stress Therapy
-
మనుషులకే కష్టాలు.. మానులకు కాదు! ఈ నాలుగు ప్రాక్టీస్ చేయండి చాలు!
Sakshi Funday Cover Story: కష్టాలు మనుషులకు కాకుండా.. మానులకొస్తాయా! ఓదార్పు కోసం పెద్దవాళ్లు చెప్పే సాధారణమైన మాటిది. నిజమే కానీ.. సమాజంలో ఒకరిద్దరికి కష్టాలొస్తే ఇలాంటి ఓదార్పు మాటలు ఉపయోగపడతాయి! కానీ.. వందలో 42 మందికి తాము కష్టాల్లోనే బతుకీడుస్తున్నట్లు అనిపిస్తే? ఆ దుఃఖంలోనే వారు కుంగి కృశించి పోతూంటే.. అప్పుడు ఆ కష్టాలకు పెట్టుకోవాల్సిన పేరు.. ఒత్తిడి. ఇంగ్లిష్‌లో చెప్పుకుంటే స్ట్రెస్! ప్రపంచ దేశాలన్నింటిలోనూ అతిసామన్యమైపోతున్న ఈ మానసిక సమస్య గురించి భారత్‌లో చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. చాలామంది... పైన చెప్పుకున్నట్లు ఓదార్పు మాటలతోనే సరిపెట్టుకుంటున్నారు. అందుకే.. ఆందోళనకరమైన ఈ సమస్య ఆనుపానులు సులువుగా... సచిత్రంగా!!! సాధనం-1: గ్రౌండింగ్ గ్రౌండింగ్ అంటే మీతో మీరు కనెక్ట్ కావడం. అంటే.. మీ శరీరం, ఆలోచనలు, భావాలు, పరిసరాలతో కనెక్ట్ కావడం. మీరు భావోద్వేగాల తుఫానులో కొట్టుకుపోతున్నప్పుడు నెమ్మదిగా మీ పాదాలను నేలకు ఆనించండి. భూమితో కనెక్ట్ అవ్వండి. తర్వాత మీ దృష్టిని శ్వాసపై నిలపండి. ఆ తర్వాత మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం వాసన, రుచి చూడగలరనే విషయాన్ని శ్రద్ధగా గమనించండి. అంటే మీరు మీ ఆలోచనల నుంచి దూరంగా జరిగి.. మీతో, మీ చుట్టూ ఉన్న పరిసరాలతో మమేకం అవండి. గ్రౌండింగ్ అంటే సింపుల్‌గా ఇంతే. గ్రౌండింగ్‌ను ప్రాక్టీస్ చేయడానికి ప్రత్యేక సమయం అవసరంలేదు. ఒకటి రెండు నిమిషాలు చాలు. ప్రతిరోజూ మీరు తినడం, వంట చేయడం లేదా నిద్ర పోవడం వంటి పనులకు ముందు గ్రౌండింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఆలోచనల నుంచి బయటపడి, ఒత్తిడికి దూరంగా ఆనందంగా మారడాన్ని గమనించవచ్చు. మొదట చిన్న చిన్న పనులకు ముందు గ్రౌండింగ్ ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో గ్రౌండింగ్ ఉపయోగించడం సులభం అవుతుంది. సాధనం-2: అన్ హుకింగ్ అన్ హుకింగ్ అంటే మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న ఆలోచనల గాలం నుంచి తప్పించుకోవడం. మూడు దశల్లో ఆ పని చేయవచ్చు. మొదట మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న ఆలోచన లేదా ఫీలింగ్‌ను గుర్తించండి. తర్వాత దాన్ని ఉత్సుకతతో గమనించండి. ఆ తర్వాత ఆ ఆలోచనకు లేదా అనుభూతికి ఓ పేరు పెట్టండి. ఇలా ఆలోచనలను, అనుభూతులను దూరంగా ఉండి గమనించడం, వాటికో పేరు పెట్టడం వల్ల.. మీరు, మీ ఆలోచనలు ఒకటి కాదనే స్పృహæ కలుగుతుంది. అది మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరంగా పెడుతుంది. ఆ తర్వాత మీతో ఎవరున్నారో, మీరేం చేస్తున్నారో దానిపై దృష్టి పెట్టండి. సాధనం-3: విలువలపై స్పందించడం ప్రతి మనిషికీ కొన్ని విలువలుంటారు. మీకు అత్యంత ముఖ్యమైన విలువలేమిటో ఎంచుకోండి. ఉదాహరణకు ప్రేమ, పని, ధైర్యం, దయ, కష్టపడి పనిచేయడం.. ఇలా చాలా! వీటికి దూరంగా జరగాల్సిన పరిస్థితుల్లో ఒత్తిడి కలుగుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ముందుగా మీరు ముఖ్యమైన నాలుగైదు విలువలేమిటో నిర్ణయించుకోండి. వచ్చే వారమంతా మీ విలువలకు అనుగుణంగా పనిచేసే ఒక చిన్న మార్గాన్ని ఎంచుకోండి. మీ విలువలకు అనుగుణంగా జీవించండి. మీరు పాటించలేని విలువల గురించి ఒత్తిడికి గురికాకుండా, మార్చగలిగే వాటిని మార్చండి. మార్చలేని వాటిని వదిలేసి ముందుకు సాగండి. సాధనం-4: ప్రేమతో నింపుకోండి మీరు మీ పట్ల ప్రేమతో, దయతో ఉంటే ఒత్తిడిని అధిగమించడానికి కావాల్సిన శక్తి మీకు వస్తుంది. ఆ ప్రేమ, దయ ఆకాశం నుంచి ఊడిపడవు. మీరే ఊహించుకోవాలి, సృష్టించుకోవాలి. మీ మెదడుకు ఊహకు, వాస్తవానికీ ఉన్న తేడా తెలియదు. కాబట్టి మీరు జస్ట్ ఊహించుకున్నా చాలు దానికి అనుగుణంగా స్పందిస్తుంది. అందుకే మీ దోసిటి నిండా ప్రేమ లేదా దయ ఉన్నట్లు ఊహించండి. దాన్ని ఏ ఆకారంలో ఊహించుకుంటారనేది మీ ఇష్టం. తర్వాత, మీ శరీరంలో బాధ అనిపించే చోట చేతులుంచండి. మీ చేతుల నుంచి శరీరంలోకి ప్రవహించే ప్రేమను, దాని వెచ్చదనాన్ని అనుభవించండి. ఆ ప్రేమ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. -
మీకళ్లు 60లో కూడా 20 లా కనిపించాలని ఉందా!
మొహంలో కళ్లు ఎంత ప్రత్యేకమో.. అంతే సున్నితం కూడా! అందుకే ఫేషియల్స్ చేసినా.. స్క్రబ్ చేసినా..మసాజ్ చేసినా..నయనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. లోషన్స్, క్రీమ్స్ అప్లై చేసుకునేటప్పుడు కూడా కళ్లకు తగలకుండా జాగ్రత్తపడతాం. కీరాముక్కలు, గోరువెచ్చటి కాపడంతో కనుల సోయగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటాం. అపురూపమైన కళ్లు అందంగా.. ఎల్లప్పుడూ ఆకట్టుకునేలా ఉండాలంటే స్పెషల్ కేర్ తప్పనిసరి. వయసుతో వచ్చే నల్లటి వలయాలు, ముడతలు, నిద్రలేమితో కలిగే అలసట.. వీటన్నింటినీ దూరం చెయ్యాలంటే చిత్రంలోని కళ్లజోడు ఎంతో చక్కగా పనిచేస్తుంది. దీన్ని పెట్టుకుని కళ్లు మూసుకుని ఉండటం బోర్ కదా అనుకునే వారికి ఆ దిగులే అవసరం లేదు. ఎందుకంటే ఈ డివైజ్.. పాటలను వినిపిస్తూ కళ్ల పని చూస్తుంది. ఒత్తిడి, అలసట, కళ్ల మంటలు, కళ్లు పొడిబారడం, తలనొప్పి వంటి వాటిని దూరం చేస్తూనే.. 60లో 20లా కనిపించేలా అందాన్ని కాపాడుతుంది. 180 డిగ్రీస్ యాంగిల్లో XECH Eye Massager డివైజ్‌ని సులభంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలా ఫోల్డ్ అయిన గాడ్జెట్ చూడటానికి వైర్లెస్ మౌస్లా ఉంటుంది. డివైజ్‌కి ఒకవైపు.. చార్జర్ జాక్, ఇయర్ ఫోన్ జాక్ ఉంటాయి. పైభాగంలో ఆన్, ఆఫ్, వైబ్రేషన్, మ్యూజిక్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. దీనికి ఇయర్ ఫోన్స్ పెట్టుకునే వీలుండటంతో.. నచ్చిన పాటను వినొచ్చు. నచ్చకుంటే మార్చుకోవచ్చు. సౌండ్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. డివైజ్ ఆన్ చేసుకుంటే సున్నితంగా వైబ్రేట్ చేస్తూ.. ట్రీట్మెంట్ అందిస్తుంది. ఆఫీస్‌లో, ఇంట్లో ఎక్కడైనా దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. దీనికి 2 గంటల పాటు చార్జింగ్ పెడితే చాలు బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఈ డివైజ్ అడుగు భాగంలో సాఫ్ట్ స్కిన్ కేర్ లైనింగ్ అమర్చి ఉంటుంది. వెనుకవైపు బ్యాండ్ అటాచ్ అయ్యి ఉంటుంది. దాని సాయంతోనే తలకు అమర్చుకోవచ్చు. దీని ధర సుమారు 28 డాలర్లు. అంటే 2,108 రూపాయలు. -
ఒత్తిడిని తగ్గించుకోవడానికి... వాడండి.. ఈ అరుపు మాత్రలు
Scream To Release Stress: డాక్టర్ రాసే మాత్రలు వేరు. మనం వాడుకోవాల్సిన మాత్రలు కూడా ఉంటాయి. అమెరికాలో స్త్రీలు ఇప్పుడు ‘స్క్రీమ్ గేదరింగ్స్’లో పాల్గొంటున్నారు. అంటే ఒక మైదానంలో చేరి పెద్ద పెద్దగా అరిచి తెరిపిన పడుతున్నారు. ఎందుకు? ఒత్తిడి దూరం చేసుకోవడానికి. మన దేశంలో కూడా కోవిడ్ వల్ల, కుటుంబ సభ్యుల అనారోగ్యాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల స్త్రీలు లోలోపల వొత్తిడి పేరబెట్టుకుంటున్నారు. ఇది మంచిది కాదు. డాబా మీదకో, గ్రౌండ్లోకో వెళ్లి ‘స్క్రీమ్’ చేయడం ఒత్తిడికి ఒక మందు. ‘లాఫింగ్ థెరపీ’లా ఈ థెరపీ ఇప్పుడు అవసరమే సుమా. సంప్రదాయ చైనీయ వైద్యంలో కొండ చిటారుకో, ఏదైనా ఏకాంత ప్రదేశానికో వెళ్లి పెద్ద పెద్దగా అరవడం కూడా ఒక ఆరోగ్య సాధనం అని నమ్ముతారు. చైనా సంగతేమో కాని అమెరికాలోని స్త్రీలు మా అసహనాన్ని పెద్దగా అరచి పారదోలుతాం అని ఇటీవల ఏదో ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్లోనో పార్క్‌లోనో ‘స్క్రీమ్ గేదరింగ్స్’ నిర్వహిస్తున్నారు. అంటే ఒక పదీ పదిహేను నిమిషాల సేపు పెద్దగా అరిచి తమ మనసులో, శరీరంలో ఉన్న అలజడిని తగ్గించుకోవడం అన్నమాట. దానికి కారణం గత రెండేళ్లుగా కోవిడ్ వారిపై ఏర్పరుస్తున్న ఒత్తిడిని వాళ్లిక సహించలేని స్థాయికి చేరడమే. కోవిడ్‌ను పూర్తిగా నిర్మూలించే వాక్సిన్ ఇంకా రాకపోవడం, వాక్సిన్ వేసుకున్నా దాని బారిన పడుతూ ఉండటం, చంటి పిల్లలకు ఇంకా వాక్సిన్ లేకపోవడం, కోవిడ్ వల్ల అందరూ ఇంట్లో ఉండిపోవాల్సి రావడం, ఉద్యోగాలు ఊడటం, రెట్టింపు పని చేయాల్సి రావడం... ఇవన్నీ పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా గూడు కట్టుకుని పోతున్నాయి. అవి అలాగే లోపల సాంద్రపడటం ప్రమాదం అని నిపుణులు అంటారు. వొత్తిడిని సాటివారితో పంచుకుని రిలీఫ్ పొందాలి. కాని సాటివారు కూడా అలాంటి వొత్తిడిలో ఉంటే ఏమిటి చేయడం. ‘పదండి... అందరం కలిసి అరుద్దాం’ అని అమెరికాలోని స్త్రీలు స్క్రీమ్ థెరపీని సాధన చేస్తున్నారు. అయితే ఈ అరుపులు ఇతరులు వినకపోవడమే మంచిది. పెద్దగా గట్టిగా అరిచే మనిషిని చూడటం, వినడం ఎదుటి వారికి ఆందోళన కలిగించవచ్చు. అందుకే వీలైనంత ఏకాంత ప్రదేశంలో వీటిని సాధన చేయడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. యోగాలో కూడా ‘జిబ్రిష్’ వంటివి సాధన చేయిస్తుంటారు. అంటే ఒక ఐదు పది నిమిషాలు గొంతులో నుంచి ఏ పిచ్చి అరుపులు వస్తే ఆ అరుపులను అలౌ చేస్తూ వెళ్లడం. దీని వల్ల సబ్కాన్షియస్ మైండ్‌లో గూడు కట్టుకుని ఉన్న గాఢమైన భావాలు వదిలిపోతాయని చెబుతారు. మరో పద్ధతి ‘ట్రీ షేక్’. అంటే ఒక చెట్టు గాలికి ఎలా గలగలలాడిపోతుందో అలా మూడు నాలుగు నిమిషాలు నిటారుగా నిలబడి ఒళ్లంతా గలగలలాడించాలి (కదిలించాలి). దాని వల్ల ఒత్తిడి దూరం అవుతుందని నిపుణులు అంటారు. మన దేశంలో అమ్మలు, పెద్దవాళ్లు ఏదైనా ఒత్తిడి పెరగడం వల్ల గట్టిగా తిట్టడం, అరవడం చూస్తూ ఉంటాం. అది ఒక రకంగా స్ట్రెస్ నుంచి దూరమవడమే. ఎన్నో చేదు సంఘటనలు, అయిష్టమైన పరిణామాలు చూసిన స్త్రీలు ‘గయ్యాళి’ ముద్రతో ఉండటం కూడా మన సమాజంలో ఉంది. నిజానికి అదంతా లోపలి ఒత్తిడికి ఒక బయటి ప్రతిఫలనం. ఆ ఒత్తిడి ఏమిటో కనుక్కుని దూరం చేయగలిగితే వారు కూడా శాంత స్వభావులు అవుతారు. గత రెండేళ్లుగా ఇళ్లల్లో ఉగ్గ పట్టుకుని ఉన్న స్త్రీలు ఏ మేరకు ఒత్తిడిలో ఉన్నారో కుటుంబం మొత్తం పట్టించుకోవాలి. ఇవాళ రేపూ అంటూ కోవిడ్ ముగింపు వాయిదా పడే కొద్దీ వారి మనసులో ఎలాంటి భావాలు చెలరేగుతున్నాయో కూడా పరిశీలిస్తూ ఉండాలి. వారు విసుక్కుంటూ ఉంటే, ఒక్కోసారి పని వైముఖ్యం చూపుతుంటే కుటుంబం సంపూర్ణంగా ఆ మూడ్స్‌ను అర్థం చేసుకోవాలి. మగవాళ్లు స్ట్రెస్‌ను తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం వెతుక్కుంటారు. వారికి కనీసం బయట ఒకరిద్దరు స్నేహితులను కలిసే వీలు ఉంటుంది. స్త్రీలు ఇళ్లకే పరిమితమయ్యే అనివార్య పరిస్థితులు ఈ రెండేళ్లలో వచ్చాయి. అందుకే వారి మానసిక ఆరోగ్యం కూడా శ్రద్ధ పెట్టక తప్పదు. మంచి నిద్ర, ఉల్లాసం, ఆశావహమైన భవిష్యత్తు కనిపించకనే తాము పార్కుల్లో చేరి కేకలేస్తున్నాం అంటున్నారు అమెరికా వనితలు. ‘మా మీద మేము అరుచుకోలేము. కుటుంబం మీద అరవలేము. పిల్లల చదువు సరిగ్గా సాగకపోవడం మాకు చాలా వొత్తిడి కలిగిస్తోంది. వాళ్ల మూడ్స్ కూడా మాకు కష్టమే. మాకు వొత్తిడిగా ఉంది. అందుకే ఏడ్చి తెప్పరిల్లే బదులు అరిచి తెరిపిన పడుతున్నాం’ అని బోస్టన్‌లో స్క్రీమ్ థెరపీలో పాల్గొన ఒక గృహిణి అంది. ‘కోపం పోవడానికి పంచింగ్ బ్యాగ్‌ను పంచ్ చేయడం ఎలాగో ఒత్తిడి పోవడానికి ఇలా పెద్దగా అరవడం అలాగా’ అని కొందరు నిపుణులు అంటున్నారు. యుద్ధ సైనికుడు గెలుపు నినాదం ఇచ్చినట్టు, కుంగ్‌ఫూ ఫైటర్ పంచ్ ఇచ్చే ముందు అరిచినట్టు, కింగ్ కాంగ్ శత్రువు మీద దాడి చేసే ముందు గుండెలు చరుచుకున్నట్టు మామూలు మనుషులు కూడా ఏదో ఒక పార్కులో చేరి తమ లోపల ఉన్న ఒత్తిడి అనే శత్రువును ఈ పద్ధతుల్లో ఓడించవచ్చని నిపుణులు అంటున్నారు. స్క్రీమ్ థెరపీ వల్ల ప్రయోజనం ఎలా ఉన్నా దాని వంకతో తమ లాంటి కొంతమంది స్త్రీలతో ఏదో ఒక మేరకు కొత్త స్నేహం, సంభాషణ కూడా ఒత్తిడి తగ్గిస్తాయి. కాబట్టి కొత్త మార్గాలు వెతకండి. ఆరోగ్యంగా ఉండండి. ఒత్తిడిని ఒంట్లో నుంచి ఖాళీ చేయండి. -
కరోనా : రిలాక్స్ అవ్వాలంటే జపాన్‌కి..
టోక్యో : కరోనా మహమ్మారి కంటే భయమే ఎక్కువ ప్రమాదకరం. తమకు కరోనా సోకుతుందేమా అన్న భయంతోనే కొందరు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు చూశాం. దీంతో కోవిడ్ నుంచి దృష్టి మళ్లించి ప్రజల్లో భయాన్ని పోగొట్టాలనే లక్ష్యంతో జపాన్‌లోని ఓ ఈవెంట్ మేనేజింగ్ సంస్థ దీనికి అనుగుణంగా ఓ హార్రర్ షోను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కస్టమర్ శవపేటికలో పడుకుంటే భయానక అరుపులు వినిపిస్తాయి. అంతేకాకుండా ఈ పెట్టె బయటినుంచి కొందరు వ్యక్తులు దెయ్యాలుగా మిమ్మల్ని భయపెడుతుంటారు. " స్కేర్ స్క్వాడ్'' పేరుతో ఉండే ఈ షోలో 15 నిమిషాల సేపు గడపొచ్చు. దీంతో కోవిడ్ అనే భయం నుంచి కాసేపు ఉపశమనం పొందవచ్చు అని ఈవెంట్ నిర్వాహకులు కెంటా ఇవానా తెలిపారు. (ఆకలి చచ్చిపోయింది.. ఇంకోసారి ఇలా చేయకండి) కరోనా వల్ల ప్రజల్లో నెలకొన్న ఒత్తిడిని వదిలించేందుకు మాదో చిన్న ప్రయత్నం అని అన్నారు. అంతేకాకుండా సామాజిక దూరం పాటించేలా ప్లాస్టిక్ షీల్డ్‌లు, గ్లవుజులు వంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వారాంతాల్లో నిర్వహించే ఈ హార్రర్ షోలకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, వారు సైతం ప్రత్యామ్నాయలను వెతుక్కుంటున్నారని పేర్కొన్నారు. దీని వల్ల ప్రజలకు ఉపశమనంతో పాటు తమకు కూడా మంచి ఆదాయం లభిస్తోందని తెలిపారు. 'శవపేటికలో పడుకున్నాక అసలు భయట ఏం జరుగుతుంది, కోవిడ్ పరిస్థితులు అన్న ఆలోచనలు ఏమీ రాలేదు. అక్కడ ఉన్నంతసేపు హార్రర్ సినిమాని ప్రత్యక్షంగా చూసినట్లు అనిపిస్తుంది. చాలా రిలాక్స్ అయ్యాను' అని ఓ కస్టమర్ వివరించారు. ఇక జపాన్‌లో గడిచిన 24 గంటల్లో 1034 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. (డిసెంబరు నాటికి వ్యాక్సిన్; ప్లాస్మా చికిత్సకు గ్రీన్ సిగ్నల్!) -
పోలీస్ అధికారులకు స్ట్రెస్ థెరపీ: ఎస్పీ
కోలారు: విధి నిర్వహణలో పోలీసు అధికారులు ఒత్తిడిని అదిగమించేందుకు స్ట్రెస్ థెరఫీ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు జిల్లా ఎస్పీ దివ్య వీ గోపినాథ్ తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మాలూరు సీఐ రాఘవేంద్రన్ అనుమానాస్పద మృతి కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాఘవేంద్రన్ విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యారా ? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ.. ఒత్తిడికి గురయ్యారా లేక ఆత్మహత్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కూలంకుషంగా దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.