Cordial relations
-
వారు తెలుగువారే.. కర్ణాటకలో ఉద్యోగాలు చేస్తుంటారు!
అమరాపురం: వారు తెలుగువారే. అయినా కన్నడ మాట్లాడతారు. కన్నడ మాధ్యమంలో చదువుకుంటారు. కర్ణాటకలో ఉద్యోగాలు చేస్తుంటారు. అంతేనా.. వివాహ, వ్యాపార సంబంధాలు సైతం కన్నడిగులతోనే. రాష్ట్రాలు వేరైనా ఇరు ప్రాంతాల వారూ అన్నదమ్ముల్లా కలసిమెలసి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఆచార, వ్యవహారాలు కూడా ఒకే విధంగా పాటిస్తున్నారు. ఇదీ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉన్న గ్రామాల పరిస్థితి. మడకశిర నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. మడకశిర మినహా మిగిలిన అమరాపురం, అగళి, రొళ్ల, గుడిబండ మండలాల్లో ప్రజల మాతృభాష కన్నడ. ఇంటిలోనే కాదు ప్రభుత్వ కార్యాలయాలు, సమావేశాలు ఎక్కడైనా సరే కన్నడంలోనే మాట్లాడుతారు. అమరాపురం మండల కేంద్రానికి ఏడు కిలో మీర్ల దూరంలో నిద్రగట్ట పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ పరిధిలోని హెచ్బీఎన్ కాలనీ కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉంది. పక్కనే కర్ణాటకలోని లక్కనహళ్లి గ్రామం ఉంది. రాష్ట్రాలు, భాషలు వేరైన ఈ రెండు గ్రామాలకు మధ్యన సరిహద్దుగా రోడ్డు ఉంది. కేవలం మూడు అడుగులే దూరం. రోడ్డుకు ఒకపైపు ఆంధ్రప్రదేశ్.. మరొక వైపు కర్ణాటక రాష్ట్రం ఉంటాయి. నిద్రగట్ట పంచాయతీ పరిధిలో నిద్రగట్ట, ఎన్.గొల్లహట్టి, యర్రగుంటపల్లి, హెచ్బీఎన్ కాలనీలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని విద్యార్థులు కర్ణాటకలోని లక్కనహళ్లి పాఠశాలకు వెళ్లి చదువుకుంటారు. ఆంధ్రప్రదేశ్ వాసులే అయినప్పటికీ వీరి మాతృభాష మాత్రం కన్నడే. తెలుగు పాఠశాలల్లో చదివినా.. అక్కడ వారు మాట్లాడేది కన్నడ భాషే. దీంతో హెచ్బీఎన్కాలనీ, కెంపక్కనహట్టి గ్రామాల్లో రెండు కన్నడ పాఠశాలలు ఉన్నాయి. బెంగళూరు, తుమకూరు, దావణగెర పట్టణాల్లో కూడా మన తెలుగువారు చదువుకుంటున్నారు. శిర, హిరియూరు, తుమకూరు, పావగడ, మధుగిరి, తదితర ప్రాంతాల్లో తమ పిల్లలకు వివాహాలు కుదుర్చుకుంటున్నారు. వ్యాపార, వాణిజ్య సంబంధాలు, స్థలాలు, పొలాలు సైతం రెండు ప్రాంతాల వారివీ అటు – ఇటు కొనసాగుతున్నాయి. అన్నదమ్ముల్లా ఉంటాం రాష్ట్రాలు వేరైనా గ్రామం వేరైనా ఒకేభాష మాట్లాడుకుంటూ అన్నదమ్ములా కలిసిమెలసి ఉంటున్నాం. మాకు రెండు భాషలు వస్తాయి. తెలుగుతో పాటు కన్నడను అనర్గళంగా మాట్లాడుతాము. నా కూతురు కర్ణాటకలోని మైసూరు యూనివర్సిటిలో చదివించా. పిహెచ్డీ చేయించా. మాకు చాలా అనుకూలమైన ప్రాంతం. దీంతో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మూడడుగులు వేస్తే కర్ణాటక లక్కనహళ్లిలో ఉంటాము. రెండు గ్రామాల్లో ఏ శుభకార్యాలు జరిగినా కలిసిమెలసి జరుపుకుంటాం. –రాజన్న, హెచ్బీఎన్ కాలనీ, అమరాపురం మండలం పరస్పర సహకారం మాకు రాష్ట్రాలు అనే భేద భావం లేదు. అన్నదమ్ముల్లా కలసి ఉంటాం. ఆంధ్ర ప్రాంత ప్రజలు మా గ్రామాల్లో పని చేయడానికి కూలికి వస్తారు. మేము పని ఉంటే ఆంధ్రాకు వెళతాం. హెచ్బీఎన్ కాలనీ ప్రజలు తెలుగు, కన్నడ బాగా మాట్లాడుతారు. మాకు తెలుగు రాదు. అయినా అర్థం చేసుకుని కన్నడలో మాట్లాడుతాం. –రవికుమార్, లక్కనహళ్లి, కర్ణాటక రాష్ట్రం సంబంధాలు బలపడుతన్నాయి పొరుగునే కర్ణాటక రాష్ట్రం ఉండడంతో తమ సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఆ రాష్ట్రంలోనే జరుపుతున్నాం. పిల్లల్ని కూడా అక్కడే చదివిస్తున్నాం. పెళ్లిళ్లు ఎక్కువగా కర్ణాటకలోనే చేస్తున్నాం. ఆచార వ్యవహరాలు, భోజనం తదితర అన్నీ ఒక్కటిగానే ఉంటాయి. ఇక్కడ ప్రధాన వంటకం రాగి ముద్ద. –నాగన్న, హెచ్బీఎన్ కాలనీ, అమరాపురం మండలం చక్కగా మాట్లాడుతారు లక్కనహళ్లిలోని కన్నడ పాఠశాలకు నిద్రగట్ట పంచాయతీ నుంచి అధిక మంది విద్యార్థులు వస్తున్నారు. చక్కగా చదువుకుంటున్నారు. నేను కన్నడ బోధిస్తా. మా కన్నడిగుల కంటే తెలుగు ప్రాంత విద్యార్థులకే అధిక మార్కులు వస్తున్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు బెంగళూరు, మైసూరు తదితర ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులుగా స్థిర పడ్డారు. –జయరామ్, కన్నడ టీచర్, లక్కనహళ్లి ఉన్నత పాఠశాల ఏపీలో ఉద్యోగావకాశాలు కల్పించాలి నేను ఒకటో తరగతి నుంచి కన్నడ పాఠశాలలోనే చదువుకున్నా. ప్రస్తుతం సెకెండ్ పీయూసీ చేస్తున్నా. మాకు ఆంద్రప్రదేశ్‌లో ఉద్యోగావకాశాలు వచ్చేలా చూడాలి. నా సొంత మండలం అమరాపురం. అయితే చదువు కర్ణాటకలో ఉండడం వలన మాకు నాన్‌లోకల్‌గా గుర్తిస్తారు. మండలాన్ని బేస్ చేసుకుని లోకల్‌గా పరిగణించాలి. –నయన, విద్యార్థి సెకెండ్ పీయూసీ, యర్రగుంటపల్లి, అమరాపురం మండలం. రెండు భాషలు నేర్చుకోవచ్చు హెచ్బీఎన్ కాలనీ కన్నడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇక్కడ తెలుగు, కన్నడ భాషలు రెండు నేర్చుకోవచ్చు. నాది రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహళ్ మండలం. ఆంధ్ర సర్కారు గడినాడు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలలు నిర్వహించడం మాలాంటి వారికి ఎంతో ఉపయోగం. –సోమశేఖర్, ఉపాధ్యాయుడు, హెచ్బీఎన్ కాలనీ, కన్నడ పాఠశాల ఆంధ్రలో పథకాలు బాగున్నాయి మా రాష్ట్రంలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు పింఛన్ ఇక్కడ రూ.600 ఇస్తారు. అదే హెచ్బీఎన్ కాలనీ మా ఇంటికి ఆరడుగుల దూరంలో ఉంది. అక్కడ నా స్నేహితురాలు నరసమ్మకు పింఛన్ రూ.2250 ఇస్తున్నారు. అంతేకాదు 45 ఏళ్లు నిండిన మహిళలకు రూ.18,750 ఆర్థికసాయం అందిస్తున్నారు. –లక్ష్మక్క, లక్కనహళ్లి కర్ణాటక రాష్ట్రం -
Corona Virus: ‘లాంగ్ హాలర్స్’ అంటే ఎవరో తెలుసా?
కరోనా గురించి కొత్త కొత్త పరిశోధనల్లో తేలుతున్న విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అలాంటి ఒక అధ్యయనంలో ఈ ‘లాంగ్ హాలర్స్’ గురించి తెలిసింది. ‘కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బాగైపోయాం’ అనుకున్నవారిని సైతం కోవిడ్ లక్షణాలు మరికొంతకాలం పాటు బాధపెడుతుంటాయి. అలా బాధపడే పరిస్థితిని ‘లాంగ్ కోవిడ్’ లేదా ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19’ అనీ... అలా బాధపడేవారినే ‘‘లాంగ్ హాలర్స్’’గా పేర్కొంటున్నారు. క్లివ్లాండ్ క్లినిక్‌లోని లోరియన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్... ‘ఫ్యామిలీ మెడిసిన్’ విభాగానికి చెందిన వైద్యపరిశోధకుడు క్రిస్టోఫర్ బబియుక్ అనే పరిశోధకుడు ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19’ గురించీ... అలాగే ‘లాంగ్ హాలర్స్’పై తన పరిశోధన పత్రాన్ని సమర్పించగా... ఇటీవలే దీని వివరాలను బయటికి వెల్లడించారు. లాంగ్ హాలర్స్ అంటే ఎవరు, వారి లక్షణాలేమిటి, వారి సమస్యలకు కారణాలేమిటి లాంటి అనేక విషయాలు తెలిపేదే ఈ కథనం. ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బాధితులు ఎవరు? ఈ ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బారిన ఎవరు పడతారు? ఎలాంటి లక్షణాలూ లేని అసింప్టమాటిక్ రోగులు దీని బారిన పడరా? కేవలం మూడు, నాలుగు వారాల పాటు కూడా నెగెటివ్ రానివారే దీని బారిన పడతారా?... ఈ సందేహాలు మీ మదిలో రావచ్చు. కానీ అలాంటి మినహాయింపులేమీ ఈ లాంగ్ హాలర్స్కు ఉండవంటున్నారు పరిశోధకులు. ఎలాంటి లక్షణాలూ లేకుండా ఉన్నవారూ, కొద్దిపాటి లక్షణాలతో తేలిగ్గానే కరోనా బారినుంచి తప్పించుకున్నవారు మొదలుకొని సుదీర్ఘకాలం పాటు దాని బారిన పడ్డవారు ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బారిన పడవచ్చు. అలాగే ఎవరో వయోవృద్ధులకు మాత్రమే అది పరిమితమేమో అంటూ కూడా పొరబడవద్దు. ఎందుకంటే... యౌవనంలో ఉన్నవారూ, నడివయసువారు, అప్పుడే వృద్ధాప్యంలో అడుగుపెట్టినవారు మొదలుకొని బాగా వయోవృద్ధుల వరకు అందరూ దీనిబారిన పడే అవకాశాలున్నాయంటున్నారు క్రిస్టోఫర్ బబియుక్ అనే పరిశోధకుడు. పైగా ఇదొక ఛాలెంజింగ్ పరిస్థితి అని... అందరికీ ఒకేలాంటి చికిత్స కాకుండా... ప్రతి ఒక్కరికీ వారి వారి పరిస్థితి ని బట్టి వేర్వేరు చికిత్సలు అందించేలా జబ్బు విసురుతున్న సవాలే ఈ సమస్య అని క్రిస్టోఫర్ బబియుక్ పేర్కొంటున్నారు. ఆయన పేర్కొన్న శాస్త్రీయ వివరాలు చాలావరకు సాధారణ ప్రజలకూ పనికివచ్చేవే. ప్రశ్న: గతంలో చాలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారే ‘లాంగ్ హాలర్స్’గా మారే అవకాశం ఉందా? సమాధానం: ఒకరకంగా అలాగే అనుకోవచ్చు. కానీ కచ్చితంగా అదేనిజం అని అనుకోడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే గత మన అనుభవాలను బట్టి గతంలో ఏదో క్రానిక్ జబ్బులతో బాధపడేవారే ఇలా సుదీర్ఘకాలం పాటు ఏవో లక్షణాలతో బాధపడుతుంటారని తేలినా... కొందరు మామూలు వ్యక్తుల్లో సైతం కొన్ని లక్షణాలు అదేపనిగా కొనసాగుతున్నాయి. అందుకే ఈ స్థితి ఫలానా నిర్దిష్ట వ్యక్తుల్లోనే కనిపిస్తుందని ఇదమిత్థంగా ఇప్పుడే చెప్పడానికి వీలు కావడం లేదు. ప్రశ్న : ఈ లాంగ్ హాలర్స్లో కనిపిస్తున్న లక్షణాలేమిటి? సమాధానం: చాలా లక్షణాలే ఈ లాంగ్ హాలర్స్లో ఉన్నాయి. అవి... దీర్ఘకాలికం గా కొనసాగే తీవ్రమైన దగ్గు, ఛాతీ పట్టేసినట్టుగా ఉండటం, శ్వాస సరిగా అందకపోవడం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులు, కొందరిలో నీళ్లవిరేచనాలు కూడా. అయితే ఈ అందరిలోనూ కనిపిస్తూ ఉండే ఒకే ఒక లక్షణం తీవ్రమైన అలసట. దీన్నే ‘క్రానిక్ ఫెటీగ్’గా చెప్పవచ్చు. ఇలాంటి చాలామంది లాంగ్ హాలర్స్లో ‘బ్రెయిన్ ఫాగ్’ కూడా కనిపిస్తోంది. అంటే... మంచు కప్పి ఉన్నప్పుడు ఏదీ స్పష్టంగా తెలియనట్టే... వీళ్లలో కూడా ఏ ఆలోచనా స్పష్టంగా లేక అయోమయానికి గురవుతుంటారు. దీన్నే ‘బ్రెయిన్ ఫాగ్’ అని అంటారు. ప్రశ్న : ఈ లాంగ్ హాలర్స్ నుంచి ఈ లక్షణాలు ఒకరి నుంచి మరొకరికి పాకుతాయా అంటే ఈ ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ అంటువ్యాధా? సమాధానం : అదృష్టవశాత్తూ కాదు. ఎందుకంటే ఇవన్నీ అప్పటికే కరోనా సోకి తగ్గినవారిలో కనిపించే కొన్ని దీర్ఘకాలిక లక్షణాలు. అంతేతప్ప ఇదో వ్యాధి కాదు. అందునా అంటువ్యాధి కాదు. అందుకే, అంటుకుంటుందేమో అని దీనిగురించి ఆందోళన అక్కర్లేదు. కేవలం కరోనా వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయినవారి నుంచే ఆ వైరస్ మరొకరికి అంటుకుంటుది. రెండువారాల తర్వాత వైరస్ దేహం నుంచి తొలగిపోయాక ఏ రోగీ కరోనాను వ్యాపింపజేయలేడు. (అతడు కాంటేజియస్ కాదు). కాబట్టి వ్యాధి సోకిన రెండు వారాల తర్వాత అటు రోగినీ, ఇటు లాంగ్ హాలర్స్నీ అనుమానాస్పదంగా చూడాల్సిన అవసరం లేదు. పైగా వారికి సమాజం నుంచి మరింత సానుభూతి, సహకారం అవసరం. ప్రశ్న: కొందరిలో ఈ లక్షణాలు సుదీర్ఘకాలం ఎందుకు కొనసాగుతున్నాయి? సమాధానం : కరోనా వచ్చి తగ్గాక చాలామందిలో అది వారి అంతర్గత అవయవాల్లో ‘ఇన్ఫ్లమేషన్’ (వాపు, మంట లాంటి స్థితి) తీసుకొస్తుందన్న విషయం తెలిసిందే కదా. బహుశా ఆ ‘ఇన్ఫ్లమేటరీ కండిషన్స్’ అన్నీ సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ లక్షణాలన్నీ కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలూ, పరిశోధకుల అంచనా. అందుకే ఈ అంశాలపై ఇప్పటికే పరిశోధన కొనసాగుతోందనీ, ఇంకా చాలా అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు కొనసాగితే సుదీర్ఘకాలంలో అప్పటికే కిడ్నీవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెజబ్బులు ఉన్నవారిపై కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావం వల్ల కలిగే ఫలితాలేమిటో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికైతే పరిశోధనలు మాత్రం విస్తృతంగా కొనసాగుతున్నాయి. ప్రశ్న: ఇప్పుడీ పరిస్థితిలో ‘లాంగ్ హాలర్స్’ ఏం చేయాలి? సమాధానం : కరోనా తగ్గిందనీ, తమకు నెగెటివ్ వచ్చిందని తెలిశాక కూడా లక్షణాలు కనిపిస్తున్నా లేదా కోవిడ్–19 వచ్చి తగ్గిందనుకున్న 28 రోజుల తర్వాత కూడా మళ్లీ లక్షణాలు కనిపిస్తున్నా ముందుగా వారు డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పటికి ఉన్న అవగాహన మేరకు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు తమ పల్మునరీ (ఊపిరితిత్తులకు సంబంధించిన), కార్డియోవాస్కులార్ (గుండెకు సంబంధించిన), న్యూరలాజికల్ (మెదడు సంబంధిత) పరీక్షలను వారి వారి డాక్టర్ల సలహాల మేరకు చేయించుకుంటూ ఉండాల్సి రావచ్చు. ఇక ఆ తర్వాత వారంతా క్రమం తప్పకుండా దేహానికి మంచి ఖనిజలవణాలు దొరికేలా ఎప్పుడూ ద్రవాహారాలు తీసుకుంటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటూ, మంచి ఆహారం తింటూ, కంటినిండా నిద్రపోతూ... శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలి. ఈ అంశాలన్నింటినీ ఆరోగ్యవంతులూ, కరోనాకు గురికాని వారందరు కూడా పాటిస్తే అవి వాళ్లందరికీ మేలు చేసేవే. ప్రశ్న: లాంగ్ హాలర్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? సమాధానం : లాంగ్ హాలర్స్తో సహా... ప్రతివారూ, కరోనా వచ్చి తగ్గిన వారు సైతం (వారి వారి దేశాల్లోని ప్రభుత్వ, వైద్య సంస్థలు చెప్పిన నిర్ణీత కాల వ్యవధి ముగిశాక) తప్పక వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. -
ఆఫీస్ విందుల్లో ప్రవర్తన ఎలా!
కార్యాలయాల్లో పనిచే సే ఉద్యోగుల మధ్య స్నేహసంబంధాలను బలోపేతం చేసేందుకు, వారిలో పునరుత్తేజం నింపేందుకు, ప్రమోషన్, వీడ్కోలు లాంటి సందర్భాల్లో యాజమాన్యాలు విందులను ఏర్పాటు చేస్తుంటాయి. ఈ విందుల్లో ప్రవర్తన హూందాగా ఉంటేనే ఆఫీస్‌లో గౌరవం పెరుగుతుంది. ఎలా మెలగాలో తెలియకపోతే నలుగురిలో అభాసుపాలు కావాల్సి వస్తుంది. ఆఫీస్ పార్టీల్లో ప్రవర్తన గురించి తెలుసుకుంటే పొరపాట్లకు ఆస్కారం ఉండదు. మీరు మీలాగే.. విందుల్లో సహచరులతో సంభాషించేటప్పుడు మీరు మీలాగే సహజంగా ఉండండి. అహంభావం, అతిశయం వద్దు. కృత్రిమంగా ప్రవర్తించొద్దు. ఇలా చేస్తే మీ నటన ఎదుటివారికి వెంటనే తెలిసిపోతుంది. మీపై చిన్నచూపు కలుగుతుంది. సహోద్యోగులతో ఆరోగ్యకరమైన సంబంధాలను నాలుగు కాలాలపాటు కొనసాగించాలంటే వారితో మర్యాదపూర్వకంగా మెలగాలి. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడొద్దు. చొరవ తీసుకోండి పార్టీలో ఒకచోట బిగుసుకుపోయి కూర్చోవడం సరికాదు. మీరే చొరవ తీసుకొని ఇతరులతో ఆహ్లాదకరమైన సంభాషణ ప్రారంభించండి. కలివిడితనం అవసరం. దీంతో మీరు నలుగురి దృష్టిలో వెంటనే పడతారు. మంచి గుర్తింపు వస్తుంది. అదేసమయంలో పుకార్లు పుట్టించేవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటల్లో తప్పులు వెతికి, బయట ప్రచారం చేస్తారు. అందుకే వారితో ఎక్కువ మాట్లాడకపోవడమే మంచిది. వినే లక్షణం మీరు మాట్లాడడమే కాదు, ఎదుటివారికి కూడా నోరువిప్పే అవకాశం ఇవ్వండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. నచ్చితే అభినందించండి. తగిన సలహాలు ఇవ్వండి. దీనివల్ల వారి దృష్టిలో మీ విలువ కచ్చితంగా పెరుగుతుంది. ఇతరులు చెప్పేది పూర్తిగా వినాలంటే ఓర్పు, సహనం ఉండాలి. వివాదాస్పద అంశాలొద్దు సంభాషణలో కులం, మతం, ప్రాంతం, వర్గం... ఇలాంటి వివాదాస్పద, సున్నితమైన అంశాలకు చోటు కల్పించకండి. వీటిని ప్రస్తావిస్తే మాటామాటా పెరిగి గొడవ పెద్దదవుతుంది. ఇరువురి మధ్య ద్వేషం మొదలవుతుంది. కాబట్టి అప్రమత్తతే ప్రధానం. సంభాషణ ద్వారా కొత్త విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించండి. స్పోర్ట్స్, ట్రావెలింగ్ లాంటి వాటిపై మాట్లాడుకోవచ్చు. సమయ పాలన సమయ పాలన ప్రతి ఒక్కరికీ అవసరం. ఆఫీస్ పార్టీలకు సమయానికి చేరుకోవాలి. ఆలస్యంగా వెళ్తే సహోద్యోగుల్లో మీపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుంది. సహచరుడికి పదోన్నతి, బదిలీ అయినవారికి వీడ్కోలు లేదా పదవీ విరమణ.. ఇలా విందు ఉద్దేశం ఏమిటో ముందే తెలుసుకోవడం మంచిది. దానికి తగ్గట్టుగా సిద్ధమై వెళ్లాలి. వ్యక్తుల గురించి తెలియజేసేవి.. వారి మాటతీరు, ప్రవర్తనే. ఈ రెండూ సక్రమంగా ఉండేలా చూసుకుంటే.. ఆఫీస్ పార్టీల ను హూందాగా పూర్తిచేసుకొని రావొచ్చు.