కవిత, కృష్ణలకు స్వీటీ ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుతున్నారు. హైదరాబాద్‌లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది స్వీటీ. అయితే గత నెలరోజులుగా కడుపు నొప్పి అంటూ బాధపడుతోంది. ముద్దుల కూతురు బాధపడుతుంటే చూడగలరా? వెంటనే కార్పొరేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ అన్ని పరీక్షలూ చేశాక ఏమీ లేదని చెప్పి, నాలుగు టాబ్లెట్లు ఇచ్చి పంపారు. ఆ తర్వాత మరో రెండుసార్లూ అలాగే జరిగింది. నాలుగోసారి హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు అక్కడి చైల్డ్ స్పెషలిస్ట్ అసలు సమస్యను గుర్తించారు. పాప ఏ విషయంలోనో ఆందోళన పడుతోందని, అందుకే కడుపునొప్పితో బాధపడుతోందని, సైకాలజిస్ట్‌ని కలవమని చెప్పారు.
పిల్లల్లో కూడా యాంగ్టయిటీ డిజార్డర్స్ ఉంటాయా? అని విస్తుపోతూ.. అలా పిల్లలు బాధపడుతుంటే చూడలేమని .. ఏం చేయాలో చెప్పమంటూ కవిత, కృష్ణల్లాగే చాలామంది పేరెంట్స్ సైకాలజిస్ట్ సాయం కోరుతుంటారు. పిల్లల్లో కూడా యాంగ్జయిటీ డిజార్డర్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం మంది పిల్లల్లో యాంగ్జయిటీ లక్షణాలు ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. పిల్లలు ఆందోళన ఎదుర్కోవడంలో తల్లిదండ్రులదే ప్రధానపాత్రనీ చాలా అధ్యయనాల్లో స్పష్టమైంది. మీ పిల్లల్లో ఆందోళన కనిపిస్తే మీరేం చేయాలో తెలుసుకుని, ఆచరించండి. తప్పకుండా ఫలితాలు కనిపిస్తాయి.
ఆందోళన చెందే పిల్లల్లో కనిపించే లక్షణాలు
- కడుపునొప్పి, తలనొప్పి అంటూ ఫిర్యాదు చేయడం..
- చిన్న చిన్న పనులకు లేదా అసలు ఏ పనీ చేయకపోయినా అలసిపోవడం..
- చిరాకు, కోపం ఎక్కువగా ఉండటం..
- నిద్రపోవడానికి కష్టపడటం..
- ఏకాగ్రత లేకపోవడం..
- చిన్న చిన్న విషయాలకే మితిమీరిన ఆందోళన..
- కొన్ని విషయాలు లేదా పనులను నివారించడం..
నొప్పులుగా కనిపించే ఆందోళన
పిల్లల్లో భయాలు సహజం. కొందరు చీకటికి భయపడితే, మరికొందరు పేరెంట్స్‌కి దూరంగా ఉండాలంటే భయపడతారు. అయితే ఈ భయాలు స్కూలుకు వెళ్లడానికి, ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి, నిద్రపోవడానికి ఎలాంటి ఇబ్బందులూ కలిగించవు. వయసు పెరిగేకొద్దీ చాలామంది పిల్లలు ఈ భయాలను అధిగమిస్తారు. కానీ కొందరిలో అలాగే కొనసాగుతాయి. పిల్లలు తమ భయాలను, ఆందోళనను వివరించలేరు. తమ ఆలోచనల్లోని అహేతుకతను గుర్తించలేరు, నియంత్రించలేరు. దాంతో కడుపునొప్పి, తలనొప్పి, అలసటరూపాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. చిరాకు, కోపం పెరుగుతాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లలు ఆందోళన చెందుతున్నారని పేరెంట్స్ గుర్తించాలి.
1. ఇంట్లోని అలారం కొన్నిసార్లు తప్పుగా మోగినట్లే, మెదడులోని అలారం కూడా కొన్నిసార్లు అవసరం లేకపోయినా ఆందోళన చెందేలా చేస్తుందని వివరించండి. అందులో పిల్లల తప్పేమీ లేదని, ఆందోళన చెందడం ‘చెడు’ కాదని చెప్పండి.
2. బిడ్డ ఆందోళన చెందుతున్నప్పుడు పదేపదే ‘ఏమీ కాదు’అని అతిగా భరోసా ఇవ్వకండి. దేనివల్ల ఆందోళన చెందుతున్నారో గుర్తించి, వాటిని నివారించడానికి సహాయం చేయండి.
3. స్కూలు ఎగ్గొట్టడానికి దొంగ వేషాలు వేస్తున్నావంటూ తిట్టకుండా, కొట్టకుండా వాళ్ల బాధ నిజమైనదేనని గుర్తించండి. తన బాధను మీరు అర్థం చేసుకున్నారని తెలపండి.
4. పిల్లల ఆందోళనను గుర్తించి, సానుభూతి అందించిన తర్వాత, వారు ఆ భయాలను ఎదుర్కొనేందుకు అడుగులు వేసేలా చూడండి. అందుకోసం బిడ్డతోపాటు మీరూ పనిచేయండి.
5. పిల్లలు తమ భయాలను విజయవంతంగా ఎదుర్కొన్నప్పుడు లేదా భయాలను ఎదుర్కోవడానికి అడుగులు వేసినప్పుడు మెచ్చుకోండి. ఒక్కొక్క అడుగుతో ఆందోళనను ఎదుర్కోగలవనే భరోసా ఇవ్వండి.
6. చాలామంది పిల్లలు తమ చుట్టూ ఉన్న వాతావరణంలోని అనిశ్చితిని తగ్గించడం ద్వారా ఆందోళనను నివారించడానికి ప్రయత్నిస్తారు. అందుకే పిల్లల చుట్టూ ఉన్న వాతావరణంలో అనిశ్చితిని వివరిస్తూ దాన్ని వాళ్లు ఎదుర్కొనేందుకు, తట్టుకునేందుకు మీ పిల్లలకు సహాయపడండి.
7. మితిమీరిన నియంత్రణను పాటిస్తున్న తల్లిదండ్రులకు ఆందోళనతో కూడిన బిడ్డ పుట్టే అవకాశం ఉందని పరిశోధన కనుగొంది. మితిమీరిన క్రమశిక్షణ పిల్లల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మీ బిడ్డ రిస్క్ తీసుకోవడానికి, తప్పులు చేయడానికి, సరిదిద్దుకోవడానికి స్వేచ్ఛనివ్వండి.
8. ఇవన్నీ చేశాక కూడా మీ బిడ్డలో ఆందోళన తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ని కలవండి. కౌన్సెలింగ్, సైకోథెరపీ ద్వారా మీ బిడ్డకు సహాయపడతారు.
సెకాలజిస్ట్ విశేష్
(చదవండి: చిన్నారులే నడుపుతున్న న్యూస్ చానెల్! వాళ్లే రిపోర్టింగ్, యాంకరింగ్..)
Comments
Please login to add a commentAdd a comment