మనుషులకే కష్టాలు.. మానులకు కాదు! ఈ నాలుగు ప్రాక్టీస్‌ చేయండి చాలు! | Stress Symptoms Effects Human Body Behavior Exercises Stress Relief | Sakshi
Sakshi News home page

Funday Cover Story: కష్టాలు మనుషులకు కాకుండా మానులకొస్తాయా! ఈ నాలుగు ఎక్సర్‌సైజ్‌లు ప్రాక్టీస్‌ చేయండి చాలు!

Published Sun, Dec 4 2022 12:55 PM | Last Updated on Mon, Dec 5 2022 3:54 PM

Stress Symptoms Effects Human Body Behavior Exercises Stress Relief - Sakshi

Sakshi Funday Cover Story: కష్టాలు మనుషులకు కాకుండా.. మానులకొస్తాయా! ఓదార్పు కోసం పెద్దవాళ్లు చెప్పే సాధారణమైన మాటిది. నిజమే కానీ.. సమాజంలో ఒకరిద్దరికి కష్టాలొస్తే ఇలాంటి ఓదార్పు మాటలు ఉపయోగపడతాయి! కానీ.. వందలో 42 మందికి తాము కష్టాల్లోనే బతుకీడుస్తున్నట్లు అనిపిస్తే? ఆ దుఃఖంలోనే వారు కుంగి కృశించి పోతూంటే.. అప్పుడు ఆ కష్టాలకు పెట్టుకోవాల్సిన పేరు.. ఒత్తిడి. ఇంగ్లిష్‌లో చెప్పుకుంటే స్ట్రెస్‌! ప్రపంచ దేశాలన్నింటిలోనూ అతిసామన్యమైపోతున్న ఈ మానసిక సమస్య గురించి భారత్‌లో చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. చాలామంది... పైన చెప్పుకున్నట్లు ఓదార్పు మాటలతోనే సరిపెట్టుకుంటున్నారు. అందుకే.. ఆందోళనకరమైన ఈ సమస్య ఆనుపానులు సులువుగా... సచిత్రంగా!!! 


సాధనం-1: గ్రౌండింగ్‌
గ్రౌండింగ్‌ అంటే మీతో మీరు కనెక్ట్‌ కావడం. అంటే.. మీ శరీరం, ఆలోచనలు, భావాలు, పరిసరాలతో కనెక్ట్‌ కావడం. మీరు భావోద్వేగాల తుఫానులో కొట్టుకుపోతున్నప్పుడు నెమ్మదిగా మీ పాదాలను నేలకు ఆనించండి. భూమితో కనెక్ట్‌ అవ్వండి. తర్వాత మీ దృష్టిని శ్వాసపై నిలపండి. ఆ తర్వాత మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం వాసన, రుచి చూడగలరనే విషయాన్ని శ్రద్ధగా గమనించండి. అంటే మీరు మీ ఆలోచనల నుంచి దూరంగా జరిగి.. మీతో, మీ చుట్టూ ఉన్న పరిసరాలతో మమేకం అవండి. గ్రౌండింగ్‌ అంటే సింపుల్‌గా ఇంతే. 

గ్రౌండింగ్‌ను ప్రాక్టీస్‌ చేయడానికి ప్రత్యేక సమయం అవసరంలేదు. ఒకటి రెండు నిమిషాలు చాలు. ప్రతిరోజూ మీరు తినడం, వంట చేయడం లేదా నిద్ర పోవడం వంటి పనులకు ముందు గ్రౌండింగ్‌ ప్రాక్టీస్‌ చేయవచ్చు. అలా ప్రాక్టీస్‌ చేసినప్పుడు మీరు ఆలోచనల నుంచి బయటపడి, ఒత్తిడికి దూరంగా ఆనందంగా మారడాన్ని గమనించవచ్చు. మొదట చిన్న చిన్న పనులకు ముందు గ్రౌండింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తే ఆ తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో గ్రౌండింగ్‌ ఉపయోగించడం సులభం అవుతుంది. 

సాధనం-2: అన్‌ హుకింగ్‌ 
అన్‌ హుకింగ్‌ అంటే మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న ఆలోచనల గాలం నుంచి తప్పించుకోవడం. మూడు దశల్లో ఆ పని చేయవచ్చు. మొదట మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న ఆలోచన లేదా ఫీలింగ్‌ను గుర్తించండి. తర్వాత దాన్ని ఉత్సుకతతో గమనించండి. ఆ తర్వాత ఆ ఆలోచనకు లేదా అనుభూతికి ఓ పేరు పెట్టండి. ఇలా ఆలోచనలను, అనుభూతులను దూరంగా ఉండి గమనించడం, వాటికో పేరు పెట్టడం వల్ల.. మీరు, మీ ఆలోచనలు ఒకటి కాదనే స్పృహæ కలుగుతుంది. అది మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరంగా పెడుతుంది. ఆ తర్వాత మీతో ఎవరున్నారో, మీరేం చేస్తున్నారో దానిపై దృష్టి పెట్టండి.



 

సాధనం-3: విలువలపై స్పందించడం
ప్రతి మనిషికీ కొన్ని విలువలుంటారు. మీకు అత్యంత ముఖ్యమైన విలువలేమిటో ఎంచుకోండి. ఉదాహరణకు ప్రేమ, పని, ధైర్యం, దయ, కష్టపడి పనిచేయడం.. ఇలా చాలా! వీటికి దూరంగా జరగాల్సిన పరిస్థితుల్లో ఒత్తిడి కలుగుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ముందుగా మీరు ముఖ్యమైన నాలుగైదు విలువలేమిటో నిర్ణయించుకోండి. వచ్చే వారమంతా మీ విలువలకు అనుగుణంగా పనిచేసే ఒక చిన్న మార్గాన్ని ఎంచుకోండి. మీ విలువలకు అనుగుణంగా జీవించండి. మీరు పాటించలేని విలువల గురించి ఒత్తిడికి గురికాకుండా, మార్చగలిగే వాటిని మార్చండి. మార్చలేని వాటిని వదిలేసి ముందుకు సాగండి. 



సాధనం-4: ప్రేమతో నింపుకోండి
మీరు మీ పట్ల ప్రేమతో, దయతో ఉంటే ఒత్తిడిని అధిగమించడానికి కావాల్సిన శక్తి మీకు వస్తుంది. ఆ ప్రేమ, దయ ఆకాశం నుంచి ఊడిపడవు. మీరే ఊహించుకోవాలి, సృష్టించుకోవాలి. మీ మెదడుకు ఊహకు, వాస్తవానికీ ఉన్న తేడా తెలియదు. కాబట్టి మీరు జస్ట్‌ ఊహించుకున్నా చాలు దానికి అనుగుణంగా స్పందిస్తుంది. అందుకే మీ దోసిటి నిండా ప్రేమ లేదా దయ ఉన్నట్లు ఊహించండి. దాన్ని ఏ ఆకారంలో ఊహించుకుంటారనేది మీ ఇష్టం. తర్వాత, మీ శరీరంలో బాధ అనిపించే చోట చేతులుంచండి. మీ చేతుల నుంచి శరీరంలోకి ప్రవహించే ప్రేమను, దాని వెచ్చదనాన్ని అనుభవించండి. ఆ ప్రేమ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement