మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైద్య, మున్సిపల్ సిబ్బందితో సర్వే చేస్తున్న అధికారులు
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో ఏ ఇంట్లో చూసినా.. ఎవరో ఒకరికి జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు.. కొందరిలో అన్ని లక్షణాలూ ఉంటే.. మరికొందరు ఏదో ఓ లక్షణంతో కనిపిస్తున్నారు. కొందరు స్వల్పంగా ఇబ్బందిపడుతుంటే.. ఇంకొందరు తీవ్రంగా అవస్థ పడుతున్నారు. మొత్తంగా ఎక్కడ చూసినా.. కరోనా తరహా లక్షణాలతో బాధపడుతున్నారు. జ్వర సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న వైద్య బృందాలకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ మొదలైన తర్వాత ఇప్పుడు బాధితుల సంఖ్య భారీ స్థాయిలో కనిపిస్తోందని వైద్య నిపుణులు చెప్తున్నారు.
వేలాది బృందాలతో వేగంగా..
‘ఇంటింటికి ఆరోగ్యం’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐదో విడత జ్వర సర్వే మూడు రోజులుగా సాగుతోంది. 25 వేల మంది ఏఎన్‌ఎంలు, 7వేల మందికిపైగా ఆశా కార్యకర్తలు, వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ఒక్కో బృందం రోజుకు 50 ఇళ్ల చొప్పున సర్వే చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది. కోవిడ్ లక్షణాలున్న వారికి అక్కడికక్కడే కిట్లు అందజేసి హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తోంది. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 42.30 లక్షల ఇళ్లకు సర్వే బృందాలు వెళ్లాయి. జ్వరం, జలుబు, గొంతునొప్పి ఇతర లక్షణాలు ఉన్న 1,78,079 మందిగా గుర్తించి.. హోం ఐసోలేషన్ కిట్లు అందజేశాయి. ఆదివారం ఒక్కరోజే 13.04 లక్షల ఇళ్లలో సర్వే చేయగా.. 50,833 మందిలో లక్షణాలను గుర్తించి, కిట్లు అందజేశారు. అయితే సర్వే సందర్భంగా కొందరు పరీక్షలకు అంగీకరించడం లేదని వైద్యారోగ్యశాఖ సిబ్బంది చెప్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కువగా ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం వంటి జిల్లాల్లో కనిపిస్తోందని అంటున్నారు.
జిల్లాల వారీగా ఇదీ పరిస్థితి...
– ఉమ్మడి వరంగల్‌లో 1,03,021 ఇళ్లలో సర్వే నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో 22,375 ఇళ్లను పరిశీలిస్తే.. 3,356 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. భీమదేవరపల్లి మండల కేంద్రంలో 250 మందిని పరీక్షిస్తే.. 60 మందికి జలుబు, జ్వరం ఉన్నట్లు వెల్లడైంది. జనగామ జిల్లాలో 98,292 గృహాల్లో సుమారు 5 వేల మందికి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 17,759 ఇళ్లలో 1,892 మందికి లక్షణాలున్నట్టు గుర్తించారు.
– నల్లగొండ జిల్లాలో 1,30,558 ఇళ్లలో సర్వే చేసి 4,519 మందికి కిట్లను అందజేశారు.
– ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 5,41,763 ఇళ్లలో సర్వే పూర్తికాగా.. జ్వరం, జలుబు తదితర లక్షణాలతో 14,875 మంది బాధపడుతున్నట్టు గుర్తించారు.
– ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 9,603 మందికి, నిజామాబాద్ జిల్లాలో 4,164 మందికి కిట్లను అందజేశారు.
– ఖమ్మం జిల్లాలో 1,33,150 ఇళ్లలో సర్వే చేసి, 4,604 మంది బాధితులను గుర్తించారు.
– సంగారెడ్డి జిల్లాలో 7,465 మందికి, మెదక్ జిల్లాలో 4,999 మందికి, సిద్ధిపేట జిల్లాలో 2,956 మందిని ఐసోలేషన్ కిట్లు అందజేశారు.
మూడు రోజుల నుంచి జ్వరం, జలుబు
‘‘మూడు రోజుల కింద ఆరోగ్య సిబ్బంది మా ఇంటికి వచ్చి సర్వే చేశారు. అప్పటికే నాకు జలుబు, జ్వరంతో అవస్థ పడుతున్న. వికలాంగుల కుటుంబమైన మేం పట్టణ ప్రాంతాలకు చికిత్సకోసం పోలేని పరిస్థితి. ఆరోగ్య సిబ్బంది ఇచ్చిన మందులు వేసుకుంటున్నాం.’’
– సుడిగల రాధ, కడవెండి, దేవరుప్పుల మండలం, జనగామ జిల్లా
రెండు డోసులు వేసుకున్నా జ్వరమొచ్చింది
‘‘కరోనా టీకాలు రెండు డోసులు వేసుకున్నాం. అయినా ఈ మాయదారి రోగం ఏంటో అర్థంకాకుండా ఉంది. ఎక్కడికీ పోవడం లేదు. ఇంటి పట్టునే ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు మళ్లాజ్వరమొచ్చింది. ఆరోగ్య సిబ్బంది మందులిచ్చారు.’’
– తుమ్మ బుచ్చమ్మ, చిన్నబోయినపల్లి, ములుగు జిల్లా
కొందరు లక్షణాలున్నా చెప్పట్లేదు
‘‘కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జ్వర సర్వే చేపట్టింది. ఇంటింటికి వచ్చే వైద్య బృందాలకు అందరూ సహకరించాలి. కొందరు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నా చెప్పడం లేదు. బయటికి వెళ్లి తిరుగుతున్నారు. ఇది సరికాదు. లక్షణాలు ఉన్నా, పాజిటివ్ వచ్చినా.. దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బందిని సంప్రదించి.. వారు చెప్పే జాగ్రత్తలు, సూచనలు పాటించాలి. ఇంటింటి జ్వర సర్వే వేగంగా జరుగుతోంది. లక్షణాలున్న వారికి ఐసోలేషన్ కిట్లు అందజేస్తున్నాం.’’
– డాక్టర్ సుదర్శనం, డీఎంహెచ్‌వో, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment