నాకు 35 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. మా అమ్మకు, అమ్మమ్మకు 50వ ఏట బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. నాకు కూడా అలా వచ్చే చాన్స్ ఉందా? ఎలాంటి టెస్ట్‌లు చేయించాలి? టెస్ట్‌ల ద్వారా ముందుగా కనుక్కోవచ్చా?
– జి. చిన్ని, ఎమ్మిగనూరు
కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఆ కుటుంబ సభ్యులు 25వ ఏట నుంచే గైనకాలజిస్ట్‌ని లేదా జెనెటిక్ కౌన్సెలర్‌ని కలవాలి. ఇప్పుడు ఫ్యామిలీ క్యాన్సర్ క్లినిక్స్, జెనెటిక్ క్లినిక్స్ చాలా చోట్ల ఉంటున్నాయి. ఈ రకమైన కన్సల్టేషన్‌లో.. మీ కుటుంబంలో ఏవిధమైన క్యాన్సర్ ఉంది? అది వంశపారంపర్యంగా మీ జీవితం కాలంలో మీకు వచ్చే చాన్స్ ఎంత? ఎలాంటి టెస్ట్‌తో ముందే కనిపెట్టి చెప్పవచ్చు? ఏ టెస్ట్‌తో నివారించవచ్చు? వంటివాటితో రిస్క్‌ను అంచనా వేస్తారు. కొన్ని జన్యుపరమైన పరీక్షలను సూచిస్తారు. కేవలం 5 శాతం బ్రెస్ట్ క్యాన్సర్స్ మాత్రమే వంశపారంపర్యంగా వస్తాయి. కుటుంబంలో ఆల్టర్డ్ జీన్ కనుక ఉంటే తర్వాత తరానికీ బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు.
వృద్ధాప్యంలో వచ్చే క్యాన్సర్స్‌కి చాలా వరకు వంశ పరంపర ఉండదు. మీ కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంది కాబట్టి మీరు ప్రతి నెలసరి తరువాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఏడాదికోసారి మామోగ్రఫీ చేయించుకోవాలి. మామూలుగా అయితే దీన్ని 40 ఏళ్లకి మొదలుపెడతారు. 50 ఏళ్లు వచ్చేవరకు ప్రతి ఏడు ఈ పరీక్షను చేయించుకోవాలి. 50–70 ఏళ్ల మధ్య ప్రతి మూడేళ్లకోసారి మామోగ్రఫీ చేయించుకోవాలి. మామోగ్రఫీ అంటే ఎక్స్ రేతో చేసేది. అయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్.
నొప్పిలేని లంప్ ఏదైనా చేయికి తగిలినా.. బ్రెస్ట్ సైజ్, షేప్ మారినా, స్కిన్‌లో తేడా కనిపించినా.. నిపిల్ డిశ్చార్జ్ ఉన్నా.. చంకల్లో వాపు ఉన్నా.. వెంటనే గైనకాలజిస్ట్‌ని సంప్రదించాలి. పెయిన్ అనేది చాలావరకు క్యాన్సర్ సింప్టమ్ కాదు. జీన్ టెస్టింగ్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. వశపారంపర్య బ్రెస్ట్ క్యాన్సర్‌కి ముఖ్యంగా బీర్‌సీఏ 1, బీఆర్‌సీఏ 2 జీన్స్ కారణం. ఇవి మీలో జీన్ చేంజెస్ అయినాయా లేదా అని జెనెటిక్ పానెల్ టెస్ట్ చేసి తెలుసుకుంటారు. జీవనశైలిలో మార్పు ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించవచ్చు. ఎత్తుకు తగిన బరువును మెయిన్‌టేన్ చేయడం, కనీసం 30 నిమిషాల వ్యాయామాన్ని వారానికి కనీసం అయిదురోజులు చేయడం, పౌష్టికాహారం వంటివన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించడానికి దోహదపడతాయి.
డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలా?)
Comments
Please login to add a commentAdd a comment