
సాధించాలన్న పట్టుదల ఉండాలే గానీ కొండమీది కోతినైనాకిందికి దింపవచ్చు. వయసుతో సంబంధం లేకుండా తన శక్తిని, ఆసక్తిని వినియోగించి కోటీశ్వరుడుకావచ్చు. ఉదయపూర్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ కథే ఇందుకు చక్కటి ఉదాహరణ. 16 ఏళ్ల వయసులో ఉన్న దిగ్విజయ్ సింగ్ తీసుకున్న ఈ చిన్న నిర్ణయం దిగ్విజయమైంది. తనకంటూ ఒక సొంత బ్రాండ్‌ను ప్రారంభించడానికి దారితీసింది. స్ఫూర్తిదాయకమైన దిగ్విజయ్ సక్సెస్ గురించి తెలుసుకుందాం.
కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచమంతా లాక్‌డౌన్ అయింది. చాలా మంది ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఉద్యోగాలు లేక, చేతిలో చిల్లిగవ్వ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఉదయపూర్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ మాత్రం వినూత్నంగా ఆలోచించాడు, కరోనా ఇచ్చిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. యూట్యూబ్ నుంచి చాక్లెట్ తయారీని నేర్చుకున్నాడు. ఆ హాబీనే తరువాత బిజినెస్‌గా మార్చుకున్నాడు. తన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించడంతో ‘సారామ్’ అనే బ్రాండ్‌ను మొదలు పెట్టాడు. కట్ చేస్తే దిగ్విజయ్ బిజినెస్ కోటి రూపాయలకు చేరింది. దేశవ్యాప్తంగా చాక్లెట్లను విక్రయిస్తోంది. సారామ్‌లో కుల్ఫీలు, కుకీలు కూడా చేరాయి. ప్రస్తుతం దీన్ని మరింత విస్తరించే ప్రణాళికల్లో ఉన్నాడు.
ఉదయ్‌పూర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన దిగ్విజయ్ ఎప్పుడూవిభిన్నంగా ఆలోచించేవాడు. ఇందులో భాగంగా కోవిడ్‌లో దొరికిన ఖాళీ సమయం దిగ్విజయ్ విజయానికి బాటలు వేసింది. తనకెంతో ఇష్టమైన చాక్లెట్‌ను ఇంట్లోనే తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే తన ఆలోచనను తన సోదరుడు మహవీర్ సింగ్‌తో పంచుకున్నాడు. సోదరుడు కూడా సై అన్నాడు గానీ చాక్లెట్ ఎలా తయారు చేయాలో తెలియదు. అందుకే యూట్యూబ్‌ను ఆశ్రయించాడు. పలు సార్లు విఫలమైన తర్వాత పట్టుసాధించాడు. అలా తయారు చేసిన చాక్లెట్లను తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తినిపించడం ప్రారంభించాడు. ఇంతలో దీపావళి సందర్భంగా దిగ్విజయ్ తండ్రి కారు కొన్నారు. ఆయనకు చాక్లెట్ బాక్స్ బహుమతిగా ఇచ్చారు. ఇక్కడే మనోడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. షోరూమ్ ఓనర్లు తమ కస్టమర్లకు ప్రతి కార్ సేల్‌లో ఒకే చాక్లెట్ బాక్స్‌ను అందజేస్తారని తెలుసుకున్న దిగ్విజయ్ తన ఇంట్లో తయారు చేసిన చాక్లెట్‌లను విక్రయించడానికి హోటల్ యజమానులు, కార్ షోరూమ్‌లను సంప్రదించాడు.
తొలి ఆర్డర్
అలా 2021లో దిగ్విజయ్ ఒక కార్ షోరూమ్ నుంచి వెయ్యి రూపాయల చాక్లెట్ల మొదటి ఆర్డర్‌ను అందుకున్నాడు. ఇక అంతే అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. సారామ్ ఒక ప్రధాన చాక్లెట్ బ్రాండ్‌గా మారిపోయింది. 2023 నాటికి, సారామ్ రెండు టన్నులకు పైగా చాక్లెట్‌ను విక్రయించింది. ఢిల్లీ, బెంగళూరు, ఉదయపూర్, జైపూర్ వంటి నగరాల్లో వారికి కస్టమర్లు ఉన్నారు. కేరళ ,తమిళనాడు నుండి సేకరించిన కోకోతో పాటు కోకుమ్, బేర్, జామున్ ఐస్ ఆపిల్ వంటి స్వదేశీ పండ్లతో చాక్లెట్‌లను తయారు చేయడం ఇతని ప్రత్యేకత. స్థానిక రైతులతో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రత్యేకమైన రుచులను సృష్టిస్తూ ప్రాంతీయ వ్యవసాయానికి మద్దతు ఇస్తాడు.
"నాకు చాక్లెట్టు అంటే చాలా ఇష్టం అని దిగ్విజయ్ సింగ్ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పాడు. క్లాసెస్ ఆన్‌లైన్‌లో ఉండటంతో చాలా సమయం దొరికింది. వివిధ ప్రయత్నాల తర్వాత ఇంట్లో చాక్లెట్లు తయారు చేసుకోవడం మొదలుపెట్టానని చెప్పాడు. ఎలాంటి అధికారిక శిక్షణ లేకుండానే YouTube ట్యుటోరియల్ ద్వారానే ఇది సాధించాడు. పార్ట్‌టైమ్ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయంతో తన ప్రయోగాలకు డబ్బులు సమకూర్చుకున్నానని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment