
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటింటి ఫీవర్ సర్వే శనివారానికి రెండో రోజుకు చేరుకుంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుసహా అనేక చోట్ల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒమిక్రాన్ తీవ్రత నేపథ్యంలో మాస్క్‌లు ధరించాలని, వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. రెండ్రోజుల్లో 29.26 లక్షల ఇళ్లకు వెళ్లి ఫీవర్ సర్వే చేపట్టినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో 1.28 లక్షల మందిలో జ్వర లక్షణాలను గుర్తించారు. వారిలో 1.27 లక్షల మందికి హోం ఐసోలేషన్ మెడికల్ కిట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు.
వారం రోజుల్లోగా మొదటి విడత ఫీవర్ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. అవసరమైతే రెండో విడత సర్వే జరిపే అవకాశముంది. కరోనా తీవ్ర లక్షణాలున్న వారికి తక్షణమే టెస్టులు చేసి, అవసరమైతే ఆసుపత్రులకు పంపిస్తున్నారు. కాగా, కోటి హోంఐసోలేషన్ కిట్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటివరకు 50 లక్షల కిట్లు సిద్ధం చేసినట్లు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఫీవర్ సర్వేలో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తేæ మందులు ఇవ్వడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి తెలిపారు.