
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షణాలు లేకుండానే కరోనా బారినపడిన వారు 70 శాతం మంది ఉంటారని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకు డు డాక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం కరోనా బులిటెన్ విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 34,49,925 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, 2,08,535 మంది కరోనా బారినపడ్డారని, వీరిలో 1,45,974 మందికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. మిగి లిన 62,561 మంది ల„క్షణాలతో వైరస్ బారి న పడినట్లు వెల్లడించారు. ఇక శుక్రవారం 53,086 మందికి పరీక్షలు నిర్వహించగా, 1,891 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఒక రోజులో 1,878 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,80,953కి చేరుకుంది. శుక్రవారం ఏడుగురు చనిపోగా, ఇప్పటివరకు 1,208 మంది మరణించారు. దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతం ఉండగా, తెలంగాణలో 0.57 శాతముంది. అలాగే దేశంలో కోలుకున్నవారి రేటు 85.5 శాతం ఉండగా, తెలంగాణలో 86.77 శాతముందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 26,374 ఉండగా, అందులో ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్ లో 21,801 మంది ఉన్నారు. రాష్ట్రంలో పది లక్షల జనాభాలో 92,690 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు.
ప్రైవేట్‌లో పరీక్షలు 7.4 శాతం...
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో 17 చోట్ల, ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో 44 చోట్ల ఆర్‌టీపీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇవిగాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,076 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మొత్తం కలిపి ప్రతీ రోజూ ప్రభుత్వంలో దాదాపు 12 వేల పరీక్షలు, ప్రైవేట్‌లో 8 వేల పరీక్షలు చేసే సామర్థ్యం ఉంది. అయితే ప్రభుత్వంలో యాంటిజెన్ పరీక్షలు చేస్తుండటం, అర గంటలోపే ఫలితం వస్తుండటంతో ప్రజలు అటువైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో పరీక్షలు చేయించుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. శుక్రవారం నిర్వహించిన 53,086 పరీక్షల్లో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో 3,675 (7.44 శాతం) మాత్రమే నిర్వహించారు. మిగిలిన 49,411 వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.