ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదోలా కరోనా సోకింది. ఐసోలేషన్‌లో ఉంటూ, జాగ్రత్తగా మందులు వాడుతూ.. కరోనా నుంచి బయటపడ్డారు.. మరి తర్వాత ఏమిటి? ఎప్పటిలాగానే ఉండొచ్చా? ఏమైనా మందులు వాడాల్సి ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), కేంద్ర వైద్యారోగ్య శాఖ తమ మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చాయి. కోవిడ్ వచ్చి తగ్గాక ఏం చేయాలంటే..
కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలా?
►కరోనా సోకి తగ్గిపోయినవారు కూడా తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించాల్సిందే.
►కోవిడ్ సమయంలో శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయన్నది వ్యక్తులను బట్టి ఉంటుంది. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కోవిడ్ తగ్గిన వారికి అప్పటికప్పుడే మళ్లీ సోకే అవకాశం లేకున్నా.. ఉమ్మడిగా వాడే వస్తువులు, బహిరంగ ప్రదేశాల్లోని ఉపరితలాలను తాకడం వంటి వాటి ద్వారా వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది.
కరోనా మళ్లీ సోకుతుందా?
►కోవిడ్ వచ్చి తగ్గిపోయినా మళ్లీ సోకే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఇటీవల 1,300 మందిపై చేసిన పరిశోధనలో.. 58 మందికి (4.5 శాతం) రెండోసారి కరోనా సోకినట్టు గుర్తించారు.
►రెండోసారి కరోనా సోకిన ఈ 58 మందిలో ఇద్దరికి అయితే.. 102వ రోజే (దాదాపు మూడు నెలలకే) మళ్లీ సోకినట్టు తేలింది.
కోవిడ్ సోకి తగ్గగానే వ్యాక్సిన్ వేయించుకోవచ్చా?
►కోవిడ్ నుంచి కోలుకున్నాక కనీసం నాలుగు నుంచి 8 వారాల వరకు వ్యాక్సిన్ అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ గతంలో పేర్కొంది. ఈ విరామం కనీసం 12 వారాలు (మూడు నెలలకు) ఉండాలని ఇటీవల అధికారికంగా ప్రకటించింది.
►కరోనా సోకి తగ్గినవారిలో ఆరు నెలల వరకు వ్యాక్సిన్ అవసరం లేదని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే అందరిలోనూ ఇదే స్థాయిలో ఇమ్యూనిటీ ఉంటుందని చెప్పలేమని వైద్య నిపుణులు అంటున్నారు.
కోలుకున్నాక నీరసం, ఆయాసం ఉంటే ఎలా?
►ఆస్పత్రిలో చేరాల్సిన స్థాయిలో తీవ్రత లేకున్నా కూడా.. కోవిడ్ వచ్చి తగ్గిన కొందరు పేషెంట్లలో నిస్సత్తువ, ఆయాసం, శ్వాస ఇబ్బందులు, పలు న్యూరోలాజికల్ సమస్యలు ఉంటున్నాయి. ఇవి ఎంతకాలం కొనసాగుతాయన్నదే కీలకం. కొద్దిరోజుల్లో తగ్గిపోతే ఏ ఇబ్బందులూ ఉండవు.
►కోవిడ్ నుంచి కోలుకున్నాక కొన్ని లక్షణాల విషయంగా మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తీవ్ర స్థాయి జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయిలు 95 శాతం కన్నా తగ్గిపోవడం, ఛాతీలో నొప్పి, గందరగోళ పడుతుండటం, కంటి చూపులో ఇబ్బందులు వంటివాటిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఉంటుందా?
►కోవిడ్ వచ్చి తగ్గిపోయిన అందరికీ బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్‌మైకోసిస్) సోకే ప్రమాదం లేదు. మధుమేహం నియంత్రణలో లేకపోవడం, స్టెరాయిడ్ల వాడకం వల్ల రోగనిరోధక శక్తి బలహీనం కావడం, ఎక్కువ కాలం ఐసీయూ/ఆక్సిజన్ బెడ్‌పై ఉండటం, కేన్సర్, కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, అవయవ మార్పిడి చేయించుకుని ఉండటం వంటివి ఉంటే మాత్రమే బ్లాక్ ఫంగస్ దాడికి అవకాశం ఎక్కువ.
ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ పెట్టాలి?
►వీలైనంత వరకు గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి.
►వైద్యుల సూచనల మేరకు రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుష్ మందులు వాడొచ్చు.
►వయసు/శరీర పరిస్థితికి తగినట్టుగా యోగా, మెడిటేషన్, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం మంచిది.
►వీలైనంత వరకు రోజూ ఉదయం పూట నడక అవసరం.
►అన్ని పోషకాలు ఉండి, సులువుగా జీర్ణమయ్యే తాజా ఆహారం తీసుకోవాలి.
►తగిన స్థాయిలో విశ్రాంతి, నిద్ర తప్పనిసరిగా ఉండాలి.
►దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర సమస్యలకు సంబంధించి డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment