Health: చర్మం మీద మార్పులు.. క్యాన్సర్‌ సూచన కావొచ్చు! కణతి, పుట్టుమచ్చ.. ఏదైనా.. | Health Tips: How To Spot Skin Cancer Symptoms Treatment By Expert | Sakshi
Sakshi News home page

Skin Cancer: ఒంటిపై మచ్చలు, గడ్డలు, పులిపిరికాయలు ఉన్నాయా.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం..

Published Mon, Dec 12 2022 10:05 AM | Last Updated on Mon, Dec 12 2022 10:43 AM

Health Tips: How To Spot Skin Cancer Symptoms Treatment By Expert - Sakshi

చాలామంది ఒంటిపై మచ్చలు, గడ్డలు, పులిపిరికాయలు, స్కిన్‌ట్యాగ్స్‌ కనిపించగానే క్యాన్సరేమోనని ఉలిక్కిపడుతుంటారు. అందుకే స్కిన్‌ క్యాన్సర్‌పై అవగాహన పెంపొందిచడానికి ఈ వివరాలు మీకోసం...

టీనేజ్‌లో, అటు తర్వాత... హార్మోన్ల అసమతౌల్యత వల్ల చర్మంలోని నూనె గ్రంథులు (సెబేషియస్‌ గ్లాండ్స్‌) ‘సీబమ్‌’ను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల జిడ్డుతనం ఎక్కువై మొటిమల వంటి సమస్యలు వేధిస్తుంటాయి.

అది క్యాన్సర్‌ కారకం కాదు!
అవి తీవ్రంగా ఉన్నప్పుడు మచ్చలు, గుంటలు ఏర్పడుతూ ఉంటాయి. హెచ్‌పీవీ వైరస్‌ వల్ల ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాపించే పులిపిరికాయలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి  కొంతమందిలో వాటంతట అవే రాలిపోయినా, మరి కొంతమందిలో శాశ్వతంగా ఉండిపోయి, మరింతగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. పులిపిరికాయలను కలిగించే హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) క్యాన్సర్‌ కారకం కాదు.

లైంగిక చర్యల వల్ల మర్మావయవాల వద్ద వచ్చే పులిపిరికాయలు కూడా క్యాన్సర్‌కు దారితీయవు. అయితే హెచ్‌పీవీ 16, 18 మొదలైన వైరస్‌ రకాలను అంకోవైరస్‌లుగా పేర్కొనవచ్చు. ఇవి ఎలాంటి పులిపిరులను కలగజేయవు. కానీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఎక్కువ.  అధికబరువు వల్లనో, జన్యుపరమైన కారణాల వల్లనో ఏ వయసులో వారికైనా కనిపించే స్కిన్‌ట్యాగ్స్‌ వల్ల సాధారణంగా ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు.

ఇలాంటి లక్షణాలుంటే
అయితే అవి పెద్దసైజులో ఉండి, బయటకు కనిపించే భాగాల్లో ఉంటే తీసివేయించుకోవడమే మంచిది. మామూలుగా పెసరగింజంత ఉండే ఈ స్కిన్‌ట్యాగ్స్‌ ఒక్కోసారి గోల్ఫ్‌బాల్‌ సైజుకూ పెరగవచ్చు. చాలా అరుదుగా వీటి రంగులో మార్పు, రక్తం కారడం వంటి లక్షణాలు కనిపించి, స్కిన్‌క్యాన్సర్‌కు దారితీయవచ్చు. పుట్టుకతో వచ్చే మచ్చలు కాకుండా... 20 ఏళ్ల తర్వాత మచ్చలు వచ్చి, అవి సరైన ఆకారంలో లేకుండా, రంగుమారుతూ, రక్తం స్రవిస్తూ, ఉబ్బెత్తుగా ఉంటే... క్యాన్సరేమోనని అనుమానించాల్సి ఉంటుంది. 

వాటిని అనుమానించాల్సిందే
శరీరంలో అనేక ప్రాంతాలలో సాఫ్ట్‌టిష్యూలతో ఏర్పడే కొవ్వు గడ్డలనే లైపోమా అంటారు. ఎడిపోజ్‌ టిష్యూలతో ఏర్పడే ప్రమాదకరం కాని ఈ గడ్డలు... శరీరం లోపలి భాగాల్లో కూడా ఏర్పడితే జాగ్రత్తగా గమనించాలి. చర్మం కిందగానీ, రొమ్ముల్లోగానీ, గడ్డలు మెత్తగా కదులుతూ, కొద్దివారాలుగా ఎలాంటి మార్పులేకుండా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ... మనం చేతితో తాకినప్పడు గట్టిగా రాయిలాగా ఉండటం, గడ్డలో ఏవైనా మార్పులు గమనిస్తూ ఉంటే  మాత్రం తప్పనిసరిగా వాటిని అనుమానించాలి. 

గడ్డ అయినా, పుట్టుమచ్చ అయినా మార్పులకు గురవుతూ, రంగు మారుతూ, గట్టిగా ఉండి, రక్తస్రావం కనిపిస్తే... నిర్లక్ష్యం చేయకూడదు.  లైపోమాలు ఎటువంటి నొప్పినీ కలగజేయవు. క్యాన్సర్‌ కణుతులు కూడా తొలిదశలో అస్సలు నొప్పి ఉండవు. కానీ పెరిగేకొద్దీ నరాలు, ఇతర వ్యవస్థల మీద ప్రభావం చూపించడం వల్ల తీవ్రమైన నొప్పిని కలగజేయటంతో పాటు చికిత్సకు అంత తొందరగా లొంగవు. 

90 శాతం అవే!
మన దేశాలలోని ప్రజల శరీరాలలో మెలనిన్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్‌క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం చాలా తక్కువని చెప్పవచ్చు. పూర్తిగా నయం చేయదగిన ఈ క్యాన్సర్‌ ప్రధానంగా ‘బేసల్‌సెల్‌ కార్సినోమా’, ‘స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా’ అని రెండు రకాలుగా ఉంటుంది. దాదాపు 90 శాతం బేసల్‌సెల్‌ కార్సినోమా రకానికి చెందినవే ఉంటాయి. మనదేశంలో కూడా ‘నాన్‌ మెలనోమాస్కన్‌ క్యాన్సర్‌’ పెరుగుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

పరీక్షలు చేయంచుకోవడం మంచిది
యాభై ఏళ్లు పైబడ్డాక కనిపించే ఈ క్యాన్సర్స్‌... అల్ట్రావయొలెట్‌ కిరణాలు (యూవీ రేస్‌) ఎక్కువగా ఉన్న పాశ్చాత్యదేశాలలో శరీరాన్ని ట్యాన్‌ చేయడానికి ఉపయోగించే ట్యాన్‌బూత్స్‌వల్ల, బాగా తెల్లగా ఉన్నవారిలో, నీలం రంగు కళ్లు ఉన్నవారిలో, పురుషుల్లో ఎక్కువగా వస్తుంటాయి. శరీరం మీద ఎక్కడైనా...అంటే... ముఖ్యంగా ఎండకు ఎక్స్‌పోజ్‌ అయ్యే శరీరభాగాల్లో చర్మం రంగుమార్పుతో పాటు మాననిపుండు, స్కిన్‌ప్యాచ్‌లా ఉండి రక్తస్రావం అవుతూ ఉంటే పరీక్షలు చేయంచుకోవడం మంచిది. 

పూతమందుగా కీమోథెరపీ
స్కిన్‌క్యాన్సర్స్‌ చాలావరకు 100% నయమవుతాయి. క్యాన్సర్‌ వచ్చిన ప్రదేశాన్ని శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగించడమే కాకుండా మిలిగి ఉన్న క్యాన్సర్‌ కణాలనూ చంపివేయడానికి క్రయోవిధానంలో లేదా లేజర్‌తో చికిత్సలు చేస్తుంటారు. రేడియేషన్, కీమోథెరపీలను అవసరాన్ని బట్టి చేయడం జరుగుతుంది. క్యాన్సర్‌ వచ్చిన భాగంలో మాత్రమే ఆయింట్‌మెంట్‌ రూపంలో పూతమందుగా కీమోథెరపీనీ ఇస్తారు.

సర్జరీ చేసి... చర్మాన్ని చాలా ఎక్కువగా తొలగించాల్సి వచ్చినప్పుడు ఇతర భాగాలనుంచి చర్మాన్ని సేకరించి, తొలగించిన చోట గ్రాఫ్టింగ్‌ చేస్తారు. 
►ఎండ నేరుగా తగిలే భాగాల్లో పైపూతగా సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం
►శరీరాన్ని బాగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం
►ఎండకు వెళ్లేటప్పుడు లేత రంగు దుస్తులు ధరించడం, గొడుగు, చలువ కళ్లద్దాలు, టోపీలు ధరించడం
►వీలైనంతవరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉండే ఎండలో బయటకు తిరగకుండా ఉండటంవంటి జాగ్రత్తలు పాటిస్తే స్కిన్‌క్యాన్సర్‌ను కొంతవరకు దూరంగా ఉంచగలిగినవాళ్లం అవుతాం. కేవలం క్యాన్సర్‌ నివారణ కోసం మాత్రమే కాకుండా సాధారణ చర్మ సంరక్షణకు ఈ జాగ్రత్తలు ఉపయోగపడతాయి.  -డా. సీహెచ్‌. మోహన వంశీ, చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్‌

చదవండి: Health: పెళ్లి సంబంధాలు చూస్తున్నారు... కానీ ఆ సమస్య! పిల్లలు పుట్టే అవకాశాలు!?
Toxic Positivity: ‘పాజిటివిటీ పిచ్చి’ పడితే అంతే సంగతులు! అతి సానుకూలతతో అనర్థాలే! మీలో ఈ లక్షణాలుంటే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement