నిర్మానుష్యంగా మారిన తిరుపతిలోని సెంట్రల్ బస్టాండ్
- అవస్థలు పడ్డ ప్రయాణికులు
- శ్రీవారి భక్తులకు తప్పని ఇక్కట్లు
- బోసిపోయిన బస్టాండ్లు
- ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన కార్మికులు
- సమ్మెతో 1.5 కోట్లు నష్టపోయిన ఆర్టీసీ
తిరుపతి కల్చరల్: ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో జిల్లావ్యాప్తంగా బుధవారం బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వోద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు 43 ఫిట్‌మెంట్ కల్పించాలనే డిమాండ్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు మంగళవారం అర్ధరాత్రి నుంచి పిలుపునిచ్చాయి. జిల్లావ్యాప్తంగా 7,500 మంది కార్మికులు సమ్మె చేపట్టారు. దీంతో సుమారు 4 లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
రోజువారీ తిరుమలకు నడిచే 450 బస్సుల్లో కేవలం 43 సర్వీసులు మాత్రమే నడిచాయి. కొన్ని సర్వీసులు అలిపిరి-తిరుమల మధ్య నడిచాయి. తిరుమలకు వచ్చిన వేలాదిమంది భక్తులు తిరుగు ప్రయాణంలో ఇబ్బం దులు పడ్డారు. సమ్మె కారణంగా జిల్లాలో బుధవారం ఆర్టీసీ సుమారు 1.5 కోట్లు ఆదాయాన్ని నష్టపోయింది. ఆయా డిపోల్లో ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు, కార్మికులు ప్రభుత్వం, యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బెడిసికొట్టిన అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు
సమ్మెలో యథాతథంగా రవాణా సాగించాలని ఆర్టీసీ యాజ మాన్యం ప్రత్యామ్నాయ చర్యల ఆదేశాలు బెడిసికొట్టాయి. రోజుకు డ్రైవర్‌కు రూ.1000లు, కండక్టర్‌కు రూ.800లు ఇస్తామని అధికారులు ప్రకటించారు. హెవీ లెసైన్స్, టెన్త్ ఉత్తీర్ణత సాధించిన వారికి డ్రైవర్, కండక్టర్లు ఉద్యోగులు కల్పిస్తామని ఇచ్చిన ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది నిరుద్యోగులు ఆయా ఆర్టీసీ డిపోలకు పరుగులు తీశారు. సుమారు 200 మంది నిరుద్యోగులు సర్టిఫికెట్లతో తిరుపతి ఆర్టీసీ డిపోకు చేరుకున్నారు. అధికారులు చర్యలను పసిగట్టిన కార్మికులు ఇంటర్వ్యూలను అడ్డుకున్నారు. దీంతో కార్మికులు, నిరుద్యోగల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పిలిచి అవమానించిన అధికారుల తీరును ఎండగడుతూ ధర్నా చేపట్టారు. పోలీసుల రంగప్రవేశంతో ప్రశాంతత నెలకొంది.
ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాం
కార్మికులు సమ్మె బాట పట్టడంతో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నామని ఆర్టీసీ ఆర్‌ఎం మహేశ్వర తెలిపారు. జిల్లాలో 180 అద్దె బస్సుల్లో 60 బస్సులను నడిపి ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించామన్నారు. గురువారం నుంచి సర్వీసులను నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు.