సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినప్పటికీ కొన్ని సంస్థలు, రంగాలకు మినహాయింపునిచ్చింది. దీంతో ఆయా సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమల ఉద్యోగులు భౌతిక దూరం పాటిస్తూ విధులకు హాజరవుతున్నాయి. అయితే గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరించింది. ఈ క్రమంలో సెంట్రలైజ్డ్ ఏసీలు వినియోగించే కార్యాలయాలతో పాటు ఏసీలు, ఎయిర్ కూలర్లు వినియోగించే విషయంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనర్ ఇంజనీర్స్ (ఐఎస్‌హెచ్‌ఆర్‌ఏఈ) పలు రకాల సూచనలు చేసింది. ప్రయోగాత్మక పద్ధతుల ఆధారంగా చేసిన ఈ సూచనలకు అనుబంధంగా కేంద్ర ప్రజా పనుల శాఖ (సీపీడబ్ల్యూడీ) మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా కొనసాగుతున్న కార్యాలయాల్లో ఏసీలు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు వినియోగించే సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.
ఏసీలు, కూలర్లు ఎలా వాడాలంటే...
సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ సిస్టంలో గాలి అంతా అదే ప్రాంతంలో ఉంటుంది. ఈ సిస్టం పనిచేసే విస్తీర్ణంలో గాలి ఒక చోటు నుంచి మరోచోటుకు ప్రయాణిస్తుంది. దీంతో కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఒకసారి సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టం ఉన్న ప్రాంతంలోకి వస్తే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఈక్రమంలో వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఈ క్రమంలో ఏసీ ఉష్ణోగ్రతలను ఎలా ఉంచాలనే విషయంలోనూ సీపీడబ్ల్యూడీ సూచనలు చేసింది.
► గది ఉష్ణోగ్రత 24–30 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండేలా చూడాలి. గాలిలో తేమ స్థాయి 40–70 డిగ్రీల మధ్య ఉండాలి. తక్కువ తేమ, ఉష్ణోగ్రతలుంటే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
► ఇళ్లలో వినియోగించే స్ల్పిట్ ఏసీ ఫిల్టర్ల ను, కార్యాలయాల్లో వినియోగించే సెం ట్రలైజ్డ్ ఏసీల డక్ట్‌లను శుభ్రపరచాలి.
► ఎయిర్ కండిషనర్‌లు పనిచేస్తున్నప్పటికీ బయటి నుంచి గాలిలోనికి వచ్చేలా, గదిలోని గాలి బయటకు వెళ్లేలా కిటికీలను తెరిచిపెట్టడం మంచిది. ఏసీలు వాడకుంటే మాత్రం తలుపులు, కిటికీ లు, వెంటిలేటర్లు తెరిచి ఉంచాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచాలి.
► ఇళ్లు, కార్యాలయాల్లో ఎయిర్ కూలర్లు వాడుతున్న వారు బయటి గాలి వాటికి తగిలేలా జాగ్రత్తపడాలి.
►ఎయిర్ కూలర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు క్రిమిసంహారకాలతో శుభ్రం చేసుకోవాలి. తరచూ నీటిని ఖాళీ చేసి, మళ్లీ నింపుకోవాలి.
►ఫ్యాన్లు వినియోగించేవారు కిటీకీలను కొద్దిగా తెరిచి ఉంచాలి. ఫ్యాన్ వాడే గదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే, వెంటిలేషన్ కోసం దాన్ని ఆన్ చేసి పెట్టడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment