ప్రతీకాత్మకచిత్రం
‘బోథ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో ఉండకుండా ఓ మీసేవా కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ఓ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశాడు. దరఖాస్తు చేసే సమయంలో మీ సేవా నిర్వాహకుడు ఓటీపీ కోసం అతడి మొబైల్ తీసుకున్నారు. ఆ మొబైల్‌లో ఆయనకు కోవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు మెస్సేజ్ చూశాడు. దీంతో మీ సేవ నిర్వాహకుడు ఖంగుతిన్నాడు. బయటకు ఎందుకు వచ్చావని ప్రశ్నించగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత మీసేవా నిర్వాహకుడు కోవిడ్ టెస్టు చేసుకోవాల్సి వచ్చింది. నెగిటివ్ రావడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు’. ఇలా చాలా మంది కరోనా వచ్చినా బయట తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు.
సాక్షి, బోథ్(ఆదిలాబాద్): ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటే కొంతమంది మాత్రం లెక్క చేయడం లేదు. కరోనా వచ్చినట్లు తెలిసినా.. లక్షణాలు లేవంటూ రోడ్లపై తిరిగేస్తున్నారు. దీంతో కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. కరోనా సోకిన వారికి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడం, కరోనా సోకిన వారిపై ప్ర భుత్వ అధికారులు శ్రద్ధ పెట్టకపోవడమే కారణాలు గా తెలుస్తున్నాయి. ఫలితంగా వైరస్ విస్తరిస్తోంది. దీంతో ప్రతి రోజూ పాజిటివ్ రేట్లు వందల్లో పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కోవిడ్ రోగులు ఆసుపత్రుల్లో, ల్యాబ్‌ల్లో దర్శనమిస్తున్నారు. దీంతో చాలా మందిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
పాజిటివ్ వస్తే పర్యవేక్షణ కరువు..
గత ఏడాది కరోనా టెస్టులు చేసిన తరువాత కరోనా సోకిన వ్యక్తులను వారిని ఇంటికి పంపకుండా ఆస్పత్రిలోనే ఉంచి, ఐసోలేషన్ సెంటర్లలోనే ఉంచేవారు. వారికి క్రమం తప్పకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు ప్రతి రోజు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ వారికి సరైన మందులు ఇచ్చారు. వసతితో పాటు భోజనం కూడా ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో కరోనా సోకిన వారు బయటకు వెళ్లకుండా ఐసోలేషన్ సెంటర్లలోనే కరోనా తగ్గేవరకు ట్రిట్‌మెంట్ తీసుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా సోకిన వారిపై పర్యవేక్షణ కరువవుతోంది. కరోనా వచ్చిన వారికి సప్లిమెంట్‌లను ఇచ్చి, వారిపై పర్యవేక్షణ చేయడం లేదు. కరోనా వచ్చిన వెంటనే వారు ఆటోల్లో, ఇతర వాహనాల్లో గుంపులుగా ప్రజలతో కలిసి వెళ్తున్నారు. దీంతో పక్కవారికి కూడా కరోనా బారిన పడే అవకాశం ఏర్పడుతోంది. వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం లేదు.
పేద ప్రజలు హోం ఐసోలేషన్‌లో ఎలా ఉండేది..
కరోనా సోకిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పేద కుటుంబాల్లో ఇరుకు ఇళ్లు ఉండటం వలన ఇంట్లో ఇరుకు గదుల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఏర్పడుతోంది. కనీస సదుపాయాలు కూడా లేని వారి కుటుంబాల్లో కరోనా సొకిన వారు ఉండలేని పరిస్థితి నెలకొంటోంది. ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తే సెంటర్లలో ఉండవచ్చునని పేదప్రజలు పేర్కొంటున్నారు.
గ్రామాల్లోలేని ఐసోలేషన్ సెంటర్లు..
జిల్లాలోని చాలా గ్రామాల్లో ఐసోలేషన్ సెంటర్లు లేక కరోనా సోకిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో కేవలం రిమ్స్‌లో మాత్రమే ఐసోలేషన్ సెంటర్ ఉండటంతో చాలా మంది రిమ్స్‌కు వెళ్లక ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. వారిపై అధికారుల పర్యవేక్షణ లేక కొంతమందికి తీవ్రమైన ఆక్సిజన్ కొరత రావడంతో చివరి నిమిషంలో రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. రిమ్స్‌కి చివరి నిమిషంలో రావడంతో మృత్యువాత పడ్డ సందర్భాలు నెలకొన్నాయి. అదే గ్రామాల్లో ఎక్కడికక్కడ ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి, ఏఎన్‌ఎంల ద్వారా పర్యవేక్షణ చేయిస్తే కోవిడ్ సోకిన వ్యక్తులు భయభ్రాంతులకు గురి కాకుండా కోలుకునే అవకాశం ఉంటుంది.
సిబ్బంది కొరత..
ఒకవైపు కరోనాతో ఆసుపత్రుల్లో కోవిడ్ పేషంట్లతో నిండిపోతుంటే.. ఆసుపత్రుల్లో సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెడికల్ టెక్సీషియన్స్, వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఆసుపత్రుల్లో సిబ్బందిని నియమిస్తే కోవిడ్ సోకిన వ్యక్తులపై పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండే అవకాశం ఉంది. చాలా ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి భారం ప్రస్తుతం ఉన్న వైద్యుల మీద పడుతోంది.
పట్టించుకోకపోవడంతో...
బోథ్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి కరోనా టెస్టు చేయించుకున్నాడు. ఆయనకు కరోనా సోకిందని నిర్ధారణ అయింది. వైద్యులు ఇచ్చిన మందులు తీసుకున్నాడు. వెంటనే ఆర్టీసీ బస్సులో ఎక్కి ఏం చక్కా వెళ్లిపోయాడు. ఆయనతో ఆ బస్సులో ఉన్న వారికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఏర్పడింది.
మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి దగ్గు, జలుబు ఉండటంతో ఆయన కుమారుడు బోథ్‌లోని సామాజిక ఆసుపత్రికి బైక్‌పై తీసుకువచ్చాడు. తన తండ్రికి కరోనా టెస్టు చేయించాడు. పాజిటివ్ వచ్చింది. ఆదే బైక్‌లో తన తండ్రిని ఇంటి వద్ద వదిలేశాడు. కానీ ఆయన కరోనా టెస్టును చేయించుకోలేదు. నాలుగు రోజులు గడిచిన తరువాత ఆయనకు కూడా కరోనా సోకింది. ఆ నాలుగు రోజులు ఆయన అందరితో కలిసి తిరిగాడు. అతడిని కలిసిన వారికి కూడా కరోనా సోకి ఉండవచ్చు. ఇలా నిర్లక్ష్యం వల్లనే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment