ముఖ్య లక్షణం వాసన, రుచి చూసే సామర్థ్యం కోల్పోవడం. మెదడు ముందుభాగంలో ఉండే ‘ఆల్ఫాక్టరీ బల్బ్’గా పిలిచే ప్రాంతం ద్వారా.. మిగతా భాగాలకు వాసనకు సంబంధించిన సిగ్నల్స్ వెళతాయి. ఈ భాగంపై కరోనా వైరస్ ప్రభావం చూపడం వల్లే వాసన చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది.
- ‘ఆల్ఫాక్టరీ బల్బ్’తోపాటు మెదడులోని టెంపోరల్ లోబ్, హిప్పోకాంపస్ భాగాలకు అనుసంధానం ఉంటుంది. మన జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తికి ఈ భాగాలే కీలకం. కరోనా సోకినవారిలో ఈ భాగాలు కూడా కుంచించుకుపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్లే ఆలోచన శక్తిపై ప్రభావం పడుతోందని, మానసికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
- ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా.. కొన్నిసార్లు తెలిసినవారి పేర్లు, చిన్నచిన్న ఘటనలు కూడా కాసేపు గుర్తురాని పరిస్థితి ఉంటోందని వివరిస్తున్నారు.
ఇంకా తేల్చాల్సినవీ ఉన్నాయి
వయసు మీద పడినకొద్దీ మెదడులో జరిగే మార్పుల తరహాలో కోవిడ్ బారినపడ్డవారిలో మార్పులు కనిపిస్తున్నాయని.. దీని ప్రభావం దీర్ఘకాలంలో ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జెస్సికా బెర్నార్డ్ తెలిపారు. కోవిడ్ వల్ల దెబ్బతిన్న మెదడు మళ్లీ కోలుకుంటుందా? ఈ సమస్య ఎంతకాలం ఉంటుందన్నది తేలాల్సి ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment