చిన్నా పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరూ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఆర్థరైటిస్. దీన్నే కీళ్ళవాపు వ్యాధి అంటారు. మీదపడే వయస్సుతో మరింత తీవ్రమయ్యే ఈ వ్యాధి, పూర్వం ఎక్కువగా వృద్ధాప్యంలో అంటే 65 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ముందే వచ్చేస్తోంది. అనారోగ్య జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 12ను ప్రపంచ ఆర్థరైటిస్ డేగా పాటిస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ తేతలి దశరథరామారెడ్డిని ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. వివరాలు ఆయన మాటల్లోనే..
లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకండి
ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. అసాధారణమైన కీళ్ళ వాపు, నొప్పి లేక కీళ్ళు బిగుసుకుపోవడం వంటివి రోజుల తరబడి ఉన్నా, అకస్మాత్తుగా తీవ్రమైన వెన్నునొప్పి వచ్చినా, కీళ్లను తాకడం బాధాకరంగా మారినా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించాలి. 65 ఏళ్ల మహిళలు 70 ఏళ్ల పురుషులు ఎముక సాంద్రత (బోన్ డెన్సిటీ) పరీక్ష చేయించుకోవాలి.
ఆర్థరైటిస్‌లో అనేక రకాలు
ఆర్థరైటిస్‌లో అనేక రకాలు ఉన్నాయి. ప్రతిదానికి వేర్వేరు చికిత్సలు కూడా ఉన్నాయి.
ఆస్టియో ఆర్థరైటిస్ (ఓఏ): వృద్ధులలో ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్న తర్వాత నడిస్తే కీళ్ళు గట్టిగా అనిపించవచ్చు. అయితే ఒకసారి కదలడం మొదలుపెడితే నొప్పి త్వరగా తగ్గిపోతుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్‌ఏ): రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను మందులతో, కీళ్ళపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా వ్యాయామంతో తగ్గించవచ్చు.
సోరియాటిక్ ఆర్థరైటిస్: ఆర్‌ఏ లాగే ఇది ఆటో ఇమ్యూన్ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధి. సాధారణంగా సోరియాసిస్ ఉన్నవారిలో సంభవిస్తుంది.
గౌట్: శరీరంలో యూరిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉండటం ఈ సమస్యకు కారణం.
లూపస్: లూపస్ అనేది చర్మం, అవయవాలు శరీరంలోని అనేక ఇతర ప్రదేశాలలో మంటను కలిగించే దీర్ఘకాలిక వ్యాధి.
స్పైనల్ ఆస్టియో ఆర్థరైటిస్ (వెన్నెముక ఆస్టియో ఆర్థరైటిస్): కొన్నిసార్లు ఆస్టియో ఆర్థరైటిస్ వెన్నెముక వద్ద నుండే నరాలపై ఒత్తిడి తెచ్చే ’స్పర్స్’ (ఎముక ఎదుగుదల)కు కారణమవు తుంది. దీనివల్ల ఉత్పన్న మయ్యే సమస్యలను స్పైనల్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు.
ఎలా నియంత్రించాలి?
- బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఎక్కువ బరువుంటే తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి.
- క్రమం తప్పకుండా నడకవంటి వ్యాయా మం చేయడంవల్ల కీళ్ల ఫ్లెక్సిబిలిటీ (సరళంగా వంగే గుణం) పెరుగుతుంది.
- ఈత కొట్టాలని, బరువులు ఎత్తడం లాంటి కసరత్తులు చేయాలని కొందరు వైద్యులు సిఫారసు చేస్తారు.
- పండ్లు, మూలికలు, చేపలు, కూరగాయలతో సహా అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఆహారం తినాలి.
- ధూమపానం, మద్యపానం మానాలి. ఎముకలు చిట్లకుండా చూసుకోవాలి.
(చదవండి: ఆరేళ్ల చిన్నారి బ్రెయిన్‌లో సగభాగం స్విచ్‌ఆఫ్ అయ్యింది? ఐనా..)
Comments
Please login to add a commentAdd a comment