ప్రతీకాత్మకచిత్రం
కరోనా గురించి కొత్త కొత్త పరిశోధనల్లో తేలుతున్న విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అలాంటి ఒక అధ్యయనంలో ఈ ‘లాంగ్ హాలర్స్’ గురించి తెలిసింది. ‘కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బాగైపోయాం’ అనుకున్నవారిని సైతం కోవిడ్ లక్షణాలు మరికొంతకాలం పాటు బాధపెడుతుంటాయి. అలా బాధపడే పరిస్థితిని ‘లాంగ్ కోవిడ్’ లేదా ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19’ అనీ... అలా బాధపడేవారినే ‘‘లాంగ్ హాలర్స్’’గా పేర్కొంటున్నారు. క్లివ్‌లాండ్ క్లినిక్‌లోని లోరియన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్... ‘ఫ్యామిలీ మెడిసిన్’ విభాగానికి చెందిన వైద్యపరిశోధకుడు క్రిస్టోఫర్ బబియుక్ అనే పరిశోధకుడు ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19’ గురించీ... అలాగే ‘లాంగ్ హాలర్స్’పై తన పరిశోధన పత్రాన్ని సమర్పించగా... ఇటీవలే దీని వివరాలను బయటికి వెల్లడించారు. లాంగ్ హాలర్స్ అంటే ఎవరు, వారి లక్షణాలేమిటి, వారి సమస్యలకు కారణాలేమిటి లాంటి అనేక విషయాలు తెలిపేదే ఈ కథనం.
‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బాధితులు ఎవరు?
ఈ ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బారిన ఎవరు పడతారు? ఎలాంటి లక్షణాలూ లేని అసింప్టమాటిక్ రోగులు దీని బారిన పడరా? కేవలం మూడు, నాలుగు వారాల పాటు కూడా నెగెటివ్ రానివారే దీని బారిన పడతారా?... ఈ సందేహాలు మీ మదిలో రావచ్చు. కానీ అలాంటి మినహాయింపులేమీ ఈ లాంగ్ హాలర్స్‌కు ఉండవంటున్నారు పరిశోధకులు. ఎలాంటి లక్షణాలూ లేకుండా ఉన్నవారూ, కొద్దిపాటి లక్షణాలతో తేలిగ్గానే కరోనా బారినుంచి తప్పించుకున్నవారు మొదలుకొని సుదీర్ఘకాలం పాటు దాని బారిన పడ్డవారు ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బారిన పడవచ్చు. అలాగే ఎవరో వయోవృద్ధులకు మాత్రమే అది పరిమితమేమో అంటూ కూడా పొరబడవద్దు. ఎందుకంటే... యౌవనంలో ఉన్నవారూ, నడివయసువారు, అప్పుడే వృద్ధాప్యంలో అడుగుపెట్టినవారు మొదలుకొని బాగా వయోవృద్ధుల వరకు అందరూ దీనిబారిన పడే అవకాశాలున్నాయంటున్నారు క్రిస్టోఫర్ బబియుక్ అనే పరిశోధకుడు. పైగా ఇదొక ఛాలెంజింగ్ పరిస్థితి అని... అందరికీ ఒకేలాంటి చికిత్స కాకుండా... ప్రతి ఒక్కరికీ వారి వారి పరిస్థితి ని బట్టి వేర్వేరు చికిత్సలు అందించేలా జబ్బు విసురుతున్న సవాలే ఈ సమస్య అని క్రిస్టోఫర్ బబియుక్ పేర్కొంటున్నారు. ఆయన పేర్కొన్న శాస్త్రీయ వివరాలు చాలావరకు సాధారణ ప్రజలకూ పనికివచ్చేవే.
ప్రశ్న: గతంలో చాలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారే ‘లాంగ్ హాలర్స్’గా మారే అవకాశం ఉందా?
సమాధానం: ఒకరకంగా అలాగే అనుకోవచ్చు. కానీ కచ్చితంగా అదేనిజం అని అనుకోడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే గత మన అనుభవాలను బట్టి గతంలో ఏదో క్రానిక్ జబ్బులతో బాధపడేవారే ఇలా సుదీర్ఘకాలం పాటు ఏవో లక్షణాలతో బాధపడుతుంటారని తేలినా... కొందరు మామూలు వ్యక్తుల్లో సైతం కొన్ని లక్షణాలు అదేపనిగా కొనసాగుతున్నాయి. అందుకే ఈ స్థితి ఫలానా నిర్దిష్ట వ్యక్తుల్లోనే కనిపిస్తుందని ఇదమిత్థంగా ఇప్పుడే చెప్పడానికి వీలు కావడం లేదు.
ప్రశ్న : ఈ లాంగ్ హాలర్స్‌లో కనిపిస్తున్న లక్షణాలేమిటి?
సమాధానం: చాలా లక్షణాలే ఈ లాంగ్ హాలర్స్‌లో ఉన్నాయి. అవి... దీర్ఘకాలికం గా కొనసాగే తీవ్రమైన దగ్గు, ఛాతీ పట్టేసినట్టుగా ఉండటం, శ్వాస సరిగా అందకపోవడం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులు, కొందరిలో నీళ్లవిరేచనాలు కూడా. అయితే ఈ అందరిలోనూ కనిపిస్తూ ఉండే ఒకే ఒక లక్షణం తీవ్రమైన అలసట. దీన్నే ‘క్రానిక్ ఫెటీగ్’గా చెప్పవచ్చు. ఇలాంటి చాలామంది లాంగ్ హాలర్స్‌లో ‘బ్రెయిన్ ఫాగ్’ కూడా కనిపిస్తోంది. అంటే... మంచు కప్పి ఉన్నప్పుడు ఏదీ స్పష్టంగా తెలియనట్టే... వీళ్లలో కూడా ఏ ఆలోచనా స్పష్టంగా లేక అయోమయానికి గురవుతుంటారు. దీన్నే ‘బ్రెయిన్ ఫాగ్’ అని అంటారు.
ప్రశ్న : ఈ లాంగ్ హాలర్స్ నుంచి ఈ లక్షణాలు ఒకరి నుంచి మరొకరికి పాకుతాయా అంటే ఈ ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ అంటువ్యాధా?
సమాధానం : అదృష్టవశాత్తూ కాదు. ఎందుకంటే ఇవన్నీ అప్పటికే కరోనా సోకి తగ్గినవారిలో కనిపించే కొన్ని దీర్ఘకాలిక లక్షణాలు. అంతేతప్ప ఇదో వ్యాధి కాదు. అందునా అంటువ్యాధి కాదు. అందుకే, అంటుకుంటుందేమో అని దీనిగురించి ఆందోళన అక్కర్లేదు. కేవలం కరోనా వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయినవారి నుంచే ఆ వైరస్ మరొకరికి అంటుకుంటుది. రెండువారాల తర్వాత వైరస్ దేహం నుంచి తొలగిపోయాక ఏ రోగీ కరోనాను వ్యాపింపజేయలేడు. (అతడు కాంటేజియస్ కాదు). కాబట్టి వ్యాధి సోకిన రెండు వారాల తర్వాత అటు రోగినీ, ఇటు లాంగ్ హాలర్స్‌నీ అనుమానాస్పదంగా చూడాల్సిన అవసరం లేదు. పైగా వారికి సమాజం నుంచి మరింత సానుభూతి, సహకారం అవసరం.
ప్రశ్న: కొందరిలో ఈ లక్షణాలు సుదీర్ఘకాలం ఎందుకు కొనసాగుతున్నాయి?
సమాధానం : కరోనా వచ్చి తగ్గాక చాలామందిలో అది వారి అంతర్గత అవయవాల్లో ‘ఇన్‌ఫ్లమేషన్’ (వాపు, మంట లాంటి స్థితి) తీసుకొస్తుందన్న విషయం తెలిసిందే కదా. బహుశా ఆ ‘ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్’ అన్నీ సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ లక్షణాలన్నీ కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలూ, పరిశోధకుల అంచనా. అందుకే ఈ అంశాలపై ఇప్పటికే పరిశోధన కొనసాగుతోందనీ, ఇంకా చాలా అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు కొనసాగితే సుదీర్ఘకాలంలో అప్పటికే కిడ్నీవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెజబ్బులు ఉన్నవారిపై కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావం వల్ల కలిగే ఫలితాలేమిటో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికైతే పరిశోధనలు మాత్రం విస్తృతంగా కొనసాగుతున్నాయి.
ప్రశ్న: ఇప్పుడీ పరిస్థితిలో ‘లాంగ్ హాలర్స్’ ఏం చేయాలి?
సమాధానం : కరోనా తగ్గిందనీ, తమకు నెగెటివ్ వచ్చిందని తెలిశాక కూడా లక్షణాలు కనిపిస్తున్నా లేదా కోవిడ్–19 వచ్చి తగ్గిందనుకున్న 28 రోజుల తర్వాత కూడా మళ్లీ లక్షణాలు కనిపిస్తున్నా ముందుగా వారు డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పటికి ఉన్న అవగాహన మేరకు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు తమ పల్మునరీ (ఊపిరితిత్తులకు సంబంధించిన), కార్డియోవాస్కులార్ (గుండెకు సంబంధించిన), న్యూరలాజికల్ (మెదడు సంబంధిత) పరీక్షలను వారి వారి డాక్టర్ల సలహాల మేరకు చేయించుకుంటూ ఉండాల్సి రావచ్చు. ఇక ఆ తర్వాత వారంతా క్రమం తప్పకుండా దేహానికి మంచి ఖనిజలవణాలు దొరికేలా ఎప్పుడూ ద్రవాహారాలు తీసుకుంటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటూ, మంచి ఆహారం తింటూ, కంటినిండా నిద్రపోతూ... శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలి. ఈ అంశాలన్నింటినీ ఆరోగ్యవంతులూ, కరోనాకు గురికాని వారందరు కూడా పాటిస్తే అవి వాళ్లందరికీ మేలు చేసేవే.
ప్రశ్న: లాంగ్ హాలర్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
సమాధానం : లాంగ్ హాలర్స్‌తో సహా... ప్రతివారూ, కరోనా వచ్చి తగ్గిన వారు సైతం (వారి వారి దేశాల్లోని ప్రభుత్వ, వైద్య సంస్థలు చెప్పిన నిర్ణీత కాల వ్యవధి ముగిశాక) తప్పక వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment