నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే కాచిగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని అలీకేఫ్ చౌరస్తాలో చాలా రోజుల్నుంచీ ట్రాఫిక్ సిగ్నళ్లు పని చేయడం లేదు. దీంతో ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ట్రాఫిక్ పూర్తి గందరగోళంగా మారుతోంది. నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాలను ట్రాఫిక్ పోలీసులే నియంత్రించాల్సి వస్తుండటంతో వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోని చాలా సిగ్నల్స్ వద్ద టైమర్ పనిచేయకపోవడం సమస్యగా మారింది.
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 2011లో రూ.10 కోట్లు. ఏడాదికే హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేడెట్ మేనేజ్‌మెంట్ సిస్టం (హెచ్–ట్రిమ్స్) పేరుతో మరో రూ.66.5 కోట్లు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 నుంచి రూ.100 కోట్లకు పైగా కేటాయింపు...రాజధానిలో గడిచిన 11 ఏళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాటు ఆ వ్యవస్థ ఆధునీకరణ కోసం వెచ్చించిన మొత్తాలివి. ఇలా కోట్లు కుమ్మరిస్తున్నా నగర వాసికి ట్రాఫిక్ కష్టాలు మాత్రం తప్పట్లేదు. ‘ప్రాజెక్ట్ 100 డేస్’ కింద పదేళ్ల క్రితం రూ.10 కోట్లు కేటా యించినా, తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.100 కోట్లకు పైగా మంజూరు చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. చాలాచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం, ఏర్పాటు చేసినవి ప్రారంభించకపోవడం, కీలక జంక్షన్లలో సైతం రోజుల తరబడి సిగ్నల్స్ పనిచేయకుండా పోవడం వంటి కారణాలతో నగరంలో వాహన ప్రయాణం నరకయాతనను తలపిస్తోందంటే అతిశయోక్తి కాదు.
‘వంద రోజులు’ ఓ ఫ్లాప్ ప్రాజెక్ట్
ఉమ్మడి రాష్ట్రానికి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉం డగా ‘ప్రాజెక్ట్ 100 డేస్’తో ఓ పథకం ప్రకటిం చారు. నగర రూపురేఖల్ని 100 రోజుల్లో మార్చాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ విభాగానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ వీటిని సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరించడానికి వెచ్చించేలా ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అప్పట్లో నగర వ్యాప్తంగా ఉన్న 150 జంక్షన్లలోని సిగ్నలింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.7.5 కోట్లు, 30 చోట్ల కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి మరో రూ.2.5 కోట్లు వెచ్చించారు. ఈ నిధుల్ని గరిష్టంగా మూడు నెలల్లోనే ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు.
హెచ్–ట్రిమ్స్‌తోనూ ఒరిగింది లేదు..తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సిస్టం (హెచ్–ట్రిమ్స్) అందుబాటులోకి తీసుకురావాలని 2012లో నిర్ణయించారు. ఇలాంటి వ్యవస్థ దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. కాగా అప్పటికి సిటీలో ఉన్న 168 జంక్షన్లలోని సిగ్నల్స్ హైటెక్ హంగులు సంతరించుకోవడంతో పాటు 53 జంక్షన్లలో కొత్త సిగ్నల్స్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు వెళ్లారు. ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.66.5 కోట్లను కేటాయించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) సహకారం, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (యాస్కీ) ప్రణాళికలతో అమలైన ఈ ప్రాజెక్ట్‌కు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) సాంకేతిక సహకారం అందించింది.
సిగ్నల్స్ ఏర్పాటులో ప్రముఖ సంస్థగా పేరున్న బెంగళూరుకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకుంది. 2012 ఆగస్టు 18న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో బెల్ ఒప్పందం కుదుర్చుకుంది. గరిష్టంగా ఏడాది కాలంలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అప్పట్లో గడువు నిర్దేశించారు. అప్పటి ఒప్పందం ప్రకారం ఏడాదిలోపు బెల్ ఈ కాంట్రాక్ట్ పూర్తి చేయకుంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉండగా... తొమ్మిది నెలల్లోనే పూర్తి చేస్తే ప్రాజెక్ట్ వ్యయంలో 3 శాతం అధికంగా చెల్లించేలా నిర్ణయించారు.
అత్యాధునిక సౌకర్యాలు, నిఘా వ్యవస్థలతో కూడిన ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నగరంలో ప్రయాణ వేగంలో 50 శాతం పెరుగుదల , రోడ్ నెట్‌వర్క్ ఆలస్యంలో 35 శాతం, ఇంధన వినియోగంలో 22 శాతం తగ్గుదల వస్తుందని యాస్కీ అంచనా వేసింది. దాదాపు రెండేళ్లకు పైగా సాగిన ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యేకంగా నగరానికి ఒరిగిందంటూ ఏమీ కనిపించక పోగా ట్రాఫిక్ కష్టాలు యధావిధిగానే కొనసాగడం గమనార్హం.
ఐదేళ్లుగా ఐటీఎంఎస్ ట్రయల్ రన్!
‘ఉల్లంఘనుల్లో’ క్రమశిక్షణ పెంచడం, స్వైర‘విహారం’ చేసేవారికి చెక్ చెప్పడం, వాహనచోదకులు గమ్యం చేసుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం, ట్రాఫిక్ జామ్‌లనేవి లేకుండా చేయడం... లక్ష్యాలుగా అత్యాధునిక ఐటీఎంఎస్ (ఇంటెలిజెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం)కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో తొలి దశలో నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్లలో ఉన్న 250 జంక్షన్లలో ఈ వ్యవస్థ అమలు చేయాలని భావించారు. ఇది అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ నిర్వహణ, పరిశీలన మొత్తం కమిషనరేట్ కేంద్రంగా పని చేసే ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీ–సీసీసీ) నుంచే ఉంటుందని ప్రకటించారు. రాత్రి వేళల్లోనూ పనిచేసే, 16 మెగా పిక్సెల్ కెమెరాలతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ ఐటీఎంఎస్ ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వట్లేదు. దాదాపు ఐదేళ్లుగా ట్రయల్ రన్‌లకు మాత్రమే ఇది పరిమితమైంది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టం (ఏఎన్‌పీఆర్), డైనమిక్ బస్ ప్లాట్‌ఫాం అసైన్‌మెంట్ (డీబీపీఏ), ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐఎంఎస్), వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులుగా (వీఎంఎస్) పిలిచే డిజిటల్ బోర్డులు, ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌లు (ఈసీబీ)... ఇలా ఉండాల్సిన హంగులు, ఆర్భాటాల్లో ఇప్పటివరకు కేవలం సగమే పని చేస్తుండటం శోచనీయం.
తాజాగా మరో రూ.60 కోట్లు ..
ఇప్పటివరకు రూ.170 కోట్లకు పైగా ఖర్చు పెట్టినా రోడ్డు మధ్యలో నిల్చుని, అటూ ఇటూ తిరుగుతూ, నోటిలో ఉన్న ఈల ఊదుతూ, చేత్తోనో లేదా చేతిలో ఉన్న పనిచేయని కర్ర (ఎలక్ట్రానిక్) తోనో వాహనాలకు దారి చూపించాల్సిన పరిస్థితి ట్రాఫిక్ పోలీసులకు.. ఏ మాత్రం అదుపు తప్పినా గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సిన దుస్థితి నగరవాసులకు తప్పట్లేదు. గతంలో ఈ సిగ్నల్స్ నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకున్న ‘బెల్’ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం, కొత్తగా టెండర్ దక్కించుకున్న ఐబీఐ సంస్థ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగకపోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు.
తాజాగా సిగ్నల్స్ ఆధునీకరణ కోసం ఐబీఐ–ఉస్మానియూ యూనివర్శిటీ కలసి పని చేసేలా జీహెచ్‌ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం ఈ ఒప్పందాలపై సంతకాలు కూడా పూర్తయ్యాయి. మూడేళ్లల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టుకు రూ.60 కోట్లు కేటాయిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. నగరంలో ఎక్కడా ట్రాఫిక్ రద్దీ లేకుండా చూడటం, సిగ్నల్స్ ఆధునీకరణ, సాఫీగా ప్రయాణం సాగేలా చేయడం వంటి పాత లక్ష్యాలతోనే కూడిన ఈ ప్రాజెక్టు అమలుకు ఓయూ ఈఈఈ విభాగం సహకరిస్తుందని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. ఇక ఈ ప్రాజెక్టు ఏ మేరకు ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే.
మా పరిస్థితి దారుణంగా ఉంటోంది
ఇప్పటికే వేసవి తాపం కనిపిస్తోంది. ఈ వాతావరణంలో ట్రాఫిక్ పోస్టులో కూర్చుని పని చేయడమే కష్టమే. అలాంటిది కొన్ని సిగ్నల్స్ పని చేయకపోవడంతో అదనపు డ్యూటీలు చేయాల్సి వస్తోంది. రోడ్డుపై, రహదారికి మధ్యలో, సిగ్నల్స్ వద్ద నిల్చుని స్వయంగా వాహనాలను నియంత్రించాల్సి వస్తోంది. ఫలితంగా విధులు ముగిసే సమయానికి మా పరిస్థితి దారుణంగా తయారవుతోంది.
– పశ్చిమ మండలానికి చెందిన ఓ కానిస్టేబుల్
Comments
Please login to add a commentAdd a comment