spreading fast
-
మరో కరోనా వేవ్.. జపాన్‌లో పెరుగుతున్న కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోల్లాన్ని ఎవరూ మరచిపోలేరు. తాజాగా జపాన్‌లో మరోసారి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇవి అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా వైరస్ వేరియంట్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జపాన్ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19కు చెందిన 11వ వేవ్ ఇప్పుడు జపాన్ను వణికిస్తోంది.జపాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కజుహిరో టటేడా తెలిపిన వివరాల ప్రకారం కేపీ.3 వేరియంట్ జపాన్‌లో వేగంగా విస్తరిస్తోంది. టీకాలు తీసుకున్న లేదా గతంలో ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారికి కూడా ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ సోకుతోంది. ఈ వైరస్ పరివర్తన చెందిన ప్రతిసారీ మరింత ప్రమాదకరంగా మారుతోంది. కరోనా నూతన వేరియంట్ వ్యాప్తి విషయంలో రాబోయే వారాలు చాలా కీలకం.ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో కోవిడ్ -19 బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. అయితే ఈ కేసుల్లో చాలా వరకు తీవ్రమైనవి కావని టాటెడా చెప్పారు. కేపీ వేరియంట్ త్రీ సాధారణ లక్షణాలు అధిక జ్వరం, గొంతు నొప్పి, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి, అలసట. జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం జపాన్ అంతటా జూలై 1 నుండి 7 వరకు వివిధ ఆసుపత్రులలో రోజుకు సగటున 30 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య సదుపాయాలు, పడకల కొరత విషయంలో ఆందోళన తలెత్తుతోంది. -
దడ పుట్టిస్తున్న కొత్త బ్యాక్టీరియా.. సోకితే రెండు రోజుల్లో మృతి?
జపాన్‌లో అరుదైన వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా ప్రాణాంతకమని, దీని బారిన పడిన బాధితులు రెండు రోజుల్లో మృతి చెందే అవకాశం ఉన్నదని జపాన్ వైద్య నిపుణులు చెబుతున్నారు.జపాన్‌లో కరోనా పీరియడ్ ఆంక్షలు సడలించిన అనంతరం ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. వైద్యుల అంచనా ప్రకారం ఈ వ్యాధి మనిషిని 48 గంటల్లో మృత్యు ఒడికి చేరుస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధిని ‘స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్’ (ఎస్టీఎస్ఎస్) అని అంటారు.జపాన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తెలిపిన వివరాల ప్రకారం 2024, జూన్ 2 నాటికి ఈ వ్యాధి కేసులు 977కి చేరుకున్నాయి. గతేడాది 941 కేసులు నమోదయ్యాయి. ఈ ఇన్స్టిట్యూట్ 1999 నుంచి ఈ వ్యాధికి సంబంధించిన రికార్డులను భద్రపరుస్తోంది.ఈ వ్యాధి సోకినప్పుడు గొంతు నొప్పి మొదలవుతుంది. అలాగే శరీరంలోని వివిధ అవయవాల్లో వాపు, నొప్పి జ్వరం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది శ్వాస సమస్యలు, అవయవ వైఫల్యానికి దారితీసి చివరికి బాధితుడిని మృత్యు ఒడికి చేరుస్తుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం అధికంగా ఉంటున్నదని పలు పరిశోధనల్లో తేలింది.ఈ వ్యాధి గురించి టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన అంటు వ్యాధుల ప్రొఫెసర్ కెన్ కికుచి మాట్లాడుతూ ఈ వ్యాధి సోకినప్పుడు మరణం 48 గంటల్లో సంభవించే అవకాశం ఉన్నదన్నారు. జపాన్‌లో ఈ ఏడాది చివరినాటికి ఈ కేసుల సంఖ్య 2,500కి చేరుకోవచ్చని కికుచి తెలిపారు. -
కేరళలో ‘గవదబిళ్లలు’ వ్యాప్తి.. ఒక్క రోజులో 190 కేసులు!
కేరళలో ‘గవదబిళ్లలు’(మంప్స్) వ్యాధి బారినపడిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో 190 కేసులు బయటపడడంతో వైద్యశాఖలో ఆందోళన నెలకొంది. మార్చి నెలలోనే 2,505 గవదబిళ్లల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం గత రెండు నెలల్లో మొత్తం 11,467 గవదబిళ్లలు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నేరుగా బాధితుని రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధిని ‘చిప్మంక్ చీక్స్’ అని కూడా అంటారు. ఈ వ్యాధి బారినపడనప్పుడు జ్వరం, తలనొప్పి, అలసట, శరీర నొప్పి, లాలాజల గ్రంధులలో వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకినప్పుడు బాధితుని బుగ్గలు వాచినట్లు కనిపిస్తాయి. ఒక్కోసారి ఈ వ్యాధి లక్షణాలు బాధితునిలో రెండు మూడు వారాల తర్వాత కనిపిస్తాయి. పారామిక్సోవైరస్ అనే వైరస్ కారణంగా ‘గవదబిళ్లలు’ వ్యాప్తి చెందుతుంది. ఇది బాధితుని నోటి నుంచి వెలువడే నీటి బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి నుండి మరొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ‘గవదబిళ్ల’ బారిన పడినవారికి మెదడు వాపు వచ్చే ప్రమాదం కూడా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులను అధికంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికి చికిత్స కొద్ది రోజుల పాటు కొనసాగుతుంది. యాంటీబయాటిక్స్‌తో ఈ వ్యాధి త్వరగా నయం కాదు. ‘గవదబిళ్ల’ బారినపడినవారు ఆమ్ల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. -
ప్రబలుతున్న జ్వరాలు.. ఆందోళనలో ప్రజలు..!
చింతలమానెపల్లి మండలం నందికొండ గ్రామానికి చెందిన భీంరావుకు జ్వరం రావడంతో కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. కొద్దిగా కోలుకోవడంతో ఇంటికి వెళ్లాడు. మళ్లీ ఆరోగ్య పరిస్థితి విషమించి పదిరోజుల క్రితం ఇంటి వద్ద మృతి చెందాడు. భీంరావు మరణంతో భార్య, పిల్లలు పెద్దదిక్కును కోల్పోయారు. కుమరం భీం: పల్లెలు మంచం పడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఫ్లూజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలతోపాటు గ్రామీణ మండలాల్లోని ప్రజలు జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. నాణ్య మైన వైద్యం అందక ఇటీవల పెంచికల్పేట్ మండలంలోని కొండెపల్లిలో ఓ మహిళ, చింతలమానెపల్లి మండలం నందికొండలో యువకుడు మృత్యువాత పడ్డారు. అయితే జిల్లావ్యాప్తంగా జ్వరాల వ్యాప్తిపై అధికారికంగా రికార్డులు లేవు. కేవలం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోని పరీక్షలనే రికార్డులుగా అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారే అధికంగా ఉండటం గమనార్హం. జ్వరాల వ్యాప్తి గ్రామీణ మండలాల్లో విద్యుత్ సరఫరా అంతరా యంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ కారణంగా నే దోమలతో వ్యాప్తిచెందే మలేరియా, డెంగీ వి జృంభిస్తున్నాయి. కలుషితమైన వాతావరణం, ఆహారం కారణంగా టైఫాయిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. వాతావరణ మార్పులతో చిన్నారులపై ఫ్లూజ్వరం ప్రభావం చూపుతోంది. జలుబు, దగ్గు, స్వల్ప జ్వరంతో అస్వస్థతకు గురవుతున్నారు. టైఫాయిడ్ సోకిన వ్యక్తికి తీవ్రమైన జ్వరం, వాంతులు, విరోచనాలు ఉంటాయి. డెంగీ వ్యాధిగ్రస్తులకు జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు, కళ్ల వెనుక భాగంలో తలనొప్పి ఉంటుంది. వీపు భాగంలో ద ద్దుర్లు, మచ్చలను కూడా గమనించవచ్చు. మలేరియా బానిన వారిలో చలి జ్వరం ఎక్కువగా ఉంటుంది. పీహెచ్‌సీల్లో పరీక్షలు టైఫాయిడ్, మలేరియా, డెంగీ జ్వరాలకు బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాపిడ్ పరీక్షల ద్వారా మలేరియాను నిర్ధారిస్తున్నా.. టైఫాయిడ్, డెంగీ శాంపిళ్లను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఫలితాలు రావడానికి ఒక రోజు సమయం పడుతోంది. దీంతో కొన్నిచోట్ల అనుమానిత లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. కట్టడి చర్యలేవి.? జ్వరాల కట్టడికి చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు పంచాయితీ కార్యాలయాల్లో ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతుండడంతో ఫాగింగ్ నిలిచిపోయింది. మరోవైపు పారిశుధ్యం అధ్వానంగా ఉండడం కూడా దోమలు ఉధృతికి కారణమవుతోంది. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో కలుషిత నీరే ప్రజలకు దిక్కవుతోంది. నియంత్రణకు చర్యలు జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. తిర్యాణి వంటి ఏజన్సీ ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎలిసా పరీక్ష ద్వారా డెంగీని కచ్చితంగా నిర్ధారిస్తున్నాం. ఈ ఫలితాలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నాం. – కృష్ణప్రసాద్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డెంగీతో ఒకరి మృతి పెంచికల్పేట్ మండలం అగర్‌గూడ గ్రామానికి చెందిన గోలేటి మారుతి(42) డెంగీతో ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతికి నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానికంగా ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకున్నాడు. జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఈస్గాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లగా అక్కడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య శారద, కుమార్తె ఉన్నారు. కాగా.. మారుతి తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా 20 ఏళ్లుగా సేవలందిస్తున్నాడు. -
25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్ఓ అలర్ట్..
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5 కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్ ఇప్పటికే 25 దేశాలకుపైగా విస్తరించిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, దీని ముప్పు గురించి తెలుసుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పింది. ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ ప్రపంచానికి కొత్త ముప్పుగా పరిణమించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. అమెరికాలో గత ఏడాది డిసెంబర్లో ఈ వేరియంట్ వల్లే అత్యధిక కేసులు వెలుగుచూశాయి. ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. భారత్ బేఫికర్.. మరోవైపు భారత్‌లో మాత్రం కరోనా వేరియంట్ల ప్రభావం కన్పించండం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 214 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 0.01గా ఉంది. ప్రస్తుతం 2,509 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.8శాతంగా ఉంది. చదవండి: చైనాలో దయనీయ పరిస్థితులు.. బెడ్స్ లేక నేలపైనే రోగులకు చికిత్స -
Monkeypox: భారత్‌కు మంకీపాక్స్ ముప్పు
మంకీపాక్స్ వైరస్ ముప్పు భారత్‌కూ పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కూడా. ఇప్పటికే ముంబైలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాలైన మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూసేవి. బయటి దేశాల్లో బయటపడడం చాలా అరుదైన అంశం. అలాంటిది రెండు వారాల వ్యవధిలో 14 దేశాలకు విస్తరించడం అసాధారణమైన వ్యవహారమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పైగా ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత్ అలర్ట్ అయ్యింది. తమిళనాడులో హైఅలెర్ట్ మంకీపాక్స్ విజృంభణ నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలకు అనుగుణంగా.. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సోమవారం జిల్లా కలెక్టర్లకు కీలక సూచనలు చేసింది. మంకీపాక్స్ అనుమానిత కేసుల్ని గుర్తిస్తే.. వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి తగు చికిత్స అందించాలని తెలిపింది. గత 21 రోజులుగా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్యంపై నిఘా ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించింది తమిళనాడు సర్కార్. మంకీపాక్స్ అంటే.. స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్ఫెక్షన్ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ వైరస్ జాడ కనిపించింది. లక్షణాలివే.. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్‌లో వాపు వంటివి మొదట కనిపిస్తాయి. అయిదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది. ఎలా వ్యాపిస్తుంది?: తుంపర్ల ద్వారా, మంకీపాక్స్ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్‌పై పడుకున్నా, శారీరకంగా కలిసినా సోకుతుంది. చికిత్స ఎలా.. ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ వాడతారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా పని చేస్తుంది. మందులు వాడితే.. నాలుగైదు వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది. లేదంటే మరో మూడు వారాలు ఎక్కువ పట్టొచ్చు. ప్రతీ పది మందిలో ఒకరు మంకీపాక్స్‌తో చనిపోయే అవకాశాలు ఉన్నాయి. చదవండి: మంకీపాక్స్ విజృంభణ.. శారీరకంగా కలవడం వల్లే కేసుల వ్యాప్తి! -
బ్లాక్‌ఫంగస్ కేసుల్లో తెలంగాణది ఏడోస్థానం
సాక్షి, హైదరాబాద్: బ్లాక్‌ఫంగస్ కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశంలోనే ఏడోస్థానంలో నిలిచిందని, గత నెల 28వ తేదీ నాటికి 2,578 కేసులు నమోదయ్యాయని, అత్యధికంగా మహారాష్ట్రలో 9,654 బాధితులు ఫంగస్ బారినపడ్డారని తెలిపింది. తెలంగాణ కంటే అధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో గుజరాత్ 6,846, ఆంధ్రప్రదేశ్ 4,209, తమిళనాడు 4,075, కర్ణాటక 3,648, రాజస్థాన్ 3,536 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువ నమోదైన రాష్ట్రాల్లో నాగాలాండ్, త్రిపుర ఒకటి చొప్పున, మణిపూర్ 7, అసోం 10, గోవా 30, హిమాచలప్రదేశ్ 31, జమ్మూకాశ్మీర్ 47 ఉన్నాయని తెలిపింది. బ్లాక్ ఫంగస్ కేసులు దేశంలో మే రెండోవారం తర్వాత ఎక్కువయ్యాయనీ, ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. కరోనాతో ఆసుపత్రుల్లో చేరినవారికి ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్ల ఇవ్వడం వల్ల షుగర్ పెరగడం తదితర కారణాలతో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువయ్యాయని తెలిపింది. -
డెల్టాప్లస్.. ఆటలమ్మ కంటే వేగం
న్యూయార్క్: చికెన్‌పాక్స్(ఆటలమ్మ) ఎంత వేగంగా వ్యాపించగలదో, కరోనా డెల్టా వేరియంట్ అంతే వేగంగా వ్యాపించగలదని, మిగిలిన వేరియంట్ల కన్నా ఎక్కువ అనారోగ్యం కలిగించగలదని యూఎస్ సీడీసీ(సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) హెచ్చరించినట్లు అమెరికా మీడియా వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ తీసుకోనివారిలో వ్యాపించినంత వేగంగానే, టీకా తీసుకున్నవారికి కూడా అంతేవేగంగా డెల్టా సోకవచ్చని సీడీసీ తెలిపింది. టీకా తీసుకోని వారి ముక్కు, గొంతులో ఎంత వైరల్ లోడు ఉంటుందో, టీకా తీసుకున్న వారిలో నూ అంతే లోడుంటుందని సీడీసీ డైరెక్టర్ రొచెల్ వాలెన్‌స్కై చెప్పారు. అలాగే ఆల్ఫా వేరియంట్ బాధితుల్లో ఉండే వైరల్ లోడు కన్నా 10 రెట్లు అధిక లోడు డెల్టా వేరియంట్ సోకినవారిలో గమనించినట్లు సీడీసీ తెలిపింది. మెర్స్, సార్స్, ఎబోలా, జలుబు, స్మాల్‌పాక్స్, చికెన్‌పాక్స్ వైరస్ల కన్నా డెల్టా వేరియంట్ వేగంగా సోకుతుందని తెలిపింది. అమెరికాలో టీకా తీసుకున్న వారిలో సైతం డెల్టా సోకినట్లు్ల సీడీసీ పేర్కొంది. వివిధ రాష్ట్రాల గణాంకాలను విశ్లేషించి సీడీసీ ఈ పత్రాన్ని రూపొందించింది. ప్రతి చోటా ప్రతి ఒక్కరూ మరలా మాస్కులు ధరించడం మంచిదని రొచెల్ సూచించారు. ప్రభుత్వం, ప్రజలు తీవ్రమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. టీకా తీసుకున్నవారు సైతం డెల్టా వ్యాప్తికి కారకులు కావడం ఆందోళనకరమైన విషయమని మరో సైంటిస్టు వాల్టర్ ఓరెన్స్టైన్ చెప్పారు. అయితే డెల్టా సోకినా సరే టీకా తీసుకున్నవారు సురక్షితంగా ఉన్నట్లేనన్నారు. టీకా వల్ల వ్యాధి తీవ్రత 90 శాతం వరకు తగ్గుతుందని, అందువల్ల వీరు తీవ్ర అనారోగ్యం పాలయ్యేందుకు, లేదా తీవ్ర వ్యాప్తికి కారణమయ్యేందుకు ఛాన్సులు తక్కువన్నారు. -
Corona Virus: పెరుగుతున్నకొత్త కేసులు..
సాక్షి, కరీంనగర్: కరోనా మహమ్మారి నిన్నమొన్నటి వరకు తగ్గినట్లే తగ్గి మరోమారి ఆందోళనలో పడేస్తోంది. ప్రజలు కరోనాను మరిచిపోతున్నట్లు కనిపిస్తున్నా ఇదంతా తాత్కాలికమే అన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని సంబరపడే లోపే థర్డ్ వేవ్ ఆనవాళ్లు అప్పుడే కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. జిల్లాలో కరోనా కేసులు మరో మారు ముంచుకొచ్చే ప్రమాదం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కేసుల తీవ్రత మరింత పెరగవచ్చని వైద్యారోగ్యశాఖ నిపుణులు హెచ్చరిన్నారు. జిల్లాలో థర్డ్‌వేవ్ ప్రమాదం కనిపించకపోయినప్పటికీ రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కరోనా ముప్పు తొలగిపోయిందనే భావనతో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జూలై నెల మొదటి వారం నుంచి కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టగా మళ్లీ విజృంభణ కొనసాగుతోంది. ప్రజలు ఇష్టానుసారంగా తిరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫంక్షన్లు, రాజకీయ కార్యక్రమాలు, అంత్యక్రియలు, బోనాలు తదితర కార్యక్రమాలకు వెళ్తుండడం, మాస్కులు ధరించకపోవడం వంటి కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా తగ్గిన కారణంగా షాపింగ్ మాల్స్, సూపర్బజార్లు, జ్యూవెల్లరీ, వస్త్ర దుకాణాలు, కిరాణ దుకాణాల వద్ద ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. భౌతిక దూరం పాటించకుండా, మాస్క్‌లు ధరించకుండా తిరగడం వ్యాధి వ్యాప్తికి కారణమవుతోంది. నిర్ధారణ పరీక్షల పెంపుతో.. జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షల పెంపుతో కేసుల సంఖ్య బయటపడుతోంది. జిల్లాలోని 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గతంలో అరకొరగా ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలు చేయగా నిర్ధారణ పరీక్షల కోసం జనం రెండు మూడు రోజులపాటు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ప్రస్తుతం పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఎక్కడికక్కడ నిర్ధారణ పరీక్షలు పెంచారు. అవసరమైతే కేసులు ఎక్కువ ఉన్న చోట క్షేత్రస్థాయిలో నిర్ధారణ పరీక్షలు చేస్తూ పాజిటివ్లను గుర్తిస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. స్వీయ నియంత్రణ కరువు కరోనా ప్రారంభంలో ప్రజలు మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం పాటిస్తూ వ్యాప్తిని కొంత మేర అడ్డుకున్నారు. సెకండ్‌వేవ్ ప్రారంభంలో కూడా నియంత్రణ చర్యలు పాటించగా.. కరోనా తగ్గిందనే భావనతో ప్రస్తుతం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. సాధారణ రోజుల మాదిరిగానే వ్యవహరిస్తుండడంతో కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతోంది. టెస్టులు చేయించుకోవాలి.. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఒకే జ్వరం వచ్చి తగ్గిందనే నిర్లక్ష్యంగా ఉండకుండా కరోనా టెస్టు చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే ఐసోలేషన్‌లో ఉండి ఇతరులకు పాజిటివ్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ జువేరియా, డీఎంహెచ్‌వో -
ఆగని కరోనా ఉధృతి .. ఆ జిల్లాలో వందల కొద్ది కేసులు..
సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు వందల సంఖ్యలో నమోదువుతున్నా యి. గురువారం ఒక్కరోజే జిల్లాలో 225మంది మ హమ్మారి బారిన పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడలో 39, అనుములలో 26, చౌటుప్పల్‌లో 15, కేతేపల్లిలో 13, శాలిగౌ రారంలో 12, ఆలేరులో 11, పెద్దఅడిశర్లపల్లిలో10, బొమ్మలరామారంలో 10, సంస్థాన్‌నారాయణపురంలో 8, తుంగతుర్తిలో 8, అడవిదేవులపల్లిలో 7, గుండాలలో ఆరుగురికి, కట్టంగూర్‌లో ఆరుగురికి, చింతపల్లిలో ఆరుగురికి, మర్రిగూడెంలో ఆరుగురికి, తిరుమలగిరిలో నలుగురికి, మునుగోడులో నలుగురికి, మోత్కూరులో నలుగురికి, నాంపల్లిలో నలుగురికి, జాజిరెడ్డిగూడెంలో ముగ్గురికి, కొండమల్లేపల్లిలో ముగ్గురికి, ఆత్మకూరు(ఎం)లో ముగ్గురికి, వలిగొండలో ముగ్గురికి, డిండిలో ముగ్గురికి, మద్దిరాలలో ముగ్గురికి, నడిగూడెంలో ఇద్దరికి, పోచంపల్లిలో ఇద్దరికి, భువనగిరిలో ఇద్దరికి, నాగారంలో ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని వైద్యులు ధ్రువీకరించారు. కరోనాతో ఇద్దరు మృత్యువాత చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం మృతి చెందాడు. వివరాలి ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన చిన్నం భిక్షం(72)కు పదిరోజుల క్రితం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐదురోజులపాటు స్థానిక వైద్యుల పర్యవేక్షణలో హోం కార్వంటైన్‌లోనే ఉన్నారు. అనంతరం భిక్షం ఆరోగ్యం విషమించడంతో ఆయన కుటుంబ సభుయలు మెరుగైన వైద్యం కోసం నల్లగొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. తక్కెళ్లపాడులో వృద్ధురాలు.. మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్లపాడులో 70ఏళ్ల వృద్ధురాలు కరోనాతో గురువారం మృతి చెందింది. కాగా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మిర్యాలగూడకు చెందిన గయాస్ మిత్ర బృందం సభ్యులు సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. చదవండి: Third Wave: మన పిల్లలు సేఫ్ -
సూపర్ స్ప్రెడర్స్ లా పాజిటివ్ వ్యక్తులు..
‘బోథ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో ఉండకుండా ఓ మీసేవా కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ఓ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశాడు. దరఖాస్తు చేసే సమయంలో మీ సేవా నిర్వాహకుడు ఓటీపీ కోసం అతడి మొబైల్ తీసుకున్నారు. ఆ మొబైల్లో ఆయనకు కోవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు మెస్సేజ్ చూశాడు. దీంతో మీ సేవ నిర్వాహకుడు ఖంగుతిన్నాడు. బయటకు ఎందుకు వచ్చావని ప్రశ్నించగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత మీసేవా నిర్వాహకుడు కోవిడ్ టెస్టు చేసుకోవాల్సి వచ్చింది. నెగిటివ్ రావడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు’. ఇలా చాలా మంది కరోనా వచ్చినా బయట తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. సాక్షి, బోథ్(ఆదిలాబాద్): ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటే కొంతమంది మాత్రం లెక్క చేయడం లేదు. కరోనా వచ్చినట్లు తెలిసినా.. లక్షణాలు లేవంటూ రోడ్లపై తిరిగేస్తున్నారు. దీంతో కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. కరోనా సోకిన వారికి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడం, కరోనా సోకిన వారిపై ప్ర భుత్వ అధికారులు శ్రద్ధ పెట్టకపోవడమే కారణాలు గా తెలుస్తున్నాయి. ఫలితంగా వైరస్ విస్తరిస్తోంది. దీంతో ప్రతి రోజూ పాజిటివ్ రేట్లు వందల్లో పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కోవిడ్ రోగులు ఆసుపత్రుల్లో, ల్యాబ్‌ల్లో దర్శనమిస్తున్నారు. దీంతో చాలా మందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. పాజిటివ్ వస్తే పర్యవేక్షణ కరువు.. గత ఏడాది కరోనా టెస్టులు చేసిన తరువాత కరోనా సోకిన వ్యక్తులను వారిని ఇంటికి పంపకుండా ఆస్పత్రిలోనే ఉంచి, ఐసోలేషన్ సెంటర్లలోనే ఉంచేవారు. వారికి క్రమం తప్పకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు ప్రతి రోజు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ వారికి సరైన మందులు ఇచ్చారు. వసతితో పాటు భోజనం కూడా ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో కరోనా సోకిన వారు బయటకు వెళ్లకుండా ఐసోలేషన్ సెంటర్లలోనే కరోనా తగ్గేవరకు ట్రిట్మెంట్ తీసుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా సోకిన వారిపై పర్యవేక్షణ కరువవుతోంది. కరోనా వచ్చిన వారికి సప్లిమెంట్లను ఇచ్చి, వారిపై పర్యవేక్షణ చేయడం లేదు. కరోనా వచ్చిన వెంటనే వారు ఆటోల్లో, ఇతర వాహనాల్లో గుంపులుగా ప్రజలతో కలిసి వెళ్తున్నారు. దీంతో పక్కవారికి కూడా కరోనా బారిన పడే అవకాశం ఏర్పడుతోంది. వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం లేదు. పేద ప్రజలు హోం ఐసోలేషన్‌లో ఎలా ఉండేది.. కరోనా సోకిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పేద కుటుంబాల్లో ఇరుకు ఇళ్లు ఉండటం వలన ఇంట్లో ఇరుకు గదుల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఏర్పడుతోంది. కనీస సదుపాయాలు కూడా లేని వారి కుటుంబాల్లో కరోనా సొకిన వారు ఉండలేని పరిస్థితి నెలకొంటోంది. ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తే సెంటర్లలో ఉండవచ్చునని పేదప్రజలు పేర్కొంటున్నారు. గ్రామాల్లోలేని ఐసోలేషన్ సెంటర్లు.. జిల్లాలోని చాలా గ్రామాల్లో ఐసోలేషన్ సెంటర్లు లేక కరోనా సోకిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో కేవలం రిమ్స్‌లో మాత్రమే ఐసోలేషన్ సెంటర్ ఉండటంతో చాలా మంది రిమ్స్‌కు వెళ్లక ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. వారిపై అధికారుల పర్యవేక్షణ లేక కొంతమందికి తీవ్రమైన ఆక్సిజన్ కొరత రావడంతో చివరి నిమిషంలో రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. రిమ్స్‌కి చివరి నిమిషంలో రావడంతో మృత్యువాత పడ్డ సందర్భాలు నెలకొన్నాయి. అదే గ్రామాల్లో ఎక్కడికక్కడ ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి, ఏఎన్ఎంల ద్వారా పర్యవేక్షణ చేయిస్తే కోవిడ్ సోకిన వ్యక్తులు భయభ్రాంతులకు గురి కాకుండా కోలుకునే అవకాశం ఉంటుంది. సిబ్బంది కొరత.. ఒకవైపు కరోనాతో ఆసుపత్రుల్లో కోవిడ్ పేషంట్లతో నిండిపోతుంటే.. ఆసుపత్రుల్లో సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెడికల్ టెక్సీషియన్స్, వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఆసుపత్రుల్లో సిబ్బందిని నియమిస్తే కోవిడ్ సోకిన వ్యక్తులపై పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండే అవకాశం ఉంది. చాలా ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి భారం ప్రస్తుతం ఉన్న వైద్యుల మీద పడుతోంది. పట్టించుకోకపోవడంతో... బోథ్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి కరోనా టెస్టు చేయించుకున్నాడు. ఆయనకు కరోనా సోకిందని నిర్ధారణ అయింది. వైద్యులు ఇచ్చిన మందులు తీసుకున్నాడు. వెంటనే ఆర్టీసీ బస్సులో ఎక్కి ఏం చక్కా వెళ్లిపోయాడు. ఆయనతో ఆ బస్సులో ఉన్న వారికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఏర్పడింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి దగ్గు, జలుబు ఉండటంతో ఆయన కుమారుడు బోథ్‌లోని సామాజిక ఆసుపత్రికి బైక్‌పై తీసుకువచ్చాడు. తన తండ్రికి కరోనా టెస్టు చేయించాడు. పాజిటివ్ వచ్చింది. ఆదే బైక్‌లో తన తండ్రిని ఇంటి వద్ద వదిలేశాడు. కానీ ఆయన కరోనా టెస్టును చేయించుకోలేదు. నాలుగు రోజులు గడిచిన తరువాత ఆయనకు కూడా కరోనా సోకింది. ఆ నాలుగు రోజులు ఆయన అందరితో కలిసి తిరిగాడు. అతడిని కలిసిన వారికి కూడా కరోనా సోకి ఉండవచ్చు. ఇలా నిర్లక్ష్యం వల్లనే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. -
కొంపముంచిన ఎన్నికల బందోబస్తు..
సాక్షి, నిజామాబాద్ అర్బన్: పోలీసు శాఖలో కరోనా కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వైరస్ బారిన పడడం ఆందోళనకు గురి చేస్తోంది. అయితే, ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బందోబస్తుకు వెళ్లిన పోలీసులకు కరోనా సోకింది. సాగర్ ఉప ఎన్నికలకు జిల్లా నుంచి ఏసీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు కలిపి 112 మంది బందోబస్తుకు వెళ్లారు. 16 రోజుల పాటు అక్కడ విధులు నిర్వహించారు. ఎన్నిక ముగిసిన తర్వాత జిల్లాకు వచ్చిన పోలీసులు ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు 32 మందికి వైరస్ నిర్ధారణ అయింది. వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులకు సైతం వైరస్ సోకింది. దీంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. కోవిడ్ బాధితుల్లో కొందరు హోం ఐసోలేషన్‌లో, మరి కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి 17 మంది కోలుకున్నట్లు తెలిసింది. ఉప ఎన్నికకు వెళ్లి కరోనా బారిన పడిన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై సీపీ కార్తికేయ నిత్యం వాకబు చేస్తున్నారు. వైరస్ బారిన పడిన సిబ్బందితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇందులో సీపీ, అదనపు డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌వో, సీఐలు, ఎస్బీ అధికారులు ఉన్నారు. కరోనా బారిన పడిన తమ సిబ్బందితో వీరంతా మాట్లాడుతున్నారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తూ మందులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. -
కరోనా సునామి.. పల్లెల్లో తగ్గుముఖం.. పట్టణాల్లో ఉత్పాతం..
సాక్షి, వేములవాడరూరల్: పల్లె, పట్టణం తేడా లేకుండా కరోనా కేసుల సంఖ్య పెరిగాయి. కానీ ప్రస్తుతం పల్లెల్లో కరోనా కేసుల సంఖ్య కొంతవరకు తగ్గుముఖం పట్టినట్లు ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. వేములవాడ మండలంలోని చాలా గ్రామాల్లో కరోనా కేసులు ఈ మధ్యకాలంలో పెరిగాయి. దీంతో గ్రామాల వారీగా ప్రత్యేకంగా కట్టడి చేసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కొంతవరకు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మండలంలోని ఫాజుల్‌నగర్, నూకలమర్రి గ్రామాలతో పాటు తదితర గ్రామాల్లో కరోనా వాక్సిన్ను వైద్యాధికారులు ప్రత్యేక క్యాంపు ద్వారా ప్రజలకు వేశారు. దీంతో పాటు మండలంలో అత్యధికంగా మల్లారం, జయవరం గ్రామాల్లో కేసులు పెరగడంతో ఆ రెండు గ్రామాల్లో సెల్ఫ్‌లాక్‌డౌన్ విధించుకున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాలలో వారు తీసుకున్న కరోనా నివారణ చర్యల్లో ప్రస్తుతం తగ్గుముఖం పట్టినట్లు తెలిసింది. కరోనా విలయ తాండవం వేములవాడ: వేములవాడలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం ఆడుతున్నది. ఇది అత్యంత ప్రమాదకరంగా మారిందనడానికి వేములవాడలో నిత్యం వినిపించే మరణాలే నిదర్శనం. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి ఆక్సీజన్ లెవెల్స్ తగ్గిపోయి కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడుతుండటం వేములవాడ ప్రాంతంలో జనం బేంబేలెత్తిపోతున్నారు. వారం రోజుల్లో ఇరవైకిపైగా కరోనా కాటుకు బలైన ఘటనలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. తేరుకునేలోగానే.. కాస్త జ్వరం, జలుబు, దగ్గు అనిపించి ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ కరోనా టెస్టులు చేయించుకుని హోమ్ క్వారంటైన్ ఉన్న నాగరాజు, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందిన కొబ్బరికాయల రాజు, అర్చకులు దామెదర్‌లు కేవలం పాజిటివ్ వచ్చిన వారం రోజులకే మృత్యువాతపడ్డారు. ఏం జరుగుతుందోనని తెలుసుకునేలోగానే వీరంతా తుది శ్వాస విడిచారు. గుడికి పెరుగుతున్న రద్దీ.. విచ్చలవిడిగా తిరుగుతున్న జనం వేములవాడ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్న క్రమంలో రాజన్న గుడికి భక్తులు, స్థానికులు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతుండటం స్థానికంగా ఆందోళనలు నెలకొంటున్నాయి. రాత్రి 9 గంటల నుంచి చేపట్టే కర్ఫ్యూ సైతం అంతంత మాత్రంగానే కొనసాగుతుండటంతో మరింత భయం పెరిగింది. నాలుగు రోజుల్లోనే మాయమయ్యాడు నిత్యం కళ్లముందే బుల్లెట్ తిరుగుతుండే నాగరాజు వారం రోజుల క్రితం పాజిటివ్ వ చ్చింది. దీంతో హోమ్ క్వారంటైన్లో ఉన్నాడు. నాలుగు రోజుల వ్యవధిలోనే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పడంతో హుటాహుటిన వేములవాడకు అక్కడ్నుంచి కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 25న మరణించాడని నాగరాజు బంధువులు పేర్కొంటున్నారు. వారం రోజుల్లో తుదిశ్వాస అందరినీ ఆప్యాయంగా మందలిస్తూ రాజన్న గుడి ముందు కొబ్బరికాయలు, పువ్వులు అమ్ముకునే రాజు కరోనా కాటుకు బలయ్యాడు. కరోనా పాజిటివ్ రావడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో మూడు రోజులు చికిత్స పొందాడు. ఆక్సీజన్ లెవెల్స్ తగ్గడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఈనెల 25న మరణించాడని సహచర వ్యాపారులు చెబుతున్నారు. ఏం జరిగిందోనని తెలుసుకునేలోగానే.. నాంపల్లి గుట్టకు వెళ్లిన భక్తులను నవ్వుతూ పలుకరించడమే కాకుండా ఆశీర్వాదాలు ఇచ్చి పంపించే అర్చకుడు దామోదర్ వారం రోజుల క్రితం పాజిటివ్ వచ్చింది. వారి సమీప బంధువు వైద్యశాఖలో పని చేస్తున్నారు. మందులు తీసుకొచ్చే వాడుకోమని చెప్పారు. నాలుగు రోజుల క్రితం శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని అనడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించగానే ఆక్సీజన్ లెవెల్స్ 80 వరకే ఉన్నాయని చెప్పారు. దీంతో ఈనెల 26న ఉదయం మరణించాడని ఆలయ అధికారి ఒకరు వివరించారు. -
వామ్మోకరోనా.. కంటి చూపు కోల్పోతున్నారు!
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్‌లో పరిస్థితి సీరియస్ అవుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉంటున్నా.. ఆ కొద్దిమందిలో మాత్రం ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. గతంలో 7 నుంచి 12 రోజుల్లో ఆరోగ్యం క్షీణిస్తే.. ఇప్పుడు నాలుగైదు రోజులకే ప్రమాదకరంగా మారుతోందని వైద్యులు చెప్తున్నారు. గతంలో పెద్ద వయసు వారిలో మాత్రమే ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతినగా.. ఇప్పుడు పెద్దవారితోపాటు యువతలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్య పరిస్థితి సీరియస్ అయి.. ఆక్సిజన్ బెడ్, వెంటిలేటర్‌పైకి వెళ్లినవారిలో కంటిచూపు దెబ్బతింటోంది. రెటీనా ఇన్ఫ్లమేషన్ కనిపిస్తోంది. ఇది కొత్త లక్షణం అని వైద్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో వారంలో 4,432 కేసులు తెలంగాణలో మార్చి 20–26 మధ్య 2,949 కరోనా కేసులు నమోదుకాగా.. మార్చి 27 నుంచి ఏప్రిల్ 2 వరకు 4,432 కేసులు నమోదు కావడం గమనార్హం. గతవారం మరణాలు 19గా ఉండగా, ఈ వారం 23కు పెరిగాయి. సగటున రోజుకు నాలుగు మరణాలు నమోదవుతున్నాయి. అయితే మొత్తంగా చూస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉందని వైద్యారోగ్యశాఖ చెబుతోంది. కొత్త స్ట్రెయిన్ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని.. మొదటి వేవ్‌లో 15 నిమిషాలు పాజిటివ్ రోగితో ఉంటే ఇతరులకు వైరస్ వ్యాప్తి జరిగేదని.. ఇప్పుడు నాలుగైదు నిమిషాలు ఉన్నా వ్యాపిస్తోందని స్పష్టం చేస్తోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ.. ►అందరూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకుంటే వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉంటుంది. ► ఎవరికైనా పాజిటివ్ వస్తే వారి కాంటాక్టులకు లక్షణాలు లేకున్నా టెస్టులు చేయాలి. లక్షణాలు లేనివారి నుంచి ఇతరులకు వ్యాపించే అవకాశం ఎక్కువ. ► వీలైనంత వరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోవాలి. టెస్టింగ్ సెంటర్లు కూడా పెరిగాయి. ► ఆఫీసుల్లోని క్యాంటీన్లు, కెఫెటేరియాల వంటి చోట మరింత జాగ్రత్తగా ఉండాలి. ► మొదటివేవ్లో కరోనా వచ్చినవారిలో ఇమ్యూ నిటీ ఉంటుంది. ఇప్పుడు వారికి వైరస్ సోకి నా లక్షణాలు కనిపించే అవకాశం తక్కువ. కేసులు పెరగడం ఆందోళనకరం సెకండ్ వేవ్‌లో కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయి. కానీ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో 78 శాతం కేసులు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లోనే నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 14 శాతం కేసులు పెరిగాయి. దక్షిణాసియాలో నమోదైన కేసుల్లో 85 శాతం భారత్‌లో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
సెంట్రలైజ్డ్ ఏసీతో కరోనా వ్యాప్తి
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటికీ కొన్ని సంస్థలు, రంగాలకు మినహాయింపునిచ్చింది. దీంతో ఆయా సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమల ఉద్యోగులు భౌతిక దూరం పాటిస్తూ విధులకు హాజరవుతున్నాయి. అయితే గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరించింది. ఈ క్రమంలో సెంట్రలైజ్డ్ ఏసీలు వినియోగించే కార్యాలయాలతో పాటు ఏసీలు, ఎయిర్ కూలర్లు వినియోగించే విషయంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనర్ ఇంజనీర్స్ (ఐఎస్హెచ్ఆర్ఏఈ) పలు రకాల సూచనలు చేసింది. ప్రయోగాత్మక పద్ధతుల ఆధారంగా చేసిన ఈ సూచనలకు అనుబంధంగా కేంద్ర ప్రజా పనుల శాఖ (సీపీడబ్ల్యూడీ) మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కొనసాగుతున్న కార్యాలయాల్లో ఏసీలు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు వినియోగించే సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఏసీలు, కూలర్లు ఎలా వాడాలంటే... సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ సిస్టంలో గాలి అంతా అదే ప్రాంతంలో ఉంటుంది. ఈ సిస్టం పనిచేసే విస్తీర్ణంలో గాలి ఒక చోటు నుంచి మరోచోటుకు ప్రయాణిస్తుంది. దీంతో కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఒకసారి సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టం ఉన్న ప్రాంతంలోకి వస్తే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఈక్రమంలో వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఈ క్రమంలో ఏసీ ఉష్ణోగ్రతలను ఎలా ఉంచాలనే విషయంలోనూ సీపీడబ్ల్యూడీ సూచనలు చేసింది. ► గది ఉష్ణోగ్రత 24–30 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండేలా చూడాలి. గాలిలో తేమ స్థాయి 40–70 డిగ్రీల మధ్య ఉండాలి. తక్కువ తేమ, ఉష్ణోగ్రతలుంటే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ► ఇళ్లలో వినియోగించే స్ల్పిట్ ఏసీ ఫిల్టర్ల ను, కార్యాలయాల్లో వినియోగించే సెం ట్రలైజ్డ్ ఏసీల డక్ట్‌లను శుభ్రపరచాలి. ► ఎయిర్ కండిషనర్లు పనిచేస్తున్నప్పటికీ బయటి నుంచి గాలిలోనికి వచ్చేలా, గదిలోని గాలి బయటకు వెళ్లేలా కిటికీలను తెరిచిపెట్టడం మంచిది. ఏసీలు వాడకుంటే మాత్రం తలుపులు, కిటికీ లు, వెంటిలేటర్లు తెరిచి ఉంచాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచాలి. ► ఇళ్లు, కార్యాలయాల్లో ఎయిర్ కూలర్లు వాడుతున్న వారు బయటి గాలి వాటికి తగిలేలా జాగ్రత్తపడాలి. ►ఎయిర్ కూలర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు క్రిమిసంహారకాలతో శుభ్రం చేసుకోవాలి. తరచూ నీటిని ఖాళీ చేసి, మళ్లీ నింపుకోవాలి. ►ఫ్యాన్లు వినియోగించేవారు కిటీకీలను కొద్దిగా తెరిచి ఉంచాలి. ఫ్యాన్ వాడే గదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే, వెంటిలేషన్ కోసం దాన్ని ఆన్ చేసి పెట్టడం మంచిది. -
‘డెంగీ’తో దొంగాట
సాక్షి, రాజమండ్రి : జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. వందల్లో కేసులు నమోదవుతున్నాయి. ప్లేట్లెట్లకు డిమాండ్ పెరిగింది. రక్త దాతల కోసం బాధితులు అష్టకష్టాలు పడి వెతుకుతున్నారు. రూ.400 పలికే యూనిట్ రక్తం రూ.2500 పైన పలుకుతోంది. ఇదీ జిల్లాలోని పరిస్థితి. అయినా జిల్లాలో ఎక్కడా డెంగీ కేసులను గుర్తించ లేదని, అనుమానాస్పద కేసులకు మాత్రమే చికిత్స చేస్తున్నామని అధికారులు చెప్పుకొస్తున్నారు. భారీ వర్షాలతో కాకినాడ, రాజమండ్రి నగరాలతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైరల్ వ్యాధులు పడగ విప్పాయి. వీటిలో అతి ప్రమాదకరమైన డెంగీ కోరలు చాస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాధి నిర్ధారణలో అధికారులు అవలంబిస్తున్న వైఖరి రోగుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. వారం రోజులుగా జిల్లాలో సుమారు 300కు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. సాక్షాత్తూ జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు జిల్లాలో 120 మంది డెంగీ లక్షణాలు కలిగిన రోగులను గుర్తించారని, వారిలో 40 మంది రాజమండ్రిలోనే ఉన్నారని చెప్పడం గమనార్హం. కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రులతో పాటు అపోలో, జీఎస్ఎల్ తదితర ఆస్పత్రుల్లో పలువురు రోగులు చికిత్స పొందుతున్నారు. కానీ డెంగీకి సంబంధించిన ప్రాథమిక లక్షణాలతో చేరిన రోగులను కూడా డెంగీ బాధితులుగా గుర్తించేందుకు ప్రైవేట్, ప్రభుత్వాస్పత్రుల వారు వెనుకాడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారుల ఒత్తిడి ఆస్పత్రిలో చేరిన రోగులకు డెంగీ నిర్ధారణ అయితే తక్షణం జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి సమాచారం అందించాలి. అనంతరం వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాల్సి ఉంటుంది. కాగా వ్యాధిని గుర్తించినా లక్షణాలు గల పేషెంట్లుగా మాత్రమే చికిత్స చేయాలని అధికారుల నుంచి ఒత్తిడి వస్తున్నట్టు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు చెపుతున్నారు. ఈమేరకు రాజమండ్రి, కాకినాడ నగరపాలక సంస్థ ల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు అందినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కేసులను గుర్తించి సమాచారం అందిస్తే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రశ్నలతో వేధిస్తున్నారని చెపుతున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే అనుమానాస్పద కేసుల పేరుతో చికిత్స చేస్తుండడంతో పాటు ప్లేట్లెట్స్ పేరుతో వేలు దండుకుంటున్నారని పేదరోగులు వాపోతున్నారు. రూ.50 వేల వరకు వ్యయం వ్యాధి నిర్ధారణ లేకుండా చికిత్స చేస్తుం డడంతో ప్రభుత్వపరంగా సహకారం అందడం లేదని రోగులువాపోతున్నారు. అధికారుల వైఖరి వల్ల కూడా ప్రైవేట్ ఆస్పత్రులు వేలు దండుకుంటున్నాయి. ప్రస్తుతం డెంగీ సోకిన రోగి మామూలు మనిషి కావాలంటే సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేలు అవుతోందని అంచనా. రోగిలో అసాధారణ పరిస్థితుల్లో ప్లేట్లెట్స్ తగ్గుతూ, దాన్ని డెంగీ వ్యాధిగా అనుమానిస్తున్న సందర్భం లో ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.