సమాజంలో మూత్రవిసర్జనకు స్త్రీలకు ఉండే సౌకర్యాలు చాలా తక్కువ. పెద్ద పెద్ద నగరాల్లో ఏమోకానీ, చిన్న ఊర్లలో బయటకు వెళితే ఇంటికి వచ్చే వరకు ఉగ్గబట్టుకోవాల్సిందే! ఇలా ఎక్కువ సార్లు ఆపితే ఇన్‌ఫెక్షన్ వస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్లు మూత్రాన్ని ఆపుకోలేని ఇబ్బందిని కూడా కలగజేస్తాయి. దీంతో నలుగురిలోకి వెళ్లాలన్నా, దూరాభారం వెళ్లాలన్నా భయపడే పరిస్థితి వస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిలో మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ (యూరినరీట్రాక్ ఇన్ఫెక్షన్– యూటీఐ) కామన్‌గా కనిపిస్తుంది. ఈ సమస్య స్త్రీలలోనే అధికం. ప్రతి ఐదుగురు స్త్రీలలో ఒకరు తమ జీవితకాలంలో ఒక్కసారైన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్‌ను ఎదుర్కొన్నవారే. మూత్రనాళం, మూత్రాశయ ముఖ ద్వారంలో బ్యాక్టీరియా చేరడం వల్ల యూటీఐ సంభవిస్తుంది. కొన్ని సార్లు ఈ ఇన్ఫెక్షన్ యూరినరీ బ్లాడర్, కిడ్నీల్లో కనిపించి ఇబ్బంది పెడుతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల పైలోనెఫ్రటీస్ అనే కిడ్నీ వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉంది.
యూటీఐ లక్షణాలు..
కిడ్నీ, బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఈ రెండింటిలో కామన్‌గా కనిపించే లక్షణం మాత్రం ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సిరావడం. ఈ లక్షణం కాకుండా బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ వస్తే బ్లాడర్ ఖాళీ అయినప్పటికీ మూత్రానికి వెళ్లాలనిపించడం, మూత్రం పోసేటపుపడు మంట,నొప్పి ఉండడం, పొత్తికడుపులో నొప్పి, యూరిన్‌లో రక్తం పడడం కనిపిస్తాయి. అదే కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంటే అధిక జ్వరం, చలితో ఒణికిపోవడం, విపరీతమైన నడుము నొప్పి, వాంతులవుతుండడం తదితరాలుంటాయి.
అరికట్టడం ఎలా?
తగినన్ని నీళ్లు తాగి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉండాలి. మూత్రవిసర్జన చేయాలనిపించినప్పుడు బలవంతంగా ఆపుకోకూడదు. బలవంతంగా మూత్రాన్ని ఆపడం వల్ల మూత్రాశయంలోకి బ్యాక్టీరియా చేరుతుంది. వీలైనంత ఎక్కువ నీళ్లు తాగడం ద్వారా బ్యాక్టీరియా మూత్రం ద్వారా కొట్టుకుపోయి ఇన్‌ఫెక్షన్ తీవ్రత తగ్గుతుంది. మల విసర్జనకు వెళ్లినప్పుడు వెనక నుంచి ముందుకు కాకుండా చేతిని ముందు నుంచి వెనక్కి జరుపుతూ శుభ్రంచేసుకోవాలి. దంపతులు లైంగిక కలయిక తర్వాత మూత్రవిసర్జన చేసి శుభ్రంగా కడుక్కోవాలి.
పైన చెప్పిన మార్గాలు పాటించిన తర్వాత కూడా మూత్రంలో మంట, మూత్రంలో రక్తం పడడం, చలిజ్వరం,నడుంనొప్పి, వాంతులు, మూత్రం దుర్వాసన కలిగిఉండడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సిరావటం, ముఖ్యంగా రాత్రివేళ ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సిరావటం, మూత్రాన్ని అదుపు చేసుకోలేకపోవడం, మూత్రం చుక్కలుగా పడుతూనే ఉండడం, మూత్రవిసర్జన బలవంతంగా చేయాల్సిరావడం, విసర్జన తర్వాత కూడా ఇంకా మూత్రం మిగిలి ఉందని అనిపించడం ఉంటే మాత్రం తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment