
కడుపు ఉబ్బరంగా ఉందని చాలా మంది డాక్టర్లను సంప్రదించడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఎందుకంటే ఈ సమస్య ఉన్నప్పుడు ఏ పనీచేయలేం. స్థిమితంగా ఉండలేం. మన జీవనశైలి వల్లే ఈ సమస్య వచ్చిందని గ్రహించి, అందుకు అనుగుణమైన మార్పు చేర్పులు చేసుకోవడం అవసరం. ఎక్కువ సేపు ఒకేచోట కూర్చుని పని చేయడం, శారీరక వ్యాయామం లేకపోవడం, అతి నిద్ర లేదా అసలు నిద్రలేకపోవడం, కొన్ని వ్యాధులకు వాడే మందుల వల్ల జీర్ణాశయంలో, పేగుల్లో కొన్ని సూక్ష్మ జీవుల వల్ల గ్యాస్ ఏర్పడుతుంది.
లక్షణాలు
పొట్ట ఉబ్బరం, ఆహారం తీసుకున్న తర్వాత ఆయాసం, కడుపులో నొప్పి, గుండెలో మంట, తేన్పు రావడానికి ఇబ్బంది, తిననప్పుడు కూడా కడుపు ఉబ్బరించుకోవడం. నడవడానికి కూడా ఇబ్బంది.
నివారణ ఇలా...
కడుపు ఉబ్బరాన్ని నివారించడంలో వ్యాయామం ముఖ్యమైంది. రోజు 40 నిమిషాలు ఉదయం లేక సాయంత్రం బ్రిస్క్‌వాక్ చేయాలి. నీళ్లు తగినన్ని తాగాలి. కుదిరితే స్విమ్మింగ్ చేయడం లేదా స్కిప్పింగ్ చేయడం అంటే తాడాట ఆడటం మంచిది. తిన్న వెంటనే పడుకోకుండా కొద్ది దూరం ఇంట్లోనే నడవాలి. గ్యాస్ ఎక్కువ చేసే పదార్థాలు, మసాలా తగ్గించాలి. మద్యం సేవించకూడదు. వేళకు ఆహారం తీసుకోవాలి.
చికిత్స ఇది...
►ఒక గ్లాస్ నీటిలో నాలుగైదు చిన్న చిన్న అల్లం ముక్కలు వేసి ఆ నీటిని బాగా మరిగించి కొద్దిగా వేడిగా ఉండగానే ఆ నీటిని తాగేయాలి.
►అల్లం ముక్కలను దంచి రసం తీసి ఆ రసాన్ని తేనెతో కలిపి తాగినా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. చెంచాడు వాము తీసుకుని అందులో కొంత ఉప్పు వేసి బాగా నలిపి ఆ మిశ్రమాన్ని తిని, నీరు తాగాలి.
►గ్లాసు నీరు లేదా తేనె, లేదా నిమ్మరసం లో కొద్దిగా బేకింగ్ సోడాను కలిపి తాగితే గ్యాస్ సమస్య తగ్గుముఖం పడుతుంది. ∙గ్లాస్ నీళ్లలో కొన్ని సోంపు గింజలను వేసి మరిగించి.. ఆ నీటిని వడకట్టి వేడిగా ఉండగానే తాగితే గ్యాస్ ఏర్పడకుండా ఉంటుంది.
►ఆకలి లేకపోవటం వల్ల పొట్ట ఉబ్బరిస్తుంటే జీలకర్రను దోరగా వేయించి, పొడిచేసి, అరచెంచాడు నుంచి చెంచాడు మోతాదుగా భోజనానికి ముందు అరకప్పు వేడినీళ్లతో తీసుకోవాలి. వాము, అల్లం, జీలకర్రను సమ భాగాలుగా తీసుకొని సైంధవ లవణం కలిపి నూరి ఉదయం, సాయంకాలాలు పుచ్చుకోవాలి. నిరంతరం కడుపుబ్బరంతో బాధపడేవారు భోజనానికి ముందు రెండు, మూడు అల్లం ముక్కలను ఉప్పుతో అద్దుకొని తింటుండాలి.
Comments
Please login to add a commentAdd a comment