మలయాళ భాషల్లో అనేక అద్భుతమైన సినిమాల్లో నటించిన ఫహాద్ ఫాజిల్, తెలుగులో మాత్రం ‘పుష్ప’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే మలయాళ బ్యూటీ, హీరోయిన్ నజ్రియా నజీమ్ భర్త కూడా. అయితే తాను అటెన్షన్ డిఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ)తో బాధపడుతున్నట్టు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అసలు ఏడీహెచ్‌డీ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది, దీనికి చికిత్సా విధానాలు ఏమిటి? ఒకసారి చూద్దాం.
ఏడీహెచ్‌డీ: ఆవేశం సినిమాతో సహా, వరుస హిట్‌లు అందుకుంటున్న ఫహాద్ ఒక వ్యాధితో బాధపడుతున్నారు. ఇదొక మానసిక వ్యాధి. ఏదైనా అంశంపై ఏకాగ్రత లేకపోవడం, అతిగా స్పందించడం, ఇంపల్సివ్ బిహేవియర్ (ఆలోచించకుండానే స్పందించడం) లాంటి ఇబ్బందులు ఏడీహెచ్‌డీలో కనిపిస్తాయి. దీని వల్ల వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగం లేదా చదువుపై కూడా శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. కొందరిలో ఆత్మవిశ్వాసం కూడా చాలా తగ్గిపోతుంటుంది. కొందరికి చిన్న వయసులోనే ఇది మొదలు అవుతుంది. పెద్దయ్యే వరకూ ఇది పీడిస్తూనే ఉంటుంది.
లక్షణాలు
ఇది సాధారణంగా పిల్లలలో కనిపిస్తుంది. దీని లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తే, మరికొందరిలో లక్షణాలు తీవ్రంగా ఉండొచ్చు. తీవ్ర లక్షణాలు ఉన్నవారితో పోలిస్తే ఒకమాదిరి లక్షణాలుండేవారిలో ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టం. లక్షణాల ఆధారంగా మానసిక వైద్య నిపుణులు ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.
ఆలోచించకుండానే స్పందించడం (ఇంపల్సివ్‌నెస్)
టైమ్ మేనేజ్‌మెంట్‌లో ఇబ్బందులు
ఏకాగ్రత లోపించడం, పనిపై దృష్టి పెట్టలేరు, లేదా ప్రాధాన్యత ఇవ్వలేరు.
మల్టీ టాస్కింగ్ చేయడం కష్టం. మూడ్ స్వింగ్స్
క్యూలో వేచి ఉండటం లేదా ట్రాఫిక్‌లో ఉన్నా ఉద్రేకపడతారు.
అతిగా ఆవేశం ఒత్తిడిని తీసుకోలేకపోవడం లాంటివి సాధారణంగా కనిపిస్తాయి.
ముఖ్యంగా ఏడీహెచ్‌డీ రోగుల్లో మూడ్ డిజార్డర్స్ తీవ్రంగా ఉంటాయి. దీంతో తీవ్రమైన డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ లాంటివి ముఖ్యమైనవి. ఏడీహెచ్‌డీ వల్ల రోగుల్లో యాంక్సైటీ సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రతిదానికీ ఆందోళన పడటం, గుండె వేగం పెరగడం లాంటి సమస్యలు వీరిలో కనిపించొచ్చు. పర్సనాలిటీ డిజార్డర్లు, లెర్నింగ్ డిసేబిలిటీస్ కూడా ఏడీహెచ్‌డీ రోగుల్లో కనిపించొచ్చు.
ఏడీహెచ్‌డీ కారణాలు
స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ, ప్రస్తుతం దీనిపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. జన్యు కారణాలు, నాడీ సమస్యలు, పర్యావరణం లాంటి అంశాలు ఈ వ్యాధి వచ్చేందుకు ప్రభావితం చేస్తాయంటారు పరిశోధకులు. ముఖ్యంగా చిన్నప్పుడే సీసం లాంటి లోహాల ప్రభావానికి లోనైనప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే ముప్పు పెరుగుతుంది.నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లోనూ , గర్భంతో ఉన్నప్పుడు మహిళలు మద్యపానం, ధూమపానం లాంటివి చేసినా పిల్లల్లో ఏడీహెచ్‌డీ ముప్పు పెరగొచ్చు. ఏడీహెచ్‌డీతో బాధపడే వారు వైద్యుల పర్యవేక్షణలో కొన్ని రకాల ఔషధాలతోపాటు ,మానసిక థెరపీలను తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment