people sufferings
-
Corona Virus: ‘లాంగ్ హాలర్స్’ అంటే ఎవరో తెలుసా?
కరోనా గురించి కొత్త కొత్త పరిశోధనల్లో తేలుతున్న విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అలాంటి ఒక అధ్యయనంలో ఈ ‘లాంగ్ హాలర్స్’ గురించి తెలిసింది. ‘కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బాగైపోయాం’ అనుకున్నవారిని సైతం కోవిడ్ లక్షణాలు మరికొంతకాలం పాటు బాధపెడుతుంటాయి. అలా బాధపడే పరిస్థితిని ‘లాంగ్ కోవిడ్’ లేదా ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19’ అనీ... అలా బాధపడేవారినే ‘‘లాంగ్ హాలర్స్’’గా పేర్కొంటున్నారు. క్లివ్లాండ్ క్లినిక్‌లోని లోరియన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్... ‘ఫ్యామిలీ మెడిసిన్’ విభాగానికి చెందిన వైద్యపరిశోధకుడు క్రిస్టోఫర్ బబియుక్ అనే పరిశోధకుడు ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19’ గురించీ... అలాగే ‘లాంగ్ హాలర్స్’పై తన పరిశోధన పత్రాన్ని సమర్పించగా... ఇటీవలే దీని వివరాలను బయటికి వెల్లడించారు. లాంగ్ హాలర్స్ అంటే ఎవరు, వారి లక్షణాలేమిటి, వారి సమస్యలకు కారణాలేమిటి లాంటి అనేక విషయాలు తెలిపేదే ఈ కథనం. ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బాధితులు ఎవరు? ఈ ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బారిన ఎవరు పడతారు? ఎలాంటి లక్షణాలూ లేని అసింప్టమాటిక్ రోగులు దీని బారిన పడరా? కేవలం మూడు, నాలుగు వారాల పాటు కూడా నెగెటివ్ రానివారే దీని బారిన పడతారా?... ఈ సందేహాలు మీ మదిలో రావచ్చు. కానీ అలాంటి మినహాయింపులేమీ ఈ లాంగ్ హాలర్స్కు ఉండవంటున్నారు పరిశోధకులు. ఎలాంటి లక్షణాలూ లేకుండా ఉన్నవారూ, కొద్దిపాటి లక్షణాలతో తేలిగ్గానే కరోనా బారినుంచి తప్పించుకున్నవారు మొదలుకొని సుదీర్ఘకాలం పాటు దాని బారిన పడ్డవారు ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బారిన పడవచ్చు. అలాగే ఎవరో వయోవృద్ధులకు మాత్రమే అది పరిమితమేమో అంటూ కూడా పొరబడవద్దు. ఎందుకంటే... యౌవనంలో ఉన్నవారూ, నడివయసువారు, అప్పుడే వృద్ధాప్యంలో అడుగుపెట్టినవారు మొదలుకొని బాగా వయోవృద్ధుల వరకు అందరూ దీనిబారిన పడే అవకాశాలున్నాయంటున్నారు క్రిస్టోఫర్ బబియుక్ అనే పరిశోధకుడు. పైగా ఇదొక ఛాలెంజింగ్ పరిస్థితి అని... అందరికీ ఒకేలాంటి చికిత్స కాకుండా... ప్రతి ఒక్కరికీ వారి వారి పరిస్థితి ని బట్టి వేర్వేరు చికిత్సలు అందించేలా జబ్బు విసురుతున్న సవాలే ఈ సమస్య అని క్రిస్టోఫర్ బబియుక్ పేర్కొంటున్నారు. ఆయన పేర్కొన్న శాస్త్రీయ వివరాలు చాలావరకు సాధారణ ప్రజలకూ పనికివచ్చేవే. ప్రశ్న: గతంలో చాలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారే ‘లాంగ్ హాలర్స్’గా మారే అవకాశం ఉందా? సమాధానం: ఒకరకంగా అలాగే అనుకోవచ్చు. కానీ కచ్చితంగా అదేనిజం అని అనుకోడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే గత మన అనుభవాలను బట్టి గతంలో ఏదో క్రానిక్ జబ్బులతో బాధపడేవారే ఇలా సుదీర్ఘకాలం పాటు ఏవో లక్షణాలతో బాధపడుతుంటారని తేలినా... కొందరు మామూలు వ్యక్తుల్లో సైతం కొన్ని లక్షణాలు అదేపనిగా కొనసాగుతున్నాయి. అందుకే ఈ స్థితి ఫలానా నిర్దిష్ట వ్యక్తుల్లోనే కనిపిస్తుందని ఇదమిత్థంగా ఇప్పుడే చెప్పడానికి వీలు కావడం లేదు. ప్రశ్న : ఈ లాంగ్ హాలర్స్లో కనిపిస్తున్న లక్షణాలేమిటి? సమాధానం: చాలా లక్షణాలే ఈ లాంగ్ హాలర్స్లో ఉన్నాయి. అవి... దీర్ఘకాలికం గా కొనసాగే తీవ్రమైన దగ్గు, ఛాతీ పట్టేసినట్టుగా ఉండటం, శ్వాస సరిగా అందకపోవడం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులు, కొందరిలో నీళ్లవిరేచనాలు కూడా. అయితే ఈ అందరిలోనూ కనిపిస్తూ ఉండే ఒకే ఒక లక్షణం తీవ్రమైన అలసట. దీన్నే ‘క్రానిక్ ఫెటీగ్’గా చెప్పవచ్చు. ఇలాంటి చాలామంది లాంగ్ హాలర్స్లో ‘బ్రెయిన్ ఫాగ్’ కూడా కనిపిస్తోంది. అంటే... మంచు కప్పి ఉన్నప్పుడు ఏదీ స్పష్టంగా తెలియనట్టే... వీళ్లలో కూడా ఏ ఆలోచనా స్పష్టంగా లేక అయోమయానికి గురవుతుంటారు. దీన్నే ‘బ్రెయిన్ ఫాగ్’ అని అంటారు. ప్రశ్న : ఈ లాంగ్ హాలర్స్ నుంచి ఈ లక్షణాలు ఒకరి నుంచి మరొకరికి పాకుతాయా అంటే ఈ ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ అంటువ్యాధా? సమాధానం : అదృష్టవశాత్తూ కాదు. ఎందుకంటే ఇవన్నీ అప్పటికే కరోనా సోకి తగ్గినవారిలో కనిపించే కొన్ని దీర్ఘకాలిక లక్షణాలు. అంతేతప్ప ఇదో వ్యాధి కాదు. అందునా అంటువ్యాధి కాదు. అందుకే, అంటుకుంటుందేమో అని దీనిగురించి ఆందోళన అక్కర్లేదు. కేవలం కరోనా వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయినవారి నుంచే ఆ వైరస్ మరొకరికి అంటుకుంటుది. రెండువారాల తర్వాత వైరస్ దేహం నుంచి తొలగిపోయాక ఏ రోగీ కరోనాను వ్యాపింపజేయలేడు. (అతడు కాంటేజియస్ కాదు). కాబట్టి వ్యాధి సోకిన రెండు వారాల తర్వాత అటు రోగినీ, ఇటు లాంగ్ హాలర్స్నీ అనుమానాస్పదంగా చూడాల్సిన అవసరం లేదు. పైగా వారికి సమాజం నుంచి మరింత సానుభూతి, సహకారం అవసరం. ప్రశ్న: కొందరిలో ఈ లక్షణాలు సుదీర్ఘకాలం ఎందుకు కొనసాగుతున్నాయి? సమాధానం : కరోనా వచ్చి తగ్గాక చాలామందిలో అది వారి అంతర్గత అవయవాల్లో ‘ఇన్ఫ్లమేషన్’ (వాపు, మంట లాంటి స్థితి) తీసుకొస్తుందన్న విషయం తెలిసిందే కదా. బహుశా ఆ ‘ఇన్ఫ్లమేటరీ కండిషన్స్’ అన్నీ సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ లక్షణాలన్నీ కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలూ, పరిశోధకుల అంచనా. అందుకే ఈ అంశాలపై ఇప్పటికే పరిశోధన కొనసాగుతోందనీ, ఇంకా చాలా అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు కొనసాగితే సుదీర్ఘకాలంలో అప్పటికే కిడ్నీవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెజబ్బులు ఉన్నవారిపై కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావం వల్ల కలిగే ఫలితాలేమిటో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికైతే పరిశోధనలు మాత్రం విస్తృతంగా కొనసాగుతున్నాయి. ప్రశ్న: ఇప్పుడీ పరిస్థితిలో ‘లాంగ్ హాలర్స్’ ఏం చేయాలి? సమాధానం : కరోనా తగ్గిందనీ, తమకు నెగెటివ్ వచ్చిందని తెలిశాక కూడా లక్షణాలు కనిపిస్తున్నా లేదా కోవిడ్–19 వచ్చి తగ్గిందనుకున్న 28 రోజుల తర్వాత కూడా మళ్లీ లక్షణాలు కనిపిస్తున్నా ముందుగా వారు డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పటికి ఉన్న అవగాహన మేరకు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు తమ పల్మునరీ (ఊపిరితిత్తులకు సంబంధించిన), కార్డియోవాస్కులార్ (గుండెకు సంబంధించిన), న్యూరలాజికల్ (మెదడు సంబంధిత) పరీక్షలను వారి వారి డాక్టర్ల సలహాల మేరకు చేయించుకుంటూ ఉండాల్సి రావచ్చు. ఇక ఆ తర్వాత వారంతా క్రమం తప్పకుండా దేహానికి మంచి ఖనిజలవణాలు దొరికేలా ఎప్పుడూ ద్రవాహారాలు తీసుకుంటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటూ, మంచి ఆహారం తింటూ, కంటినిండా నిద్రపోతూ... శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలి. ఈ అంశాలన్నింటినీ ఆరోగ్యవంతులూ, కరోనాకు గురికాని వారందరు కూడా పాటిస్తే అవి వాళ్లందరికీ మేలు చేసేవే. ప్రశ్న: లాంగ్ హాలర్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? సమాధానం : లాంగ్ హాలర్స్తో సహా... ప్రతివారూ, కరోనా వచ్చి తగ్గిన వారు సైతం (వారి వారి దేశాల్లోని ప్రభుత్వ, వైద్య సంస్థలు చెప్పిన నిర్ణీత కాల వ్యవధి ముగిశాక) తప్పక వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. -
ఈ నగరానికేమైంది.. జంక్షన్ జామాయే.. కోట్లేమాయే
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 2011లో రూ.10 కోట్లు. ఏడాదికే హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేడెట్ మేనేజ్మెంట్ సిస్టం (హెచ్–ట్రిమ్స్) పేరుతో మరో రూ.66.5 కోట్లు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 నుంచి రూ.100 కోట్లకు పైగా కేటాయింపు...రాజధానిలో గడిచిన 11 ఏళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాటు ఆ వ్యవస్థ ఆధునీకరణ కోసం వెచ్చించిన మొత్తాలివి. ఇలా కోట్లు కుమ్మరిస్తున్నా నగర వాసికి ట్రాఫిక్ కష్టాలు మాత్రం తప్పట్లేదు. ‘ప్రాజెక్ట్ 100 డేస్’ కింద పదేళ్ల క్రితం రూ.10 కోట్లు కేటా యించినా, తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.100 కోట్లకు పైగా మంజూరు చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. చాలాచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం, ఏర్పాటు చేసినవి ప్రారంభించకపోవడం, కీలక జంక్షన్లలో సైతం రోజుల తరబడి సిగ్నల్స్ పనిచేయకుండా పోవడం వంటి కారణాలతో నగరంలో వాహన ప్రయాణం నరకయాతనను తలపిస్తోందంటే అతిశయోక్తి కాదు. ‘వంద రోజులు’ ఓ ఫ్లాప్ ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రానికి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉం డగా ‘ప్రాజెక్ట్ 100 డేస్’తో ఓ పథకం ప్రకటిం చారు. నగర రూపురేఖల్ని 100 రోజుల్లో మార్చాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ విభాగానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ వీటిని సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరించడానికి వెచ్చించేలా ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అప్పట్లో నగర వ్యాప్తంగా ఉన్న 150 జంక్షన్లలోని సిగ్నలింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.7.5 కోట్లు, 30 చోట్ల కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి మరో రూ.2.5 కోట్లు వెచ్చించారు. ఈ నిధుల్ని గరిష్టంగా మూడు నెలల్లోనే ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. హెచ్–ట్రిమ్స్తోనూ ఒరిగింది లేదు..తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టం (హెచ్–ట్రిమ్స్) అందుబాటులోకి తీసుకురావాలని 2012లో నిర్ణయించారు. ఇలాంటి వ్యవస్థ దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. కాగా అప్పటికి సిటీలో ఉన్న 168 జంక్షన్లలోని సిగ్నల్స్ హైటెక్ హంగులు సంతరించుకోవడంతో పాటు 53 జంక్షన్లలో కొత్త సిగ్నల్స్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు వెళ్లారు. ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.66.5 కోట్లను కేటాయించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సహకారం, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (యాస్కీ) ప్రణాళికలతో అమలైన ఈ ప్రాజెక్ట్‌కు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) సాంకేతిక సహకారం అందించింది. సిగ్నల్స్ ఏర్పాటులో ప్రముఖ సంస్థగా పేరున్న బెంగళూరుకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకుంది. 2012 ఆగస్టు 18న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో బెల్ ఒప్పందం కుదుర్చుకుంది. గరిష్టంగా ఏడాది కాలంలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అప్పట్లో గడువు నిర్దేశించారు. అప్పటి ఒప్పందం ప్రకారం ఏడాదిలోపు బెల్ ఈ కాంట్రాక్ట్ పూర్తి చేయకుంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉండగా... తొమ్మిది నెలల్లోనే పూర్తి చేస్తే ప్రాజెక్ట్ వ్యయంలో 3 శాతం అధికంగా చెల్లించేలా నిర్ణయించారు. అత్యాధునిక సౌకర్యాలు, నిఘా వ్యవస్థలతో కూడిన ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నగరంలో ప్రయాణ వేగంలో 50 శాతం పెరుగుదల , రోడ్ నెట్వర్క్ ఆలస్యంలో 35 శాతం, ఇంధన వినియోగంలో 22 శాతం తగ్గుదల వస్తుందని యాస్కీ అంచనా వేసింది. దాదాపు రెండేళ్లకు పైగా సాగిన ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యేకంగా నగరానికి ఒరిగిందంటూ ఏమీ కనిపించక పోగా ట్రాఫిక్ కష్టాలు యధావిధిగానే కొనసాగడం గమనార్హం. ఐదేళ్లుగా ఐటీఎంఎస్ ట్రయల్ రన్! ‘ఉల్లంఘనుల్లో’ క్రమశిక్షణ పెంచడం, స్వైర‘విహారం’ చేసేవారికి చెక్ చెప్పడం, వాహనచోదకులు గమ్యం చేసుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం, ట్రాఫిక్ జామ్లనేవి లేకుండా చేయడం... లక్ష్యాలుగా అత్యాధునిక ఐటీఎంఎస్ (ఇంటెలిజెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం)కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో తొలి దశలో నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్లలో ఉన్న 250 జంక్షన్లలో ఈ వ్యవస్థ అమలు చేయాలని భావించారు. ఇది అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ నిర్వహణ, పరిశీలన మొత్తం కమిషనరేట్ కేంద్రంగా పని చేసే ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీ–సీసీసీ) నుంచే ఉంటుందని ప్రకటించారు. రాత్రి వేళల్లోనూ పనిచేసే, 16 మెగా పిక్సెల్ కెమెరాలతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ ఐటీఎంఎస్ ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వట్లేదు. దాదాపు ఐదేళ్లుగా ట్రయల్ రన్లకు మాత్రమే ఇది పరిమితమైంది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టం (ఏఎన్పీఆర్), డైనమిక్ బస్ ప్లాట్‌ఫాం అసైన్మెంట్ (డీబీపీఏ), ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎంఎస్), వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులుగా (వీఎంఎస్) పిలిచే డిజిటల్ బోర్డులు, ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌లు (ఈసీబీ)... ఇలా ఉండాల్సిన హంగులు, ఆర్భాటాల్లో ఇప్పటివరకు కేవలం సగమే పని చేస్తుండటం శోచనీయం. తాజాగా మరో రూ.60 కోట్లు .. ఇప్పటివరకు రూ.170 కోట్లకు పైగా ఖర్చు పెట్టినా రోడ్డు మధ్యలో నిల్చుని, అటూ ఇటూ తిరుగుతూ, నోటిలో ఉన్న ఈల ఊదుతూ, చేత్తోనో లేదా చేతిలో ఉన్న పనిచేయని కర్ర (ఎలక్ట్రానిక్) తోనో వాహనాలకు దారి చూపించాల్సిన పరిస్థితి ట్రాఫిక్ పోలీసులకు.. ఏ మాత్రం అదుపు తప్పినా గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సిన దుస్థితి నగరవాసులకు తప్పట్లేదు. గతంలో ఈ సిగ్నల్స్ నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకున్న ‘బెల్’ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం, కొత్తగా టెండర్ దక్కించుకున్న ఐబీఐ సంస్థ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగకపోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. తాజాగా సిగ్నల్స్ ఆధునీకరణ కోసం ఐబీఐ–ఉస్మానియూ యూనివర్శిటీ కలసి పని చేసేలా జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం ఈ ఒప్పందాలపై సంతకాలు కూడా పూర్తయ్యాయి. మూడేళ్లల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టుకు రూ.60 కోట్లు కేటాయిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. నగరంలో ఎక్కడా ట్రాఫిక్ రద్దీ లేకుండా చూడటం, సిగ్నల్స్ ఆధునీకరణ, సాఫీగా ప్రయాణం సాగేలా చేయడం వంటి పాత లక్ష్యాలతోనే కూడిన ఈ ప్రాజెక్టు అమలుకు ఓయూ ఈఈఈ విభాగం సహకరిస్తుందని జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఇక ఈ ప్రాజెక్టు ఏ మేరకు ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే. మా పరిస్థితి దారుణంగా ఉంటోంది ఇప్పటికే వేసవి తాపం కనిపిస్తోంది. ఈ వాతావరణంలో ట్రాఫిక్ పోస్టులో కూర్చుని పని చేయడమే కష్టమే. అలాంటిది కొన్ని సిగ్నల్స్ పని చేయకపోవడంతో అదనపు డ్యూటీలు చేయాల్సి వస్తోంది. రోడ్డుపై, రహదారికి మధ్యలో, సిగ్నల్స్ వద్ద నిల్చుని స్వయంగా వాహనాలను నియంత్రించాల్సి వస్తోంది. ఫలితంగా విధులు ముగిసే సమయానికి మా పరిస్థితి దారుణంగా తయారవుతోంది. – పశ్చిమ మండలానికి చెందిన ఓ కానిస్టేబుల్ -
ఆగిన ఆర్టీసీ బస్సులు
- అవస్థలు పడ్డ ప్రయాణికులు - శ్రీవారి భక్తులకు తప్పని ఇక్కట్లు - బోసిపోయిన బస్టాండ్లు - ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన కార్మికులు - సమ్మెతో 1.5 కోట్లు నష్టపోయిన ఆర్టీసీ తిరుపతి కల్చరల్: ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో జిల్లావ్యాప్తంగా బుధవారం బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వోద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు 43 ఫిట్మెంట్ కల్పించాలనే డిమాండ్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు మంగళవారం అర్ధరాత్రి నుంచి పిలుపునిచ్చాయి. జిల్లావ్యాప్తంగా 7,500 మంది కార్మికులు సమ్మె చేపట్టారు. దీంతో సుమారు 4 లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రోజువారీ తిరుమలకు నడిచే 450 బస్సుల్లో కేవలం 43 సర్వీసులు మాత్రమే నడిచాయి. కొన్ని సర్వీసులు అలిపిరి-తిరుమల మధ్య నడిచాయి. తిరుమలకు వచ్చిన వేలాదిమంది భక్తులు తిరుగు ప్రయాణంలో ఇబ్బం దులు పడ్డారు. సమ్మె కారణంగా జిల్లాలో బుధవారం ఆర్టీసీ సుమారు 1.5 కోట్లు ఆదాయాన్ని నష్టపోయింది. ఆయా డిపోల్లో ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు, కార్మికులు ప్రభుత్వం, యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెడిసికొట్టిన అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు సమ్మెలో యథాతథంగా రవాణా సాగించాలని ఆర్టీసీ యాజ మాన్యం ప్రత్యామ్నాయ చర్యల ఆదేశాలు బెడిసికొట్టాయి. రోజుకు డ్రైవర్‌కు రూ.1000లు, కండక్టర్‌కు రూ.800లు ఇస్తామని అధికారులు ప్రకటించారు. హెవీ లెసైన్స్, టెన్త్ ఉత్తీర్ణత సాధించిన వారికి డ్రైవర్, కండక్టర్లు ఉద్యోగులు కల్పిస్తామని ఇచ్చిన ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది నిరుద్యోగులు ఆయా ఆర్టీసీ డిపోలకు పరుగులు తీశారు. సుమారు 200 మంది నిరుద్యోగులు సర్టిఫికెట్లతో తిరుపతి ఆర్టీసీ డిపోకు చేరుకున్నారు. అధికారులు చర్యలను పసిగట్టిన కార్మికులు ఇంటర్వ్యూలను అడ్డుకున్నారు. దీంతో కార్మికులు, నిరుద్యోగల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పిలిచి అవమానించిన అధికారుల తీరును ఎండగడుతూ ధర్నా చేపట్టారు. పోలీసుల రంగప్రవేశంతో ప్రశాంతత నెలకొంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాం కార్మికులు సమ్మె బాట పట్టడంతో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నామని ఆర్టీసీ ఆర్ఎం మహేశ్వర తెలిపారు. జిల్లాలో 180 అద్దె బస్సుల్లో 60 బస్సులను నడిపి ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించామన్నారు. గురువారం నుంచి సర్వీసులను నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు.