మహిళల్లో సాధారణంగా గర్భసంచి పక్కనే ఉండే ఓవరీస్‌లో లేదా వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాల్లో... రకరకాల సిస్ట్‌లు కనిపిస్తుంటాయి. సిస్ట్ అంటే నీరు లేదా నీటి వంటి ద్రవపదార్థంతో నిండి ఉన్న సంచి అని అర్థం. మహిళల్లో ఇలా సిస్ట్‌లు కనిపించడం మామూలే. సాధారణంగా కనిపించే కొన్ని రకాల సిస్ట్‌ల గురించి ప్రాథమిక అవగాహన కోసం... ఈ కథనం.
ఫాలిక్యులర్ సిస్ట్: అండం విడుదల సమయంలో కనపించే సిస్ట్ ఇది. పీరియడ్స్ తరువాత ఐదు లేదా ఆరు రోజుల నుంచి క్రమంగా సైజ్ పెరుగుతూ ΄ోతుంది. సాధారణంగా 2 నుంచి 2.2 సెం.మీ. సైజ్‌కు చేరాక... మహిళల్లో అండం విడుదల జరిగాక కనుమరుగవుతుంది.
కార్పస్ ల్యుటియల్ సిస్ట్: అండం విడుదలైన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే... ఆ పిండాన్ని స΄ోర్టు చేయడానికి ఏర్పడే సిస్ట్ ఇది. సాధారణంగా ఈ సిస్ట్‌లు వాటంతట అవే కనుమరుగవుతాయి.
ఎండోమెట్రియల్ సిస్ట్: రక్తంతో నిండి ఉండే ఈ సిస్ట్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్‌లో కనపడుతుంది. ఈ సిస్ట్‌లు తీవ్రమైన నొప్పి కలిగిస్తాయి. ఇవి క్రమంగా పెద్దదై కొన్నిసార్లు పలిగి΄ోయే అవకాశం ఉన్నందున ఇటువంటి సిస్ట్‌లను ఇంజక్షన్ ద్వారా తాత్కాలికంగా పెరగకుండా చేయడంగానీ లేదా సర్జరీ ద్వారా తీసేవేయడం కానీ చేస్తుంటారు. ఇలా చేయాల్సిన అవసరమూ ఉంటుంది.
ఇన్ఫెక్టెడ్ సిస్ట్: ఓవరీస్‌లో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ట్యూబ్‌తో కలిసి ట్యూబో–ఒవేరియన్ సిస్ట్‌ల పెల్విస్ ఇన్ఫెక్షన్స్‌లో సాధారణంగా ఇది కనిపిస్తుంటుంది.
పాలిసిస్టిక్ ఓవరీస్ : సాధారణంగా ప్రతినెలా 20 నుంచి 30 ఫాలికల్స్ ఓవరీస్‌లో పెరగడం ప్రారంభిస్తాయి. వీటన్నింటిలో అత్యంత అనువుగా ఉన్న ఫాలికల్ మాత్రమే అండంగా మారుతుంది. అది... మిగిలిన వాటికన్నా మరింత వేగంగా పెరిగి... పీరియడ్స్ వచ్చిన 12–16 రోజుల మధ్యలో విడుదల అవుతుంది. ఇక మిగిలిన ఫాలికల్స్ అన్నీ వాటంతట అవే మాయమైపోతాయి.
కాని ఊబకాయం, హార్మోన్ల అసమతౌల్యత ఉన్న మహిళల్లో ఆ ఫాలికల్స్ అన్నీ ఒకే సైజ్ వరకు పెరుగుతాయిగానీ, ఏ ఒక్కటీ అండంగా మారదు. అలా పెరిగిపోయిన ఈ సిస్ట్‌ల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాక΄ోవడం, బరువు మరింతగా పెరగడం, అవాంఛిత రోమాలు రావడం జరగవచ్చు. స్కానింగ్ చేసి చూసినప్పుడు ఈ ఫాలికల్స్ అన్నీ చిన్న చిన్న నీటి బుడగల్లాగా కనపడతాయి. వీటినే డాక్టర్లు పాలిసిస్టిక్ ఓవరీస్’గా చెబుతారు. ఈ సమస్యను మందులతో, జీవనశైలి మార్పులతో తగ్గించడం సాధ్యమవుతుంది.
సీరస్ లేదా మ్యూసినస్ సిస్ట్ : ఇవి కూడా ఓవరీస్‌లో సాధారణంగా కనిపించే సిస్ట్‌లే. నలభై ఏళ్లకు పైబడినవారిలో కనిపిస్తుంది. సైజును బట్టి చికిత్స నిర్ణయిస్తారు.
చాలావరకు వాటంతట అవి తగ్గిపోయేవే...
ఇన్ని రకాల సిస్ట్‌లు ఉన్నా ఫాలిక్యులార్, కార్పస్ ల్యుటియల్, చిన్న సైజ్‌లో ఉన్న సీరస్ సిస్ట్‌లు వాటంతట అవే తగ్గిపోతాయి. కొన్ని సమయాలలో 6 సెం.మీ సైజ్ కన్నా ఎక్కువగా ఉంటే సిస్ట్‌లు లేదా నీరులాంటి పదార్థంతోపాటు గట్టిగా ఉన్న సిస్ట్‌లు, ఎండోమెట్రియాటిక్ సిస్ట్‌ల వంటికి మాత్రమే శస్త్రచికిత్స అవసరమ వుతుంది.
శస్త్రచికిత్స అవసరమయ్యేవి...
కొన్ని సిస్ట్‌లు మెలిక తిరిగి అంటే టార్షన్‌కు గురై పేషెంట్‌కు విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, స్పృహ తప్పిపోవడం వంటి సమస్యలను తెచ్చిపెట్టినప్పుడు ఆపరేషన్ తప్పని సరి.
చివరగా... మహిళలు తామ ఓవరాల్ ఆరోగ్యం కోసం సరైన ఆహారం, ఎక్సర్‌సైజ్ చేస్తే బరువు తగ్గడం చాలా మంచిది. దీనివల్ల ఇతరత్రా అనేక సమస్యలతో పాటు కొంతవరకు సిస్ట్‌లు కూడా నివారితమయ్యే అవకాశం ఉంది. - డా. స్వాతి హెచ్‌వి
కన్సల్టెంట్, అబ్‌స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment